Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​: ఆగస్ట్ 2022

కరెంట్​ అఫైర్స్​: ఆగస్ట్ 2022

అంతర్జాతీయం

నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంకింగ్​

నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంకుల్లో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) దేశంలోని విశ్వవిద్యాలయాల కేటగిరీలో ప్రథమ స్థానం దక్కించుకుంది. మొత్తమ్మీద 16వ స్థానం సాధించింది. ఈ ర్యాంకుల్లో బెంగళూరులోని ఐఐఎమ్​ తొలిస్థానంలో నిలిచింది. ఐఐటీ హైదరాబాద్‌కు 23, ట్రిపుల్‌ఐటీ-హైదరాబాద్‌కు 82వ ర్యాంక్​ దక్కింది.

తైవాన్​లో అమెరికా హౌజ్‌ స్పీకర్‌ పర్యటన

అమెరికా హౌజ్‌ (ప్రతినిధుల సభ) స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించారు. చైనా చేసిన హెచ్చరికలు లెక్కచేయకుండా 25 ఏళ్ల తర్వాత తైవాన్‌ను సందర్శిస్తున్న అత్యున్నత అమెరికా ప్రతినిధి నాన్సీ పెలోసీ కావడం విశేషం. తైవాన్‌లో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని అమెరికా ఆకాంక్షిస్తోందని, అందుకు తగిన సాయాన్ని అందిస్తామని ఆమె పేర్కొన్నారు.

పాక్‌ పంజాబ్‌ సీఎంగా పర్వేజ్‌ ఇలాహీ

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ముఖ్యమంత్రిగా చౌదరి పర్వేజ్‌ ఇలాహీ ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలోనే అత్యంత కీలకమైన రాజకీయ ప్రాధాన్యం కలిగిన ప్రాంతంలో నాటకీయ పరిణామాల మధ్య పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) మద్దతు ఇస్తున్న ఇలాహీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. పాక్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ ఇలాహీతో పంజాబ్‌ సీఎంగా ప్రమాణం చేయించారు.

అల్​కాయిదా ఛీఫ్​ హత్య

అల్‌-కాయిదా చీఫ్‌.. 9/11 అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌(డబ్ల్యూటీసీ) ట్విన్‌ టవర్స్‌పై ఉగ్రదాడిలో భాగస్వామి అయ్‌మాన్‌ అల్‌-జవహరి హత్యకు గురయ్యాడు. పకడ్బందీగా చేపట్టిన ఆపరేషన్‌లో అమెరికా గూఢచార సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ(సీఐఏ), కౌంటర్‌ టెర్రరిజం ఆపరేషన్‌ బృందాలు అఫ్ఘానిస్థాన్‌ రాజధాని నగరం కాబూల్‌లో మట్టుబెట్టాయి.

మిస్​ ఇండియా యూఎస్​ఏ

భారతీయ అమెరికన్‌ యువతి ఆర్య వల్వేకర్ మిస్‌ ఇండియా యూఎస్‌ఏ–2022 గెలుచుకున్నారు. వర్జీనియాకు చెందిన ఆర్య న్యూజెర్సీలో జరిగిన 40వ వార్షిక పోటీలో మిస్‌ఇండియా యూఎస్‌ఏ కిరీటం సొంతం చేసుకుంది. సౌమ్య శర్మ, సంజన చేకూరి రన్నరప్‌లుగా నిలిచారు.

టాటా చేతికి ఫోర్డ్‌ ఇండియా ప్లాంట్‌

అమెరికన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం ఫోర్డ్‌కు గుజరాత్‌లోని సాణంద్‌లో ఉన్న ప్లాంట్​ కొనుగోలు చేస్తున్నట్లు టాటా మోటార్స్‌ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఫోర్డ్‌ ఇండియా (ఎఫ్‌ఐపీఎల్‌), గుజరాత్‌ ప్రభుత్వం, టాటా మోటర్స్‌ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి.

న్యూగినియా ప్రధానిగా జేమ్స్​‍ మరాపే

దక్షిణ పసిఫిక్‌ ద్వీప దేశంలోని పపువా న్యూగినియా దేశ ప్రధాన మంత్రిగా జేమ్స్​‍ మరాపే ఎన్నికయ్యారు. ఈ దేశ ఎన్నికలు జూలై 4న నిర్వహించగా 22న ముగిశాయి. భద్రతా సమస్యలు తదితర కారణాలతో ఆగస్టు 8న ఓట్లు లెక్కించారు. మొత్తం 118 పార్లమెంట్‌ సీట్లలో 39 సీట్లు మరాపే నాయకత్వంలోని ‘పంగు’ పార్టీ గెలిచింది.

