నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీ ఏ) దేశంలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో బీఈడీ చేసేందుకు ప్రవేశం కొరకు నిర్వహించే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎన్సిఈటీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో 400 సీట్లు
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఐఐటీల్లో నాలుగేండ్ల బీఈడీ కోర్సు అందుబాటులోకి రానున్నది. ఇంజినీరింగ్‌తో పాటు అన్నిరకాల కోర్సులు ఐఐటీల్లో అందుబాటులోకి వస్తుండగా, తాజాగా బీఈడీ కోర్సు కూడా ఈ జాబితాలో చేరనున్నది. ఇటీవలే నిర్వహించిన ఐఐటీ కౌన్సిల్ సమావేశంలో నాలుగేండ్ల బీఈడీ (ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం)ని ఐఐటీల్లో ప్రవేశపెట్టడంపై చర్చించారు.
డ్యూయల్ డిగ్రీ
నాలుగేండ్ల బీఈడీ కోర్సును డ్యూయల్ డిగ్రీ కోర్సుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం డిగ్రీ మూడేండ్లు, బీఈడీ రెండేండ్లపాటు పూర్తిచేసే అవకాశం ఉన్నది. ఈ విధానంలో నాలుగేండ్లలోనే మూడేండ్ల డిగ్రీతోపాటు రెండేండ్ల బీఈడీ కోర్సులను ఒకే దఫాలో పూర్తిచేసేందుకు వీలవుతుంది. బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ, బీకాం బీఈడీల పేరుతో కోర్సులను నిర్వహించనున్నారు. ప్రస్తుత బీఈడీ కాలేజీల్లో బోధన అంతంత మాత్రంగానే ఉన్నదన్న విమర్శలున్నాయి. కొత్త టీచర్లను తయారుచేసేందుకు, శిక్షణనిచ్చేందుకు ఐఐటీలు ఉత్తమ కేంద్రాలుగా భావించిన కేంద్ర ప్రభుత్వం వీటిల్లో నాలుగేండ్ల బీఈడీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.