Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​ : జూన్​ 2023

కరెంట్​ అఫైర్స్​ : జూన్​ 2023

తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు టీఎస్​పీఎస్​సీ (TSPSC), టీఎస్​ఎల్​పీఆర్​బీ (TSLPRB) నిర్వహిస్తున్న పోటీ పరీక్షలకు, గురుకుల్​ (TREI RB) పోస్టులకు నిర్వహిస్తున్న అన్ని పరీక్షలకు యూపీఎస్సీ (UPSC) పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్​. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ముఖ్యాంశాలు, తెలంగాణ విశేషాలు, సైన్స్​ అండ్​ టెక్నాలజీ, స్పోర్ట్స్, వార్తల్లో వ్యక్తులు.

Advertisement

అంతర్జాతీయం

తుర్కియే అధ్యక్షుడిగా ఎర్డోగాన్‌
తుర్కియే ఎన్నికల్లో అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగాన్‌ మరోసారి విజయం సాధించారు. రెండు దశాబ్దాలుగా ఎర్డోగాన్‌ తుర్కియే పాలకుడిగా కొనసాగుతున్నారు. ప్రధానిగా, అధ్యక్షుడిగా ఆయన పని చేశారు. మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వస్తే మూడో దశాబ్దంలోకి ప్రవేశిస్తారు.

ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో ఐదో స్థానం
ప్రపంచంలో 5వ అతిపెద్ద స్టాక్‌ మార్కెట్‌గా భారత్‌ మళ్లీ అవతరించింది.  ప్రస్తుతం భారత స్టాక్‌ మార్కెట్‌ విలువ 3.4 లక్షల కోట్ల డాలర్లు (రూ.283.92 లక్షల కోట్లుగా ఉంది).  స్టాక్‌ మార్కెట్‌ విలువలో తొలి టాప్ ఐదు దేశాల్లో అమెరికా, చైనా, జపాన్, హాంకాంగ్, ఇండియా నిలిచాయి.

అమెరికా స్పెల్లింగ్‌ బీ విజేతగా దేవ్‌షా
అమెరికాలో నిర్వహించిన 95వ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల దేవ్‌షా చాంపియన్గా నిలిచాడు. అతడు శామాఫైల్‌ అనే పదానికి స్పెల్లింగ్‌ చెప్పి 50 వేల డాలర్ల ప్రైజ్‌ మనీని గెలుచుకొన్నాడు. శామాఫైల్‌ అంటే ఇసుక నేలల్లో కనిపించే కనిపించే జీవి లేదా మొక్క అని అర్థం.

Advertisement

స్వలింగ వివాహం చట్టబద్ధమే
యూరప్‌లోని ఎస్టోనియా దేశం కీలక నిర్ణయం తీసుకుంది. స్వలింగ వివాహానికి అనుమతినిచ్చేలా చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లును చట్టసభ ఆమోదించింది. జనవరి 1 నుంచి ఎస్టోనియాలో స్వలింగ వివాహం అమల్లోకి రానుంది.

న్యూయార్క్‌లో దీపావళికి సెలవు
న్యూయార్క్‌ నగరంలో పాఠశాలలకు ఈ ఏడాది నుంచి దీపావళి రోజున సెలవు ఇవ్వనున్నారు. రెండు దశాబ్దాలుగా దక్షిణాసియా, ఇండో-–కరీబియన్‌ ప్రజలు దీని కోసం పోరాడుతున్నారు. అసెంబ్లీ, సెనెట్‌ట్లో పాసైన ప్రస్తుత బిల్లును గవర్నర్‌ ఆమోదించాల్సి ఉంది.

వీసాదారులకు కెనడా గుడ్‌న్యూస్‌
అమెరికాలో పనిచేస్తున్న హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 10వేల మంది హెచ్‌-1బీ వీసాదారులు తమ దేశానికి వచ్చి ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా ఓపెన్‌ వర్క్‌-పర్మిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌ మంత్రి సీన్‌ ఫ్రేజర్‌ వెల్లడించారు.

Advertisement

జాతీయం

ఐఐఎఫ్‌ఏ పురస్కారాలు
ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడెమీ (ఐఐఎఫ్‌ఏ) పురస్కారాల్లో ‘గంగూభాయి కథియావాడీ’ అత్యధిక విభాగాల్లో అవార్డులు గెల్చుకుంది. హృతిక్‌ రోషన్, అలియా భట్‌లు ఉత్తమ నటీనటులుగా ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రం – దృశ్యం 2,  ఉత్తమ దర్శకుడిగా -ఆర్‌.మాధవన్‌కు (రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌) అవార్డులు దక్కాయి.

పార్లమెంట్‌ రూపశిల్పి బిమల్‌ పటేల్‌
ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించే పార్లమెంట్‌ నూతన భవనాన్ని ప్రముఖ ఆర్కిటెక్ట్‌ బిమల్‌ హస్ముఖ్‌ పటేల్‌ రూపకల్పన చేశారు. పార్లమెంట్‌ కొత్త భవన రూపాన్ని డిజైన్‌ చేసిన గుజరాత్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైన్స్‌ సంస్థ యజమానే బిమల్‌ పటేల్‌. ప్రధాని మోడీ ఈ భవనాన్ని ప్రారంభించారు.

 ‘అహిల్యాదేవి హోల్కర్‌’ గా అహ్మద్‌నగర్‌  
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా పేరును ఇకపై అహిల్యాదేవి హోల్కర్‌ జిల్లాగా మార్చినట్లు సీఎం ఏక్‌నాథ్‌ శిందే ప్రకటించారు. 18వ శతాబ్దానికి చెందిన ఇందౌర్‌ రాజ్య దిగ్గజ పాలకురాలే అహిల్యాదేవి (అహిల్యాబాయి). శిందే సర్కారు ఇదివరకే ఔరంగాబాద్‌ పేరును ఛత్రపతి సంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్‌ పేరును ధారాశివ్‌గా మార్చింది.

Advertisement

ఈశాన్య భారతంలో వందే భారత్‌
ఈశాన్య భారతంలో తొలి వందే భారత్‌ రైలు అస్సాంలోని గువాహటి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పాయ్‌గురిల మధ్య ప్రధాని మోడీ ప్రారంభించారు. గువాహటి రైల్వేస్టేషన్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్టవ్, అస్సాం గవర్నర్‌ గులాబ్‌ చంద్‌ కటారియా, సీఎం హిమంత బిశ్వశర్మ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

రూ.75 నాణెం విడుదల
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవమైన మే 28న కేంద్ర ప్రభుత్వం రూ.75 నాణేన్ని విడుదల చేయనుంది. నాణేనికి ఒక వైపు అశోకుడి స్థూపం నాలుగు సింహాలతో పాటు దేవనాగరి లిపిలో భారత్, ఆంగ్లభాషలో ఇండియా అన్న అక్షరాలు ఉంటాయి. రెండో వైపు పార్లమెంట్ కొత్త భవనాన్ని ముద్రించారు.

అంతర్జాతీయ ‘గ్రీన్‌ యాపిల్‌’ పురస్కారాలు
లండన్‌కు చెందిన అంతర్జాతీయ సంస్థ గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ తెలంగాణలోని అయిదు నిర్మాణాలను ‘గ్రీన్‌ యాపిల్‌’ పురస్కారాలకు ఎంపిక చేసింది. ధార్మిక విభాగాల కేటగిరీలో యాదాద్రి, అందమైన ఆఫీస్ బిల్డింగ్ విభాగంలో సెక్రటేరియట్, ప్రత్యేక కార్యాలయ అంశంలో పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్, వారసత్వ విభాగంలో మొజంజాహి మార్కెట్, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిని వంతెనల విభాగంలో ఎంపిక చేసింది.

Advertisement

పంజాబ్‌లో వర్సిటీలకు ఛాన్సలర్​గా సీఎం
పంజాబ్‌ శాసనసభ రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్స్లర్గా గవర్నర్ల స్థానంలో సీఎం ఉంటారనే బిల్లు సభామోదం పొందింది. డీజీపీ ఎంపికలో యూపీఎస్సీ పాత్రను తప్పించేలా మరో బిల్లు పంజాబ్‌ అసెంబ్లీ ఆమోదించింది.

‘గుర్బానీ’ బిల్లుకు ఆమోదం
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్లో పఠించే గుర్బానీ ప్రసార హక్కులు ఇక నుంచి ఉచితంగా అందరికీ అందుబాటులో తెచ్చేందుకు పంజాబ్‌ ప్రభుత్వం సిక్కు గురు ద్వారా చట్టం 1925కు సవరణ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.

