రేపు కలెక్టర్లతో సీఎం మీటింగ్

రేపు కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్ కలెక్టర్ల తో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్ కు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు హాజరుకానున్నారు. దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లు, 9 వ విడత తెలంగాణాకు హరితగారం, పోడు పట్టాల పంపిణీ, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ సీఎం కేసీఆర్ అధికారులకు దిశా నిర్ధేశం చేయనున్నారు.
రైతుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ

రాష్ట్రంలో రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 18న క్యాబినెట్ సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం ఈ రోజు జరిగింది. సచివాలయంలోని మూడో అంతస్తు సమావేశ మందిరంలో జరిగిన ఈ మీటింగ్ కు మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. యాసంగి పంటకాలం మూడు నుండి నాలుగు వారాలు ముందుకు జరపడం మూలంగా అకాల వర్షాల నుండి రైతులు పంట నష్టపోకుండా కాపాడడం, మార్చి నెలాఖరు వరకు యాసంగి పంట కోతలు పూర్తయ్యేలా రైతులను చైతన్యం చేయడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
గెలుపు కోసం తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చరిష్మాను వినియోగించుకోవాలని టీపీసీసీ యోచిస్తోంది. కర్నాటక విజయంతో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పాగా వేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలను ప్రారంభించినట్టు తెలుస్తోంది. గాంధీ–నెహ్రూ కుటుంబానికి చెందిన ప్రియాంకను రంగంలోకి దించడం ద్వారా సక్సెస్ కావాలనుకుంటున్నది. టీపీసీసీ ముఖ్యనాయకులు ప్రియాంక గాంధీతో ఈ విషయమై ఇప్పటికే చర్చించారని సమాచారం. ఇక్కడ జరిగే బహిరంగ సభలకు తరుచూ వచ్చిపోతుండాలని ఆమెను కోరినట్టు తెలుస్తోంది. ప్రియాంక గాంధీతో తెలంగాణలో పది రోజుల పాటు పాదయాత్ర నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
రేవంత్ రెడ్డిపై షర్మిల ఫైర్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. తనది ఆంధ్ర అని విమర్శిస్తున్న రేవంత్ సోనియా గాంధీ ఎక్కడి వారో గుర్తుంచుకోవాలన్నారు. ఈ రోజు బోడుప్పల్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న న్యాయవాది యుగంధర్ ను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ వైఎస్సార్ టీపీ అన్నారు. జై తెలంగాణ అనే దమ్మున్నది షర్మిలకు మాత్రమేనని పేర్కొన్నారు. జై తెలంగాణ అనే హక్కు రేవంత్ రెడ్డి, సోనియా, కేసీఆర్, మోడీకి లేదని అన్నారు. రేవంత్ రెడ్డి అల్లుడు కూడా ఆంధ్ర అని ఈ సందర్భంగా షర్మిల అన్నారు.
కరోనాను మించిన మరో మహమ్మారి

కరోనాను మించిన మహమ్మారి వచ్చే అవకాశాలు లేకపోలేదని WHO చీఫ్ టెడ్రోస్ అథనోం హెచ్చరించారు. 76వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో తాజాగా ప్రపంచ ఆరోగ్య పరిస్థితులపై తన నివేదికను సమర్పించారు. కొత్త వేరియెంట్ల కారణంగా మరో మహమ్మారి పుట్టుకొచ్చే అవకాశం కచ్చితంగా ఉందన్నారు. అది కరోనాకన్నా ప్రమాదకరమైంది అయ్యుంటుందన్నారు. ఆ పరిస్థితులకు అంతా సిద్ధంగా ఉండాలని తెలిపారు. మరో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రణాళికను ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
హైదరాబాద్ లో ఐటీ దాడుల కలకలం

హైదరాబాద్ లో దాదాపు 20 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కోహినూర్ గ్రూప్‌తో పాటు రెండు ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు. కోహినూర్ గ్రూప్ అఫ్ కంపెనీ ఎండీ మజీద్‌తో పాటు ఆ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లల్లో ఉదయం 6 గంటల నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మాదన్నపేట్, కొండాపూర్, మెహదీపట్నం, శాస్త్రిపురం తో పాటు పలు ప్రాంతాల్లో లో సోదాలు నిర్వహిస్తున్నారు. మాదన్నపేట రామచంద్ర నగర్ లోని కోహినూర్ డెవలపర్స్ కంపెనీ డైరెక్టర్ ఇంట్లో ఐటీ సోదాలు చేసిన అధికారులు.. పలు డాక్యుమెంట్లను పరిశీలించడంతోపాటు ఆదాయానికి సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో కోహినూర్ కంపెనీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పలు ప్రభుత్వ భూముల్లో కోహినూర్ గ్రూపు వెంచర్లు కూడా వేసింది.
వినియోగదారులకు నెట్ ఫ్లిక్స్ షాక్

