Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​: సెప్టెంబర్​ 2022

కరెంట్​ అఫైర్స్​: సెప్టెంబర్​ 2022

అంతర్జాతీయం

బ్రిటన్‌ నూతన ప్రధానిగా లిజ్‌ ట్రస్‌
బ్రిటన్‌ నూతన ప్రధానిగా అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన లిజ్​ట్రస్‌ ఎన్నికయ్యారు. భారత సంతతికి చెందిన మాజీ ఆర్థికమంత్రి రిషి సునాక్‌పై ఆమె సుమారు 21 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో 47 ఏళ్ల లిజ్‌ ట్రస్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టింది.

కుషియారా జలాలపై ఒప్పందం
మన దేశంలో పర్యటిస్తున్న బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌హసీనా భారత ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్‌–బంగ్లాదేశ్‌ల మధ్య ఏడు కీలకమైన ఒప్పందాలు కుదిరాయి. వాటిలో దక్షిణ అస్సాం, బంగ్లాదేశ్‌లోని సిల్హేట్‌ ప్రాంతాలకు ప్రయోజనకరంగా ఉన్న కుషియారా నదీ జలాలపై ఒప్పందం కుదిరింది.

బ్రిటన్​ రాజుగా ఛార్లెస్‌
బ్రిటన్‌ను 70 ఏళ్ల పాటు పరిపాలించిన రాణి ఎలిజబెత్‌-2 స్కాట్‌లాండ్‌లోని బల్మోరల్‌ క్యాజిల్‌లో మరణించారు. రాణి మరణంతో ఆమె పెద్దకుమారుడు, వేల్స్‌ మాజీ యువరాజు ఛార్లెస్‌ నూతన రాజుగా, 14 కామన్వెల్త్‌ దేశాలకు దేశాధినేతగా వ్యవహరించనున్నారు.

కుబేరుల అడ్డా న్యూయార్క్​
ప్రపంచంలో కుబేరులు ఎక్కువగా ఉన్న నగరాల్లో న్యూయార్క్, టోక్యో, శాన్‌ ఫ్రాన్సిస్కో, లండన్‌ తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. రెసిడెన్సీ అడ్వైజరీ సంస్థ ‘హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ గ్రూప్‌’ తాజా నివేదికలో ఈ మేరకు వెల్లడించింది. చైనాలోని బీజింగ్, షాంఘై తొమ్మిది, పదో స్థానాల్లో, భారత్‌లోని ముంబై 25వ స్థానంలో నిలిచింది.

ఉజ్బెకిస్తాన్‌లో ఎస్సీఓ సమ్మిట్​
షాంఘై సహకార సంఘం (ఎస్సీఓ) 22వ సదస్సు ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతుంది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ పాల్గొనే అవకాశముంది. ఎస్సీఓలో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారత్, పాకిస్తాన్‌ సభ్యదేశాలు. ఇరాన్‌ సైతం చేర్చుకోనున్నారు.

అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్లు
అంగారక గ్రహంపై జీవాన్వేషణ కోసం పరిశోధనలు సాగిస్తోన్న నాసాకు చెందిన పర్సెవరెన్స్‌ రోవర్‌ కీలక ఆనవాళ్లను గుర్తించింది. జెజెరో బిలం నుంచి ఆర్గానిక్‌ మాలిక్యూల్స్‌ సహా పలు నమూనాలను సేకరించింది. ఆ మాలిక్యూల్స్‌తో అంగారకుడిపై పురాతన జీవాలు ఉండొచ్చని నాసా భావిస్తోంది.

‘జిమెక్స్‌ – 2022’ విన్యాసాలు
వైజాగ్​లో భారత్‌–జపాన్‌ దేశాల ఆరో విడత మారిటైం విన్యాసాలు–2022 (జిమెక్స్‌) నిర్వహించారు. ముగింపు వేడుకల్లో భారత నేవీ బృందానికి రియర్‌ అడ్మిరల్‌ సంజయ్‌ భల్లా సారథ్యం వహించగా, జపాన్‌ తరఫున రియర్‌ అడ్మిరల్‌ హిరాత్‌ టొషియుకి కమాండర్‌గా కొనసాగారు. దీంతో ద్వైపాక్షిక ఒప్పందం మరింత బలోపేతం కానుందని నేవీ వర్గాలు పేర్కొన్నాయి.

