Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​ : నవంబర్​​ 2023

కరెంట్​ అఫైర్స్​ : నవంబర్​​ 2023

అంతర్జాతీయం

మిస్‌ యూనివర్స్‌–2023
ప్రతిష్టాత్మకమైన మిస్‌ యూనివర్స్‌–2023 కిరీటం షెన్నిస్‌ పలాసియోస్‌ దక్కించుకుంది. నికరాగ్వా నుంచి అంతర్జాతీయ గౌరవం దక్కడం ఇదే మొదటిసారి. ఫస్ట్‌ రన్నరప్‌గా మిస్‌ థాయ్‌లాండ్‌ ఆంటోనియో పోర్సిల్డ్, సెకండ్‌ రన్నరప్‌గా మిస్‌ ఆస్ట్రేలియా మొరాయా విల్సన్‌ నిలిచారు.

Advertisement

అర్జెంటీనాకు నూతనాధ్యక్షుడు
అర్జెంటీనాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జేవియర్‌ మిలి ఘన విజయం సాధించారు. మొత్తం 99.4 శాతం ఓట్లు పోలవ్వగా మిలి 55.7 శాతం ఓట్లు సాధించారు.1983 తరువాత ఇంత భారీ మెజారిటీతో అధ్యక్ష అభ్యర్థి గెలుపొందడం ఇదే తొలిసారి.

ఇందిరాగాంధీ శాంతి పురస్కారం
ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి పురస్కారం – 2022ను భారత కొవిడ్‌ వారియర్లు గెల్చుకున్నారు. వారి ప్రతినిధులుగా భారత వైద్య సంఘం (ఐఎంఏ) అధ్యక్షుడు శరద్‌ కుమార్‌ అగర్వాల్, భారత ట్రైన్డ్‌ నర్సుల సంఘం ప్రెసిడెంట్‌ రాయ్‌ కె జార్జ్‌ దీన్ని అందుకున్నాయి. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ ఈ పురస్కారాన్ని అందజేశారు.

శ్రీలంక వీసా ఫ్రీ సేవలు ప్రారంభం
భారతీయులతో పాటు ఏడు దేశాల వారికి వీసా ఫ్రీ సేవలను శ్రీలంక ప్రారంభించింది. ఇక నుంచి భారత్, చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ దేశాలవారు వీసా లేకుండానే శ్రీలంకలో 30 రోజుల పాటు పర్యటించవచ్చు. 2024 మార్చి 31వ తేదీ వరకూ ఈ సౌకర్యం అమల్లో ఉంటుంది.

Advertisement

ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్‌
ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్‌ నిలిచాయని ‘ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌’(ఈఐయూ) తెలిపింది. జ్యూరిచ్‌ ఆరోస్థానం నుంచి ఎగబాకి సింగపూర్‌ సరసన చేరినట్లు పేర్కొంది. గతేడాది సింగపూర్‌తోపాటు తొలిస్థానంలో నిలిచిన న్యూయార్క్‌ ఈసారి మూడోస్థానానికి పరిమితమైంది.

న్యూజిలాండ్‌ కొత్త ప్రధానిగా లక్సన్‌
న్యూజిలాండ్‌ కొత్త ప్రధానిగా క్రిస్టఫర్‌ లక్సన్‌  ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం దేశార్థికాన్ని మెరుగుపరచడమే తన ప్రథమ లక్ష్యమని ప్రకటించారు. గత నెల పార్లమెంటు ఎన్నికల తరవాత రెండు చిన్న పార్టీల మద్దతుతో లక్సన్‌కు చెందిన నేషనల్‌ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి.

జాతీయం

వరల్డ్‌ అథ్లెట్‌ ఆఫ్‌ ద ఇయర్ జాబితా
ఈ ఏడాది ప్రపంచ పురుషుల అత్యుత్తమ అథ్లెట్‌ పురస్కారం తుది జాబితాలో భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాకు స్థానం లభించింది. సామాజిక మాధ్యమాల్లో నిర్వహించిన ఓటింగ్‌లో 20 లక్షల మంది పాల్గొన్నారు. ఓటింగ్‌ అనంతరం ఈ జాబితాను 11 నుంచి కుదించి టాప్‌–5 ఆటగాళ్లను ఎంపిక చేశారు.

