తెలంగాణలో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 20 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అక్టోబర్ 21తో ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి పలు అభ్యంతరాలు రావడంతో దరఖాస్తు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ. ఈ గడువును అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు పొడిగించినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రకటన వెలువరించింది విద్యాశాఖ.
ఈసారి అప్లికేషన్ల సంఖ్య తక్కువగానే ఉండటంతో ఉపాధ్యాయ పోస్టుల పోటీ తక్కువగా ఉంటుందనే విశ్లేషణలున్నాయి. కానీ రిజర్వేషన్ల వారీగా కోటాల ప్రకారం ఆశించినన్ని ఖాళీలకు నోటిఫికేషన్ రాలేదని, దాదాపు 15 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటే కేవలం 5 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిందని, అందుకే అభ్యర్థుల నుంచి స్పందన లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబర్ 20 నుంచి పది రోజుల పాటు సీబీఆర్టీ విధానంలో ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. ఎన్నికల కారణంగా ఈ పరీక్షల తేదీలను వాయిదా వేశారు. మరోవైపు బీఈ, బీటెక్‌తో బీఈడీ ఉన్న అభ్యర్థులు కూడా టీచర్ పోస్టులకు అర్హులేనని ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పరీక్షలు వాయిదా పడ్డందున.. అప్లికేషన్ల గడువును పొడిగించాలని అభ్యర్థులు విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో అప్లికేషన్ల గడువును మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ.