దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్ షిప్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీనెట్ 2024 కోసం నిర్ధేషించిన యూజీసీ నెట్ పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 16వ తేదీన నిర్వహించాల్సిన పరీక్షను జూన్ 18కు రీషెడ్యూల్ చేసినట్లు యూజీసీ ఛైర్మన్ ఎం. జగదీశ్ కుమార్ ఏప్రిల్ 29న ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేశారు. జూన్ 16న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష ఉండటంతో అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల నేపథ్యంలో యూజీసీ నెట్ పరీక్షను జూన్ 18 నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, యూజీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఎన్టీఏ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుందని చెప్పారు. ప్రస్తుతం యూజీసీ నెట్ దరఖాస్తు ప్రక్రియా ఇంకా కొనసాగుతోంది.
మే10 వరకు దరఖాస్తులు:
యూజీసీ నెట్ జూన్ 2024 దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 20న ప్రారంభమైన విషయం తెలిసిందే. అభ్యర్థులు మే 10 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే మే 12 వరకు ఫీజు చెల్లించవచ్చు. కనీసం 55శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి ఏడాది పరీక్షలకు హాజరయ్యేవారు కూడా అప్లయ్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా 4ఏండ్లు డిగ్రీ లేదా 8 సెమిస్టర్ల డిగ్రీ ప్రోగ్రామ్ లో 75శాతం మార్కులు లేదా సమానమైన గ్రేడ్స్ సాధించినవారు దరఖాస్తుచేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఆర్థికంగా వెనబడిన వర్గాలు, ఇతర వర్గాలకు చెందిన వారికి 5శాతం మార్కులు గ్రేడలలో సడలింపు ఉంటుంది.
పరీక్ష ఎలా ఉంటుందంటే:
అభ్యర్థులకు ఓఎమ్మార్ షీట్ ఇస్తారు. ఇందులో మీరు జవాబులను బబుల్ చేయాలి. యూజీసీ నెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలోనూ ఆబ్జెక్టివ్ అండ్ మల్టిపుల్ ఛాయిల్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 1లో 50 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 100 మార్కులు. పేపర్ 2 లో 100 ప్రశ్నలు. వీటికి 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 3గంటలు ఉంటుంది.
ఏపీ, తెలంగాణలో పరీక్ష కేంద్రాలు:
అమరావతి, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. హైదరాబాద్, సికింద్రాబాద్, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.