చైనాలో ‘హెనిపా’ వైరస్​

చైనాలో జంతువుల నుంచి మరో కొత్త వైరస్‌ మనుషులకు సోకడం ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది. జంతువుల నుంచి వ్యాపించే ‘హెనిపా’ వైరస్‌.. ఇటీవల షాంగ్‌డాంగ్, హెనాన్‌ ప్రావిన్సుల్లో కొందరికి సోకినట్లు తేలింది. దీనికి నోవెల్‌ లాంగ్యా హెనిపా వైరస్‌గా పేరుపెట్టారు.

డిజిటల్‌ కరెన్సీలో భారత్‌ స్థానం

భారత జనాభాలో 7 శాతానికి పైగా ప్రజలు డిజిటల్‌ కరెన్సీ కలిగి ఉన్నారని ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) వెల్లడించింది. యూఎన్‌ వాణిజ్యం, అభివృద్ధి సమాఖ్య యూఎన్‌సీటీఏడీ ప్రకారం ఉక్రెయిన్‌ జాబితాలో 12.7 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. రష్యా, వెనెజులా తర్వాత స్థానంలో ఉండగా, భారత్​లో​ (7.3) శాతం ప్రజలతో ఏడో స్థానంలో ఉంది.

అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు డ్రోన్లు

రష్యా సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్‌కు భారీగా సైనిక సాయం అందిస్తున్న అమెరికా తాజాగా అత్యాధునిక స్కాన్‌ ఈగిల్స్‌ నిఘా డ్రోన్లు, మైన్‌ రెసిస్టెంట్‌ వెహికల్స్, యాంటీ ఆర్మోర్‌ రౌండ్స్, హోవిట్జర్‌ ఆయుధాలను సరఫరా చేయనుంది. ఈ సైనిక సాయం విలువ 77.5 కోట్ల డాలర్లు.

చైనాలో తగ్గిన వృద్ధి రేటు

చైనాలో వర్షపాతం అతి తక్కువ స్థాయికి పడిపోవడంతో నదులు ఎండిపోవడం జలవిద్యుదుత్పత్తిని దారుణంగా దెబ్బతీసింది. కర్మాగారాలకు కరెంటు సరఫరా నిలిచిపోయి, పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతింటోంది. 2022లో 5.5% వృద్ధిరేటును సాధించాలనుకున్న డ్రాగన్‌ అందులో సగం రేటుతోనే సరిపెట్టుకుంది.

‘మదర్‌ హీరోయిన్‌’లకు పుతిన్‌ పురస్కారం

జనాభా తగ్గిపోతోందన్న ఆందోళన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సోవియట్‌ కాలం నాటి పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. పది, అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళలను ‘మదర్‌ హీరోయిన్‌’గా గుర్తించి, 10 లక్షల రూబుళ్లను (భారత కరెన్సీలో దాదాపు రూ.13 లక్షలకుపైన) పురస్కారంగా ఇవ్వనున్నారు.

జాతీయం

కొత్త సీజేఐగా జస్టిస్​ లలిత్​

సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ ఎంపికయ్యారు. సుప్రీంకోర్టు సీనియారిటీ లిస్టులో జస్టిస్‌ రమణ తర్వాత జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ ఉండడంతో ఆయన పేరును ఎన్వీ రమణ సిఫార్సు చేశారు. ఆగ‌స్టు 26వ తేదీన ఎన్వీ రమణ సీజేఐగా రిటైర్​ కానుండడంతో జస్టిస్‌ లలిత్‌ 49వ సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తారు.

డోపింగ్‌ నిరోధక బిల్లుకు ఆమోదం

జాతీయ యాంటీ డోపింగ్‌ సంస్థ (నాడా), జాతీయ డోప్‌ పరీక్షల ప్రయోగశాల (ఎన్‌డీటీఎల్‌) ఏర్పాటుకు చట్టబద్ధత కల్పించే డోపింగ్‌ నిరోధక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. క్రీడల్ని ప్రోత్సహించి, క్రీడాకారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఇది దోహదపడుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకుర్‌ అన్నారు.

సంపన్నురాలిగా రోష్ని నాడార్‌

దేశంలో అత్యంత సంపన్న మహిళగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌ మల్హోత్రా అగ్రస్థానంలో ఉన్నారు. నైకా బ్రాండ్‌ను ప్రారంభించిన ఫల్గుణి నాయర్‌ రెండో స్థానంలో నిలిచింది. బయోకాన్‌ కిరణ్‌ మజుందార్‌ షా మూడో ర్యాంకులో ఉన్నారు.ఈ జాబితాలో ఢిల్లీ నుంచి 25 మంది, ముంబయి (21), హైదరాబాద్‌ (12) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌గా సురేష్‌ ఎన్‌ పటేల్‌

సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌గా సురేష్‌ ఎన్‌ పటేల్‌ నియామకమయ్యారు. సీవీసీ నియామకాన్ని ప్రధాని మోదీ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఇటీవల ఆమోదించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. గతేడాది జూన్‌ నుంచి సురేష్ తాత్కాలిక సీవీసీగా పని చేస్తున్నారు.

