అంతర్జాతీయం
ఫ్రాన్స్ స్కూళ్లలో బుర్ఖా నిషేధం
ఫ్రాన్స్ స్కూళ్లలో ముస్లిం విద్యార్థులు ధరించే బుర్ఖాలు నిషేధించనున్నారు. పాఠశాలల్లో అనుసరించాల్సిన లౌకిక చట్టాలకు విరుద్ధంగా ఈ వస్త్రధారణ ఉందని ఆ దేశ విద్యా మంత్రి గాబ్రియేల్ అట్టల్ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నిషేధం అమల్లోకి రానుంది.
చైనా కొత్త మ్యాప్‌లో భారత భూభాగం
భారత్ భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపుతూ చైనా కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. ‘ది 2023 ఎడిషన్ ఆఫ్ చైనా స్టాండర్డ్ మ్యాప్’ పేరుతో చైనా సహజ వనరుల శాఖ రూపొందించిన ఈ మ్యాప్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ మ్యాప్‌లో సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాలైన అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ తమ భూభాగంలోనివిగా పేర్కొంది.
జింబాబ్వేకు కొత్త అధ్యక్షుడు
జింబాబ్వే అధ్యక్షుడిగా ఎమ్మెర్సన్ మ్నంగాగ్వా మరోసారి ఎన్నికయ్యారు. 2023 ఆగస్టు 27 శనివారం రాత్రి వెలువడిన ఫలితాల్లో ఆయన పార్టీ 52.6 శాతం ఓట్లను సాధించినట్లు జింబాబ్వే ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నెల్సన్ చమీసా పార్టీకి 44 శాతం ఓట్లు సాధించారు.
సింగపూర్ అధ్యక్షుడిగా షణ్ముగరత్నం
భారతీయ సంతతికి చెందిన ఆర్థికవేత్త థర్మన్ షణ్ముగరత్నం సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల్లో 70 శాతానికి పైగా ఓట్లు ఆయనకు వచ్చాయి. సింగపూర్‌కు భారతీయ సంతతికి చెందిన మూడో అధ్యక్షుడిగా షణ్ముగరత్నం ఎన్నిక ఖరారైంది.
జార్జియాలో ‘హిందూ వారసత్వ’ నెల
మహాత్మా గాంధీ జయంతితో పాటు శరన్నవరాత్రులు, దీపావళి వంటి ప్రముఖ పండగలున్న అక్టోబరును అమెరికాలోని జార్జియా రాష్ట్రం హిందూ వారసత్వ నెలగా ప్రకటించింది. ఈ నెలలో హిందూ సంప్రదాయ, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నారు.
జావాలో సైనిక విన్యాసాలు
ఇండోనేసియా ప్రధాన దీవి అయిన జావాలో అమెరికా సహా ఏడు దేశాల సైనికుల వార్షిక విన్యాసాలు మొదలయ్యాయి. అమెరికా, ఇండోనేసియా దేశాలు 2009 నుంచి నిర్వహిస్తున్న ఈ విన్యాసాల్లో గతేడాది ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్ జత కలిశాయి.ఈ విన్యాసాలకు భారత్ సహా మరో 12 దేశాలు తమ పరిశీలకులను పంపాయి.
లిబియాలో జల విలయం
ఆఫ్రికా దేశం లిబియాలో డేనియల్ తుఫాను సృష్టించిన జల విలయం పెను విషాదాన్ని మిగిల్చింది. మెరుపు వరదల ధాటికి వేల మంది కొట్టుకుపోయారు. ఈ ప్రళయంలో మొత్తంగా 20వేల మంది వరకు మృతిచెంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
మొరాకోలో భారీ భూకంపం
ప్రకృతి విలయంతో ఆఫ్రికా దేశం మొరాకో తల్లడిల్లిపోయింది. భారీ భూకంపంతో కనీసం 820 మంది మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మొరాకో మర్రకేచ్ నగరం కేంద్రంగా రిక్టర్ స్కేల్‌పై 6.8 త్రీవతతో భూకంపం సంభవించింది.
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023లో భారత్ 40వ స్థానంలో నిలిచింది. జెనీవా(స్విట్జర్లాండ్) కేంద్రంగా పని చేస్తున్న వరల్డ్ ఇంటలెక్చుల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ప్రకటించిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023లో వరుసగా 13వ సంవత్సరం స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది.
స్విట్జర్లాండ్‌లో బురఖాలపై నిషేధం
స్విట్జర్లాండ్‌లో ముస్లిం మహిళలు ధరించే బురఖాలపై నిషేధం విధించారు. ఈ మేరకు స్విట్జర్లాండ్ పార్లమెంట్ దిగువ సభలో నిర్వహించిన ఓటింగ్‌లో 151–-29తో ఆమోదం తెలిపారు. మరోవైపు ఇరాన్ బురఖా ధరించడంపై నిబంధనలు కఠినతరం చేసింది.
అమెరికాలోని విదేశీయుల్లో చైనా టాప్
అమెరికాలో నివసిస్తున్న భారతీయులు దాదాపు 47 లక్షల మంది అని తేలింది. ఈ మేరకు 2020 నాటి జాతులవారీగా సమగ్ర జనాభా లెక్కల వివరాలను విడుదల చేశారు. జనాభా లెక్కల ప్రకారం అమెరికాలో ఉంటున్న విదేశీయుల్లో చైనీయులు ఎక్కువ. ఆ దేశానికి చెందిన వారు 52 లక్షల మంది అగ్రరాజ్యంలో ఉన్నారు. తర్వాత స్థానం భారతీయులదే.
జాతీయం
శివశక్తిగా ల్యాండర్ దిగిన ప్రాంతం
చందమామ దక్షిణ ధ్రువంపై చంద్రయాన్–3 ల్యాండర్ దిగిన ప్రాంతానికి ‘శివశక్తి’ పేరును ప్రధాని మోడీ ప్రకటించారు. ల్యాండింగ్ జరిగిన రోజు(ఆగస్ట్ 23)ను ఇకపై జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 2019లో చంద్రయాన్–2 చంద్రునిపై కూలిన ప్రదేశాన్ని తిరంగా పాయింట్‌గా పిలువనున్నారు.
మోడీకి గ్రీసు పురస్కారం
గ్రీసుకు చెందిన ప్రతిష్టాత్మక ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ హానర్’ ప్రధాని నరేంద్ర మోడీకి లభించింది. గ్రీసు అధ్యక్షురాలు కటెరీనా ఆయనను ఈ గౌరవంతో సత్కరించారు. ఈ ఆర్డర్ ఆఫ్ హానర్‌ను గ్రీసు ప్రభుత్వం 1975 నుంచి ఇస్తున్నారు.
నెహ్రూ మ్యూజియంకు కొత్త పేరు
దేశ రాజధాని న్యూఢిల్లీ తీన్‌మూర్తి భవన్‌లో అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించిన నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్‌ఎంఎంఎల్)ని ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ (పీఎంఎంల్)గా పేరు మారుస్తూ ఆగస్టు 14న అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. తీన్‌మూర్తి భవనం 16 ఏళ్లపాటు నెహ్రూ అధికారిక నివాసంగా ఉంది.
‘భారత్ ఎన్‌క్యాప్’ ప్రోగ్రామ్
గ్లోబల్ ఎన్‌క్యాప్ తరహాలో దేశీయ కార్లలో ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను పరీక్షించి సేఫ్టీ రేటింగ్ ఇచ్చే కొత్త విధానం ‘భారత్ ఎన్‌క్యాప్’ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. భారత్ ఎన్‌క్యాప్ లోగోతో పాటు స్టిక్కర్‌ను విడుదల చేశారు.
భారత రెజ్లింగ్ సమాఖ్యపై వేటు
45 రోజుల్లో భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్‌ఐ) ఎన్నికల ప్రక్రియ ముగించకుండా పదేపదే వాయిదా వేయడంతో సమాఖ్యపై యునైటెడ్ రెజ్లింగ్ వరల్డ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. అంతర్జాతీయ మెగా ఈవెంట్లలో పతకం గెలిస్తే మన త్రివర్ణ పతాకం ఎగురదు. భారత రెజ్లర్లు యూడబ్ల్యూడబ్ల్యూ జెండా కింద పోటీ పడాలి.
ఉత్తమ ఆకర్షణీయ నగరం ఇండోర్
ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. ఈ పోటీలో ఇండోర్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. సూరత్, ఆగ్రాలు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. పారిశుద్ధ్య విభాగం (ఘనవ్యర్థాల నిర్వహణ)లో కాకినాడకు రెండో బహుమతి దక్కింది.
అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్‌గా ఆర్‌బీఐ గవర్నర్
అంతర్జాతీయంగా అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్‌గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ నిలిచారు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజీన్ ఇచ్చిన ర్యాంకుల్లో ఆయనకు అగ్రస్థానం దక్కింది. ‘గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2023’లో శక్తికాంత దాస్‌కు ‘ఏ+’ రేటింగ్ లభించింది.
ఆదిత్య-ఎల్1 రెండోసారి భూకక్ష్య పెంపు
సూర్యుడిపై అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 ఉపగ్రహానికి రెండోసారి భూకక్ష్య పెంపు విన్యాసాన్ని ఇస్రో చేపట్టింది. బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ ద్వారా ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ విన్యాసంతో ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం 282 కి.మీ.లు 40,225 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశించింది.
గ్రీన్ రైల్వేస్టేషన్‌గా విజయవాడ
గ్రీన్ రైల్వేస్టేషన్‌గా విజయవాడ ఎంపికైంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) నుంచి అత్యున్నత ప్లాటినం రేటింగ్‌ను కైవసం చేసుకుంది. గతంలో గోల్డ్ రేటింగ్ పొందగా తాజాగా ప్లాటినం సర్టిఫికెట్ సాధించింది. స్టేషన్‌లో ప్రయాణికులకు మెరుగైన వసతులు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఇంధన సామర్థ్య వినియోగం, నీటి సామర్థ్యం, స్మార్ట్, పర్యావరణ హిత అంశాలను విశ్లేషించి దీనిని అందించారు.
మహేంద్రగిరి యుద్ధనౌక జలప్రవేశం
భారత అత్యాధునిక యుద్ధనౌక ‘మహేంద్రగిరి’ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సతీమణి సుదేశ్ ధన్‌ఖడ్ ముంబయిలో ప్రారంభించారు. మజ్‌గాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) ఈ యుద్ధనౌకను అభివృద్ధి చేసింది. గంటకు 51.856 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 17ఎ ప్రాజెక్టు కింద రూపొందించిన ఏడో, చివరి యుద్ధనౌక ఇది.
జీ20లో ఆఫ్రికన్ యూనియన్
భారత్ నేతృత్వం వహిస్తున్న జీ20 కూటమిలో ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ)ను శాశ్వత సభ్యురాలుగా కొత్తగా చేర్చుకుంది.1999లో ఆవిర్భావం తర్వాత జీ20 కూటమిని విస్తరించడం ఇదే తొలిసారి.
జీవ ఇంధన కూటమికి శ్రీకారం
జీ20 వేదికగా ప్రధాని మోడీ జీవ ఇంధన కూటమి ఏర్పాటును ప్రకటించారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమ యజ్ఞంలో పాలుపంచుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. కూటమిలో వ్యవస్థాపక సభ్యులుగా అర్జెంటీనా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇటలీ, మారిషస్, దక్షిణాఫ్రికా, యూఏఈ, అమెరికా ఉన్నాయి. కెనడా, సింగపూర్ పరిశీలక దేశాలుగా చేరాయి.
అతి పొడవైన గాజు వంతెన
కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లాలోని వాగమన్ ప్రాంతంలో గాజు వంతెన ప్రారంభమైంది. ఇది దేశంలోనే అతి పొడవైన గాజు వంతెన. సముద్ర మట్టానికి 3,600 అడుగుల ఎత్తులో, 40 మీటర్ల పొడవుతో నిర్మించిన ఈ వంతెనను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి పి.ఎ.మహమ్మద్ రియాస్ ప్రారంభించారు.
శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులు
దేశంలోని 12 మంది యువ శాస్త్రవేత్తలు 2022 ఏడాదికి శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ మేరకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) ప్రకటించింది. ఈ అవార్డు కింద రూ.5 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఆమోదం
మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. పెద్దల సభలోనూ ఆమోదం పొందినా.. రిజర్వేషన్ కోటా అమలు అయ్యేది మాత్రం 2029 ఎన్నికల సమయంలోనేనని కేంద్రం స్పష్టం చేసింది. అంతకు ముందు జనాభా లెక్కలు, డీ లిమిటేషన్ ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. ఓటింగ్‌లో అనుకూలంగా 454 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 2 ఓట్లు వచ్చాయి.
‘సంవిధాన్ సదన్’ గా పాత పార్లమెంట్ బిల్డింగ్
పాత పార్లమెంట్ బిల్డింగ్‌ను సంవిధాన్ సదన్ గా పిలుచుకుందామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.
పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియాగా నోటిఫై చేశారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకవేళ పేరు మార్చే ఉద్దేశ్యమే ఉంటే పార్లమెంట్ హౌస్ ఆఫ్ భారత్ అనే గెజిట్ వెలువడేదనే వాదన వస్తోంది.
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్
‘టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్’ మేగజీన్ ప్రకటించిన ప్రపంచ విశ్వవిద్యాలయా ర్యాంకుల్లో ఆక్స్‌ఫర్డ్ (ఇంగ్లాండ్), స్టాన్‌ఫోర్డ్ (కాలిఫోర్నియా), మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కేంబ్రిడ్జి, మసాచుసెట్స్) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. బెంగళూరులోని ఐఐఎస్‌సీ 250వ స్థానాన్ని దక్కించుకుంది. రికార్డు స్థాయిలో 91 భారతీయ వర్సిటీలు ఇందులో చోటు దక్కించుకున్నాయి.
ఉత్తమ పర్యాటక గ్రామాలు
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఉత్తమ పర్యాటక గ్రామాలుగా జనగామ జిల్లా పెంబర్తి, సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌లను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దేశ ఉత్తమ పర్యాటక గ్రామంగా పశ్చిమబెంగాల్ ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన కిరీటేశ్వరి ఎంపికైంది.
లిథియం నిల్వల గుర్తింపు
అరుదైన ఖనిజం అయిన లిథియం నిల్వలు ఏపీలోనూ ఉన్నట్లు గుర్తించారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో పెద్దఎత్తున లిథియం నిల్వలను కొద్ది నెలల కిందట గుర్తించగా, ఏపీలోనూ అనంతపురం, వైయస్‌ఆర్ జిల్లాల సరిహద్దులో ఈ నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) నివేదిక ఇచ్చింది.
వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. 30 ఎకరాల్లో రూ.450 కోట్లతో ఈ స్టేడియాన్ని అంతర్జాతీయ హంగులతో నిర్మిస్తున్నారు. ఈ స్టేడియాన్ని శివతత్వం ఉట్టిపడేలా డిజైన్ చేశారు. సుమారు 30,000 సీటింగ్ సామర్థ్యంతో స్టేడియాన్ని నిర్మించనున్నారు.
ఆస్కార్‌కు భారత్ నుంచి ‘2018’
2024కు భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీని మలయాళ చిత్రం ‘2018’ దక్కించుకుంది. ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో ఈ సినిమా ఎంపికైంది. ‘ది కేరళ స్టోరీ’, ‘గదర్ 2’, ‘బలగం’, ‘దసరా’ ‘విరూపాక్ష’, ‘సార్’ తదితర 22 చిత్రాలు పోటీపడగా జ్యూరీ ‘2018’ని ఎంపిక చేసింది.
ప్రాంతీయం
ఎన్టీఆర్ రూ.100 స్మారణ నాణేం
నట దిగ్గజం, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. దివంగత నందమూరి తారకరామారావు పేరిట రూ.100 స్మారణ నాణేం విడుదల అయింది. రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది.
టెస్కాబ్‌కు జాతీయ పురస్కారాలు
తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారాలకు ఎంపికైంది.దేశంలోని ఉత్తమ సహకార బ్యాంకుగా టెస్కాబ్‌ను 2020–21 సంవత్సరానికి గాను ప్రథమ పురస్కారానికి, 2021–22లో ద్వితీయ పురస్కారానికి ఎంపిక చేసింది.
రన్నరప్ హంపి
టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ మహిళల బ్లిట్జ్‌లో కోనేరు హంపి రన్నరప్‌గా నిలిచింది. చైనాకు చెందిన జు వెంజున్ 12.5 పాయింట్లతో టైటిల్ చేజిక్కించుకోగా హంపి (12) అర పాయింటు తక్కువతో రెండో స్థానంలో నిలిచింది.
ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆమోదం
టీఎస్ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.
వన్యప్రాణుల సంరక్షణకు కమిటీ
వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెద్ద పులుల సంరక్షణకు ఈ కమిటీ ప్రాధాన్యం ఇవ్వనుంది. ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో అటవీ శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా, వైల్డ్‌లైఫ్ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. మరో 12 మంది సభ్యులు ఉంటారు.
