గ్రూప్ 1.. గ్రూప్ 2 పోస్టుల రిక్రూట్మెంట్ లో ఈసారి ఇంటర్వ్యూలు ఎత్తి వేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు సంబంధించిన సాధ్యసాధ్యాలపై ఇప్పటికే టీఎస్పీఎస్సీ ఆఫీసర్లతో చర్చించింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం గ్రూప్ 1 నియామకాల్లో ఇంటర్వ్యూలను ఎత్తేసింది. నియామకాలు ఆలస్యం కాకుండా, ఆరోపణలకు తావు లేకుండా ఉంటుందని ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అదే పద్ధతిని ఇక్కడ అనుసరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతమున్న గ్రూప్ 1 నియామక పద్ధతి ప్రకారం ఆబ్జక్టివ్ పద్ధతిలో ప్రిలిమ్స్, అందులో క్వాలిఫై అయిన వారికి.. డిస్క్రిప్టివ్ పద్ధతిలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ స్కోర్ మెరిట్ ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించి.. తుది సెలెక్షన్ చేపడుతారు. డిస్క్రిప్టివ్ పేపర్లకు 900 మార్కులుంటే.. ఇంటర్వ్యూకు 100 మార్కులు కేటాయించారు. గ్రూప్ 2 రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో ఇంటర్వ్యూకు 75 మార్కులు కేటాయించారు. ఇంటర్వ్యూలు నిర్వహించే ప్రక్రియ సుదీర్ఘంగా జరుగనుండటంతో ఈ పోస్టుల భర్తీ నెలల తరబడి ఆలస్యమవుతుంది. ఇంటర్వ్యూలు ఎంత పారదర్శకంగా నిర్వహించినా.. అవకతవకలు జరిగాయనే ఆరోపణలూ వచ్చే అవకాశమూ ఉంటుంది. అందుకే మంత్రులతో పాటు టీఎస్పీఎస్సీ ఆఫీసర్లు ఇంటర్వ్యూలను ఎత్తేసే విషయంపై ఇప్పటికే చర్చించారు. ఒకవేళ ఇంటర్వ్యూలను తీసేస్తే అంతమేరకు వంద మార్కులను మెయిన్స్‌లో పెంచటం… లేదా 900 మార్కులకు స్కోర్‌ను కుదించే ఆలోచన ఉందని అంటున్నారు.
రాష్ట్రంలో 80,039 పోస్టులను భర్తీ చేస్తామని గత నెలలోనే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. గ్రూప్1 పోస్టులు 503, గ్రూప్ 2లో 582 పోస్టులను భర్తీ చేయనున్నట్టు చెప్పారు. ఆ వెంటనే గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో భాగంగా టీఎస్పీఎస్సీ పోస్టులకు సంబంధించిన, రోస్టర్, రిజర్వేషన్ల వివరాలను రెడీ చేసింది. తుది కసర్తతు పూర్తి కాగానే ఎప్పుడంటే అప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. ఇంటర్వ్యూలను తీసేసే ఆలోచన ఉన్నందుకే నోటిఫికేషన్ ఆలస్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రతిపాదన సీఎంవోకు చేరింది. దీంతో ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయం మేరకు ఇంటర్వ్యూలపై క్లారిటీ రానుంది.