భారతీయ యూజర్లు 34.6 కోట్లు

ఈ–కామర్స్, డిజిటల్‌ పేమెంట్స్‌ వంటి ఆన్‌లైన్‌ లావాదేవీలు జరుపుతున్న భారతీయుల సంఖ్య సుమారు 34.6 కోట్లకు చేరుకుంది. ఈ సంఖ్య 33.1 కోట్లుగా ఉన్న యూఎస్‌ జనాభా కంటే అధికం. 2019లో దేశంలో ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిపిన వారి సంఖ్య 23 కోట్లు. కరోనా మహమ్మారి కాలంలో ఈ సంఖ్య 51 శాతం పెరిగింది. గమనార్హం. ఇంటర్నెట్‌ వినియోగంలో సోషల్​ మీడియా, ఎంటర్​టైన్​మెంట్, న్యూస్​ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

బీహార్ సీఎంగా నితీశ్‌ ప్రమాణం

బీహార్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనతా దళ్‌(యునైటెడ్‌)కు చెందిన నితీశ్‌ కుమార్‌ ఎనిమిదో సారి ప్రమాణం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గుడ్‌ బై చెబుతూ ఆర్జేడీ సహా విపక్షాల మద్దతుతో ఆయన ప్రభుత్వ ఏర్పాటు చేశారు. సీఎంగా నితీశ్‌ కుమార్‌తో పాటు తేజస్వి యాదవ్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.

జాతీయ స్మారకంగా ‘ఢిల్లీ చలో’ మైదానం

రెండు శతాబ్దాలుగా పలు చారిత్రక ఘటనలకు వేదికగా నిలిచిన సింగపూర్​లోని మైదానాన్ని 75వ జాతీయ స్మారకంగా ఆ దేశం ప్రకటించింది. 1943 జులై 5న ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ కవాతు అనంతరం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఇదే మైదానం నుంచి ‘ఢిల్లీ చలో’ నినాదమిచ్చారు.

ఉత్తమ పంచాయతీకి కోటి నజరానా

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీ) సాధన ఆధారంగా ఉత్తమ గ్రామాలను ఎంపిక చేయాలని కేంద్రం నిర్ణయించింది. మొదటి బహుమతికి కోటి, రెండో బహుమతికి రూ.75లక్షలు, మూడో బహుమతి పొందిన గ్రామానికి రూ.50లక్షల వరకు అవార్డు ఇస్తారు. జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తారు.

పింగళి పేరుతో పోస్టల్‌ స్టాంప్‌

జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాల సందర్భంగా ఆగస్ట్‌ 2న ఢిల్లీలో ఘనంగా తిరంగా ఉత్సవ్‌ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య పేరుతో పోస్టల్‌స్టాంప్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విడుదల చేశారు.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు మార్పు

రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కీలక పాలసీ రేట్​ అయిన రెపోను మరో 50 బేసిస్‌ పాయింట్లు లేదా 0.5 శాతం (100 బేసిస్‌ పాయింట్లు 1%) పెంచాలని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించడంతో రెపో 5.4 శాతానికి చేరింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను యథాతథంగా 7.2 శాతం వద్ద కొనసాగించింది.

భారత్‌-అమెరికా మిలిటరీ ఎక్సర్‌సైజ్‌

13వ ఎడిషన్‌ భారత్‌-అమెరికా మిలిటరీ ఎక్సర్‌సైజ్‌ ‘ఎక్స్​​‍ వజ్ర ప్రహార్‌-2022’ ఆగస్టు 8న ప్రారంభమయ్యింది. ఈ విన్యాసం హిమాచల్‌ ప్రదేశ్‌లోని బక్లోహ్‌లో నిర్వహించారు. ఉమ్మడి మిషన్‌ ప్రణాళిక, కార్యాచరణ వ్యూహాలు వంటి రంగాల్లో అనుభవాలు పంచుకోవడం, ఇరుదేశాలు రక్షణ సహకారం మెరుగుపర్చుకోవడమే లక్ష్యంగా దీన్ని చేపట్టారు.

తొలి వర్చువల్‌ స్పేస్ మ్యూజియం

దేశంలో తొలి వర్చువల్‌ స్పేస్ మ్యూజియం ‘స్పార్క్​‍’ను ఇస్రో చైర్మన్‌ ఎస్ సోమనాథ్‌ ప్రారంభించారు. ఇస్రో వివిధ మిషన్లకు చెందిన డిజిటల్‌ కంటెంట్‌ను ఇంటరాక్టివ్‌ పద్ధతిలో ప్రజలకు అందించడానికి దీనిని ఏర్పాటు చేశారు. ఇస్రోను 1969, ఆగస్ట్ 15న స్థాపించారు. ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది.