అతిపెద్ద ద్వైపాక్షిక రుణదాతగా భారత్
చైనాను అధిగమించి శ్రీలంకకు అతిపెద్ద ద్వైపాక్షిక రుణదాతగా భారత్ అవతరించింది. 2022 నాలుగు నెలల్లో భారతదేశం మొత్తం 968 మిలియన్ యూఎస్​ డాలర్ల రుణాలను ద్వీప దేశానికి అందించింది. 2017–-2021 వరకు గత ఐదేళ్లలో, శ్రీలంకకు చైనా అతిపెద్ద ద్వైపాక్షిక రుణదాతగా ఉంది.

పెరిగిన ఫెడరల్​ వడ్డీ రేటు
ధరల అదుపే లక్ష్యంగా యూఎస్‌ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ మరోసారి వడ్డీ రేటును 0.75 శాతంమేర పెంచింది. దీంతో ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 3–3.25 శాతానికి పెరిగాయి. ద్రవ్యోల్భణ కట్టడికే వరుసగా మూడోసారి రేట్లు పెంచామని ఫెడ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ పేర్కొన్నారు.

అతిపెద్ద క్రూజ్‌ నౌక ‘ది గ్లోబల్‌ డ్రీమ్‌ 2’
ప్రపంచంలోనే అతిపెద్ద విహార (క్రూజ్‌) నౌకగా- ‘ది గ్లోబల్‌ డ్రీమ్‌ 2’ నిలిచింది. 9 వేల మంది కెపాసిటీ గల ఈ నౌకను రూ.11 వేల కోట్లతో నిర్మించారు. నిర్మాణ సంస్థ దివాల తీయడం, భారీ నౌకను కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తుక్కుగా మారబోతోంది.

ఇటలీ ప్రధానిగా జార్జియా మెలోని
ఇటలీ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళా నేత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీకి చెందిన అతివాద నేత జార్జియా మెలోని నేతృత్వంలోని కూటమి 43 శాతానికి పైగా ఓట్లతో విజయఢంకా మోగించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో ఏర్పడే పూర్తి అతివాద ప్రభుత్వం ఇదే.

అఫ్గాన్‌కు మిత్ర దేశ హోదా రద్దు
అఫ్గానిస్థాన్‌కు నాటోయేతర మిత్ర దేశ హోదాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రద్దు చేశారు. 2012లో అఫ్గానిస్థాన్‌ను అమెరికా నాటోయేతర మిత్ర దేశంగా పేర్కొంది. దీనివల్ల రెండు దేశాలు రక్షణ, ఆర్థిక సంబంధాలను కొనసాగించగలిగాయి. అమెరికా నాటోయేతర మిత్ర దేశ హోదా జాబితాలో పాకిస్థాన్, కువైట్, జపాన్‌ సహా 18 దేశాలున్నాయి.

స్నోడెన్‌కు రష్యా పౌరసత్వం
అమెరికా భద్రతా విభాగం మాజీ కాంట్రాక్టర్‌ ఎడ్వర్డ్‌ స్నోడెన్‌కు అధ్యక్షుడు పుతిన్‌ రష్యా పౌరసత్వం మంజూరు చేశారు. అమెరికా భద్రతకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించినట్టు స్నోడెన్‌పై తీవ్ర ఆరోపణలున్నాయి. ఈ కేసులో విచారణను తప్పించుకునేందుకు 2013లోనే ఆయన రష్యాకు వలస వచ్చాడు.

Advertisement

జాతీయం

మానవాభివృద్ధి సూచీలో 132వ స్థానం
ఆరోగ్యం, విద్య, సగటు ఆదాయం అనే మూడు అంశాలను ప్రామాణికంగా తీసుకొని గణించిన మానవాభివృద్ధి సూచీ (హెచ్​డీఐ)–2021లో 0.633 హెచ్​డీఐ విలువతో భారత్​ 132వ స్థానంలో నిలిచింది. 2020 సంవత్సరంలో 131వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఒక స్థానం దిగజారింది.

బ్రిటన్​ను అధిగమించిన భారత్‌
బ్రిటన్‌ను అధిగమించి ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ (854.7 బిలియన్‌ డాలర్లు)గా తాజాగా అవతరించిన భారత్‌ 2029 నాటికల్లా మూడో స్థానానికి చేరుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ విభాగం అంచనా వేసింది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీలే భారత్‌ ముందున్నాయని ఐఎమ్‌ఎఫ్‌ అంచనాలు వెల్లడించాయి.

భారత్‌ బయోటెక్‌ నాసల్​ వ్యాక్సిన్​
కొవిడ్‌ నివారణకు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా (నాసల్‌ వ్యాక్సిన్‌) ఇన్‌కొవ్యాక్‌ (బీబీవీ154)కు మన దేశంలో అత్యవసర వినియోగ అనుమతి లభించింది. దీన్ని ముక్కు ద్వారా ఇస్తారు. ఈ తరహా కొవిడ్‌-19 టీకా ప్రపంచంలోనే ఇదే మొదటిది కావడం విశేషం.