గీతాప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌కు చెందిన గీతాప్రెస్‌కు కేంద్ర ప్రభుత్వం 2021 గాంధీ శాంతి బహుమతిని ప్రకటించింది. ఆ సంస్థకు అవార్డు కింద రూ. కోటి నగదు, అభినందన పత్రం, జ్ఞాపిక అందించనుంది.1995లో కేంద్ర ప్రభుత్వం గాంధీ శాంతి బహుమతిని ఏర్పాటు చేసింది.

Advertisement

 ‘జీ 20’ డెవలప్‌మెంట్‌ సమ్మిట్
నాణ్యమైన డేటా ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని, ఈ విషయంలో సాంకేతిక ప్రజాస్వామీకరణ ముఖ్య సాధనమని ప్రధాని మోడీ జూన్ 12న వారణాసిలో జరిగిన జీ20 దేశాల డెవలప్‌మెంట్‌ మంత్రుల సదస్సులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు.

స్పార్క్‌ ర్యాంకుల్లో మెప్మా టాప్
జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్‌ (ఎన్‌యూఎల్‌ఎమ్‌) ప్రకటించిన సిస్టమాటిక్‌ ప్రొగ్రెసివ్‌ అండ్‌ రియల్‌ టైం ర్యాంకింగ్‌ (స్పార్క్‌)లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) జాతీయ స్థాయిలో అగ్ర స్థానంలో నిలిచింది. కేరళలో నిర్వహించిన కార్యక్రమంలో మెప్మా మిషన్‌ డైరెక్టర్‌ విజయలక్ష్మి అందుకున్నారు.

పశుగణం ఎగుమతుల ముసాయిదా బిల్లు  
జంతువుల ఎగుమతులను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా జూన్‌ 7న వెలువరించిన ‘పశుగణం, పశుగణ ఉత్పత్తుల (దిగుమతి, ఎగుమతి) ముసాయిదా బిల్లు’ను కేంద్రం ఉపసంహరించుకుంది. జంతు హక్కుల ఉద్యమ సంస్థలు ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

మతమార్పిడి నిషేధ చట్టం రద్దు
మతమార్పిడి నిషేధ చట్టాన్ని రద్దు చేస్తామని కర్ణాటక కొత్త ప్రభుత్వం తీర్మానించింది. ఈ చట్టంతో పాటు పాఠ్య పుస్తకాల నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు సావర్కర్, హెడ్గేవార్‌ జీవిత చరిత్ర అంశాలను తొలగించాలని ప్రభుత్వం తీర్మానించింది.

సరిహద్దు గ్రామాలకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు
దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల పేర్లను రాష్ట్రంలోని 75 సరిహద్దు గ్రామాలకు పెట్టాలని త్రిపుర ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది

ప్రాంతీయం

ఎఫ్‌డీఐల్లో ఏడో స్థానం
గత ఆర్థిక సంవత్సరంలో విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ 7, ఆంధ్రప్రదేశ్‌ 11వ స్థానాల్లో నిలిచాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.10,319 కోట్లు వచ్చాయి.

Advertisement

నిర్మల్‌లో నాట్య శివుని ప్రతిమ గుర్తింపు
నిర్మల్‌ జిల్లాలోని కదిలె పాపహరేశ్వర శివాలయంలో11వ శతాబ్దానికి చెందిన నాట్య శివుని విగ్రహాన్ని గుర్తించినట్లు చరిత్రకారుడు తుమ్మల దేవరావ్‌ తెలిపారు.

‘ముడుమాల్‌’ యునెస్కో గుర్తింపు
నారాయణపేట జిల్లా ముడుమాల్‌లోని పురాతన, చారిత్రక గుర్తింపు ఉన్న మెన్హిర్స్‌కు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల గుర్తింపు సాధించే దిశగా ముందడుగు పడింది. ఈ మేరకు తెలంగాణ పురావస్తు శాఖ, దక్కన్‌ హెరిటేజ్‌ అకాడమీ ట్రస్టుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

‘రెరా’ చైర్మన్‌గా సత్యనారాయణ
రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్మన్, ఇద్దరు సభ్యులతో పూర్తిస్థాయి అథారిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్‌గా ఉన్న ఎన్‌. సత్యనారాయణను రెరా చైర్మన్‌గా నియమించింది.