ఏషియన్‌ రీజినల్‌ సమ్మిట్‌

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఏషియన్‌ రీజినల్‌ సమ్మిట్‌’ను వర్చువల్‌గా ‘మేకింగ్‌ అవర్‌ ఎలక్షన్‌ ఇన్‌క్లూజివ్‌, యాక్సెసబుల్‌ అండ్‌ పార్టిసిపేటివ్‌’ అనే థీమ్‌తో ఏర్పాటు చేశారు. ఈ సదస్సును వచ్చే నెలలో నేషనల్‌ ఎలక్టోరల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెక్సికో ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘సమ్మిట్‌ ఫర్‌ ఎలక్టోరల్‌ డెమొక్రసీ’ సమావేశం కోసం నిర్వహించారు.

పీఎంవో డైరెక్టర్‌గా శ్వేతా సింగ్‌

ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) డైరెక్టర్‌గా.. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) అధికారి శ్వేతా సింగ్‌ నియమితులయ్యారు. 2008 బ్యాచ్‌ అధికారి అయిన శ్వేతా సింగ్‌ నియామకాన్ని కేబినెట్‌ నియామకాల కమిటీ(ఏసీసీ) ఆమోదించింది. శ్వేతా సింగ్‌ మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.

సీజేఐగా లలిత్ నియామకం

భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ నియామకం ఖరారు అయ్యింది. ఆయన నియామకాన్ని ఆమోదిస్తూ ఆగ‌స్టు 10న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.భారతదేశ 49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ యూయూ లలిత్‌.. ఆగస్టు 27న బాధ్యతలు తీసుకోనున్నారు.

రాష్ట్రీయ పురస్కార్‌ పోర్టల్‌

కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు అందించే అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చింది. ఎంపికలో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ‘రాష్ట్రీయ పురస్కార్‌’ పేరిట కేంద్ర హోం మంత్రిత్వ శాఖ www.awards.gov.in పోర్టల్‌ను రూపొందించింది.

నిరుపేద బాలికల కోసమే ‘ప్రాజెక్ట్‌ శక్తి’

విద్యతో పాటు వివిధ రంగాల్లో వంద మంది నిరుపేద, ప్రతిభావంతులైన బాలికలను ప్రోత్సహించడానికే ‘ప్రాజెక్ట్‌ శక్తి’ కార్యక్రమాన్ని చేపట్టామని పర్వతారోహకులైన మాలావత్‌ పూర్ణ, కావ్య మన్యపు (నాసా శాస్త్రవేత్త) తెలిపారు. ప్రాజెక్ట్‌ శక్తి పేరుతో లక్ష డాలర్ల (సుమారు రూ.80 లక్షలు) సేకరణే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

గోవాలో 100% నల్లా నీళ్లు

గోవా 100% గ్రామీణ కుటుంబాలకు నల్లా నీటిని సరఫరా చేయాలన్న లక్ష్యాన్ని అందుకుంది. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద ప్రభుత్వం గత మూడేళ్లలో ఏకంగా ఏడు కోట్ల గ్రామీణ కుటుంబాలకు నల్లా నీటి సదుపాయాన్ని కల్పించిందని ప్రధాని తెలిపారు. దాద్రానగర్‌ హవేలీ, డామన్​ డయ్యూ ఈ జాబితాలో ఉన్నాయి.

విమానాశ్రయానికి భగత్‌సింగ్‌ పేరు

పంజాబ్, హర్యాన రాష్ట్ర ప్రభుత్వాలు చండీగఢ్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ పేరు పెట్టేందుకు ఓ అంగీకారానికి వచ్చాయి. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్, హరియాణా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్‌ చౌటాలా నడుమ జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రాంతీయం

రామగుండంలో ఫ్లోటింగ్​ సోలార్​ ప్లాంట్​

దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్‌(నీటిపై తేలియాడే) సోలార్‌ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. 100 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని 500 ఎకరాల్లో రూ.423 కోట్లతో ఈ ప్లాంట్‌ను నెలకొల్పారు.

పోలీస్​ కమాండ్​ కంట్రోల్ సెంటర్​

రాష్ట్రం ప్రభుత్వం దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సీఎం కేసీఆర్​ ప్రారంభించారు. ఏడెకరాల స్థలంలో రూ.600కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా ఏ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సీసీటీవీ కెమెరా దృశ్యాలైనా సెంటర్‌ నుంచి వీక్షించవచ్చు.

ఎకనామిక్‌ టైమ్స్‌ పురస్కారం

సరళతర వ్యాపార నిర్వహణ (ఈవోడీబీ)లో తెలంగాణ రాష్ట్రం ఎకనామిక్‌ టైమ్స్‌ పురస్కారానికి ఎంపికైంది. ఆగస్టు 25న ఢిల్లీలో నీతి ఆయోగ్, కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌శాఖలతో పాటు ఇజ్రాయెల్, స్వీడన్‌ రాయబార కార్యాలయాలు సంయుక్తంగా ఈ పురస్కారం అందజేయనున్నారు.

జాతీయ చేనేత పురస్కారాల ప్రదానం

యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక చేనేత కళాకారులు కొలను పెద్దవెంకయ్య, ఆయన కుమారుడు రవీందర్‌లు జాతీయ హస్తకళల పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలోఈ అవార్డు స్వీకరించారు.

