గ్రూప్ 2 పరీక్ష జనవరి 6, 7 తేదీల్లో జరుగుతుందా… లేదా.. నిరుద్యోగుల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికీ తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరలేదు. ఈలోపున టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహణకు ఏర్పాట్లు మొదలు పెట్టడం.. ప్రధానంగా గ్రూప్ 2 పరీక్షకు అప్లై చేసుకున్న అభ్యర్థులను గందరగోళానికి గురి చేస్తోంది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష జరగాల్సి ఉంటుంది. కానీ.. ఎన్నికల సమయంలో టీఎస్పీఎస్సీ వైఫల్యాలు ప్రధాన పార్టీల ఎజెండాగా మారాయి. ఏకంగా బోర్డును ప్రక్షాళన చేస్తామని.. బోర్డును రద్దు చేస్తామంటూ అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ లీడర్లు హామీలు ఇచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. కానీ.. అధికార పగ్గాలింకా చేపట్టలేదు. ఇప్పటివరకున్న సమాచారం ప్రకారం 7వ తేదీన సీఎం సహా పూర్తి కేబినేట్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. ఏదైనా సమీకరణాలతో పూర్తి కేబినేట్ ఎంపిక ఆలస్యమైతే మరో రెండు రోజులకు మించి పట్టదు. అంటే డిసెంబర్ 7వ తేదీన.. లేదా 9వ తేదీన కొత్త ప్రభుత్వం కొలువు దీరటం ఖాయం.
అప్పటిదాకా టీఎస్పీఎస్సీ తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు.. సన్నాహాక ఏర్పాట్లన్నీ.. పక్కాగా అమలవుతాయా.. అంటే సందేహమే. ఆ తదుపరి కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఇచ్చే ఆదేశాల మేరకు టీఎస్పీఎస్సీ తదుపరి కార్యాచరణ ఉంటుందనేది ముమ్మాటికి నిజం. కానీ ఎన్నికల కోడ్ ముగిసినందున పబ్లిక్ సర్వీస్ కమీషన్ మాత్రం ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పరీక్షలకు ఏర్పాట్లు చేసుకునే పనిలో పడింది. తమకున్న అధికారాలు, బాధ్యతల మేరకు టీఎస్పీఎస్సీ యథాతథంగా పరీక్షల ఏర్పాట్లలో నిమగ్నమైందని అర్థమవుతోంది. కేవలం నెల రోజులే వ్యవధి ఉండటంతో గ్రూప్ 2 పరీక్ష ఏర్పాట్ల విషయంలోనూ టీఎస్పీఎస్సీ అదే చేసింది. జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు టీఎస్పీఎస్సీ సెక్రెటరీ అనితా రామచంద్రన్ మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు. పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సూచించింది. దీంతో నిరుద్యోగుల్లో కలవరపాటు మొదలైంది. ఇప్పుడున్న పరిస్థితుల మేరకు ఏర్పాట్లు జరుపుతున్నామని, తదుపరి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు పరీక్ష జరుగుతుందా.. లేదా డిసైడ్ అవుతుందని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి.
పేపర్ల లీకేజీ.. వరుసగా పరీక్షల రద్దు.. నిర్వహణ వైఫల్యాలు.. అన్నింట్లో కోర్టు కేసుల కారణంగా ఇప్పుడున్న టీఎస్పీఎస్సీ బోర్డు నిరుద్యోగుల విశ్వాసం కోల్పోయింది. అందుకే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలనేది ఎన్నికల్లో నిరుద్యోగుల ప్రధాన డిమాండ్. అదే ప్రధాన పార్టీలు తమ నినాదంగా వాడుకున్నాయి. దీంతో.. టీఎస్పీఎస్సీ మళ్లీ గ్రూప్ 2 ఎలా నిర్వహిస్తుంది.. ఈ బోర్డు నిర్వహిస్తే.. మళ్లీ పాతకథనే పునరావృతమవుతుందనేది నిరుద్యోగుల ఆందోళన.
నిజానికి కొత్త ప్రభుత్వం కొలువు దీరగానే.. ప్రభుత్వం ముందున్న ప్రధాన అంశాల్లో ఉద్యోగ నియామకాలు కీలకం. అందుకే టీఎస్పీఎస్సీపై వీలైనంత తొందరగానే పలు ప్రక్షాళన చర్యలు.. అవసరమైతే బోర్డు రద్దు.. కొత్త పాలకవర్గం నియామకం జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ.. ఇదంతా జరగాలంటే.. కనీసం నెల రోజులు పడుతుందనే విషయం నిరుద్యోగ లోకం గుర్తించాలి. ఈలోపు ఆన్‌గోయింగ్ పరీక్షలు.. ఫలితాలు వెలువడుతాయా.. లేదా అనే విషయంలోనూ ప్రభుత్వం తొలి వారంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అప్పటివరకు నిరుద్యోగులు వేచి చూడాల్సిందే.

కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపట్టడం ఆ పార్టీ కొత్త ప్రభుత్వంపై ఉన్న గురుతర బాధ్యత. ఈలోపు ఉన్న కోర్టు కేసులు, వివాదాలపై కొత్త కేబినేట్ తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి. కొత్త జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రభుత్వం అమలు చేస్తుందా.. ముందుగా టీఎస్పీఎస్సీ విషయంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటుందా.. యుద్ద ప్రాతిపదికన ఈ రెండింటినీ ముందుకు తీసుకెళ్లి నోటిఫికేషన్లు జారీ చేస్తుందా.. అనేది వేచిచూడాలి.
మరోవైపు ఎన్నికల ముందు గ్రూప్ 4 ఫైనల్ కీ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేయలేదు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం సూచనలతోనే ఈ లిస్ట్ రిలీజ్ చేసేందుకు టీఎస్పీఎస్సీ వెనుకాడింది. కానీ.. దాదాపు 7 లక్షల మంది అభ్యర్థులు ఈ మెరిట్ లిస్ట్ కోసం వేచిచూస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉందనే సాకు చూపించి ఈ లిస్ట్ పెండింగ్‌లో పెట్టిన టీఎస్పీఎస్సీ.. ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగియటంతో ఎలాంటి సమాధానం చెపుతుందో వేచి చూడాలి.
నిన్న టీఎస్పీఎస్సీ జారీ చేసిన సర్క్యులర్..


Pls help me for SBI clerk and scale 2 exam