Advertisement

కొత్త మండలంగా ‘బండలింగాపూర్‌’
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం నుంచి 10 గ్రామాలను వేరు చేసి బండలింగాపూర్‌ కేంద్రంగా కొత్త మండలాన్ని ప్రతిపాదిస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

సింగరేణి థర్మల్‌ ప్లాంట్‌కు పురస్కారం
పర్యావరణహితంగా విద్యుదుత్పత్తి, గనుల తవ్వకం చేపడుతున్నందుకు సింగరేణి సంస్థకు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. పీసీబీ హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌లు ఈ అవార్డును థర్మల్‌ ప్లాంటు ప్రధాన అధికారి విశ్వనాథ రాజుకు ప్రదానం చేశారు.

వార్తల్లో వ్యక్తులు

వెర్‌స్టాపెన్‌
ఫార్ములావన్‌ ప్రపంచ చాంపియన్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ మొనాకో గ్రాండ్‌ ప్రి రేసులో చాంపియన్గా నిలిచాడు. ఫెర్నాండో అలోన్సో (ఆస్టన్‌ మార్టిన్‌), ఎస్తెబాన్‌ ఒకాన్‌ (ఆల్పిన్‌ రెనాల్ట్‌) తర్వాతి రెండు స్థానాలు దక్కించుకున్నారు.

రాజాబాబు
రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన హైదరాబాద్‌లోని క్షిపణులు, ప్యూహాత్మక వ్యవస్థల (ఎంఎస్‌ఎస్‌) డైరెక్టర్‌ జనరల్‌గా ఉమ్మలనేని రాజాబాబు నియమితులయ్యారు. రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ) డైరెక్టర్‌గా ఉన్న ఆయన పదోన్నతిపై డీజీ అయ్యారు.

ప్రవీణ్‌ కుమార్‌ శ్రీవాస్తవ
సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ (సీవీసీ)గా ప్రవీణ్‌ కుమార్‌ శ్రీవాస్తవ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రస్తుత విజిలెన్స్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌ శ్రీవాస్తవను సీవీసీగా నియమించారని రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఆర్‌ దినేశ్‌
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను (2023–24) భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ కొత్త ప్రెసిడెంట్‌గా టీవీఎస్‌ సప్లై చెయిన్‌ సొల్యూషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ ఆర్‌ దినేశ్‌ బాధ్యతలు స్వీకరించారు. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ సీఎండీ సంజీవ్‌ బజాజ్‌ స్థానంలో ఆయన ఎన్నికయ్యారు.

చమన్‌లాల్‌
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హమ్‌ నగర లార్డ్‌ మేయర్‌గా బ్రిటిష్‌–ఇండియన్‌ కౌన్సిలర్‌ చమన్‌లాల్‌ ఎన్నికయ్యారు. దీంతో బర్మింగ్‌హమ్‌ తొలి బ్రిటిష్‌–ఇండియన్‌ మేయర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. సిక్కు మతంలోని రవిదాసియా వర్గానికి చెందిన చమన్‌ లాల్‌ భారత్‌లోని పంజాబ్‌ రాష్ట్రం హోషియార్‌పూర్‌ జిల్లాలోని పఖోవాల్‌ గ్రామంలో జన్మించారు.

ఎన్‌.గోపి
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్‌ విశిష్ట సాహితీ పురస్కారానికి ప్రొఫెసర్ ఎన్‌.గోపి ఎంపికయ్యారు. సాహిత్యంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన సాహితీమూర్తులకు ఇకపై ఏటా ఈ పురస్కారం అందజేస్తామని భారత జాగృతి తెలిపింది. గోపి ఇప్పటివరకు 56 పుస్తకాలు రచించారు.

అమిత్‌ అగర్వాల్‌
ఆధార్‌ కార్డులు జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ – ఉడాయ్‌) సీఈవోగా ఐఏఎస్‌ అధికారి అమిత్‌ అగర్వాల్‌ బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఆయన ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వశాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు.