నేతన్న బీమా

రాష్ట్రంలో రైతు బీమా తరహాలో చేనేత కార్మికుల కోసం ‘నేతన్న బీమా’ పథకాన్ని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న మంత్రి కేటీఆర్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ పథకం వల్ల రాష్ట్రంలోని 80 వేలకు పైగా చేనేత, మరమగ్గాల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

ఓడీఎఫ్‌ ప్లస్‌లో తెలంగాణ టాప్‌

బహిరంగ మల విసర్జనను పూర్తిగా పరిహరించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఘన, ద్రవ వ్యర్థాలను సక్రమంగా నిర్వహిస్తూ ఓడీఎఫ్‌ (ఓపెన్‌ డెఫకేషన్‌ ఫ్రీ) ప్లస్‌ స్థాయి పొందిన టాప్‌ 5 రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌లు ఉన్నట్లు కేంద్ర జల్‌శక్తిశాఖ వెల్లడించింది.

జీఎస్‌డీపీలో 19.37% వృద్ధిరేటు

తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో ప్రస్తుత ధరల ప్రకారం 19.37 శాతం వృద్ధిరేటు, తలసరి ఆదాయంలో 19.19 శాతం వృద్ధిరేటు నమోదయ్యాయి. రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.11,48,115 కోట్లు, తలసరి ఆదాయం రూ.2,75,443గా తేలింది.

వార్తల్లో వ్యక్తులు

ఛరిష్మా కృష్ణ

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం పైన్‌ ఆర్ట్స్‌ విభాగం విద్యార్థిని ఛరిష్మా కృష్ణ మిస్‌ సౌత్‌ ఇండియా గా ఎంపికయ్యారు. పెగాసస్‌ గ్లోబల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కేరళలోని కోచిలో నిర్వహించిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. చదువుకుంటూనే నృత్య కళాకారిణిగా, నటిగా ఛరిష్మా రాణిస్తున్నారు.

ఆశిష్‌ కుమార్‌

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈవోగా ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన బీఎస్‌ఈ ఎండీ, సీఈఓగా రాజీనామా చేశారు. కొత్త ఎండీ, సీఈఓ నియామకం వరకు ఎక్స్ఛేంజీ వ్యవహారాలను ఎగ్జిక్యూటివ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ చూసుకుంటుందని బీఎస్‌ఈ వెల్లడించింది.

జస్టిస్‌ ఎన్వీ రమణ

ఉస్మానియా యూనివర్సిటీ రెండు దశాబ్దాల తర్వాత గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. 82వ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ 48వ ఓయూ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ డాక్టరేట్‌ అందుకుంటున్న మొదటి తెలుగు వ్యక్తిగా చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ నిలవనున్నారు.

అమితాబ్‌ కాంత్‌

నీతి ఆయోగ్‌ మాజీ సీఈవో అమితాబ్‌ కాంత్‌ జీ–20కు భారత కొత్త షెర్పాగా సేవలు అందించనున్నారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇప్పటి వరకు ఈ బాధ్యతలు చూశారు. జీ–20 అధ్యక్ష బాధ్యతలు ఈ ఏడాది భారత్‌కు రానున్నాయి. దీంతో షెర్పా బాధ్యతల్లో ఉన్న వారు దేశవ్యాప్తంగా వివిధ సమావేశాలు నిర్వహించాలి.

డా.ప్రతిమా చౌదరి

బ్రిటన్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్, వేల్స్‌లలోని హీమోఫీలియా సెంటర్‌ డాక్టర్లకు సంబంధించిన ‘ద యునైటెడ్‌ కింగ్‌డమ్‌ హీమోఫీలియా సెంటర్‌ డాక్టర్స్‌ ఆర్గనైజేషన్‌ (యూకేహెచ్‌సీడీఓ)’ చైర్‌పర్సన్‌గా ప్రొఫెసర్‌ డా.ప్రతిమా చౌదరి మావిళ్లపల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పదవికి ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తి.

జగదీప్‌ ధన్‌ఖడ్‌

దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి జగదీప్‌ ధన్‌ఖడ్‌ బాధ్యతలు స్వీకరించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్‌ ఆళ్వాపై ఆయన 346 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌కుమార్‌ సింగ్‌ ప్రకటించారు. రాజస్థాన్‌కు చెందిన ధన్‌ఖడ్‌కు న్యాయవాదిగా, చట్టసభల సభ్యునిగా, గవర్నర్‌గా సుదీర్ఘ అనుభవం ఉంది.

రేఖారెడ్డి

హైదరాబాద్‌కు చెందిన జపాన్‌ పూల అలంకరణ (ఒహరా ఇకెబానా) కళానిపుణురాలు గవ్వా రేఖారెడ్డి జపాన్‌ విదేశాంగమంత్రి ప్రశంసా పురస్కారానికి ఎంపికయ్యారు. తమ కళ ద్వారా భారత్‌-జపాన్‌ల మధ్య సాంస్కృతిక మార్పిడి, స్నేహ సంబంధాలకు దోహదపడినందుకు ఆమెను ఈ పురస్కానికి ఎంపిక చేశారు.

