ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన సమాధానం ఇచ్చారు. బ్యాంకులకు మంజూరు చేసిన మొత్తం పోస్టుల్లో ఇది 5శాతానికి సమానం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 8,05,986 ఉద్యోగాలు ఉన్నాయి.
95 శాతం భర్తీ
తాజా లెక్కల ప్రకారం ఎస్‌బీఐలో అత్యధికంగా 8,544 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీలు ఎక్కువగా ఉండటంతో ఉద్యోగులపై ఒత్తిడి పెరిగిపోయిన విషయం ప్రభుత్వానికి తెలుసా..? అని లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. డిసెంబర్ 1వ తేదీ నాటికి బ్యాంకులకు కేటాయించిన పోస్టుల్లో 95శాతం భర్తీ అయ్యాయని ఆమె వెల్లడించారు. ‘ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులకు కేటాయించిన 8,05,986 ఉద్యోగాల్లో కేవలం 41,177 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి’ అని ఆమె వెల్లడించారు. మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆఫీసర్, క్లర్క్,సబ్‌స్టాఫ్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎస్‌బీఐలో 8,544, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 6,743, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6,295, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 5,112, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4,848 ఉన్నట్లు తన సమాధానంలో నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
అవసరాలకు తగ్గట్లు నియామకాలు
గత ఆరేళ్లలో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో ఒక్క పోస్టు తగ్గించామన్నారు. మిగిలిన బ్యాంకుల పోస్టుల్లో ఎటువంటి కోత విధించలేదని వివరించారు. బ్యాంకులు వాటి అవసరాలకు తగినట్లు నియామకాలు చేపడుతున్నాయని సీతారామన్ చెప్పారు.