Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​: అక్టోబర్​​ 2022

కరెంట్​ అఫైర్స్​: అక్టోబర్​​ 2022

అంతర్జాతీయం

ఎర్నాక్స్‌కు సాహిత్యంలో నోబెల్

ఫ్రెంచ్ ర‌చ‌యిత్రి అన్నీ ఎర్నాక్స్‌కు ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ ద‌క్కింది. జెండ‌ర్‌, లాంగ్వేజ్‌, క్లాస్‌కు సంబంధించిన అంశాల్లో ఉన్న విభేదాల‌పై  స్పష్టమైన రీతిలో ఎర్నాక్స్ అనేక ర‌చ‌న‌ల్లో త‌న అభిప్రాయాల‌ను వ్యక్తం చేశారు. సుమారు 30కి పైగా సాహిత్య ర‌చ‌న‌లు చేశారు.

రష్యా రిఫరెండంపై ఓటింగ్‌

ఉక్రెయిన్‌లోని లుహాన్‌స్క్, డొనెట్‌స్క్, ఖేర్సన్, జపొరిజాజియాలను విలీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా నిర్వహించిన ‘చట్టవిరుద్ధ రిఫరెండం’పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓటింగ్‌ జరిగింది. భారత్‌ ఈ ఓటింగ్‌లో పాల్గొనకుండా దూరంగా ఉండిపోయింది. రష్యా మాత్రం వీటో చేసింది.

ఏడేళ్లు నివాసముంటే గ్రీన్కార్డ్

అమెరికాలో వరుసగా కనీసం ఏడేళ్లపాటు నివాసం ఉన్న వలసదారు చట్టబద్ధమైన శాశ్వత నివాస అర్హత పొందవచ్చు. అమెరికాలో ఉంటూ ఏళ్ల తరబడి గ్రీన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్న 80 లక్షల మందికి ఇది శుభవార్త. ఈ  బిల్లును డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన నలుగురు సభ్యుల బృందం సెనేట్‌లో ప్రవేశపెట్టింది.

ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్

భౌతిక శాస్త్రంలో 2022 ఏడాదికిగానూ భౌతిక శాస్త్ర మేధావులు అలెయిన్‌ ఆస్పెక్ట్‌, జాన్‌ ఎఫ్‌. క్లౌజర్‌, ఆంటోన్‌ జెయిలింగర్‌లకు సంయుక్తంగా నోబెల్ అవార్డ్ దక్కింది. క్వాంటం ఇన్ఫర్మేషన్ సైన్స్‌కు మార్గదర్శకత్వం వహించడం లాంటి పరిశోధలకు ఈ ముగ్గురికి ఈసారి నోబెల్‌ పురస్కారం లభించింది.

ఉత్తరకొరియా మిస్సైల్ టెస్ట్

ఉత్తరకొరియా దాదాపు ఐదేళ్ల తర్వాత  జపాన్‌ మీదుగా బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. అమెరికాకు చెందిన గ్వామ్‌ దీవిని సైతం తాకే సామర్థ్యమున్న ఈ అణు క్షిపణి ప్రయోగంతో జపాన్‌ షాక్కు గురైంది. దీర్ఘ శ్రేణి క్షిపణి అయితే అమెరికా ప్రధాన భూభాగమే లక్ష్యంగా చేపట్టిన ప్రయోగమై ఉంటుందని నిపుణులు అంటున్నారు.

గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ 2022

జెనీవా(స్విట్జర్లాండ్‌) కేంద్రంగా పని చేస్తున్న వరల్డ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌ ప్రతి ఏటా విడుదల చేసే గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో ఈ సంవత్సరం భారత్‌కు 40 ర్యాంకు లభించింది. మొదటి ఐదు స్థానాల్లో వరుసగా స్విట్జర్లాండ్, యూఎస్‌ఏ, స్వీడన్, బ్రిటన్, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. గతేడాది 46వ స్థానంలో ఉంది.

అర్థశాస్త్రంలో నోబెల్‌

బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై సాగించిన కీలక పరిశోధనలకుగానూ అమెరికాకు చెందిన బెన్‌ షాలోమ్‌ బెర్నాంకే, డగ్లస్‌ డబ్ల్యూ. డైమండ్, ఫిలిప్‌ హెచ్‌.డైబ్‌విగ్‌లను ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం వరించింది.

నోబెల్‌ శాంతి పురస్కారం

ప్రజాస్వామ్యం, మానవహక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న అలుపెరుగని పోరాటానికి ప్రపంచ అత్యున్నత పురస్కారం ‘నోబెల్‌’ సలాం కొట్టింది. బెలారస్‌కు చెందిన హక్కుల కార్యకర్త ఏల్స్‌ బియాలియాట్‌స్కి, రష్యాలోని మెమోరియల్‌ సంస్థ, ఉక్రెయిన్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌లను ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి వరించింది.