టెస్సీ థామస్‌

డీఆర్‌డీఓ ప్రముఖ శాస్త్రవేత్త టెస్సీ థామస్‌కు లోకమాన్య తిలక్‌ జాతీయ అవార్డు(2022)ను అందజేశారు. స్వదేశీ సిద్ధాంతాన్ని వ్యాప్తిచేయడంలో కృషిచేసినందుకు టెస్సీ థామస్‌ను ఈ పురస్కారానికి ఎంపికచేసినట్లు ట్రస్టు అధ్యక్ష, ఉపాధ్యక్షులు దీపక్‌ తిలక్, రోహిత్‌ తిలక్‌ తెలిపారు

విశ్వనాథన్‌ ఆనంద్‌

భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ప్రస్తుత అధ్యక్షుడు అర్కడి వొర్కోవిచ్‌ రెండోసారి అధ్యక్షుడయ్యారు. చెన్నై లో జరుగుతున్న 44వ చెస్ ఒలంపియాడ్ వేదికగా ప్రపంచ చెస్ సమాఖ్య నూతన కార్యవర్గం ఎంపికకు ఫిడే కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహించింది.

కౌశిక్‌ రాజశేఖర

అమెరికాలోని హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన కౌశిక్‌ రాజశేఖర.. ప్రతిష్టాత్మక గ్లోబల్‌ ఎనర్జీ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. విద్యుత్​ రవాణా, శక్తిసామర్థ్య సాంకేతికతల రంగంలో అందించిన సేవలకుగాను ఆయనకు ఈ బహుమతి దక్కింది.

సావిత్రి జిందాల్‌

ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా భారత్‌కు చెందిన సావిత్రి జిందాల్‌ అగ్రస్థానంలో నిలిచారు. జిందాల్‌ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ అయిన ఆమె నికర సంపద 11.3 బిలియన్‌ డాలర్లు. ఈ మేరకు బ్లూమ్‌బెర్గ్‌ బిలియనర్స్‌ సూచీ వెల్లడించింది. ఇప్పటివరకు ఈ జాబితాలో కంట్రీ గార్డెన్‌ కో ఛైర్మన్‌ యాంగ్‌ హుయాన్‌ తొలి స్థానంలో కొనసాగారు.

రిషబ్‌ పంత్‌

టీమ్‌ ఇండియా వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రచారకర్తగా నియమితుడయ్యాడు. సాధారణ నేపథ్యం నుంచి వచ్చినా పట్టుదలతో ప్రపంచ క్రికెట్లో అతడు సాధించిన ఘనతలు ప్రతి ఒక్కరికీ ప్రేరణ అని రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి అన్నారు. పంత్‌.. తన రాష్ట్రం, దేశం గర్వపడేలా చేశాడని చెప్పారు.

రవీంద్రరావు

భారత వాయుసేనకు చెందిన ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ డి.రవీంద్రరావుకు ప్రభుత్వం ‘వాయుసేవ శౌర్య పతకం’ ప్రకటించింది. ప్రమాదంలో చిక్కుకున్న తోటి పైలట్‌ ప్రాణాలను ధైర్యసాహసాలతో రక్షించినందుకు దీనికి ఎంపికయ్యారు. ‘‘2021 నవంబరు 6న లెఫ్టినెంట్‌ రవీంద్రరావు జాగ్వార్‌ యుద్ధవిమానంలో విధులు నిర్వర్తిస్తున్నారు.

వీవీఎస్‌ లక్ష్మణ్‌

జాతీయ క్రికెట్‌ అకాడమీ అధినేత వీవీఎస్‌ లక్ష్మణ్‌ మరోసారి టీమ్‌ఇండియాకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. జింబాబ్వేతో ఆగస్టు 18, 20, 22 తేదీల్లో మూడు వన్డేల సిరీస్‌ ఆడబోతున్న భారత జట్టుకు అతను కోచ్​గా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు.

దినేష్‌ పరుచూరి

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ హైదరాబాద్‌ విభాగం అడిషనల్‌ డైరెక్టర్‌గా దినేష్‌ పరుచూరి నియమితులయ్యారు. ప్రస్తుతం ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌గా ఉన్న అభిషేక్‌ గోయల్‌ను ముంబైకి బదిలీ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆగస్టు 10న ఉత్త ర్వులు జారీ చేసింది.

మహమ్మద్‌ ముస్తఫా

నాబార్డ్‌ చైర్మన్‌గా మహమ్మద్‌ ముస్తఫాను నియమించాలని ‘ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) సిఫార్సు చేసింది. ముస్తఫా యూపీ కేడర్‌కు చెందిన 1995 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. పదవీ కాలం ముగియనున్న ప్రస్తుత చైర్మన్‌ గోవిందరాజులు స్థానంలో ముస్తఫాను నియమించనున్నారు.

