Homeadmissionsతెలంగాణతెలంగాణలో అత్యధిక అక్షరాస్యత కలిగిన తెగ..?

తెలంగాణలో అత్యధిక అక్షరాస్యత కలిగిన తెగ..?

గోండులు
సంఖ్యాపరంగా, చారిత్రక ప్రాధాన్యత పరంగా తెలంగాణ రాష్ట్రంలో గోండులను లేదా రాజ్‍ గోండులను చాలా ప్రధానమైన ఆదిమ తెగగా భావిస్తారు. రాజ్‍గోండ్‍ అనే పదం చందా రాజుల పురాతన కుటుంబాల నుంచి వచ్చినదిగా భావిస్తారు. గోండులు తమను తాము కోయ్‍తుర్‍గా గోండీ భాషలో పిలుచుకుంటారు. ప్రధాన్‍లను గోండుల వారసత్వ కళాకారులుగా చెప్పవచ్చు. ప్రధాన్‍లు వీరి వద్ద యాచిస్తారు.

నాయక్‍పోడ్‍లు
నాయక్‍పోడ్‍లను గోండులు, రాజ్‍గోండ్‍లతో కలిపి షెడ్యూల్‍ ట్రైబ్స్ చట్టం – 1976 జాబితాలో పొందుపరిచారు. కానీ ఈ రెండు తెగల నడుమ వివాహ సంబంధాలు ఉండవు. నాయక్‍పోడ్‍లు గోండ్‍ల కంటే ఉన్నతమైనవారిగా భావిస్తారు. వీరి ముఖ్య దేవతలు లక్ష్మి, రుక్మిణి (కృష్ణుని భార్య). వీరు తాము దైవంగా భావించే లక్ష్మి, కృష్ణ, శివ, పాండవులు, పాండిరాజు, పోతరాజు, గొర్రెపోతు, సింగభీముడి దేవుళ్ల రంగు రంగు మాస్క్ లు తయారు చేసి ఉత్సవాలు నిర్వహిస్తారు. నాయక్‍పోడ్‍లు గోండులు నివసించే ప్రాంతాలకు దగ్గరగా నివసిస్తున్నప్పటికీ వారి ఆచార వ్యవహారాలను అనుసరించలేదు.

ఆంద్‍లు
ఆంద్‍లు గోండ్‍ తెగవారి లక్షణాలను కలిగి ఉన్నట్లు కనిపించినప్పటికీ వీరికంటూ కొన్ని ప్రత్యేక సహజ లక్షణాలున్నాయి. ఎస్సీ, ఎస్టీ చట్టం 1976 ప్రకారం ఆంద్‍లను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‍, తెలంగాణలో షెడ్యూల్‍ ట్రైబ్స్ గా గుర్తించారు. వీరి వృత్తి వ్యవసాయం, వేట. వీరు ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని పర్బనీ, నాందేడ్‍ జిల్లాలకు పరిమితమై ఉన్నారు. ఆంద్‍ మాండలికంలో చర్చల ద్వారా జరిగే వివాహాన్ని ‘పన్‍వాహ్’ అని పిలుస్తారు. ఈ తెగలో ఉత్సవాలు, పానీయాలతో ఒక పండగ వాతావరణంలో వివాహం కొన్ని రోజుల పాటు జరుగుతుంది.

బిల్లులు
తెలంగాణలో బిల్లులను షెడ్యూల్‍ తెగగా గుర్తించినప్పటికీ వారి జనాభా చాలా తక్కువ. 2011 జనాభా లెక్కల ప్రకారం వీరి జనాభా 604. వీరు బిల్లు, మరాఠీ, తెలుగు, సింధీ భాషలను మాట్లాడుతారు.

కోలమ్‍లు
కోలమ్‍లు మహాభారత ఇతిహాసంలోని భీమ, హిడింబిల వారసులుగా చెప్పుకుంటారు. వీరు ఎవరితో కలవకుండా అడవులలో, పర్వత ప్రాంతాలలో నివసిస్తారు. కోలమ్‍లు తెలంగాణలో ప్రాచీన తెగగా గుర్తించబడ్డారు. వీరు ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు. గోండ్‍లు, కోలమ్‍లు ఒకే రకమైన సామాజిక వ్యవస్థను కలిగి ఉంటారు. కోలమ్‍ తెగలో భర్త మరణించినప్పుడు అతని భార్య తన భర్త సోదరుణ్ని వివాహం చేసుకునే ఆచారం ఉంది. దీన్నే దేవర వివాహం అంటారు. వీరు గుస్సాడి, థింసా నృత్యాలను ప్రదర్శిస్తారు.

