నూతన విద్యావిధానం అమల్లోకి తీసుకవచ్చింది భద్రాది కొత్తగూడెం జిల్లా. ఏజెన్సీలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో నూతన పద్దతిలో విద్యార్థులకు విద్యను బోధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దీనిలో భాగంగా వేదగణిత పద్ధతిని ప్రవేశపెట్టనున్నారు. గతేడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆశించిన స్థాయిలో 10వ తరగతి ఫలితాలు రాలేవు. కేవలం 77.1శాతం మాత్రమే ఫలితాలు వచ్చాయి.
అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కొత్తగూడెం జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో వేదిక గణిత పద్ధతినిప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో దీన్ని వినూత్న ప్రయత్నంగా భావిస్తున్నారు. మంచి ఫలితాలు వస్తే దీనిని కొనసాగించడంతోపాటు మిగతా చోట్ల కూడా ప్రవేశపెట్టే వీలుందని ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ తెలిపారు.
ఈ నూతన విద్యావిధానాన్ని అమల్లోకి తీసుకువచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 50 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి చదివే వారికి త్వరలోనే దీన్ని అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం జిల్లాలోని 11 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరే అవకాశం కనిపిస్తోంది.
ఈ వేదిక్ గణిత పద్ధతిని అనుసరించి విద్యార్థులకు పెద్ద పెద్ద కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు, భాగహారాలను సులువుగా చేసే విధానాన్ని నేర్పిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 మంది గణిత టీచర్లకు ఈ బాధ్యతలు అప్పగించి..ఒక్కోగణిత నిపుణుడికి 5 పాఠశాలలు కేటాయించాలని నిర్ణయించారు. వీరు ఒక్కో పాఠశాలలో రోజుకు 4 పీరియడ్లు బోధించేలా..వారానికి 5రోజులు పనిచేసేలా చర్యలు తీసుకున్నారు.