సతీశ్​ రెడ్డి

డీఆర్​డీవో కొత్త చైర్మన్​గా డా. సమీర్​ వీ కామత్​ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో కొనసాగిన జి.సతీశ్​ రెడ్డి రక్షణ శాఖ మంత్రికి శాస్ట్రీయ సలహాదారుగా పనిచేయనున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిని సతీశ్​ రెడ్డి2018 ఆగస్టులో డీఆర్​డీవో చైర్మన్​గా బాధ్యతలు స్వీకరించారు.

అజయ్‌ భల్లా

కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ఈమేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 2023 ఆగస్టు 22 వరకు ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. భల్లా 2019 ఆగస్టులో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు

విశ్వనాథ్‌ కార్తికేయ

హైదరాబాద్‌కు చెందిన పడకంటి విశ్వనాథ్‌ కార్తికేయ ఐరోపాలో అత్యంత ఎత్తయిన మౌంట్‌ ఎల్‌బ్రస్‌ పర్వతం తూర్పు, పడమర శిఖరాలను 24 గంటల వ్యవధిలో అధిరోహించాడు. ఎల్‌బ్రస్‌ పర్వతం పశ్చిమభాగం 5,642 మీటర్లు, తూర్పు శిఖరం 5,621 మీటర్ల ఎత్తులో ఉన్నాయి.

మాక్‌ రూథర్‌ఫర్డ్‌

బెల్జియం–బ్రిటిష్ రెండు పౌరసత్వాలు ఉన్న మాక్​ రూథర్​ఫర్డ్​ చిన్న వయసులోనే రెండు గిన్నిస్‌ ప్రపంచ రికార్డులు సాధించాడు. ఎవరూ తోడులేకుండా భూగోళాన్ని చుట్టిన అత్యంత పిన్నవయస్కుడిగా, మైక్రోలైట్‌ ప్లేన్‌లో ప్రపంచమంతా తిరిగి అత్యంత పిన్నవయస్కుడిగా రెండు రికార్డులు రూథర్‌ఫర్డ్‌ పరమయ్యాయి.

స్పోర్ట్స్​

విజేత వెర్‌స్టాపెన్‌

2022 ఫార్ములావన్‌ సీజన్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఎనిమిదో విజయం నమోదు చేశాడు. బుడాపెస్ట్‌లో జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. హామిల్టన్‌ (మెర్సిడెస్‌) రెండో స్థానంలో, జార్జి రసెల్‌ (మెర్సిడెస్‌) మూడో స్థానంలో నిలిచారు.

మెక్ కియోన్ గోల్డెన్​ రికార్డ్

ఆస్ట్రేలియా మహిళా స్విమ్మర్‌ ఎమ్మా మెక్‌కియోన్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో అత్యధికంగా 11 గోల్డ్​ మెడల్స్ సాధించిన అథ్లెట్‌గా రికార్డులకెక్కింది. 28 ఏళ్ల స్విమ్మర్‌ తాజాగా ఇంగ్లండ్ లోని బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో మూడో స్వర్ణం మహిళల 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో గెలిచింది. 2014 గ్లాస్గో గేమ్స్‌లో, 2018 గోల్డ్‌కోస్ట్‌ గేమ్స్‌లో ఎమ్మా నాలుగు స్వర్ణాల చొప్పున నెగ్గింది.

చెస్‌ ఒలింపియాడ్‌

44వ చెస్‌ ఒలింపియాడ్‌ను భారత్‌ రెండు కంచు పతకాలతో ముగించింది. మహిళల-1, పురుషుల-2 జట్లు పోడియంపై నిలిచాయి. చివరిదైన 11వ రౌండ్లో మహిళల-1 జట్టు కంచు పతకం సాధించింది. తొఖిర్‌జొనోవాతో గేమ్‌ను హంపి, ఇరినా కృష్‌తో గేమ్‌ను వైశాలి డ్రాగా ముగించారు. పురుషుల-2 జట్టు మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది.

కామన్వెల్త్‌ క్రీడల్లో నాలుగో స్థానం

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ ఈ సారి 61 పతకాలతో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు సాధించింది. 2010లో సొంతగడ్డపై జరిగిన క్రీడల్లో 38 స్వర్ణాలు సహా 101 పతకాలతో పట్టికలో మన దేశానికి రెండో స్థానం దక్కింది. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలవగా, ఇంగ్లండ్‌, కెనడా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముగింపు వేడుకల్లో శరత్‌ కమల్, నిఖత్‌ జరీన్‌ పతాకధారులుగా వ్యవహరించారు.

ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌

ఎఫ్‌టీఎక్స్‌ క్రిప్టో కప్‌ అంతర్జాతీయ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద సంచలనంతో శుభారంభం చేశాడు. అమెరికా వేదికగా ఎనిమిది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య లీగ్‌ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. తొలి రౌండ్‌లో ప్రజ్ఞానంద అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు.