టెస్కాబ్‌కు నాఫ్కాబ్ పురస్కారాలు
దేశంలో అత్యుత్తమ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ పురస్కారాన్ని తెలంగాణ టెస్కాబ్ (సహకార అర్బన్ బ్యాంకులపై టాస్క్‌ఫోర్స్) అధ్యక్షుడు కొండూరు రవీందర్‌రావు, ఎండీ నేతి మురళీధర్‌లు జైపుర్‌లో స్వీకరించారు.
జీవన్‌దాన్‌కు స్టేట్ ఆర్గాన్ అవార్డ్
అవయవదానంలో విశిష్ట సేవలు అందిస్తున్న తెలంగాణ జీవన్‌దాన్‌కు ఉత్తమ స్టేట్ ఆర్గాన్, టిష్యు ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఎస్‌వోటీటీవో) అవార్డు లభించింది. ట్రాన్స్‌ప్లాంట్ అథారిటీ ఆఫ్ తమిళనాడు (ట్రాన్స్‌స్థాన్) ఈ అవార్డును ప్రకటించింది.
వార్తల్లో వ్యక్తులు
జయావర్మ సిన్హా
రైల్వే బోర్డు సీఈవో, ఛైర్‌పర్సన్‌గా జయావర్మ సిన్హాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళా అధికారి జయావర్మనే కావడం విశేషం. సెప్టెంబర్ 1 నుంచి 2024 ఆగస్టు 31 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సీఈవో బాధ్యతల్లో కొనసాగనున్నారు. నేటి వరకు రైల్వే బోర్డు సీఈవోగా అనిల్ కుమార్ లాహోటీ కొనసాగారు.
రఫేల్ నాదల్
ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌కు, ఆ సంస్థకే చెందిన డిజిటల్ ఇన్నోవేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా అంతర్జాతీయ టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఈ భాగస్వామ్యం అమల్లో ఉంటుంది.
హెచ్.ఎస్.ప్రణయ్
భారత షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యంతోనే సరిపెట్టుకున్నాడు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రణయ్ 21–18, 13–21, 14–21తో కున్లావుత్ వితిద్‌సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం చవిచూశాడు.
ధనూషసాయి దుర్గాచౌదరి
అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన ధనూషసాయి దుర్గాచౌదరి స్టార్ మిస్ టీన్ ఇండియా ఇంటెలిజెంట్ 2023కు విజేతగా నిలిచింది. రాజస్థాన్‌లో జరిగిన స్టార్ మిస్ టీన్ ఇండియా ఇంటెలిజెంట్‌లో పలు రాష్ట్రాల నుంచి పాల్గొన్న ఎంతో మందిని దుర్గా ఓడించింది.
క్లెయిర్ కౌటిన్హో
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ కొత్తగాకేబినెట్‌లోకి క్లెయిర్ కౌటిన్హో అనే భారత సంతతి మహిళా సభ్యురాలిని చేర్చు కున్నారు. ఇంధన భద్రత మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. హోం మంత్రి సుయెల్లా బ్రేవర్‌మెన్‌తోపాటు క్లెయిర్ పూర్వీకులు గోవాకు చెందిన వారే.
జయరాజ్
విప్లవ పాటల రారాజు జయరాజ్‌ను 2023 సంవత్సరానికి కాళోజీ నారాయణరావు అవార్డు వరించింది. కాళోజీ జయంతి సందర్భంగా జయరాజ్‌కు పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపిక, రూ.1,01, 116 నగదు పురస్కారాన్ని అందించనున్నారు.
డాక్టర్ రవి కన్నన్
ఆసియా ఖండపు నోబెల్ బహుమతిగా పరిగణించే రామన్ మెగసెసె అవార్డుకు భారతీయ వైద్యుడు ఎంపికయ్యారు. ఎటువంటి సదుపాయాలుండని గ్రామీణ ప్రాంత క్యాన్సర్ రోగులకు విశిష్ట సేవలందిస్తున్న డాక్టర్ రవి కన్నన్‌ను ఈ పురస్కారం వరించింది. రామన్ మెగసెసె అవార్డు విజేతలను ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో నిర్వాహక కమిటీ ప్రకటించింది.
రాజేశ్ నంబియార్
టెక్నాలజీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ చైర్‌పర్సన్‌గా రాజేశ్ నంబియార్ నియమాతులయ్యారు. ప్రస్తుతం ఆయన కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన వైస్ చైర్మన్‌గానూ పనిచేశారు.