తోటీలు
తెలంగాణలో తోటీలు ప్రాచీన తెగ సమూహానికి(ప్రిమిటివ్‍ ట్రైబల్‍ గ్రూప్‍) చెందినవారు. తోటీ అనే పదం తోండు అనే పదం నుంచి వచ్చింది. తోండు అనగా తవ్వడం లేదా చుట్టూ తిరిగి రావడం. తోటీల సంప్రదాయ వృత్తి గోండులకు కళాకారులుగా వ్యవహరించడం. కానీ నేడు అత్యధిక తోటీలు వ్యవసాయం, కూలీలుగా జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. తోటీ తెగ మహిళలు పచ్చబొట్టు వేయడంలో నిష్ణాణుతులు. తోటి తెగలలో ఎక్కువగా మేనరికపు వివాహాలు జరుగుతాయి. వీరు గోండులతో తక్కువ సామాజిక హోదా కలిగిఉన్నప్పటికీ విద్యాపరంగా అత్యధిక అక్షరాస్యతను కలిగి ఉన్నారు. తోటీల గ్రామస్థాయిలోని రాజకీయ వ్యవస్థను ‘పాంచ్’గా పిలుస్తారు.

పర్‍ధాన్‍లు/ప్రధాన్‍
పర్‍ధాన్‍లు ఆదిలాబాద్‍ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. పర్‍ధాన్‍లు గోండులకు వారి ఇతిహాసాలను, జానపదాలను పాటలు పాడి వినిపించే సంప్రదాయ కళాకారులు. దీనికి ప్రతిఫలంగా వీరు ద్రవ్యరూపంలోగానీ, వస్తు రూపంలోగానీ పరిహారాన్ని పొందుతారు.

ప్రతి గోండు కుటుంబం ఒక పర్‍ధాన్‍ కుటుంబం నుంచి సంప్రదాయ కళాకారున్ని కలిగి ఉంటుంది. వీరిని పటోడి(సింగర్‍) అని పిలుస్తారు. పర్‍ధాన్‍ల మాతృభాష మరాఠీ అయినప్పటికీ వీరు గోండుల ఇతిహాసాలను, జానపదాలను గోండి భాషలోనే వినిపిస్తారు. తెలంగాణలో అత్యధిక అక్షరాస్యత కలిగిన తెగ వీరిదే.

ఇక్కడ పునర్వివాహం చేసుకున్న వితంతువును మతపరమైన ఉత్సవాలలో పాల్గొనడానికి అనుమతించరు. గోండ్‍లు పర్‍ధాన్‍లకు ఇచ్చే దానాలను పాల్‍దాన్‍, సాడెదాన్‍, షాట్‍దాన్‍, మున్వార్‍దాన్‍ అని పిలుస్తారు. వీరి అభివృద్ధి కోసం ఆదిలాబాద్‍ జిల్లా ఉట్నూరు వద్ద ఐటీడీఏను ఏర్పాటు చేశారు.

కోయ
తెలంగాణలో ప్రస్తుతం కోయలు జయశంకర్‍ భూపాలపల్లి జిల్లా ములుగు(ఏటూరు నాగారం), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం తాలుకాలో విస్తరించి ఉన్నారు. వీరు గోదావరి నదికి ఇరువైపులా నివసిస్తున్నారు. జయశంకర్‍ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‍ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలలో నివసిస్తున్నారు. సుమారు 70శాతం జనాభా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఉన్నారు. చర్చలు, అంగీకారం ద్వారా, ఎత్తుకెళ్లడం ద్వారా కోయ తెగలలో భాగస్వాములను పొందుతారు. జయశంకర్‍ భూపాలపల్లి జిల్లాలోని మేడారంలో జరిగే సమ్మక్క సారక్క జాతర వీరి ప్రధాన పండగ. ముత్యాలమ్మ పండగను సంవత్సరానికి ఒకసారి నిర్వహించుకుంటారు.

కొండరెడ్లు
కొండరెడ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నదికి ఇరువైపులా అడవులలో, పర్వత ప్రాంతాలలో నివసిస్తున్నారు. కొండరెడ్లను సైతం ప్రిమిటివ్‍ ట్రైబల్‍ సమూహంగా ప్రభుత్వం గుర్తించింది. వీరి మాతృభాష తెలుగు. పోడు వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి. వీరిలో భర్త మరణిస్తే అతని భార్య భర్త సోదరుణ్ని వివాహం చేసుకునే సంప్రదాయం ఉంది. కొండరెడ్ల సామాజిక వ్యవస్థను నియంత్రించేందుకు ‘కుల పంచాయత్‍’ అనే వ్యవస్థ ఉంది. ప్రతి గ్రామం ఒక పెద్దమనిషిని పెద్దగా భావిస్తుంది అతనిని ‘పెద్ద కాపు’గా పిలుస్తారు.

చెంచులు
చెంచులు నాగర్‍ కర్నూల్‍ జిల్లా అమ్రాబాద్‍ ప్రాంతంలోని నల్లమల అడవులలో, నల్లగొండ జిల్లాలోని కృష్ణా నది ఉత్తర ప్రాంతంలో, రంగారెడ్డి జిల్లా వికారాబాద్‍ ప్రాంతంలో విస్తరించి ఉన్నారు. చెంచులు తెలంగాణలో గుర్తించిన మొట్టమొదటి ప్రిమిటివ్‍ ట్రైబల్‍ సమూహం. ఎక్కువ మంది చెంచులు అమ్రబాద్‍ ఎగువ పీఠభూమి ప్రాంతంలో, నల్లమల అడవులలో నివసిస్తున్నారు. వీరిని ‘జంగిల్‍ చెంచులు’ అంటారు. వీరి వేటాడంలో నిష్ణాతులు. ఆహార సేకరణ వేట ద్వారానే చేస్తారు. చెంచులు నల్లని మేనిఛాయతో, పొడవాటి తల, చూడగానే ఆకర్షించే కనుబొమ్మలతో ఆస్ర్టరాయిడ్‍ సమూహానికి చెందినవారుగా కనిపిస్తారు. శ్రీశైల మల్లికార్జునస్వామిని వారి అల్లుడిగా భావిస్తారు. అందుకే పెద్దస్థాయిలో శివరాత్రి పండగను జరుపుకుంటారు.

లంబాడ/సుగాలి/బంజార
లంబాడాలను సుగాలి అని, బంజారాలు అని పిలుస్తారు. తెలంగాణలో లంబాడాలు అతిపెద్ద గిరిజన తెగ. వీరు ప్రత్యేకమైన ఆవాసాన్ని ఏర్పరుచుకుంటారు. వీటిని ‘తండాలు’ అంటారు. సాధారణంగా ప్రతి గ్రామానికి దూరంగా తండాలు దూరంగా ఉంటాయి. లంబాడా తెగలలో జీవితభాగస్వాములను ఎన్నుకోవడంలో, నైతిక విలువలను కాపాడుకోవడంలో ఉమ్మడి కుటుంబాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. లంబాడాలకు సంప్రదాయ సంగీత కళాకారులుంటారు. వీరిని ‘దప్పన్స్’ అంటారు. వీరు లంబాడాలు ఇచ్చే బహుమతులపై ఆధారపడి జీవిస్తారు. లంబాడాలలోనే వెండి, బంగారు ఆభరణాలను తయారుచేసేవారిని ‘సోనాల్ లంబాడాలు’ అంటారు.

ఎరుకలు
ఎరుకలు తెగవారు తెలంగాణ రాష్ట్రమంతటా విస్తరించి ఉన్నారు. వీరికి సొంత మాండలికం ఉంది. దీనిని ఎరుకల భాష, కుర్రు భాష లేదా కులవత అని పిలుస్తారు. వీరు మేనరికపు వివాహాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. కులపంచాయత్‍ల ద్వారా ప్రవర్తన నియమావళిని అతిక్రమించకుండా జీవిస్తారు. గంపలు అల్లడం, చాపలు అల్లడం, తీగలు అల్లడం వీరి సంప్రదాయ వృత్తి.

Advertisement

గిరిజన నృత్యాలు

 • కోయ నృత్యం కోయ
 • రేలా కోయ
 • గుస్సాడి గోండులు
 • థింసా గోండులు
 • మయూరి ఖోండ్‍లు
 • చెంచు నృత్యం చెంచులు
 • దండోరియా గోండులు
 • కోలమీ నృత్యం కోలమ్ లు
 • ఫెన్‍డోల్‍ నృత్యం తోటీలు
 • తోటీల నృత్యం తోటీలు
 • నాయక్‍పోడ్‍ల నృత్యం నాయక్‍పోడ్‍లు

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!