బ్రిటన్ ప్రధాని రాజీనామా

బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ రాజీనామా చేశారు. తానిచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయానని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకూ తాను ప్రధాని పదవిలో కొనసాగుతానని తెలిపారు. లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్‌లో మరో మారు రాజకీయ సంక్షోభం ఏర్పడింది.

స్వీడన్‌ ప్రధానిగా ఉల్ఫ్‌ క్రిస్టెర్‌సన్‌

స్వీడన్‌ ప్రధానిగా కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన ఉల్ఫ్‌ క్రిస్టెర్‌సన్‌ను ఆ దేశ పార్లమెంట్ ఎన్నుకుంది. కేవలం మూడు ఓట్ల ఆధిక్యంతో ఆయన డెమోక్రాట్లపై విజయం సాధించారు. మూడు పార్టీల సంయుక్త భాగస్వామ్యంతో ప్రధాని పదవికి పోటీపడిన ఆయన సంపూర్ణ మెజారిటీని సాధించలేకపోయారు.

దలైలామాకు స్పెండ్‌లవ్‌ పురస్కారం

టిబెట్‌ ఆధ్యాత్మికవేత్త దలైలామాను అలైస్‌ అండ్‌ క్లిఫర్డ్‌ స్పెండ్‌లవ్‌ పురస్కారం వరించింది. సామాజిక న్యాయం, దౌత్యం, సహన విభాగాల్లో ఈ పురస్కారం ప్రకటించినట్లు దలైలామా కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ఈ అవార్డు అందుకొన్నారు.

ఆక్రమిత ఉక్రెయిన్‌ ప్రాంతాల్లో మార్షల్‌ లా

ఉక్రెయిన్‌లో ఇటీవల ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాల్లో రష్యా మార్షల్‌ లా అమల్లోకి తెచ్చింది. దీంతో ఆ ప్రాంతాల గవర్నర్‌లకు మరిన్ని అధికారాలు దఖలుపడ్డాయి. మార్షల్‌ లా నేపథ్యంలో ఈ నాలుగు ప్రాంతాల్లో కొత్తగా స్థానిక రక్షణబలగాల ఏర్పాటు, ప్రయాణ ఆంక్షలు, ప్రజాసమావేశాల రద్దు, కఠిన సెన్సార్‌ షిప్‌ విధానాలు, పాలనా యంత్రాంగానికి మరిన్ని అధికారాలు వంటి చర్యలు తీసుకునే అవకాశముంది.

బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌

భారత మూలాలున్న రిషి సునాక్‌ను ప్రధానిగా బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3 అధికారికంగా ప్రకటించారు. గడిచిన 200 ఏళ్లల్లో బ్రిటన్‌ పాలనాపగ్గాలు చేపట్టిన పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని రిషి తెలిపారు.

గ్రే లిస్ట్‌ నుంచి పాకిస్థాన్‌ తొలగింపు

అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో పాకిస్థాన్‌కు భారీ ఊరట లభించింది. ‘గ్రే లిస్ట్‌’ నుంచి ఆ దేశాన్ని ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) తొలగించింది. దీంతో ఐఎమ్ఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, యూరోపియన్‌ యూనియన్‌ తదితర సంస్థల నుంచి నిధులు పొందే అవకాశం పాకిస్థాన్‌కు ఏర్పడింది.

వరుసగా 3వసారి ఎన్నికైన జిన్‌పింగ్‌

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా (సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి నాయకుడు ఆయనే.

ఆసియా టాప్ -పొల్యూషన్ సిటీస్

ఆసియాలోని అత్యంత కాలుష్యమైన టాప్‌–10 నగరాల్లో ఎనిమిది భారత్‌లోనే ఉన్నాయి. వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ గణాంకాల ప్రకారం హర్యాణలోని గురుగ్రామ్‌ మొదటి స్థానంలో ఉంటే బీహార్‌లోని ధారుహెరా రెండో స్థానంలో నిలిచింది. గాలిలో నాణ్యతా ప్రమాణాలు అత్యుత్తమంగా ఉన్న నగరాల్లో ఆసియాలో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం ఒక్కటే నిలిచింది.  

ఇమ్రాన్‌ఖాన్‌ సభ్యత్వం రద్దు

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, ఆ దేశ ప్రతిపక్ష నేత ఇమ్రాన్‌ఖాన్‌ జాతీయ అసెంబ్లీ సభ్యత్వంపై ఎన్నికల సంఘం రద్దు చేసింది. పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగే అర్హత ఖాన్‌కు లేదని,  రానున్న ఐదేళ్లలో అతను ఏ ఎన్నికలోనూ పోటీ చేయకూడదని తెలిపింది.

6 months current affairs e BOOK.. Just Click to Download

జాతీయం

5జీ సేవలు ప్రారంభం

అత్యంత హై– స్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలు అందించే 5జీ సేవలు దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చేశాయి. 5జీ టెలిఫొనీ సర్వీస్‌ శ్రీకారానికి అక్టోబర్ 1న ఢిల్లీలో ఆరో ‘ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌’ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రారంభించారు. దీంతో వైద్యం, విద్య, వ్యవసాయం, విపత్తు నిర్వహణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు సాధ్యం కానున్నాయి.

ముగిసిన మంగళ్యాన్ మిషన్

అంగారక (మార్స్‌) గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చేపట్టిన మంగళ్‌యాన్‌ మిషన్‌ ముగిసింది. మార్స్‌ ఆర్బిటార్‌ క్రాఫ్ట్‌తో గ్రౌండ్‌ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయినట్లు ఇస్రో అక్టోబర్ 3న ధ్రువీకరించింది. 2013 నవంబర్‌ 5న ఆర్బిటార్‌ ప్రయోగం ప్రారంభించారు.

ఒడిశా కోర్టుల్లో కాగిత రహిత సేవలు

ఒడిశాలోని 30 జిల్లాల్లో ఉన్న న్యాయస్థానాల్లో కాగిత రహిత(ఈ–ఫైలింగ్‌) వ్యవస్థను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ ప్రారంభించారు. కటక్‌ జ్యుడీషియల్‌ అకాడమీ ప్రాంగణంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

కాటన్‌ బ్యారేజికి అంతర్జాతీయ గుర్తింపు

ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా దీన్ని గుర్తించారు. దేశంలోని మొత్తం నాలుగు సాగునీటి కట్టడాలకు ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కగా అందులో కాటన్‌ బ్యారేజి అగ్రస్థానం దక్కించుకుంది.

దేశంలో తొలి సంపూర్ణ సోలార్‌ గ్రామం

దేశంలో తొలి సంపూర్ణ సౌర విద్యుత్ వినియోగ గ్రామంగా గుజరాత్‌లోని మొఢేరా గ్రామం రికార్డుల్లోకెక్కింది. మెహసాణా జిల్లాలోని మొఢేరా గ్రామం పేరు చెప్తే ఇన్నాళ్లూ అక్కడి ప్రఖ్యాత సూర్య దేవాలయమే గుర్తుకొచ్చేదని, ఇకపై సోలార్‌ ఊరుగానూ అది ఖ్యాతికెక్కుతుందని ప్రధాని పేర్కొన్నారు.

బాల్య వివాహాల్లో జార్ఖండ్‌ టాప్‌

చిన్నతనంలోనే బాలికలకు వివాహాలవుతున్న రాష్ట్రాల్లో జార్ఖండ్‌ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండకుండానే 5.8% మంది బాలికలకు పెళ్లిళ్లవుతున్నాయి.ఈ విషయంలో దేశవ్యాప్త సరాసరి 1.9% కాగా, కేరళలో 0.0% గా ఉంది. కేంద్ర హోం శాఖ నిర్వహించిన శాంపిల్‌ సర్వే–2020లో ఈ విషయం వెల్లడైంది.

అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. చట్ట ప్రకారం సురక్షితమైన అబార్షన్‌ మహిళలందరూ చేసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. పెళ్లితో సంబంధం లేకుండా అబార్షన్‌ చేయించుకునే హక్కు మహిళకు ఉందని తెలిపింది. పెళ్లి కాని మహిళలు కూడా అబార్షన్‌ చేయించుకోవచ్చని పేర్కొంది. గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్‌ కు అనుమతినిచ్చింది.

సీబీఐ ఆపరేషన్‌ మేఘచక్ర

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ) ఆపరేషన్‌ మేఘచక్రను ప్రారంభించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 20కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. గత కొంతకాలంగా ఆన్‌ లైన్‌ లో చిన్నారులపై పెరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సీబీఐ ఈ ఆపరేషన్‌ను ప్రారంభించింది.

కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్‌ పార్టీ నూత‌న‌ అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గేకు 7వేలకు పైగా ఓట్ల మెజారిటీతో శశిథరూర్‌ పై గెలుపొందారు.137 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలో తాజా ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు ఆరుసార్లు ఎన్నికలు నిర్వహించారు.