టి.వి.నాగేంద్రప్రసాద్
కజక్‌స్థాన్‌కు రాయబారిగా తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. ప్రస్తుతం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్‌గా ఉన్న టి.వి.నాగేంద్రప్రసాద్‌ను రిపబ్లిక్ ఆఫ్ కజక్‌స్థాన్‌కు అంబాసిడర్‌గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.
చౌడూరి ఉపేంద్రరావు
ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో సంస్కృతం, ఇండిక్ స్టడీస్ శాఖలో ప్రొఫెసర్‌గా ఉన్న చౌడూరి ఉపేంద్రరావు 2023 సంవత్సరానికిగానూ ఎంజీ ధడ్‌ఫాలే ఎక్స్‌లెన్స్ పురస్కారం దక్కించుకున్నారు. పాళి భాషలో సృజనాత్మక రచనలు చేసిన వారికి ఈ అవార్డును ఇస్తారు.
రజనీష్ కుమార్
దేశీయ బ్యాంకింగ్ రంగ నిపుణులు, ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ పేమెంట్ టెక్నాలజీ కంపెనీ మాస్టర్‌కార్డ్ ఇండియా ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మాస్టర్‌కార్డ్ ఇండియా గురువారం ప్రకటన విడుదల చేసింది. 210కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలో ఆయన కీలకమైన నాన్-ఎగ్జిక్యూటివ్ సలహాదారుగా సేవలు అందిస్తారని మాస్టర్‌కార్డ్ ఇండియా పేర్కొంది.
జాక్ స్వోప్
అమెరికాకు చెందిన జాక్ స్వోప్ అనే యువకుడు ఒక ఏడాదిలో ఏకంగా 777 సినిమాలు చూశాడు. తన ఉద్యోగం చేస్తూనే థియేటర్లలో ఈ సినిమాలు చూడటం విశేషం. వీలునుబట్టి రోజుకు 2 లేదా 3 సినిమాలు చూసేవాడు. 2022 మే నుంచి మొదలుపెట్టి 2023 మే నెల పూర్తయేసరికి 777 సినిమాలు చూశాడు.
సబితా మహతో
బిహార్‌లోని ఛపరా ప్రాంతానికి చెందిన సబితా మహతో అనే మహిళ 19 రోజుల్లో 570 కి.మీ.ల దూరం పరుగు తీసి మనాలీ నుంచి లద్దాఖ్‌లోని ఎత్తయిన మోటారు రహదారి ఉమ్‌లింగ్ లా పాస్ చేరుకోవడంతో ప్రపంచ రికార్డు సాధించారు.
రజినీకాంత్
భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 జరగనున్న నేపథ్యంలో భారత్‌లోని దిగ్గజాలకు ప్రత్యేక టిక్కెట్లు ఇవ్వాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్’ అని పేరుతో అబితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్‌కు బీసీసీఐ ఈ గోల్డెన్ టికెట్‌ను అందజేసింది.తాజాగా సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్‍కు గోల్డెన్ టికెట్‌ను బీసీసీఐ అందించింది.
హలెప్
డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు రెండు సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత సిమోనా హలెప్‌పై నాలుగేళ్ల నిషేధం విధించినట్లు అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ చెప్పింది. 31 ఏళ్ల హలెప్ 2022 యుఎస్ ఓపెన్ సందర్భంగా డోప్ పరీక్షల్లో విఫలమైంది.
ఎం.ఎస్.స్వామినాథన్
భారత హరిత విప్లవ పితామహుడు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్ అనారోగ్యంతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. భారత్‌లో 1960వ దశకం నుంచి హరిత విప్లవానికి బాటలు వేసిన స్వామినాథన్‌ను రామన్ మెగసెసే, మొదటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ సహా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి.
వహీదా రెహమాన్
తమిళనాట పుట్టి, తెలుగు సినిమాతో నటిగా వెండితెరపై అడుగుపెట్టి, హిందీ చిత్రసీమను ఏలిన అందాల అభినేత్రి వహీదా రెహమాన్ కు భారత ప్రభుత్వం అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది.చిత్రసీమకు ఆమె చేసిన సేవలకు భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను అందించింది.
మాతా అమృతానందమయి
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాతా అమృతానందమయి 2023 సంవత్సరానికి గాను ‘వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ’ అవార్డుకు ఎంపికయ్యారు. బోస్టన్ గ్లోబల్ ఫోరమ్ (బీజీఎఫ్), మైఖేల్ డుకాకిస్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లీడర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ (ఎండీఐ) ఈ అవార్డును ప్రకటించాయి.
