తెలంగాణకు హరితహారం: రాష్ట్రంలో ఉన్న అటవీ విస్తీర్ణంలో 24 శాతం నుంచి 33శాతానికి పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన కార్యక్రమం ‘కోతులు వాపస్ పోవాలి వానలు వాపస్ రావాలె’ అనే నినాదంతో 2015 జులై 3న రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలంలోని చిలుకూరి బాలాజీ దేవాలయ ప్రాంగణంలో సంపెంగి మొక్క నాటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఇప్పటివరకు ఏడు విడతలుగా మొక్కలు నాటారు.
మిషన్ కాకతీయ: 2015 మార్చి 12న మిషన్ కాకతీయలో భాగంగా ‘మన ఊరు–మన చెరువు’ పథకాన్ని సీఎం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ పాత చెరువులో ప్రారంభించారు. 46,531 చెరువులను ప్రతి సంవత్సరం 20శాతం చెరువులను పునరుద్దరిస్తారు.
మిషన్ భగీరథ: రాష్ట్రంలోని ప్రజలందరికి ఇంటిటికీ సురక్షిత మంచినీరును అందించేందుకు రూపొందించిన పథకం. ఈ ప్రాజెక్ట్ పైలాన్‌ను సీఎం 2015 జూన్ 8న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఆవిష్కరించారు. ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ 2016 ఆగస్టు 7న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ప్రారంభించారు.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్: ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందిన అమ్మాయి వివాహాలకు ఆర్థిక సాయం అందించేందుకు రూపొందించిన పథకం. ఈ పథకంలో మొదట రూ.51,000 అందించేవారు. 2018 ఏప్రిల్ 1 నుంచి ఆర్థిక సాయాన్ని రూ.1,00,116లకు పెంచింది. ప్రస్తుతం ఈ పథకం బీసీ, ఓబీసీ, ఈబీసీలకు వర్తింపచేస్తున్నారు.
మైనారిటీ కమ్యూనిటికి చెందిన అమ్మాయిల వివాహానికి ‘షాదీముబారక్’ పేరుతో రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఈ పథకం 2014 అక్టోబర్ 2 నుంచి అమల్లోకి వచ్చింది.
కేసీఆర్ కిట్: మాతా శిశు సంరక్షణ, బాలింతల సంరక్షణే ధ్యేయంగా ‘అమ్మకు ఆత్మీయతతో.. బిడ్డకు ప్రేమతో’ అనే నినాదంతో రూపొందించిన పథకం. 2017 జూన్ 3న హైదరాబాద్‌లోని పేట్లబురుజు ప్రభుత్వ దవాఖానలో గర్భిణీ నమోదు, వైద్య పరీక్షలు చేయించుకొని ప్రసవించిన తల్లికి వాయిదా పద్ధతిలో మగబిడ్డ పుడితే రూ.12,000. ఆడ శిశువు జన్మిస్తే రూ.13,000 ఇస్తారు. వీటితో పాటు 16 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ అందజేస్తారు. తమిళనాడులోని ‘ముత్తులక్ష్మి ప్రసవ పథకం’ ప్రేరణగా ఈ పథకాన్ని రూపొందించారు.
రైతుబంధు పథకం: రైతులను రుణభారం నుంచి విముక్తి కల్పించి తిరిగి అప్పుల ఊబిలో చిక్కుకోకుండా కాపాడడం, సాగుకు అవసరమైన ఉత్పాదకాల కొనుగోలు, ఇతర పెట్టుబడుల కోసం నిర్దేశించిన పథకం. 2018 మే 10న సీఎం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం శాలపల్లి–ఇందిరానగర్‌లో ప్రారంభించారు. 2019–20 నుంచి ఒక్కో సీజన్‌కి రూ.5,000 చొప్పున రెండు పంటలకు రూ.10,000 అందిస్తుంది.
రైతుబీమా పథకం: రైతు ఏ కారణంతో మరణించినా పది రోజుల్లోగా రూ. 5 లక్షల ప్రమాద బీమా చెల్లించే విధంగా రూపొందించిన పథకం. 2018 ఆగస్టు 15న సీఎం గోల్కొండ కోటలో ప్రారంభించారు. ఈ పథకంలో నమోదు కావడానికి వయోపరిమితి 18 నుంచి 59 సంవత్సరాలు.
దళితబంధు పథకం: ఈ పథకాన్ని ఆగస్టు 4, 2021న ముఖ్యమంత్రి దత్తత గ్రామం అయిన యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 దళిత కుటుంబాలను ఎంపిక చేసి రూ. 10 లక్షలు అందిస్తారు. ఈ పథకం ద్వారా ఇచ్చిన నగదు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. 2022–23 బడ్జెట్లో ఈ పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించారు.
