అల్లర్ల కారణంగా ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ లెవల్ 2 ఎగ్జామ్స్ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. బిహార్‌లోని అలీగఢ్‌లో అల్లరిమూకలు ఓ ప్యాసింజర్ రైలుకు నిప్పుపెట్టడం వివాదాస్పదంగా మారింది. మంగళవారం సైతం కొన్ని ప్రాంతాల్లో ఇదే విధంగా అల్లర్లు చెలరేగాయి. ఫస్ట్ ఫేజ్‌లో మోసానికి పాల్పడి రెండో ఫేజ్‌కు అర్హత సాధించిన వారిని పరీక్షలకు అనుమతించేది లేదని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్పష్టం చేసింది. దీంతో ఈ వివాదం చెలరేగింది.
నోటిఫికేషన్‌లో ఇచ్చినట్లే రిజల్ట్స్ ఇచ్చాం
ఆర్ఆర్‌బీ (CEN) 01/2019 నోటిఫికేషన్‌లో పేరా 13 లో పేర్కొనట్లుగానే అభ్యర్థులను రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కోసం ఎంపిక చేశామని బోర్డు వివరణ ఇచ్చింది. కానీ ఫలితాలపై నమ్మకం లేదని కొందరు అభ్యర్థులు అల్లర్లకు దిగడంతో భారతీయ రైల్వే బోర్డు పేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్టులను తాత్కాలికంగా వాయిదా వేసింది. ఇటీవల నిర్వహించిన ఫస్ట్ ఫేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫలితాలపై కొందరు అభ్యర్థుల్లో ఉన్న సందేహాలు, అనుమానాలు తీర్చేందుకు నిపుణుల కమిటీ పని చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ లెవల్ 1 ఎగ్జామ్, ఫలితాలను తాత్కాలికంగా రద్దు చేస్తూ బోర్డు ప్రకటన చేసింది. దీంతో ఫేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్టు కొన్ని రోజులపాటు వాయిదా పడింది.
ఫిర్యాదులకు ఫిబ్రవరి 16 వరకు ఛాన్స్
అభ్యర్థులు తమ సందేహాలను ఫిబ్రవరి 16వ తేదీ వరకు కమిటీకి పంపేందుకు అవకాశం కల్పించారు. ఇవి పరీశీలించిన కమిటీ మార్చి 4 లోగా తమ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 15 నుంచి జరగాల్సిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిబ్రవరి 23 నుంచి జరగాల్సిన కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ 1 వాయిదా వేస్తున్నట్టు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. వాస్తవానికి 35,281 ఎన్‌టీపీసీ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 2019లో నోటిఫికేషన్ విడుదల చేయగా పరీక్ష పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఫలితాలు ప్రకటించింది. ఫేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్టుకు 7 లక్షల మంది అభ్యర్థులను ఎంపిక చేశారు.