తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న జీవో నంబర్ 46 మీద అధికారులతో సీఎం సమావేశం ముగిసింది. గతంలో నోటిఫికేషన్ జారీ చేసి సెలెక్షన్ ప్రాసెస్ పూర్తయిన పోస్టులతో పాటు, కొత్త పోస్టుల నోటిఫికేషన్ పై ముందుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎంకు పలు అధికారులు పలు సూచనలు చేశారు. మార్చి 2022లో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం. 2023 అక్టోబర్ 4న 15,750 పోస్టులకు సెలెక్షన్ ప్రాసెస్ పూర్తయి ఫలితాలు విడుదల చేసింది.
పెండింగ్ లో నియామకాలు
సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన పోస్టులకు నియామక పత్రాలు అందించాలని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది. సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన 15,750 పోస్టులకు నియామక పత్రాలు అందించడం తప్ప వేరే మార్గం లేదని అడ్వకేట్ జనరల్, అధికారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొత్త నోటిఫికేషన్లకు జీవో 46 రద్దు సాధ్యాసాధ్యాలను పరిశీలంచాలని ముఖ్యమంత్రికి అధికారులు సూచించారు. అసెంబ్లీలో చర్చించి కేబినెట్ సబ్ కమిటీ ద్వారా కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి జీవో46 రద్దుపై నిర్ణయం తీసుకుందామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.