మన ఊరు–మన బడి / మన బస్తీ–మన బడి: అన్ని ప్రభుత్వ పాఠశాల్లో మౌళిక సదుపాయాలు, తరగతి గదుల మరమ్మతు, అవసరమైన ఫర్నీచర్, టాయిలెట్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ నిర్వహణ, సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో రూపొందించిన పథకం. మూడు సంవత్సరాల కాలానికి 26,067 ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టారు. జనవరి 2022లో ఈ పథకాన్ని ప్రారంభించారు. 2022–23 బడ్జెట్లో రూ.7289.54 కోట్లు 3 సంవత్సరాలకు కేటాయించారు. 2022 మార్చి 8న వనపర్తి జిల్లా బాలుర ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు.
ఆసరా పథకం: రాష్ట్రంలోని అర్హులైన వితంతువులు, వృద్దులు, వ్యాధిగ్రస్తులు, వికలాంగులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, హెచ్ఐవీ రోగులు గౌరవప్రద జీవనం గడపడానికి, సామాజిక భద్రత కల్పించాడానికి, కనీస అవసరాలు తీర్చేందుకు నిర్దేశించిన పథకం ఆసర. 2014 నవంబర్ 8న పాత మహబూబ్‌నగర్ జిల్లా (ప్రస్తుతం రంగారెడ్డి) లోని కొత్తూరులో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా వృద్ధులకు అందించే సాయం వయోపరిమితి ఇటీవల 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించారు. వృద్ధులకు రక్షణ, వితంతువులకు జీవనాధారం, కల్లుగీత కార్మికులకు ఆలంభన, చేనేత కార్మికులకు చేయూత, ఎయిడ్స్ రోగులకు భరోసా, వికలాంగులకు భద్రత పేరుతో పెన్షన్ మంజూరు చేస్తున్నారు.
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పథకం: 2015 అక్టోబర్ 22న సూర్యాపేట, ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలలో సీఎం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాలలో ఇంటి నిర్మాణానికి రూ.5.30 లక్షలు, గ్రామీణ ప్రాంతాలలో రూ.5.04 లక్షల వంతున ఖర్చుపెట్టనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటిని 125 చదరపు గజాల్లో నిర్మిస్తారు. ఇంటిస్థలం ఉన్న పేద కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది.
షీ టీమ్స్: మహిళలు, యువతులు, విద్యార్థినులిపై కొనసాగుతున్న ఈవ్ టీజింగ్ సమస్య పరిష్కారం కోసం 2014 అక్టోబర్ 24న ఈ కార్యక్రమం ప్రారంభించారు. తెలంగాణలో 331 షీ టీమ్స్ ఉన్నాయి. షీ టీమ్స్ చీఫ్‌గా ఐపీఎస్ ఆఫీసర్ స్వాతి లాక్రా కొనసాగుతున్నారు.
అమ్మ ఒడి పథకం: గర్భిణులను దవాఖానలకు క్షేమంగా తీసుకురావడం, డెలివరీ అనంతరం తల్లిబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 102 నంబర్‌కు ఫోన్ చేస్తే అన్ని సౌకర్యాలున్న ప్రభుత్వ వాహనం ఇంటికే రావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
ఆరోగ్య లక్షి: 2015 జనవరి 1న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తల్లిబిడ్డల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రూపొందించిన పథకం. అంగన్వాడీల ద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ప్రతిరోజు ఒకపూట పౌష్టికాహారంతో కూడిన భోజనం అందిస్తున్నారు. ఈ పథకానికి అయ్చే ఖర్చు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50: 50 నిష్పత్తిలో పంచుకుంటారు. 16 కోడిగుడ్లు, 25 రోజులకి సరిపోయే సంపూర్ణ భోజనం 200 మిల్లీ లీటర్ల పాలు అందిస్తున్నారు.
సుభోజనం (సద్దిమూట)/భోజనామృతం: రూ.5 కే మార్కెట్ యార్డులో (సద్దిమూట), మాతా శిశు సంరక్షణ ప్రాంతీయ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు (భోజనామృతం) ఉచితంగా అందించడానికి 2014 అక్టోబర్ 13న సిద్ధిపేటలో ప్రారంభిచారు.
కంటివెలుగు: కంటిచూపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి, తగిన చికిత్స అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమాన్ని 2018 ఆగస్టు 15న మెదక్ జిల్లా తుఫ్రాన్ మండంల మల్కాపూర్ గ్రామంలో ప్రారంభించారు.
గొర్రెల పంపిణీ: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి 2017 జూన్ 20న సిద్ధిపేట జిల్లా కొండపాకలో ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా 75శాతం సబ్సిడీతో ప్రతి గొల్ల కురుమ కుటుంబానికి ఒక్కో యూనిట్ చొప్పున గొర్రెలను పంపిణీ చేస్తారు.
సన్నబియ్యం సరఫరా: ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులకు, పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం 2015 జనవరి 1 నుంచి అమలు చేస్తున్నారు.