తెలంగాణలో ఉపాధ్యాయుల భర్తీ (డీఎస్సీ) అప్లికేషన్ల గడువును పొడిగించాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఈరోజు సాయంత్రం అధికారికంగా తేదీల వివరాలను వెల్లడించనుంది. ముందుగా ప్రకటించిన మేరకు డీఎస్సీ అప్లికేషన్ల గడువు ఈ రోజుతో (20వ తేదీ) ముగియనుంది. ఈ రోజు ఫీజు చెల్లించిన వారు రేపటి వరకు అప్లికేషన్లు అప్లోడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1.38 లక్షల మంది ఫీజు చెల్లించారు. అందులో 1.33 లక్షల మంది అప్లికేషన్లు సబ్మిట్ చేశారు.
ఈసారి అప్లికేషన్ల సంఖ్య తక్కువగానే ఉండటంతో ఉపాధ్యాయ పోస్టుల పోటీ తక్కువగా ఉంటుందనే విశ్లేషణలున్నాయి. కానీ రిజర్వేషన్ల వారీగా కోటాల ప్రకారం ఆశించినన్ని ఖాళీలకు నోటిఫికేషన్ రాలేదని, దాదాపు 15 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటే కేవలం 5 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిందని, అందుకే అభ్యర్థుల నుంచి స్పందన లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబర్ 20 నుంచి పది రోజుల పాటు సీబీఆర్టీ విధానంలో ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. ఎన్నికల కారణంగా ఈ పరీక్షల తేదీలను వాయిదా వేశారు. మరోవైపు బీఈ, బీటెక్‌తో బీఈడీ ఉన్న అభ్యర్థులు కూడా టీచర్ పోస్టులకు అర్హులేనని ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పరీక్షలు వాయిదా పడ్డందున.. అప్లికేషన్ల గడువు కూడా మరికొద్ది రోజులు పొడిగించాలని అభ్యర్థులు విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్లికేషన్ల గడువును మరో రెండు వారాలు పొడిగించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ రోజు సాయంత్రం ప్రకటన వెలువడే అవకాశముంది.