రవి సిన్హా
భారత గూఢచర్య విభాగమైన రీసెర్చ్‌ అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌ (రా)కు నూతన అధిపతిగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రవిసిన్హా నియమితులయ్యారు. 1988 బ్యాచ్‌ (ఛత్తీస్‌గఢ్‌) ఐపీఎస్‌ అధికారైన 59 ఏళ్ల సిన్హా నియామకాన్ని మంత్రి మండలి నియామకాల కమిటీ ఆమోదించింది.

స్వామినాథన్‌ జానకీరామన్‌
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నరుగా స్వామినాథన్‌ జానకీరామన్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు మైఖేల్‌ దేవవత్ర పాత్ర, ఎం.రాజేశ్వరరావు, టి.రవి శంకర్‌ ఉండగా, నాలుగో డిప్యూటీ గవర్నరుగా స్వామినాథన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

శరవణన్‌
ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌) చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా యు.శరవణన్‌ నియమితులయ్యారు. జూన్‌ 16 నుంచి ఆయన నియామకం అమల్లోకి వచ్చినట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది.

బేతవోలు రామబ్రహ్మం
కవి, పండితుడు, విమర్శకుడిగా పేరొందిన ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్మంకు ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్‌ పురస్కారం దక్కింది. కథలు, కవిత్వం, నాటకాలు కలిపి 34కు పైగా గ్రంథాలు రచించారు. సాహితీ వ్యాసాలు వెలువరించారు.

డాక్టర్‌ కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల
కోవిడ్‌-19 మహమ్మారి నుంచి మానవాళికి రక్షణగా నిలిచిన కొవాగ్జిన్‌ టీకా ఆవిష్కర్తలైన భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్ల దంపతులను జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించనున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రకటించింది.

జులన్‌ గోస్వామి
ప్రతిష్టాత్మక ఎంసీసీ ప్రపంచ క్రికెట్‌ కమిటీ (డబ్ల్యూసీసీ)లో భారత మహిళా క్రికెటర్‌ జులన్‌ గోస్వామికి చోటు దక్కింది. జులన్‌తో పాటు ఇంగ్లాండ్‌ మహిళల కెప్టెన్‌ హెదర్‌ నైట్, 2019 వన్డే ప్రపంచకప్‌ చాంపియన్‌ జట్టు సారథి ఇయాన్‌ మోర్గాన్‌లకు ఎంసీసీ డబ్ల్యూసీసీలో స్థానం లభించింది.

ఆర్తి హోల్లా
భారత సంతతికి చెందిన బ్రిటన్‌ మహిళ శాటిలైట్ పరిశ్రమలో అత్యంత నిష్ణాతులైన ఆర్తి హోల్లా-మైనీని వియన్నాలోని ఐక్యరాజ్యసమితి (అంతరిక్ష వ్యవహారాల కార్యాలయం) ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ డైరెక్టర్‌గా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ- జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఎంపిక చేశారు.

భవాని దేవి
ఫెన్సర్‌ భవాని దేవి ఆసియా ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన మొదటి భారత ఫెన్సర్‌గా భవాని నిలిచింది. చైనాలో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళల సాబెర్‌ విభాగంలో ఆమె కాంస్యం గెలిచింది. సెమీస్‌లో భవాని 14-–15 తేడాతో జేనబ్‌ దాయిబెకోవా (ఉజ్బెకిస్థాన్‌) చేతిలో పోరాడి ఓడింది.

స్పోర్ట్స్

చాంపియన్‌గా చెన్నై సూపర్‌కింగ్స్‌
ఐపీఎల్‌–2023లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో చెన్నై 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించింది. శుబ్మన్ గిల్ అత్యధికంగా 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాంప్, షమీ 28 వికెట్లతో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నారు.

బీడబ్ల్యూఎఫ్‌ టైటిల్‌
మలేసియా మాస్టర్స్‌ సూపర్‌-500 టోర్నీ విజేతగా భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ నిలిచాడు. 30 ఏళ్ల ప్రణయ్‌కు ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్‌ టైటిల్‌.మలేషియా మాస్టర్స్‌ ఉమెన్స్ సింగిల్స్‌లో 2013, 2016 సీజన్లలో పీవీ సింధు, 2017లో సైనా నెహ్వాల్ టైటిల్స్ గెలిచారు.