Advertisement

భారత ఆర్థిక వృద్ధి 6-7.1 శాతం
భారత ఆర్థిక వృద్ధి 2024 –26 ఆర్థిక సంవత్సరాల్లో ఏటా 6-7.1 శాతం మేర నమోదవుతుందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. భారత వాస్తవ జీడీపీ మార్చి త్రైమాసికం నాటి 6.1 శాతంతో పోలిస్తే, జూన్‌ త్రైమాసికంలో 7.8 శాతానికి పెరిగింది.

విజయవంతమైన మిస్సైల్ ప్రయోగం
డీఆర్‌డీఓ సహకారంతో సముద్రజలాల్లో భారత నౌకాదళం చేపట్టిన క్షిపణి ప్రయోగం విజయవంతమైందని విశాఖపట్నంలోని నేవీ వర్గాలు తెలిపాయి. యాంటీ షిప్‌ మిసైల్‌ను నేవీ హెలికాప్టర్‌ ద్వారా ప్రయోగించినట్లు పేర్కొన్నాయి. ఈ క్షిపణి లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు వెల్లడించాయి.

సంపద అసమానతల్లో భారత్ టాప్
అధికాదాయం ఉన్నప్పటికీ సంపదలో అసమానతలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ ముందు వరుసలో ఉంది. 2015–16 నుంచి 2019–21 మధ్య దేశంలో తీవ్ర పేదరికంలో మగ్గుతున్న వారు 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గారు. ఈ మేరకు ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌ డీపీ) తాజాగా ఒక నివేదికను వెలువరించింది.

Advertisement

అతిపెద్ద టైగర్‌ రిజర్వుకు కేంద్రం అమోదం
2,300 చదరపు కి.మీ విస్తీర్ణంతో దేశంలోనే అతి పెద్ద టైగర్‌ రిజర్వు ఏర్పాటు కానుంది. మధ్యప్రదేశ్‌లోని నౌరదేహి వన్యప్రాణి అభయారణ్యం, రాణి దుర్గావతి వన్యప్రాణి అభ్యయారణ్యాలను కలిపేయనున్నారు. ఈ రెండు అభయారణ్యాలు సాగర్, దమోహ్, నర్సింగ్‌పుర్, రైసెన్‌ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.

ఆసియాన్‌ – ఇండియా మిల్లెట్స్‌ ఫెస్టివల్‌
ఇండోనేసియా రాజధాని జకార్తాలో అయిదు రోజుల తృణధాన్యాల పండగను భారత్‌ ప్రారంభించింది. భారత వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, ది ఇండియన్‌ మిషన్‌ టూ ఆసియన్‌ సంయుక్తంగా ‘ఆసియాన్‌ – ఇండియా మిల్లెట్స్‌ ఫెస్టివల్‌’ను అయిదు రోజుల పాటు నిర్వహించాయి.

తపాలా బిల్లుకు రాజ్యసభ ఆమోదం
దేశంలోని తపాలా కార్యాలయాలకు సంబంధించిన 125 ఏళ్ల నాటి ఇండియన్‌ పోస్ట్ ఆఫీస్‌ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో తీసుకురాదలచిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత శాసనం ప్రకారం.. ఏ వస్తువునైనా అడ్డుకోవడానికి, తనిఖీ చేయడానికి, అదుపులోకి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ద్వారా ఏ అధికారినైనా అనుమతించవచ్చు.

Advertisement

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌
భారత్‌ 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. 2023–24లో దేశ జీడీపీ వృద్ధి 6.4 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం మన దేశం అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. భారత్‌ కంటే ముందు అమెరికా, చైనా, జర్మనీ, జపాన్‌ ఉన్నాయి

సురక్షిత నగరంగా కోల్‌కతా
దేశంలో సురక్షిత నగరంగా పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతా వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలిచింది. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం.. 2022లో ప్రతి లక్ష మంది జనాభాకు కనిష్ట సంఖ్యలో గుర్తించదగిన నేరాలు నమోదైన నగరాల్లో 86.5 కేసులతో కోల్‌కతా ప్రథమ స్థానం సాధించింది. తర్వాత స్థానాల్లో పుణె (280.7), హైదరాబాద్‌ (299.2) నగరాలు ఉన్నాయి. –

ప్రాంతీయం

నంబర్‌ వన్ మెరైన్‌ స్టేట్‌
ఏపీని దేశంలోనే నంబర్‌ 1 మెరైన్‌ స్టేట్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 21వ తేదీన జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా అహ్మదాబాద్‌లో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ట్రోఫీ, సర్టిఫికెట్‌తో పాటు అవార్డును ప్రదానం చేయనున్నారు.

Advertisement

పోటీలో 226 మందికి నేర చరిత్ర
ప్రధాన పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 226 మందికి నేర చరిత్ర ఉందని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎఫ్‌జీజీ) అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా దాదాపు పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. 63 స్థానాల్లో సంపూర్ణ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. బీఆర్ఎస్‌ పార్టీ 39 స్థానాలకు పరిమితం అయింది. బీజేపీ ఎనిమిది స్థానాల్లో, ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేశాయి.

వార్తల్లో వ్యక్తులు

పంకజ్‌ అడ్వాణీ
భారత స్టార్‌ ఆటగాడు పంకజ్‌ అడ్వాణీ ప్రపంచ బిలియర్డ్స్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నాడు. ఐబీఎస్‌ఎఫ్‌ ప్రపంచ బిలియర్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌లో అడ్వాణీ విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో 2003లో తొలిసారిగా విజేతగా నిలిచిన అడ్వాణీ టైటిల్‌ నెగ్గడం ఇది 26వ సారి.

Advertisement

మాధురీ దీక్షిత్‌
‘ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా’ (ఇఫి) 54వ వేడుకలు గోవాలో ప్రారంభమయ్యాయి. బ్రిటిష్‌ దర్శకుడు స్టూవర్ట్‌ గాట్‌ తీసిన ‘క్యాచింగ్‌ డస్ట్‌’ చిత్ర ప్రదర్శనతో మొదలైన ఆ చిత్రోత్సవంలో ప్రముఖ బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌కి ప్రత్యేక గుర్తింపు లభించింది.

డా.ఎస్‌.మాధవరాజ్‌
యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు గోవా ప్రభుత్వం ‘మనోహర్‌ పారీకర్‌ యువ శాస్త్రవేత్త’ అవార్డును ఇస్తుండగా తొలిసారి ఆ అవార్డును ఇస్రో అనుబంధ యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌కు చెందిన డా.ఎస్‌.మాధవరాజ్‌కు ఇవ్వనున్నట్లు గోవా సీఎం ప్రమోద్‌కుమార్‌ సావంత్‌ ప్రకటించారు.

అపర్ణ గుప్తా
సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తన గ్లోబల్‌ డెలివరీ సెంటర్‌ (జీడీసీ) లీడర్‌గా అపర్ణ గుప్తాను నియమించినట్లు వెల్లడించింది. జీడీసీకి లీడర్‌గా అపర్ణ కస్టమర్‌ ఇన్నోవేషన్, డెలివరీ ఎక్స్‌లెన్స్, క్లౌడ్‌ తదితర విభాగాలకు నాయకత్వం వహించనున్నారు.

Advertisement

చంద్రబోస్‌
గురజాడ రచనల్లో వాడుక భాష ఎంతో గొప్పదని, అదే తనకు నచ్చిన అంశమని ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్‌ అన్నారు. ఏపీలోని విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో చంద్రబోస్‌ను గురజాడ విశిష్ట పురస్కారంతో సత్కరించింది.

జేవియర్‌ మిలి
అర్జెంటీనాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జేవియర్‌ మిలి ఘన విజయం సాధించారు. మొత్తం 99.4 శాతం ఓట్లు పోలవ్వగా మిలి 55.7 శాతం ఓట్లు సాధించారు. ఆయన ప్రత్యర్థి, ఆర్థికమంత్రి సెర్గియో మాసా 44.3 శాతం ఓట్లు పొందారు. ఈ మేరకు అర్జెంటీనా ఎన్నికల సంఘం తెలిపింది.

