ఆర్ఆర్బీ గ్రూప్-డి పరీక్ష రాసి, రిజల్ట్ కోసం ఎదురుచూసే అభ్యర్థులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. డిసెంబర్ 22న రాత పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 2023, జనవరిలో నిర్వహించే శారీరక సామర్థ్య పరీక్ష(ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు)కు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. పీఈటీ తేదీలను సంబంధిత ఆర్ఆర్బీలు త్వరలో వెల్లడించనున్నాయి. ఎంపిక ప్రక్రియపై తాజా సమాచారం కోసం అభ్యర్థులు ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ సంప్రదించాలి.
మొత్తం పోస్టులు 1,03,769
మొత్తం 1,03,769 పోస్టులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ) ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)ను దేశవ్యాప్తంగా దశల వారీగా నిర్వహించిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల క్రితం 16 ఆర్ఆర్బీల పరిధుల్లో 1,03,769 గ్రూప్-డి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల కాగా సుమారు కోటి మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-డి ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటిది కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఇది ఇప్పటికే పూర్తయింది. దీని తర్వాత శారీరక సామర్థ్య పరీక్షలు ఉంటాయి. అభ్యర్థులు పీఈటీకి అర్హత సాధించాలంటే కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ స్కోరు సాధించాల్సి ఉంటుంది. అనంతరం వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈ మూడింటిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.