ఇండోనేసియా ఓపెన్‌ టైటిల్‌
భారత స్టార్‌ డబుల్స్‌ క్రీడాకారులు సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి ఇండోనేసియా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 1000 టోర్నీలో విజేతగా నిలిచారు. బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ 1000 టైటిల్‌ సాధించిన తొలి భారత జోడీగా రికార్డు నెలకొల్పింది. ఈ జోడీకి ఇదే మొదటి సూపర్‌ 1000 టైటిల్‌.

ఈజిప్ట్‌దే స్క్వాష్‌ ప్రపంచకప్‌
భారత్‌ వేదికగా నిర్వహించిన ఎస్‌డీఏటీ డబ్ల్యూఎస్‌ఎఫ్‌ స్క్వాష్‌ ప్రపంచకప్‌ను ఈజిప్ట్‌ కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆ జట్టు 2-–1తో మలేసియాను ఓడించింది. సెమీఫైనల్లో ఓడిన భారత జట్టు జపాన్‌తో కలిసి ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచింది.

ఆర్చరీ ప్రపంచకప్‌
ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3 టోర్నమెంట్లో అభిషేక్‌ వర్మ పురుషుల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్లో ఈ భారత స్టార్‌ 148-–146తో జేమ్స్‌ లూట్జ్‌ (అమెరికా)పై నెగ్గాడు. ప్రపంచకప్‌లో అభిషేక్‌కు ఇది మూడో వ్యక్తిగత స్వర్ణం.

ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌
ఇంటర్‌ కాంటినెంటల్‌ ఫుట్‌బాల్‌ కప్‌ను భారత్‌ సొంతం చేసుకుంది. ఫైనల్లో 2-–0 గోల్స్‌తో లెబనాన్‌ను ఓడించింది. కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి ఓ మెరుపు గోల్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

స్పీడ్‌ చెస్‌ టైటిల్‌
భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ గుకేశ్‌ జూనియర్‌ స్పీడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. తుది పోరులో తొలి మూడు గేమ్‌లలో ఒక డ్రాతో పాటు రెండింట్లో ఓడిన 17 ఏళ్ల గుకేశ్‌ బలంగా పుంజుకుని టైటిల్‌ కైవసం చేసుకున్నాడు.

సైన్స్​ అండ్ టెక్నాలజీ

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 సక్సెస్
ఇస్రో రెండో తరం నావిక్‌ ఉపగ్రహ శ్రేణిలో మొదటిది అయిన ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.  వైమానిక సేవలు, నావిగేషన్, వ్యవసాయం, అత్యవసర సేవలు మొదలైన రంగాలకు ఈ ఉపగ్రహం నిర్దిష్టమైన సమాచారం అందించనుంది.

ఇరాన్‌ హైపర్ సోనిక్ మిస్సైల్
ధ్వనితో పోలిస్తే ఏకంగా 15 రెట్లు వేగంగా దూసుకెళ్లే హైపర్‌సోనిక్‌ క్షిపణిని ఇరాన్ రూపొందించింది. ఈ క్షిపణికి ‘ఫత్తా’ అని పేరు పెట్టారు.  ఇది 1,400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.

కృత్రిమ వర్షం సక్సెస్
ఐఐటీ కాన్పూర్‌కు చెందిన పరిశోధకులు క్లౌడ్‌ సీడింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి ప్రయోగాత్మకంగా కృత్రిమ వర్షాన్ని కురిపించారు. ఏవియేషన్‌ అధికారుల అనుమతితో టెస్టింగ్‌ విమానం గాల్లోకి ఎగిరింది. 5 వేల అడుగులకు చేరుకున్న తర్వాత క్లౌడ్‌ సీడింగ్‌ టెక్నాలజీ ద్వారా వాతావరణంలో మార్పులు వచ్చేలా రసాయనాలను చల్లారు. కొద్దిసేపటికి ఆ ప్రాంతంలో కృత్రిమ వర్షం కురిసింది.

కరెంట్​ అఫైర్స్​ ఏప్రిల్​ 2023
కరెంట్​ అఫైర్స్​ మార్చి 2023
కరెంట్​ అఫైర్స్​ ఫిబ్రవరి 2023

కరెంట్​ అఫైర్స్​ జనవరి 2023

కరెంట్​ అఫైర్స్​ 2022 (క్లిక్​ చేసి.. ఈ బుక్​ ఉచితంగా డౌన్​లోడ్​ చేసుకొండి)​

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!