నౌకాదళం సరికొత్త పతాకావిష్కరణ
నౌకాదళానికి సరికొత్త పతాకాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఇన్నాళ్లూ నౌకాదళం జెండాలో బానిసత్వపు ఆనవాళ్లుండేవి. కొత్త పతాకంలో ప్రధానంగా రెండు భాగాలున్నాయి. ఎడమవైపు పైభాగంలో భారత జాతీయ జెండాను ఉంచారు. కుడి వైపున నీలం, బంగారు వర్ణంలో మెరిసిపోయే అష్టభుజాకారం ఉంది.

భారత సైన్యాధిపతికి నేపాల్‌ గౌరవం
నేపాల్‌ అధ్యక్షురాలు బైద్య దేవీ భండారి తమ దేశ గౌరవ జనరల్‌ హోదాను భారత సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ పాండేకు ప్రదానం చేశారు. ఖాఠ్మాండులోని అధ్యక్షురాలి అధికారిక నివాసంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఖడ్గం, ప్రశంసా పత్రాన్ని జనరల్‌ మనోజ్‌ పాండేకు ఆమె అందించారు.

భారత్‌లోకి చీతాలు
దేశంలోకి 74 ఏళ్ల తర్వాత మళ్లీ చీతాలు ప్రవేశించబోతున్నాయి.1952లో వీటిని అంతరించిన జాతిగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షకుల కృషి, కేంద్ర ప్రభుత్వ చొరవ ఫలితంగా ఇప్పుడు నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌లోకి రాబోతున్నాయి.

8 శాతానికి నిరుద్యోగ రేటు
ఆగస్టులో నిరుద్యోగం రేటు ఏకంగా 8% శాతానికి చేరుకుంది. 2021 ఆగస్టులో నిరుద్యోగం రేటు రికార్డు స్థాయిలో 8.35%కి చేరుకుందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ గణాంకాల్లో పేర్కొన్నాయి. గ్రామీణ భారత్‌లో నిరుద్యోగం 9.6% ఉంటే, పట్టణాల్లో 7.7%గా ఉంది. తెలంగాణలో 6.9% గా ఉంది.

అస్తిత్వంలో లేని రాజకీయ పార్టీల రద్దు
అస్తిత్వంలో లేని 86 గుర్తింపు లేని పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగించింది. రిజిస్టర్డ్‌ పార్టీల జాబితా నుంచి తొలగించిన వాటిలో ఏపీ నుంచి 6, తెలంగాణ నుంచి 2 పార్టీలున్నాయి. ఇప్పటివరకు మొత్తం 537 పార్టీలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది.

ఎస్‌బీఐ @ రూ.5 లక్షల కోట్లు
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మార్కెట్‌ విలువ తొలిసారిగా రూ.5 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. బ్యాంకింగ్‌ రంగంలో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ల తరవాత రూ.5 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ అందుకున్న సంస్థగా ఎస్‌బీఐ నిలిచింది.

ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌కు పురస్కారం
జాతీయ స్థాయిలో గ్రామీణాభివృద్ధిలో శిక్షణ కార్యక్రమాలు, నిపుణుల్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్‌ సంస్థ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌)కు ఆసియా, పసిఫిక్‌ సమీకృత గ్రామీణాభివృద్ధి కేంద్రం (సీఐఆర్‌డీఏపీ) అజీజ్‌-ఉల్‌-హక్‌ గ్రామీణాభివృద్ధి పురస్కారం లభించింది.

ఎస్‌సీవో పర్యాటక, సాంస్కృతిక రాజధాని
ఎస్‌సీవో తొలి పర్యాటక, సాంస్కృతిక రాజధానిగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని పవిత్ర వారణాసి పట్టణాన్ని గుర్తించారు. 2022–23 కాలానికి వారణాసి ఆ హోదాలో కొనసాగనున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా వెల్లడించారు.

ఇంటర్‌పోల్‌ చిహ్నంగా కోణార్క్‌ఆలయ రథచక్రం
భారత్‌లో అక్టోబరులో జరగనున్న 90వ ఇంటర్‌పోల్‌ జనరల్‌ అసెంబ్లీకి చిహ్నం (లోగో)గా కోణార్క్‌ ఆలయ రథ చక్రాన్ని ఎంపిక చేశారు. చక్రానికి చుట్టూ భారత జాతీయ పతాకంలోని మూడు రంగులను వృత్తంలా ఏర్పాటు చేసి రూపొందించిన లోగోను జనరల్‌ అసెంబ్లీని నిర్వహిస్తున్న సీబీఐ ఇటీవల ఆవిష్కరించింది.