అర్బన్‌ వేస్ట్‌ వాటర్‌ సినారియో ఇన్‌ ఇండియా

దేశంలో పట్టణ ప్రాంతాల నుంచి వెలువడే మురుగు నీటిలో కేవలం 28శాతం మాత్రమే శుద్ధి అవుతోందని, మిగిలిన 72శాతం నదులు, సరస్సులు, భూగర్భంలోకి వెళుతోందని నీతి ఆయోగ్‌ ఇటీవల విడుదల చేసిన ‘అర్బన్‌ వేస్ట్‌వాటర్‌ సినారియో ఇన్‌ ఇండియా’ నివేదికలో పేర్కొంది.

ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ

ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో ప్రారంభమైన ఇంటర్‌పోల్‌ 90వ జనరల్‌ అసెంబ్లీ సందర్భంగా స్మారక పోస్టల్‌ స్టాంపును, రూ. వంద నాణేన్ని ప్రధాని మోడీ విడుదల చేశారు. పాతికేళ్ల తర్వాత మన దేశం ఇంటర్‌పోల్‌ జనరల్‌ అసెంబ్లీ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది.

ముగిసిన ప్రపంచ జియోస్పేషియల్‌ సమ్మిట్

హైదరాబాద్‌లో నాలుగు రోజులుగా జరుగుతున్న ఐక్యరాజ్యసమితి ప్రపంచ జియోస్పేషియల్‌ ఇన్ఫర్మేషన్‌ కాంగ్రెస్‌ సమ్మిట్ ముగిసింది. సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా అట్టడుగు ప్రజలకు, సామాన్యులకు ఉపయోగపడేలా ఉన్నప్పుడే ప్రయోజనం ఉంటుందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా గిరిధర్‌ అరమణె

కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా 1988 ఏపీ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి గిరిధర్‌ అరమణె నియమితులయ్యారు. ప్రస్తుతం కేంద్ర రహదారులు, రవాణా శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయన్ను రక్షణ శాఖకు బదిలీ చేస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

జీ-20  నాయకురాలిగా అమృతానందమయి

జీ-20 కూటమిలో పౌరసమాజం తరఫున ప్రాతినిధ్యం వహించే సివిల్‌ 20 (సీ20) బృందం చైర్‌పర్సన్‌గా ఆధ్యాత్మిక వేత్త మాతా అమృతానందమయి దేవిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. భారత్ 2023 నవంబరు 30 వరకు జీ20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనుంది.

ఆర్‌ఆర్‌ఆర్‌కు శాటర్న్‌ అవార్డు

అమెరికాలో హాలీవుడ్‌ చిత్రాలకిచ్చే ప్రముఖ శాటర్న్‌ అవార్డు ఈ ఏడాదికి రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు లభించింది. ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ఈ పురస్కారం దక్కించుకుంది. ‘బాహుబలి-2’ తర్వాత భారతీయ చిత్రానికి వరించిన రెండో శాటర్న్‌ అవార్డు ఇది.

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌ ఆర్డినెన్స్‌ ఆమోదం

కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్‌ పెంపు ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ ఆమోద ముద్రవేశారు. జస్టిస్‌ నాగమోహన్‌దాస్‌ సమితి నివేదిక ఆధారంగా ఎస్సీలకు 15 నుంచి 17 శాతానికి, ఎస్టీలకు 3 నుంచి 7 శాతానికి రిజర్వేషన్లను పెంచాలని అసెంబ్లీలో తీర్మానించారు. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 56 శాతానికి పెరగనుంది.

పర్యావరణం కోసం మిషన్‌ లైఫ్‌

వాతావరణ మార్పుల నుంచి భూమండలాన్ని కాపాడడం కోసం ప్రధాని మోడీ, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ సంయుక్తంగా మిషన్‌ లైఫ్‌(లైఫ్‌ స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌)ను గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రారంభించారు. ‘రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్‌’ విధానం అనుసరించాలని ప్రధాని కోరారు.

ప్రాంతీయం

జలజీవన్‌ పురస్కారం

తెలంగాణ మిషన్‌ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వ జలజీవన్‌ మిషన్‌ పురస్కారం లభించింది. గ్రామాల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా రోజూ తాగునీరు అందిస్తున్నందుకుగాను కేంద్రం తెలంగాణను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.

‘గొల్లభామ’కు యునెస్కో గుర్తింపు

చేనేత కార్మికుల వృత్తి కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే సిద్దిపేట బ్రాండ్‌ అంబాసిడర్‌ గొల్లభామ చీరకు యునెస్కో గుర్తింపు దక్కింది. పదేళ్ల క్రితమే భౌగోళిక (జియోగ్రాఫికల్‌) గుర్తింపు లభించగా తాజాగా యునెస్కో గుర్తింపు వచ్చింది.

డాక్టర్‌ అందెశ్రీకి పురస్కారం

తొలితరం ప్రజా వాగ్గేయకారులు ‘సుద్దాల హనుమంతు – జానకమ్మ జాతీయ పురస్కారం – 2022’ను లోక కవి డాక్టర్‌ అందెశ్రీకి ప్రదానం చేయనున్నట్లు సినీ కవి డాక్టర్‌ సుద్దాల అశోక్‌ తేజ ప్రకటించారు.

నందిపేటలో పురాతన రాతి చిత్రాలు

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట్‌ మండలం నందిపేట సమీపంలోని గజ్జెలగుట్టపై తామ్రయుగం (క్రీ.పూ. 4 వేల సంవత్సరాలు) నాటి రెండు రాతి చిత్రాలను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది.

హైదరాబాద్‌కు గ్రీన్‌ సిటీ అవార్డు

భాగ్యనగరం రెండు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డుతో పాటు లివింగ్‌ గ్రీన్‌ ఫర్‌ ఎకనామిక్‌ రికవరీ అండ్‌ ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌ అవార్డుకూ ఎంపికైంది. దక్షిణ కొరియాలోని జెజులో కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రకటించారు.

ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్రంగా యాదాద్రి

ఢిల్లీలోని భారతీయ హరిత భవనాల మండలి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్ర పురస్కారానికి ఎంపిక చేసింది. రద్దీ విపరీతంగా ఉండే సమయాల్లోనూ స్వచ్ఛమైన గాలి నలుదిశలా ప్రసరించేలా వెంటిలేటర్లు, కిటికీల ఏర్పాటు వంటివి పరిశీలించి ఈ పురస్కారం ప్రకటించింది.

నందిపేటలో పురాతన రాతి చిత్రాలు

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట్‌ మండలం నందిపేట సమీపంలోని గజ్జెలగుట్టపై తామ్రయుగం(క్రీ.పూ.4 వేల ఏళ్లు) నాటి రెండు రాతి చిత్రాలను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది.

వార్తల్లో వ్యక్తులు

స్వాంటే పాబో

వైద్య శాస్త్రంలో స్వీడిష్‌ శాస్త్రవేత్త స్వాంటే పాబోకు ప్రతిష్టాత్మక నోబెల్‌ బహుమతి దక్కింది. 2022 సంవత్సరానికి ఆయనను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు నోబెల్‌ కమిటీ ప్రకటించింది. నియాండెర్తల్స్, డెనిసోవన్స్‌ వంటి హోమినిన్స్‌ జన్యువును, ఆధునిక మానవుడి జన్యువును సరిపోలుస్తూ రెండింటి మధ్య తేడాలను వివరించే టెక్నాలజీని స్వాంటే పాబో అభివృద్ధి చేశారు.

రోహన్‌ బోపన్న

భారత టెన్నిస్‌ సీనియర్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న తన కెరీర్‌లో 22వ డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు. టెల్‌ అవీవ్‌ ఏటీపీ–250 టోర్నీ ఫైనల్లో టాప్‌ సీడ్‌ బోపన్న (భారత్‌)–మిడిల్‌కూప్‌ (నెదర్లాండ్స్‌) జోడీ 6–2, 6–4తో సాంటియాగో గొంజాలెజ్‌ (మెక్సికో)–ఆండ్రెస్‌ మొల్తెని (అర్జెంటీనా) ద్వయంపై గెలిచింది.

జెరోధా నిఖిల్‌ కామత్‌

‘ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా 40 అండ్‌ అండర్‌ సెల్ఫ్‌ మేడ్‌ రిచ్‌ లిస్ట్‌ 2022’ పేరిట విడుదల చేసిన జాబితాలో ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడైన నిఖిల్‌ కామత్‌ రూ.17,500 కోట్ల నికర సంపదతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఓలా వ్యవస్థాపకుడు భవిశ్‌ అగర్వాల్‌, మీడియా.నెట్‌కు చెందిన దివ్యాంక్‌ తురాఖియా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నారు.

దిలీప్‌ టిర్కీ

భారత హాకీ మాజీ కెప్టెన్‌ దిలీప్‌ టిర్కీ హాకీ ఇండియా (హెచ్‌ఐ) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అధ్యక్ష పదవితో పాటు మరే పదవికి పోటీ లేకపోవడంతో ఫలితాలను ముందే ప్రకటించారు.

రాజీవ్‌ బహల్‌

భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శిగా డాక్టర్‌ రాజీవ్‌ బహల్‌ నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌

భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధనంజయ్‌ యశ్వంత్‌ చంద్రచూడ్‌ నియమితులు కానున్నారు. జస్టిస్‌ లలిత్‌ నవంబర్‌ 8న పదవీ విరమణ చేయనున్నారు. 9న జస్టిస్‌ చంద్రచూడ్‌ సీజేఐగా ప్రమాణం చేస్తారు. 2024 నవంబర్‌ 10 దాకా రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగుతారు.

హుసాముద్దీన్‌

జాతీయ క్రీడల్లో తెలంగాణ బాక్సర్‌ మహమ్మద్‌ హుసాముద్దీన్‌ 57 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. గుజరాత్‌లో 36వ జాతీయ క్రీడలు ముగిశాయి. 2023లో 37వ జాతీయ క్రీడలను నిర్వహించే గోవాకు క్రీడల పతాకాన్ని అందించారు.

బాలసుబ్రమణియన్‌

మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల సంఘం యాంఫీ చైర్మన్‌గా ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ మేనేజింగ్‌ డైరెక్టర్ ఎ.బాలసుబ్రమణియన్‌ తిరిగి ఎన్నికయ్యారు. ఎడెల్‌వైజ్‌ ఏఎంసీ ఎండీ రాధికా గుప్తా యాంఫీ వైస్‌ చైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు. సెప్టెంబరులో జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

డా.వివేక్‌ మూర్తి

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కార్యనిర్వాహక మండలిలో అమెరికా ప్రతినిధిగా భారత సంతతికి చెందిన డాక్టర్‌ వివేక్‌ మూర్తిని అధ్యక్షుడు జో బైడెన్‌ నియమించారు. అమెరికాలో సర్జన్‌ జనరల్‌గా ఉన్నత హోదాలో ఉంటున్న డా.మూర్తి ఆ విధులు కొనసాగిస్తూనే కొత్త బాధ్యతలు నిర్వహిస్తారని వైట్హౌస్ ప్రకటించింది.

ములాయం సింగ్‌ యాదవ్‌

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌ అనారోగ్యంతో మరణించారు. 82 ఏళ్ల ములాయం సింగ్‌ యాదవ్‌ యూపీకి మూడుపర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేశారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా, కేంద్రమంత్రిగానూ ఆయన పని చేశారు. ప్రస్తుతం మణిపురి(యూపీ) పార్లమెంట్‌ స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

రోజర్‌ బిన్నీ

బీసీసీఐ అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్, కర్ణాటకకు చెందిన రోజర్‌ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా జై షాకు మరో అవకాశం దక్కింది. అతడి ఎన్నిక కూడా ఏకగ్రీవం అయింది. అశిష్‌ షేలార్‌ కొత్త కోశాధికారిగా, రాజీవ్‌ శుక్లా ఉపాధ్యక్షుడిగా, దేవ్‌జీత్‌ సైకియా సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

సీమా ముస్తఫా

ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షురాలిగా ‘ద సిటిజన్‌’ ఎడిటర్ సీమా ముస్తఫా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ‘ద కారవాన్‌’ ఎడిటర్‌ అనంత్‌నాథ్, కోశాధికారిగా సకల్‌ మీడియా గ్రూప్‌ చీఫ్‌ ఎడిటర్‌ శ్రీరామ్‌ పవార్‌లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

షెహాన్‌ కరుణతిలక

ప్రతిష్టాత్మిక బుకర్‌ ప్రైజ్‌ 2022ను శ్రీలంక రచయిత షెహాన్‌ కరుణతిలక గెలుచుకున్నారు. ఆయన రెండవ రచన ‘ద సెవన్‌ మూన్స్‌ ఆఫ్‌ మాలి అల్మైదా’ పుస్తకానికి ఈ పురస్కారం దక్కింది. శ్రీలంకలో చోటు చేసుకున్న క్రూరమైన అంతర్యుద్ధం నేపథ్యం ఆధారంగా ఆ రచన సాగింది.

ప్రీతి తనేజా

లండన్‌ వంతెనపై 2019లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో రాసిన ‘ఆఫ్టర్‌మాథ్‌’ నవలకు భారత సంతతి రచయిత్రి ప్రీతి తనేజా గోర్డాన్‌ బర్న్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. దీని కింద ఆమెకు 5 వేల పౌండ్లు లభిస్తాయి. ప్రస్తుతం ఆమె న్యూక్యాజిల్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

జనార్దన్‌

ప్రవాస భారతీయుడు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌ జనార్దన్‌ నిమ్మలపూడి (జానీ) 5895 మీటర్ల ఎత్తున్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి తానా లోగో ప్రదర్శించారు. కిలిమంజారో అధిరోహించేందుకు ఆయన రెండేళ్ల పాటు శిక్షణ తీసుకున్నారు.

జార్జియా మెలోని  

బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీ నేత జార్జియా మెలోని ఇటలీ  ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. రెండో ప్రపంచయుద్ధం ముగిశాక అతివాద నేత ప్రధాని కావడం ఇదే తొలిసారి. ఇటలీ తొలి మహిళా ప్రధానిగానూ ఆమె చరిత్ర సృష్టించారు.

లీ జే-యాంగ్‌

శాంసంగ్‌ ఎలక్రానిక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా, తమ మూడో తరం వారసుడైన లీ జే-యాంగ్‌ను ప్రకటించింది. 2017లో అప్పటి అధ్యక్షుడు పార్క్‌ గ్వాన్‌ హేకు లంచం ఇచ్చిన కేసులో లీ కు ఇప్పటి అధ్యక్షుడు క్షమాభిక్ష ఇచ్చిన రెండు నెలల అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది.

అశ్విని

ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్‌(యుఎన్‌ హెచ్‌ఆర్‌సీ) తన ప్రత్యేక దూతగా బెంగళూరులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న అశ్వినిని నియమించింది. ఈ పదవిలోకి వచ్చి న తొలి ఆసియా మహిళగా, తొలి భారతీయురాలిగా, తొలి దళితురాలిగా అశ్విని చరిత్ర సృష్టించింది.

హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌

భారత హాకీ ప్లేయర్ హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌ మరోసారి అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్‌ఐహెచ్‌) అత్యున్నత పురస్కారం దక్కించుకున్నాడు. పురుషుల విభాగంలో ‘ఎఫ్‌ఐహెచ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా వరుసగా రెండో ఏడాది ఎంపికయ్యాడు.

నారాయణ రావు బట్టు

కేంద్ర న్యాయ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తోన్న నారాయణ రావు బట్టును పీఎఫ్‌ఆర్‌డీఏ సభ్యుడిగా (న్యాయ విభాగం) ప్రభుత్వం నియమించింది. ఈ పదవిలో ఆయన 62 ఏళ్ల వయసు లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ కొనసాగుతారని ఆర్థిక సేవల శాఖ వెల్లడించింది.

అమౌ హజీ

అమౌ హజీ వయసు 94. ఈయనకు స్నానం చేయడమంటే మహా చిరాకు. ఎంతలా అంటే ‘ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి’ అని పిలిపించుకునేంతగా. ఇరాన్‌లో డెగాహ్‌ గ్రామ శివారులో ఎలాంటి సౌకర్యాలు లేని నివాసంలో ఉండే అమౌ హజీ మరణించాడు.

స్పోర్ట్స్​

విజేత‌గా ఇండియా క్యాపిటల్స్‌

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌–-2022 చాంపియన్స్‌గా గౌతం గంభీర్‌ సారథ్యంలోని ఇండియా క్యాపిటిల్స్ విజేత‌గా నిలిచింది. అక్టోబ‌ర్ 5న జైపూర్‌ వేదికగా భిల్వారా కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో 104 పరుగుల తేడాతో ఇండియా క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించింది.

సింగపూర్‌ గ్రాండ్‌ప్రి

రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ సెర్జియో పెరెజ్‌ సింగపూర్‌ గ్రాండ్‌ప్రిలో పెరెజ్‌ విజేతగా నిలిచాడు. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన లెక్‌లెర్క్‌ (ఫెరారీ) రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో 11 విజయాలు సాధించిన వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

వెర్‌స్టాపెన్‌దే ప్రపంచ టైటిల్‌

రెడ్‌బుల్‌ రేసర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ సాధించాడు. ఈ సీజన్‌లో ట్రాక్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న ఈ 25 ఏళ్ల నెదర్లాండ్స్‌ డ్రైవర్‌ ఫార్ములావన్‌ ప్రపంచ టైటిల్‌ ఖాతాలో వేసుకున్నాడు. జపనీస్‌ గ్రాండ్‌ ప్రిలో జయకేతనం ఎగుర వేసి వరుసగా రెండో ఏడాదీ ఫార్ములా వన్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు.

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్

భారత మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, పాకిస్థాన్‌ వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌లు సెప్టెంబరు నెలకు ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డులు గెలుచుకున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో సత్తాచాటిన హర్మన్‌ జట్టును ముందుండి నడిపించింది.  గత నెలలో పది టీ20 మ్యాచ్‌లాడిన రిజ్వాన్‌ ఏడు అర్ధ సెంచరీలు సాధించాడు.

కరీమ్‌ బెంజెమాకు ‘గోల్డెన్‌ బాల్‌’

యూరోపియన్‌ అత్యుత్తమ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌కు ప్రదానం చేసే ప్రతిష్టాత్మక పురస్కారం ‘గోల్డెన్‌ బాల్‌’ను ఫ్రాన్స్‌ స్టార్‌ ఆటగాడు, రియల్‌ మాడ్రిడ్‌ క్లబ్‌ జట్టు సభ్యుడు కరీమ్‌ బెంజెమా సొంతం చేసుకున్నాడు. 2009 నుంచి మాడ్రిడ్‌ జట్టుకు ఆడుతున్న కరీమ్‌ 223 గోల్స్‌ సాధించాడు.