లియాండర్ పేస్
ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ ప్లేయర్ విభాగంలో నామినేట్ అయిన తొలి ఆసియా పురుషుడిగా భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఘనత సాధించాడు. అతడితో పాటు కారా బ్లాక్, అనా ఇవనోవిచ్, కార్లోస్ మోయా, డేనియల్ నెస్టర్, ఫ్లావియా పెనెట్టాలకు నామినేషన్స్ దక్కాయి.
చేత్నా మరూ
బ్రిటన్ రాజధాని లండన్‌కు చెందిన భారత సంతతి రచయిత చేత్నా మరూ తొలి నవల ‘వెస్ట్రన్ లేన్’ 2023 బుకర్ ప్రైజ్ తుది జాబితాలో చోటు దక్కించుకుంది. బ్రిటన్‌లోని గుజరాతీల నేపథ్యాన్ని ఆ నవలలో ప్రస్తావించారు. 11 సంవత్సరాల గోపి అనే బాలిక, తన కుటుంబంతో ఆమెకు ఉండే అనుబంధాలను నవల ఆవిష్కరిస్తుంది.
స్పోర్ట్స్
నీరజ్ స్వర్ణ చరిత్ర
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించాడు. నీరజ్ రెండో ప్రయత్నంలో విసిరిన జావెలిన్ అత్యధికంగా 88.17 మీటర్ల దూరం వెళ్లింది. పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ 87.82 మీటర్లతో రజత పతకం దక్కించుకున్నాడు.
మహిళల హాకీ ఆసియా కప్ ఫైవ్స్
మహిళల హాకీ ఆసియా కప్ ఫైవ్స్ (ఐదుగురు ఆడే) టోర్నమెంట్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. దీంతో 2024 ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందింది. ఫైనల్లో భారత్ 7–2 గోల్స్ తేడాతో థాయ్‌లాండ్ జట్టును ఓడించింది.
ఇటాలియన్ గ్రాండ్ ప్రి
ఫార్ములావన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న మ్యాక్స్ వెర్‌స్టాపెన్ రికార్డు స్థాయిలో వరుసగా పదో విజయం సాధించాడు. ఈ రెడ్‌బుల్ డ్రైవర్ ఇటాలియన్ గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచాడు. అతడి సహచరుడు సెర్జియో పెరెజ్ రెండో స్థానం సాధించాడు.
మోహన్ బగాన్‌కు డ్యూరాండ్ కప్
ప్రతిష్టాత్మక డ్యూరాండ్ కప్‌లో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ 23 ఏళ్లలో తొలిసారి ఈ ఫుట్‌బాల్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో బగాన్ జట్టు 1–-0తో ఈస్ట్ బెంగాల్‌ను ఓడించి కప్‌ను నెగ్గింది. మోహన్ బగాన్‌కు ఇది ఓవరాల్‌గా 17వ డ్యూరాండ్ కప్ టైటిల్.
యుఎస్ ఓపెన్
యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో రెండో సీడ్ జకోవిచ్ 6-–3, 7–-6 (7–-5), 6-–3 తేడాతో మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)ను వరుస సెట్లలో ఓడించేశాడు. దీంతో ఓవరాల్‌గా అగ్రస్థానంలో ఉన్న మార్గరెట్ కోర్ట్ (24)ను సమం చేశాడు. మహిళల సింగిల్స్‌లో కోకో గాఫ్ ఫైనల్లో సబలెంకను ఓడించి విజేతగా నిలిచింది.
ఇండోనేసియా మాస్టర్స్ టైటిల్
భారత యువ షట్లర్ కిరణ్ జార్జ్ ఇండోనేసియా మాస్టర్స్ సూపర్ 100 టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో కిరణ్ 21-–19, 22-–20తో ప్రపంచ 82వ ర్యాంకర్ తకాహషి (జపాన్)ను ఓడించాడు. కెరీర్‌లో అతడికిది రెండో సూపర్-100 టైటిల్.
సింగపూర్ గ్రాండ్‌ప్రి
సింగపూర్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ జట్టు డ్రైవర్ కార్లోస్ సెయింజ్ చాంపియన్‌గా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన సెయింజ్ అగ్రస్థానాన్ని సంపాదించాడు. 22 రేసుల ఈ సీజన్‌లో తొలి 14 రేసుల్లో రెడ్‌బుల్ డ్రైవర్లు వెర్‌స్టాపెన్ (12), సెర్జియో పెరెజ్ (2) విజేతగా నిలిచారు.