మతమార్పిడి నిషేధ బిల్లుకు ఆమోదం
కర్ణాటకలో గత మే నెలలో ఆర్డినెన్స్‌ ద్వారా చట్టబద్ధత కల్పించిన మతమార్పిడి నిషేధ బిల్లుకు విధాన పరిషత్తులో ఆమోదం లభించింది. బలవంతపు మతమార్పిడిని నిషేధించటం, మతాన్ని మార్చుకున్న తర్వాత కూడా పూర్వపు మతంలోని రిజర్వేషన్‌ సదుపాయాన్ని పొందేవారిని నియంత్రించడమే ఈ చట్టం ఉద్దేశం.

వ్​లో సుప్రీంకోర్ట్ కేసుల విచారణ
సుప్రీంకోర్టులో కీలక కేసుల విచారణ ప్రక్రియ ఇకపై లైవ్​లో ప్రసారం కానుంది. ప్రస్తుతానికి యూట్యూబ్‌ ద్వారా ప్రసారాలు ఉంటాయని సమాచారం. త్వరలో సుప్రీంకోర్టు సొంత ప్లాట్‌ఫామ్‌ను రూపొందిస్తుందని కోర్టు వర్గాలు తెలిపాయి.

మార్కెట్‌ విలువలో అదానీ గ్రూప్​ టాప్​
మార్కెట్‌ విలువపరంగా దేశంలోనే అగ్రగామిగా అదానీ గ్రూపు అవతరించింది. అదానీ గ్రూపునకు చెందిన నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.22.25 లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో టాటా గ్రూపు నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.20.81 లక్షల కోట్లుగా నమోదు అయింది.

సీడీఎస్​గా అనిల్‌ చౌహాన్‌
భారత నూతన త్రిదళాధిపతి (సీడీఎస్‌)గా రిటైర్డ్​ లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ నియమితులయ్యారు. సీడీఎస్‌ హోదాలో దేశ మిలిటరీ వ్యవహారాల కార్యదర్శిగానూ ఆయన విధులు నిర్వర్తించనున్నారు. భారత తొలి సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ 2021 డిసెంబరులో హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయిన నాటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది.

జమ్మూకశ్మీర్‌లో ఆజాద్‌ కొత్త పార్టీ
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ‘డెమోక్రటిక్‌ ఆజాద్‌ పార్టీ (డీఏపీ)’గా దానికి పేరు పెట్టారు. ప్రజాస్వామ్యం, భావప్రకటన స్వేచ్ఛ, సమష్టి ఆలోచనలకు ప్రతీకగా తమ పార్టీ నిలుస్తుందన్నారు.

నిస్తార్, నిపుణ్‌ జలప్రవేశం
విశాఖపట్నం హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో తయారైన నిస్తార్, నిపుణ్‌ డి.ఎస్‌.వి. (డైవింగ్‌ సపోర్ట్‌ వెసల్స్‌)లను జలప్రవేశం చేయించారు. జలాంతర్గాముల్లో విధులు నిర్వర్తించేవారి రక్షణలో డి.ఎస్‌.వి.లు అత్యంత కీలకపాత్ర పోషిస్తాయని అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ పేర్కొన్నారు.

స్వల్పశ్రేణి గగనతల క్షిపణి సక్సెస్​
ఒడిశాలోని చాందీపుర్‌లో ఐటీఆర్‌ నుంచి చేపట్టిన అత్యంత స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే డీఆర్‌డీవో పరిశోధన కేంద్రం దీన్ని రూపొందించింది.

బరాబర్, నాగార్జునుడి గుహలు
బిహార్‌లోని జెహానాబాద్‌ జిల్లాలో గల బరాబర్, నాగార్జునుడి గుహలకు ప్రపంచ వారసత్వ గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వాటిని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేర్చాలంటూ ప్రతిపాదించాలని భారత పురావస్తు శాఖ (ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా/ఏఎస్‌ఐ) నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు.

ప్రాంతీయం

యునెస్కో గ్లోబల్‌ నెట్‌వర్క్‌
యునెస్కో గ్లోబల్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ సిటీస్‌ జాబితాలో వరంగల్‌ చేరినట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి వెల్లడించారు. రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం హోదా దక్కిన ఏడాదిలోపే ఇప్పుడు వరంగల్‌కు రెండో గుర్తింపు లభించింది.

