తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను బోర్డు అధికారులు రిలీజ్ చేశారు. అలాగే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యుల్‌ను కూడా బోర్డు వెల్లడించింది. ఏప్రిల్ 25 నుంచి మే 2వ తేదీ లోగా సప్లిమెంటరీ పరీక్షల ఫీజును చెల్లించవచ్చును. మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. బుధవారం (ఏప్రిల్ 24) సాయంత్రం 5 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో మార్కు షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు అధికారులు తెలిపారు.
ఇంటర్లో 62 శాతం ఉత్తీర్ణత
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో దాదాపు 62 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 2.87 లక్షల మంది, ద్వితీయ సంవత్సరంలో 3.22 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో మొత్తం ఉత్తీర్ణత శాతం 60.01 కాగా, బాలికలు 68.35 బాలురు 51.5 శాతం సాధించారు. ద్వితీయ సంవత్సర మొత్తం ఉత్తీర్ణత 64.19 శాతం కాగా బాలికలు 72.53 బాలురు 56.1శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్షలకు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు.