బ్యాంక్ ఉద్యోగాలకు ఎదురుచూస్తున్నారా..? ఈసారి ఐబీపీఎస్ ఒకేసారి రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది. 11 ప్రభుత్వ రంగ బ్యాంకులలో 4451 ప్రొబేషనరీ ఆఫీసర్లు, స్పెషలిస్ట్ ఆఫీసర్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. దేశవ్యాప్తంగా పీఓ ఖాళీలు 3049, స్పెషలిస్ట్ ఖాళీలు 1402 ఉన్నాయి. ఐబీపీఎస్ ద్వారా రిక్రూట్‌మెంట్ జరిపే 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కొన్ని ఖాళీల వివరాలను ఈ నోటిఫికేషన్లో వెల్లడించింది. అందుకే రాబోయే రోజుల్లో ఈ ఖాళీల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
ఐబీపీఎస్ పీఓ పరీక్షకు ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టులకు సంబంధిత విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు మాత్రమే అప్లై చేసేందుకు అర్హులు. ఈ రెండు పరీక్షలకు ఇంచుమించుగా సిలబస్ సరిపోలి ఉండటంతో ఐబీపీఎస్ పీఓ పరీక్షకు ప్రిపేర్ అయితే స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమ్స్ పరీక్షకు సరిపోతుంది.
నోటిఫికేషన్
విద్యార్హతలు: ఏదైనా డిగ్రీ (పీఓ), నిర్ణీత విద్యార్హత (ఎస్‌ఓ)
వయసు : 20–- 30 ఏళ్లు
దరఖాస్తు ఫీజు: రూ.850, రూ.175 (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ)
అప్లికేషన్లకు చివరి తేదీ: ఆగస్ట్ 21
సెలెక్షన్
రెండు పరీక్షల్లోనూ మూడు అంచెలుంటాయి. మొదటి దశలో ప్రిలిమ్స్, రెండో దశలో మెయిన్స్, మూడో దశలో ఇంటర్వ్యూ ఉంటాయి. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన వారే మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. నిర్ణీత మార్కులతో ఉత్తీర్ణులైనవారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థులకు మెయిన్స్ ఆబ్జెక్టివ్ పరీక్షలో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను 80:20 నిష్పత్తిలో తీసుకుని వాటి ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ అక్టోబర్ మొదటి వారంలో, మెయిన్స్ నవంబర్‌లో నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌కు ఉన్న టైమ్ కు తగినట్లుగా అభ్యర్థులు ప్రిపరేషన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. మెయిన్స్‌లోని నాలుగు విభాగాల్లో మూడు ముఖ్యమైన విభాగాలు ప్రిలిమ్స్‌లోనూ ఉంటాయి. ఫస్ట్ టైమ్ బ్యాంక్ పరీక్ష రాసే అభ్యర్థులు ఆప్టిట్యూడ్, రీజనింగ్ సబ్జెక్టుల్లోని టాపిక్స్ అన్నింటినీ బాగా నేర్చుకుని సాధన చేయాలి. 25, 30 రోజుల సమయం వీటికి సరిపోతుంది. ప్రశ్నలను వేగంగా చేయగలిగేలా వివిధ షార్ట్‌కట్ పద్ధతులు ఉపయోగిస్తూ సాధన చేయాలి. ఆప్టిట్యూడ్, రీజనింగ్‌లకు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి వాటికి ఎక్కువ సమయం కేటాయించాలి.