కాళోజీ అవార్డ్​
ప్రజాకవి కాళోజీ నారాయణ రావు అవార్డ్ 2022కు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్​ ఎంపికయ్యారు. ఈ అవార్డ్​ కింద రూ.లక్షా 116 నగదుతో పాటు షీల్డ్​ను కాళోజీ జయంతి సందర్భంగా అందించారు.

సెక్రటేరియట్​కు అంబేద్కర్​ పేరు
కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్-3 పొందుపరచడం ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైందన్నారు

జాతీయ సమైక్యత దినోత్సవం
తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబర్ 17న ప్రజాస్వామ్య పాలనలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ప్రకటించారు.

సెర్ప్​కు జాతీయ స్థాయి గుర్తింపు
తెలంగాణ సెర్ప్‌ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలతో దేశంలోనే అగ్రభాగాన నిలిచినందున కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్రం అవార్డును అందుకుంది.

సెంట్రల్‌ సిల్క్‌బోర్డు
సెంట్రల్‌ సిల్క్‌బోర్డు సభ్యుడిగా తెలంగాణ వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌ రావు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర జౌళి శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

స్వచ్ఛ పురస్కారాలు
రాష్ట్రంలోని మరో మూడు పురపాలికలు స్వచ్ఛ పురస్కారాలను సొంతం చేసుకున్నాయి. ఇటీవల రాష్ట్రంలోని 16 పట్టణ స్థానిక సంస్థలు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులను సొంతం చేసుకోగా తాజాగా అలంపూర్, పీర్జాదీగూడ, కోరుట్ల పురపాలికలు ఇండియన్‌ స్వచ్ఛత లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) అవార్డులు దక్కించుకున్నాయి.

మూడో ఉత్తమ పర్యాటక రాష్ట్రం
దేశంలో మూడో ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా తెలంగాణ అవార్డు సాధించింది. ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర వరుసగా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

వార్తల్లో వ్యక్తులు

మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌
ఫార్ములా వన్‌ ప్రపంచ చాంపియన్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఈ సీజన్‌లో తన కెరీర్‌లోనే తొలిసారి వరుసగా నాలుగో గ్రాండ్‌ ప్రి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. డచ్‌ గ్రాండ్‌ ప్రి రేసులో ఈ బెల్జియం రేసర్‌ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో ప్రపంచ చాంపియన్‌షిప్‌ పాయింట్లలో తన ఆధిక్యాన్ని 109 పాయింట్లకు పెంచుకున్నాడు.

జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌
నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సీజేఐ తర్వాత అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిని ఈ పదవిలో నియమించడం సంప్రదాయంగా వస్తోంది.

సైరస్‌ మిస్త్రీ
వ్యాపార దిగ్గజం, టాటా సన్స్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రెండు నెలల వ్యవధిలో వీరి కుటుంబంలో ఇది రెండో పెద్ద విషాదం. జూన్‌లో సైరస్‌ తండ్రి పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ చనిపోయాడు.

విన్‌ ఓవెన్‌
బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌గా గారెత్‌ విన్‌ ఓవెన్‌ హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఈయన గతంలో రష్యా, ఆర్మేనియా, ఇరాన్, అజర్‌బైజాన్‌లలోని ఫారిన్, కామన్‌వెల్త్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ కార్యాలయాల్లో పనిచేశారు.

కల్యాణ్‌ చౌబే
అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ఎన్నికల్లో దిగ్గజ ఆటగాడు బైచుంగ్‌ భుటియా ఓడిపోయారు. ఏఐఎఫ్‌ఎఫ్‌ అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఈస్ట్‌ బెంగాల్‌ మాజీ గోల్‌ కీపర్‌ కల్యాణ్‌ చౌబే విజయం సాధించాడు.

అరవింద్‌ చిదంబరం
భారత గ్రాండ్‌మాస్టర్‌ అరవింద్‌ చిదంబరం దుబాయ్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నీ విజేతగా నిలిచాడు. 9 రౌండ్ల నుంచి 7.5 పాయింట్లతో అతడు అగ్రస్థానం సంపాదించాడు. ఏడుగురు భారతీయులు టాప్‌-10లో నిలవడం విశేషం.

వినేశ్‌ ఫొగాట్‌
భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ప్రతిష్టాత్మక ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డులకెక్కింది. ఆమె బెల్‌గ్రేడ్‌ చాంపియన్‌షిప్స్‌లో 53 కేజీల విభాగంలో కాంస్యం సాధించింది. వినేశ్‌ 2019 చాంపియన్‌షిప్స్‌లోనూ కాంస్యం గెలుచుకుంది.

