ఆంధ్రప్రదేశ్ లోని రాజీవ్ గాంధీ విజ్నాన, సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని 4 ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లలో రెండేళ్ల పీయూసీ,4ఏళ్ల బీటెక్ ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ షురూ అయ్యింది. ఆర్కే వ్యాలీ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలులోని ట్రిపుల్ ఐటీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి మే 8 నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత పొంది ఆసక్తి కలిగిన విద్యార్థులు జూన్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందినవారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే.
ఈ 4 క్యాంపస్‌లలో కలిపి మొత్తంగా 4వేల సీట్లు భర్తీ చేయనున్నారు. మొత్తం సీట్లలో 85 శాతం రాష్ట్ర విద్యార్థులకే కేటాయించనున్నారు. మిగిలిన 15 శాతం సీట్లకు రాష్ట్రంతోపాటు తెలంగాణ విద్యార్థులు కూడా పోటీ పడనున్నారు. దరఖాస్తు ఫీజు రూ.300. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఉంటుందని అధికారులు తెలిపారు.
10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అనుసరించి ఈ సీట్లను భర్తీ చేయనున్నారు. ఆర్జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదించిన ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కులకు 4 శాతం మార్కులు కలుపుతారు. రెండేళ్ల పీయూసీ తర్వాత విద్యార్థులకు బయటకు వెళ్లే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ ఇద్దరు విద్యార్థుల స్కోర్ సమానంగా ఉంటే 7 అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొదట గణితంలో, తర్వాత సైన్స్, ఆంగ్లం, సాంఘికశాస్త్రం, ఫస్ట్ లాంగ్వేజ్‌లో సాధించిన గ్రేడ్‌ను పరిశీలించి సీట్లు కేటాయిస్తారు. అవీ సమానంగా ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఎక్కువ వయసున్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. పుట్టిన తేదీ కూడా సమానంగా ఉంటే హాల్‌టికెట్ ర్యాండమ్ నంబరు విధానాన్ని పరిగణిలోకి తీసుకుంటారు. అభ్యర్థుల మెరిట్ ఆధారంగా కేటగిరీ ప్రకారం.. క్యాంపస్‌లను కేటాయిస్తారు. అందువల్ల అభ్యర్థులు తమ క్యాంపస్ ప్రాధాన్యాలను జాగ్రత్తగా సూచించాలి. ఒకసారి క్యాంపస్ నిర్ధారణ జరిగిన తర్వాత బదిలీకి అవకాశం ఉండదు. విద్యార్థులు ప్రవేశం పొందిన క్యాంపస్‌లోనే విద్యనభ్యసించాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థుల ప్రొవిజినల్ జాబితాలను జులై 11న ప్రకటించే ఛాన్స్ ఉందని ఆర్జీయూకేటీ తెలిపింది.