తొలి భారతీయ రెజ్లర్ గా రికార్డ్

ప్రపంచ అండర్‌–23 రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్ చరిత్రలో గ్రీకో రోమన్‌ విభాగంలో పతకం నెగ్గిన తొలి భారతీయ రెజ్లర్‌గా సాజన్‌ భన్వాల్‌ గుర్తింపు పొందాడు. పురుషుల 77 కేజీల విభాగంలో సాజన్‌ కాంస్య పతకం సాధించాడు. కాంస్య పతక పోరులో ఉక్రెయిన్‌కు చెందిన దిమిత్రో వాసెత్‌స్కీపై సాజన్‌ గెలుపొందాడు.

యునైటెడ్‌ స్టేట్స్‌ గ్రాండ్‌ప్రి

ఫార్ములావన్‌ టైటిల్‌ను ఇప్పటికే గెలుచుకున్న మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ తన జట్టుకు టైటిల్‌ను అందించాడు. యునైటెడ్‌ స్టేట్స్‌ గ్రాండ్‌ప్రిలో అతడు విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లో అతడికి ఇది 13వ విజయం. వెర్‌స్టాపెన్‌ విజయంతో ఫార్ములావన్‌ కన్‌స్ట్రక్టర్ల ఛాంపియన్‌షిప్‌ రెడ్‌బుల్‌ సొంతమయ్యింది.

సిక్కి జోడీకి టైటిల్‌

మాల్దీవ్స్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో టైటిల్‌ సాధించింది. ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్‌ కపూర్‌ (భారత్‌) జోడీ టాప్‌ సీడ్‌ తనీనా–కొసీలా మామెరి (అల్జీరియా) ద్వయంపై విజయం సాధించింది.

సైన్స్ అండ్​ టెక్నాలజీ

ఎయిర్ఫోర్స్లోకి ఎల్సీహెచ్ ప్రచండ్

స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అధునాతన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌(ఎల్‌సీహెచ్‌) ప్రచండ్‌ భారత వైమానిక దళంలో చేరింది. పర్వతప్రాంతాల్లో, ఎడారి వంటి ప్రతికూల వాతావరణంలో పగలూ, రాత్రి శత్రువులపై దాడి చేయగలగడం ప్రచండ్‌ ప్రత్యేకత. గగనతలంలోని లక్ష్యాలను గగనతలం నుంచే చేధించగల క్షిపణులను, ట్యాంక్‌ విధ్వంసక మిస్సైళ్లను, 20 ఎంఎం తుపాకులనూ వీటిలో అమర్చవచ్చు.

జపాన్‌ రాకెట్‌ ప్రయోగం ఫెయిల్

జపాన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ (జాక్సా) ప్రయోగించిన ఎప్సిలాన్‌-6 రాకెట్‌ విఫలమైంది. ఎనిమిది ఉపగ్రహాలతో నింగిలోకి పయనమైన కొద్దిసేపటికే ఇబ్బంది మొదలైంది. దీంతో రాకెట్‌కు ‘సెల్ఫ్‌ డిస్ట్రక్షన్‌ కమాండ్‌’ ఇచ్చి, పేల్చి వేశారు. యుచినోరా అంతరిక్ష కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది.

చంద్రుడిపై పుష్కలంగా సోడియం

చంద్రుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్‌-2 ఉపగ్రహం కీలక ఆవిష్కారం చేసింది. జాబిల్లి ఉపరితలంపై పుష్కలంగా సోడియం ఉన్నట్లు తొలిసారిగా గుర్తించింది. 2008లో ప్రయోగించిన చంద్రయాన్‌-1లోని ఎక్స్‌రే ఫ్లోరెసెన్స్‌ స్పెక్ట్రోమీటర్‌ (సీ1ఎక్స్‌ఎస్‌) సోడియం ఆచూకీని పసిగట్టింది.

బాలిస్టిక్‌ మిస్సైల్ టెస్ట్ సక్సెస్

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ మొదటిసారిగా ఒక బాలిస్టిక్‌ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. అది అత్యంత కచ్చితత్వంతో బంగాళాఖాతంలో నిర్దేశిత లక్ష్యాన్ని తాకింది. భారత వ్యూహాత్మక దాడి సామర్థ్యం ఇది బలోపేతం చేయనుంది.

జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3 సక్సెస్

జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3 వాహకనౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని రాకెట్‌ కేంద్రం నుంచి 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌)తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లోకి పంపింది.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!