ప్రపంచకప్ షూటింగ్లో గోల్డ్
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత షూటర్ ఇలవేనిల్ వలారివన్ విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్లో తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల ఇలవేనిల్ 252.2 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది.
మహిళల క్రికెట్ జట్టుకు గోల్డ్
ఆసియా క్రీడల్లో తొలిసారి మహిళల క్రికెట్ జట్టు గోల్డ్ మెడల్ సాధించింది. ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు అంచనాలను అందుకుంది. ఫైనల్లో శ్రీలంకను 19 పరుగుల తేడాతో ఓడించి స్వర్ణం చేజిక్కించుకుంది.
భారత్ నంబర్‌వన్
భారత క్రికెట్ జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలోనూ అగ్రస్థానం సంపాదించింది. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో విజయం సాధించడంతో ఈ ఫార్మాట్లో నంబర్‌వన్ ర్యాంకు భారత్ సొంతమైంది. ఇలా మూడు ఫార్మాట్లలో నంబర్‌వన్ కావడం ఇదే తొలిసారి.
సైన్స్ అండ్ టెక్నాలజీ
తేజస్ ‘అస్త్ర’ సక్సెస్
తేలికపాటి యుద్ధ విమానం తేజస్ నుంచి అస్త్ర క్షిపణిని గోవా తీరంలో విజయవంతంగా పరీక్షించారు. అస్త్ర, గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి. పైలట్ కంటికి కనిపించని పరిధి (బియాండ్ విజువల్ రేంజ్-బీవీఆర్)లోని లక్ష్య ఛేదనకు రూపొందించింది.
ఇస్రో చేతికి నాసా ఉపగ్రహం
చంద్రయాన్-3 విజయం తర్వాత ప్రపంచ దేశాల చూపు భారత దేశం వైపు మళ్లింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, ఇస్రోతో కలిసి సంయుక్తంగా డెవలప్ చేసిన నిస్సార్ ఉపగ్రహాన్ని ప్రయోగించే బాధ్యతలను ఇస్రోకు అప్పజెప్పింది.
జపాన్ మూన్ ల్యాండర్
జపాన్ చంద్రునిపై పరిశోధన కోసం మూన్ ల్యాండర్‌ను విజయవంతంగా ప్రయోగించింది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ అనే మూన్ ల్యాండర్‌ను, ఎక్స్-రే ఇమేజింగ్, స్పెక్ట్రోస్కోపీ మిషన్ అనే స్పెక్ట్రోస్కోప్‌ను తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిషన్‌కి మూన్ స్నైపర్‌గా నామకరణం చేశారు.
అంగారకుడిపై ఆక్సిజన్ తయారీ
అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి కోసం చేపట్టిన ప్రయోగం విజయవంతంగా ముగిసినట్లు ‘నాసా’ ప్రకటించింది. పర్సెవరెన్స్ రోవర్‌లోని మాక్సీ (మార్స్ ఆక్సిజన్ ఇన్-సిటు రిసోర్స్ యుటిలైజేషన్ ఎక్స్‌పెరిమెంట్) పరికరం16వ సారి ప్రాణవాయువును ఉత్పత్తి చేసిందని నాసా తెలిపింది.
ఇస్రో స్పేస్ టూరిజం
ఇస్రో చంద్రయాన్–3, ఆదిత్య ప్రయోగాలను దిగ్విజయంగా నిర్వహించి ప్రస్తుతం గగన్‌యాన్ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతోంది. మరోవైపు 2030 నాటికి స్పేస్ టూరిజానికి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటోంది.అంతరిక్షంలోకి వెళ్లే పర్యాటకులకు ఒక్కో టికెట్ ధర రూ.ఆరు కోట్లు ఉండే అవకాశం ఉందని ఇస్రో చైర్మన్ తెలిపారు.
తైవాన్ స్వదేశీ జలాంతర్గామి
నావికాదళాలతో తమ వైపు దూసుకొస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడే చైనాను అడ్డుకునేందుకు తైవాన్ తొలిసారిగా జలాంతర్గామిని తయారుచేసుకుంది. ప్రస్తుతం ఈ సబ్‌మెరైన్ పరీక్ష దశలో ఉంది. పరీక్షల్లో విజయవంతమై తైవాన్ దేశ సైనిక స్థైర్యం మరింత పెరగనుంది.