జెన్నిఫర్‌ లార్సన్‌
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌లో కాన్సుల్‌ జనరల్‌గా జెన్నిఫర్‌ లార్సన్‌ బాధ్యతలు చేపట్టారు. జోయెల్‌ రీఫ్మాన్‌ పదవీ విరమణతో ఆయన స్థానంలో అమెరికా ప్రభుత్వం జెన్నిఫర్‌ను నియమించింది. ఆమె హైదరాబాద్‌ చేరుకుని బాధ్యతలు స్వీకరించారు.

పీటర్‌ ఎల్బర్స్‌
విమానయాన సంస్థ ఇండిగో ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా పీటర్‌ ఎల్బర్స్‌ బాధ్యతలు స్వీకరించారు. రోనోజాయ్‌ దత్తా సెప్టెంబరు 30న పదవీ విమరణ చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో కొత్త సీఈఓగా ఎల్బర్స్‌ను నియమించినట్లు కంపెనీ గతంలో ప్రకటించింది.

హెబా ఫాతిమా
సంస్కృతంలోని భగవద్గీతను అతి తక్కువ సమయంలో ఉర్దూలోకి అనువదించడం ద్వారా నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణానికి చెందిన హెబా ఫాతిమా వరల్డ్‌ వైడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు సంపాదించారు. రాకాసిపేట్‌కు చెందిన ఫాతిమా మూడు నెలల కాలంలో ఈ ప్రక్రియ పూర్తి చేశారు.

రాబిన్‌ ఉతప్ప
టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు రాబిన్‌ ఉతప్ప అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. క్రికెట్లో దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించేశాడు. 36 ఏళ్ల ఈ కర్ణాటక బ్యాటర్‌ అన్ని రకాల భారత క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. ఉతప్ప 46 వన్డేల్లో 934, 13 టీ20ల్లో 249 పరుగులు చేశాడు.

స్వాతి పిరమాల్‌
భారత శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త స్వాతి పిరమాల్‌కు ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఫ్రాన్స్‌ విదేశీ వ్యవహారాల మంత్రి క్యాధరిన్‌ కోలోనా భారత పర్యటనలో స్వాతి పిరమాల్‌కు ‘ది చెవాలియర్‌ డి లా లీజియన్‌ డిహానర్‌ ఆర్‌ నైట్‌ ఆఫ్‌ ది లీజియన్‌ ఆఫ్‌ హానర్‌’ పురస్కారాన్ని అందించారు.

ప్రతాప్‌ పవార్‌
ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్స్‌ (ఏబీసీ) ఛైర్మన్‌గా 2022–23 కాలానికి ప్రతాప్‌ పవార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరాఠీ దినపత్రిక సకల్‌ను ప్రచురించే సకల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా పవార్‌ వ్యవహరిస్తున్నారు.

రతన్‌ టాటా
కరోనా నేపథ్యంలో అత్యవసర సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏర్పా టైన పీఎం కేర్స్‌ నిధికి పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా, జస్టిస్‌ కేటీ థామస్, లోక్‌సభ మాజీ డిప్యూటీ స్పీకర్‌ కరియా ముండా ట్రస్టీలుగా వ్యవహరించనున్నారు.

పూవమ్మ
డోపింగ్‌ పరీక్షలో విఫలమైన ఆసియా క్రీడల పతక విజేత పూవమ్మపై యాంటీ డోపింగ్‌ అప్పీల్‌ ప్యానెల్‌ (ఏడీఏపీ) రెండేళ్ల నిషేధం విధించింది. ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకం వాడినట్లు పరీక్షల్లో తేలింది. 2018 ఆసియా క్రీడల్లో 4×400 మీ. మహిళల, మిక్స్‌డ్‌ రిలే స్వర్ణాలు గెలిచిన జట్లలో పూవమ్మ సభ్యురాలు.

కర్మన్‌ కౌర్‌
2017 నుంచి భారత మహిళల టెన్నిస్‌ సింగిల్స్‌లో టాప్‌ ర్యాంకర్‌గా కొనసాగుతున్న అంకితా రైనా సెప్టెంబర్ 19న విడుదల చేసిన సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి పడిపోయింది. చెన్నై ఓపెన్‌ లో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరిన కర్మన్‌ కౌర్‌ భారత కొత్త నంబర్‌వన్‌గా అవతరించింది.