ఆలోక్‌ శర్మ
ప్రధాన మంత్రి రక్షణ బాధ్యతలను చూసే ‘ప్రత్యేక భద్రతా దళం’ (ఎస్‌పీజీ) డైరెక్టర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఆలోక్‌ శర్మ నియమితులయ్యారు. ఆయన 1991 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం ఎస్‌పీజీలో అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు

Advertisement

అదితి అశోక్‌
భారత మహిళా స్టార్‌ గోల్ఫర్‌ అదితి అశోక్‌ ఈ ఏడాది తన ఖాతాలో రెండో టైటిల్‌ను జమ చేసుకుంది. మహిళల యూరోపియన్‌ టూర్‌లో భాగంగా ఈ మేరకు ముగిసిన స్పానిష్‌ ఓపెన్‌లో బెంగళూరుకు చెందిన అదితి విజేతగా నిలిచింది.

జస్టిస్‌ ఫాతిమా బీవి
సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఫాతిమా బీవి కేరళలోని కొల్లంలో మరణించారు. గతంలో ఆమె తమిళనాడు గవర్నర్‌గా కూడా పనిచేశారు.1983 నుంచి 1989 వరకు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 1989 అక్టోబరు 6 నుంచి 1992 ఏప్రిల్‌ 29 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.

స్పోర్ట్స్

ఆస్ట్రేలియాకు ఆరోసారి ప్రపంచకప్‌
ప్రపంచకప్ ఫైనల్లో భారత్ మీద నెగ్గి ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్ కప్ కైవసం చేసుకుంది.  టోర్నీలో అత్యధిక పరుగులు (765) చేయడంతో విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో మహమ్మద్‌ షమి అత్యధికంగా 24 వికెట్లు పడగొట్టాడు.

జకోవిచ్‌ సరికొత్త రికార్డు
నొవాక్‌ జకోవిచ్‌ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీలో  జకోవిచ్ విజేతగా నిలవడంతో ఫెదరర్‌ (6)ను దాటి ఏడోసారి ట్రోఫీ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 400 వారాలు నంబర్‌వన్‌గా ఉన్న రికార్డు కూడా జకోవిచ్ సొంతం.

వెర్‌స్టాపెన్‌కు 19వ టైటిల్‌
ఫార్ములావన్‌ దిగ్గజ రేసర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ అబుదాబి గ్రాండ్‌ప్రి రేస్‌ను గెలుచుకున్నాడు. ఓవరాల్‌గా అతనికిది 54వ టైటిల్‌ కాగా అత్యధిక టైటిల్స్‌ సాధించిన వారిలో మూడో స్థానానికి చేరుకున్నాడు. లూయిస్‌ హామిల్టన్‌ (103), మైకేల్‌ షుమాకర్‌ (91) అతనికంటే ముందున్నారు.

శీతల్‌ దేవి@ నంబర్ వన్
భారత సంచలన పారా ఆర్చర్‌ శీతల్‌ దేవి మహిళల కాంపౌండ్‌ పారా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని నంబర్‌ వన్‌గా నిలిచింది. ఇటీవల ఆసియా ఛాంపియన్‌షిప్‌లో శీతల్‌ రెండు స్వర్ణాలు, ఓ రజతంతో సత్తా చాటింది.

సైన్స్ అండ్ టెక్నాలజీ

 ‘స్టార్‌షిప్‌’ ప్రయోగం విఫలం
మానవులను అంగారకుడు, చంద్రుడిపైకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన మెగా రాకెట్‌ ‘స్టార్‌షిప్‌’ మరోసారి విఫలం అయింది.  నింగిలోకి పయనమైన 8 నిమిషాలకే ఈ రాకెట్‌తో సంబంధాలు తెగిపోయాయి.

ఇండియన్ నేవీలో ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌
దేశంలో రూపొందిన అతిపెద్ద సర్వే నౌక ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌ భారత నౌకాదళంలో చేరింది. కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ) సంస్థ దీన్ని నిర్మించింది. రక్షణ అవసరాల కోసం సముద్ర, భౌగోళిక డేటాను సేకరించగలదు. అవసరమైతే ఆసుపత్రి నౌకగానూ సేవలు అందిస్తుంది. ఈ నౌకపై ఒక హెలికాప్టర్‌ను మోహరిస్తారు.

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : సెప్టెంబర్​​​ 2023

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!