నేపాల్​ కోచ్‌గా ప్రభాకర్‌

భారత క్రికెట్‌ జట్టు మాజీ ఆల్‌రౌండర్‌ మనోజ్‌ ప్రభాకర్‌ నేపాల్‌ జాతీయ జట్టుకు హెడ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు.భారత జట్టు తరఫున 1984 నుంచి 1996 మధ్య కాలంలో 39 టెస్టులు, 130 వన్డేలు ఆడిన ప్రభాకర్‌ గతంలో ఢిల్లీ, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ రంజీ జట్లకు కోచ్‌గా పనిచేశాడు.

సిన్సినాటి టెన్నిస్​ టైటిల్‌

సిన్సినాటి టెన్నిస్‌ టైటిల్‌ను కరోలిన్‌ గార్సియా సొంతం చేసుకుంది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో గార్సియా (ఫ్రాన్స్‌) 6–-2, 6-–4తో చెక్‌ రిపబ్లిక్‌ స్టార్‌ పెట్రా క్విటోవాను ఓడించింద పురుషుల సింగిల్స్‌లో అన్‌సీడెడ్‌ కొరిచ్‌ (క్రొయేషియా) టైటిల్‌ నెగ్గాడు. ఫైనల్లో అతడు 7-–6 (7-–0), 6-–2తో సిట్సిపాస్‌ (గ్రీస్‌)ను ఓడించాడు.

ఎఫ్‌టీఎక్స్‌ క్రిప్టో కప్‌ కార్ల్‌సన్‌ సొంతం

చాంపియన్స్‌ చెస్‌ టూర్‌లో భాగంగా జరిగిన ఎఫ్‌టీఎక్స్‌ క్రిప్టో కప్‌ చివరి రౌండ్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద 4–-2 తేడాతో ప్రపంచ నంబర్‌వన్, అయిదు సార్లు ప్రపంచ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) ను ఓడించినా 16 పాయింట్లతో కార్ల్‌సన్‌ వరుసగా రెండో ఏడాదీ టైటిల్‌ గెలుచుకున్నాడు.

సైన్స్ అండ్​ టెక్నాలజీ

భారీ సూపర్​నోవా గుర్తింపు​

భూమికి 30 లక్షల కాంతి సంవత్సరాలకు పైగా దూరంలో ఉన్న ఓ పాలపుంతలో భారీ సూపర్‌నోవాను జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ గుర్తించింది. జేమ్స్‌ వెబ్‌ కంటికి చిక్కిన తొలి సూపర్‌నోవా ఇదే. నక్షత్రం తన ఉనికిని కోల్పోయే క్రమంలో పేలిపోయినప్పుడు వెలువడే అపారమైన కాంతిని సూపర్‌నోవాగా పిలుస్తారు.

భారత నేవీ చేతికి విక్రాంత్‌

భారత నావికా దళానికి దేశీయంగా తయారైన మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక ‘విక్రాంత్‌’ను కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ అందజేసింది. షెడ్యూల్‌ ప్రకారం- విక్రాంత్‌ను ఆగస్ట్‌15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేవీ విధుల్లోకి చేర్చుకుంటారు. హిందూ మహా సముద్రంపై ఆధిపత్యం కోసం చైనా తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ విక్రాంత్‌ చేరిక కీలక పరిణామం.

తేజస్​పై విదేశాల ఆసక్తి

హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) తయారు చేసిన తేజస్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు అమెరికా, ఆ్రస్టేలియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, అర్జెంటీనా, ఈజిప్ట్‌ అసక్తి చూపిస్తున్నాయని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌ చెప్పారు. తేజస్‌ను త్వరలో మలేషియా కొనుగోలు చేయనుందని తెలిపారు.

ఖయ్యామ్‌ ఉపగ్రహం

రష్యా రాకెట్‌ ఇరాన్‌ ఉపగ్రహాన్ని ఆగస్టు 9న విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రష్యా లీజుకు తీసుకున్న కజకిస్థాన్‌లోని బైకనూర్‌ ప్రయోగ కేంద్రం నుంచి సోయజ్‌ రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ఉపగ్రహానికి 11వ శతాబ్దానికి చెందిన పర్షియన్‌ కవి, ఫిలాసఫర్‌ ఒమర్‌ ఖయ్యామ్‌ పేరు పెట్టారు.

వీఎల్‌- ఎస్‌ఆర్‌శామ్‌ సక్సెస్​

ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించేందుకు ఉపయోగించే వర్టికల్‌ లాంచ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌ (వీఎల్‌-ఎస్‌ఆర్‌శామ్‌)ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలో ఒక యుద్ధనౌక నుంచి ఈ ప్రయోగం జరిగింది. దీన్ని డీఆర్‌డీవో, భారత నౌకాదళం నిర్వహించాయి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!