ఆర్‌.వెంకటరమణి
అటార్నీ జనరల్‌ (ఏజీఐ)గా సీనియర్‌ న్యాయవాది ఆర్‌.వెంకటరమణిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. అటార్నీ జనరల్‌గా ఉన్న కే.కే.వేణుగోపాల్‌ పదవీ కాలం సెప్టెంబరు 30వ తేదీతో ముగుస్తుండడంతో ఆయన స్థానంలో వెంకటరమణిని నియమించారు. ఆయన మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు.

ఆశా పరేఖ్‌
బాలీవుడ్​ నటి ఆశా పరేఖ్‌కు సినీరంగంలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును 2020 ఏడాదికిగాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆశా 1952లో ‘ఆస్మాన్‌’ చిత్రంతో బాలనటిగా వెండితెరకు పరిచయమయ్యారు. సెప్టెంబరు 30న జరిగిన 68వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో అవార్డు అందజేశారు.

సంధ్యా పురేచా
కేంద్ర సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా సంధ్యా పురేచా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ ఉత్తర్వులిచ్చింది. ఈమె అయిదేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. మహారాష్ట్రకు చెందిన ఈమె సుప్రసిద్ధ నృత్య కళాకారిణి. 35 ఏళ్ల పాటు ముంబయిలోని కళాపరిచయ ఇన్‌స్టిట్యూట్‌లో నాట్య శాస్త్రంలో బోధించారు.

జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా
సర్వోన్నత న్యాయస్థానం జడ్జిగా జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ యు.యు.లలిత్‌ బాధ్యతలు చేపట్టాక కొలీజియం ప్రతిపాదించిన తొలి పేరు ఇదే. ఆయన ప్రస్తుతం బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.

డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌
హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల, ఆసుపత్రి డీన్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ ఎం.శ్రీనివాస్, దేశంలో అత్యున్నత వైద్య విద్యాసంస్థ ఢిల్లీ ఎయిమ్స్‌కు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ స్థాయికి ఎదిగిన మూడో ప్రముఖుడిగా నిలిచారు.

హాకీ ఇండియా అధ్యక్షుడిగా టిర్కీ
భారత హాకీ మాజీ కెప్టెన్‌ దిలీప్‌ టిర్కీ హాకీ ఇండియా (హెచ్‌ఐ) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అధ్యక్ష పదవితో పాటు మరే పదవికి పోటీ లేకపోవడంతో ఫలితాలను ముందే ప్రకటించారు.

రాజీవ్‌ బహల్‌
భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శిగా డాక్టర్‌ రాజీవ్‌ బహల్‌ నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Advertisement

స్పోర్ట్స్​

సాకేత్‌ జోడీకి టైటిల్‌
భారత జంట సాకేత్‌ మైనేని–యుకి బాంబ్రి రఫా నాదల్‌ ఓపెన్​లో విజేతగా నిలిచారు. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో సాకేత్‌ – యుకి 6-–2, 6-–2తో మారెక్‌ – లుకాస్‌ రొసోల్‌ (చెక్‌ రిపబ్లిక్‌)పై విజయం సాధించింది. ఈ సీజన్లో భారత జంటకు ఇది అయిదో ఛాలెంజర్‌ టైటిల్‌.

డైమండ్‌ లీగ్‌ ట్రోఫీ
డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన భారత తొలి అథ్లెట్‌గా నీరజ్‌ చోప్రా రికార్డు సృష్టించాడు. ఫైనల్లో జావెలిన్‌ను 88.44 మీటర్లు విసిరిన నీరజ్‌ అగ్రస్థానంలో నిలిచాడు. ఒలింపిక్స్‌ రజత విజేత, చెక్‌ రిపబ్లిక్‌ ఆటగాడు జాకబ్‌ వాద్లెచ్‌ (86.94మీ.) రెండో స్థానంలో నిలిచాడు.

యుఎస్‌ ఓపెన్‌ విన్నర్స్​
స్పెయిన్‌ యువ సంచలనం కార్లోస్‌ అల్కరాస్‌ యుఎస్‌ ఓపెన్‌ కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో 6-–4, 2–-6, 7-–6 (7-–1), 6-–3తో కాస్పర్‌ రూడ్‌ (నార్వే)పై విజయం సాధించాడు. అత్యంత పిన్నవయసులో పురుషుల సింగిల్స్‌ నంబర్‌వన్‌గా అల్కరాస్​ నిలిచాడు. మహిళల సింగిల్స్​ ఫైనల్లో స్వైటెక్‌ ఇగా అయిదో సీడ్‌ జాబెర్‌ను ఓడించి యుఎస్‌ ఓపెన్‌ గెలుచుకుంది.