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఎకౌంట్ పాస్‌వర్డ్ షేరింగ్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం ఫ్యామిలీతో మాత్రమే పాస్‌వర్డ్‌ను షేర్ చేసుకులా కండీషన్ తీసుకువచ్చింది. ఇతరులతో పాస్‌వర్డ్ షేర్ చేసుకుంటే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన ఇండియాలో ఎప్పటి నుండి అమల్లోకి రానుంది అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ విధానాన్ని కొన్ని సెలక్టెడ్ మార్కెట్స్ లో ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. వాటికి సూపర్ రెస్పాన్స్ రావడంతో.. ఇప్పుడు అమెరికా సహా వందకు పైగా దేశాల్లో అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. నిజానికి 2017లో స్వయంగా కంపెనీయే పాస్‌వర్డ్‌ను ఇతరులతో పంచుకోవచ్చని, లవ్ ఈజ్ షేరింగ్ పాస్‌వర్డ్ అని ప్రచారం కూడా చేసింది. కానీ కరోనా తరువాత ఇతర ఓటీటీ ప్లాట్ఫామ్స్ కు ఆదరణ పెరుగుతుండటంతో కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కుంటోంది.
పేపర్ లీక్ కేసు: డీఏఓ టాపర్ల విచారణ

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీల కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న 37 మందిని అరెస్ట్ చేసింది. తాజాగా డీఏవో పరీక్షలో టాపర్లుగా నిలిచిన రాహుల్, శాంతి, సుచరితలను అధికారులు విచారిస్తున్నారు. వారికి వచ్చిన మార్కులపై ఆరా తీస్తున్నారు. మరోవైపు కేసులో నిందితురాలిగా ఉండి ఇటీవల బెయిల్ పై విడుదలైన రేణుకను సిట్ ఈరోజు విచారించనుంది. అయితే ఈకేసులో యూజర్ ఐడీ, పాస్వర్డ్వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు.
బాడీని ముక్కలు చేసి ఫ్రిజ్ లో.. హైదరాబాద్ లో దారుణం
రాష్ట్రంలో సంచలనం రేపిన చాదర్ ఘాట్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆరు రోజుల క్రితం చైతన్య పురి పీఎస్ పరిధిలో పాలిథిన్ కవర్ లో ఓ మహిళ తల లభ్యమైంది. మృతురాలు కేర్ ఆస్పత్రి నర్సు గుర్రం అనురాధగా పోలీసులు గుర్తించారు. అయితే బాడీని ముక్కలు ముక్కలుగా చేసి ఫ్రిజ్ లో దాచి ఉంచినట్టు తెలుస్తోంది. అనురాధ ఓ వైపు నర్సుగా విధులు నిర్వర్తిస్తూనే మరో వైపు వడ్డీ వ్యాపారం చేసేవారని ఆమె సోదరి తెలిపింది. ఈ క్రమంలో తలెత్తిన వివాదంతోనే ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించారు. డ్డీ వ్యాపారం చేసే అనురాధ.. ఆన్ లైన్ లో ట్రేడింగ్ చేసే చంద్రమోహన్ అనే వ్యక్తికి రూ. 7 లక్షలు అప్పుగా ఇచ్చింది. తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాలని అడగగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
యువతిపై ప్రేమోన్మాది దాడి
సంగారెడ్డి జిల్లాలోని తార ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. అఖిల అనే సెకండియర్విద్యార్థినిపై ప్రవీణ్అనే ప్రేమోన్మాది బ్లేడుతో దాడి చేశాడు. చేతికి గాయాలు కావడంతో వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రవీణ్ ప్రేమను అఖిల తిరస్కరించిందనే కోపంతో దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
తిరుమలగిరిలో హైటెన్షన్

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ రోజు తలపెట్టిన నిరసన కార్యక్రమంపై హైటెన్షన్ నెలకొంది. దళితబంధు అక్రమాలను ప్రశ్నించినందుకు ఇటీవల తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరులు అడ్వకేట్ యుగంధర్‌పై దాడి చేశారు. ఈ దాడిని ఖండిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నేడు తిరుమలగిరిలో నిరసనకు పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఉదయం నుంచి అఖిలపక్ష నాయకులను ఎక్కడిక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. అయితే అఖిలపక్షం మహాధర్నాకు వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల పాల్గొనాల్సి ఉంది. పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆమె తిరుమలగిరి పర్యటనను రద్దు చేసుకున్నారు.