రోజర్‌ ఫెదరర్‌
స్విస్‌ టెన్నిస్‌ స్టార్​ రోజర్‌ ఫెదరర్‌ ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు చెప్పేశాడు. కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్‌లను నెగ్గిన ఫెదరర్‌ లావెర్‌ కప్‌ ఏటీపీనే తనకు చివరిదని ప్రకటించాడు. ఆరు సార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్, ఎనిమిదిసార్లు వింబుల్డెన్, ఐదుసార్లు యూఎస్‌ ఓపెన్‌, ఒకసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ను కైవసం చేసుకొన్నాడు.

సినియకోవాకు డబ్ల్యూటీఏ టైటిల్‌
చెక్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి క్యాటరీనా సినియకోవా పోర్టోజ్‌ డబ్ల్యూటీఏ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో సినియకోవా 6-–7(4–-7), 7–-6(7–-5), 6-–4తో ఎలెనా రిబకినాపై గెలిచింది. మూడో సెట్‌లో స్కోరు 4-–4తో ఉన్నపుడు సినియాకోవా బ్రేక్‌తో ముందంజ వేసి ట్రోఫీ గెలుచుకుంది.

రెజ్లింగ్‌లో బజ్‌రంగ్‌కు కాంస్యం
ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో బజ్‌రంగ్‌ పునియా (65 కేజీ) కాంస్యం సాధించాడు. రెపిచేజ్‌లో బరిలోకి దిగిన అతడు కాంస్య పతక పోరులో 11-9తో సెబాస్టియన్‌ రివెరా (పోర్టోరికో)పై విజయం సాధించాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో నాలుగు పతకాలు సాధించిన తొలి భారత రెజ్లర్‌ బజ్‌రంగే.

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌ టాప్​
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్‌ ఇండియా టాప్​లో నిలిచింది. ఆసీస్‌తో సిరీస్‌ను 2-–1తో చేజిక్కించుకున్న రోహిత్‌సేన ఒక పాయింట్​ మెరుగుపర్చుకుని 268 పాయింట్లతో నిలిచింది. 258 పాయింట్లతో దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా ఆరో స్థానంలో ఉంది.

జులన్‌ గోస్వామి రిటైర్​మెంట్​
టీమ్​ ఇండియా మహిళా క్రికెటర్​ జులన్‌ గోస్వామి ఆటకు వీడ్కోలు పలికింది. ఆమె12 టెస్టుల్లో 44 వికెట్లు, 291 పరుగులు చేసింది. 204 వన్డేల్లో 1228 పరుగులు, 255 వికెట్లు తీసింది. 68 టీ20 ల్లో 56 వికెట్లతో పాటు 405 పరుగులు చేసింది. వన్డేల్లో (255) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆమె ఘనత సాధించింది.

సైన్స్ అండ్​ టెక్నాలజీ

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ జలప్రవేశం
దేశీయంగా నిర్మించిన తొలి విమానవాహక నౌక ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’ లాంఛనంగా జలప్రవేశం చేసింది. కేరళలోని కొచ్చిన్‌ షిప్‌యార్డులో నిర్వహించిన వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీ దాన్ని ప్రారంభించారు. భారత నైపుణ్యాలు, ప్రతిభకు ఈ యుద్ధనౌక సాక్ష్యంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.

స్టెల్త్‌ యుద్ధనౌక తారాగిరి
స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన స్టెల్త్‌ యుద్ధనౌక తారాగిరి జలప్రవేశం చేసింది. ‘ప్రాజెక్ట్‌ 17ఏ’ శ్రేణిలో ఇది మూడో యుద్ధనౌక. ముంబయిలోని మజగావ్‌ డాక్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) దీన్ని నిర్మించింది. తారాగిరిని సమీకృత నిర్మాణ విధానాన్ని ఉపయోగించి నిర్మించారు.

చైనా వ్యోమగాముల స్పేస్‌వాక్‌
భూ కక్ష్యలో నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రం నుంచి చైనా వ్యోమగాములు కాయ్‌ షుజె, చెన్‌ డాంగ్‌ తాజాగా స్పేస్‌వాక్‌ నిర్వహించారు. ఇది షుజె, చెన్‌లు చేపట్టిన రెండో స్పేస్‌వాక్‌.

ఆస్ట్రేలియా జలాల్లో ‘ఐఎన్‌ఎస్‌ సాత్పురా’
స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ సాత్పురా ఆస్ట్రేలియా నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహించిన యుద్ధ విన్యాసాల్లో తన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించింది. గన్‌ ఫైరింగ్‌ విన్యాసాల్లో భాగంగా లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. ఇందులో 14 దేశాల నౌకాదళాలు పాల్గొన్నాయి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!