Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​: జనవరి​​​ 2023

కరెంట్​ అఫైర్స్​: జనవరి​​​ 2023

అంతర్జాతీయం

వైమానిక విన్యాసాలు
భారత్‌, జపాన్ సంయుక్త వైమానిక విన్యాసాలు జనవరి 12 నుంచి 26 వరకు జపాన్‌లోని హైకురి ఎయిర్‌బేస్‌లో జరుగుతున్నాయి. ‘వీర్‌ గార్డియన్‌-2023’ పేరుతో రెండు దేశాల వైమానిక సేనలు ఈ సంయుక్త విన్యాసాలు చేయనున్నాయి.2022 ఫిబ్రవరి–-మార్చిలో భారత్‌, జపాన్‌ తొలిసారిగా ‘ధర్మ గార్డియన్‌-2022’ పేరిట సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి.

Advertisement

పాకిస్తాన్‌లో ఆహార సంక్షోభం
పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభంతో పాటు ఆహార సంక్షోభం మొదలయ్యింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రధానంగా గోధుమ పిండి కొరత వేధిస్తోంది. రాయితీపై ప్రభుత్వం అందించే గోధుమ పిండి కోసం జనం ఎగబడుతున్నారు.

ఆస్కార్ రేసులో కాంతారా
ప్రపంచంలోని సినిమా అవార్డుల్లో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ రేసులో పాన్ ఇండియా చిత్రాలుగా స‌త్తా చాటిన ఆర్ఆర్ఆర్‌, కాంతారా సినిమాలు బ‌రిలో నిలిచాయి.  చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్‌లో సంచ‌ల‌నం సృష్టించిన కన్నడ చిత్రం ‘కాంతార’ ఆస్కార్ పోటీల జాబితాలో ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ నటుడి(రిష‌బ్‌శెట్టి)గా అర్హత సాధించింది.

25 దేశాల్లో ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ
కరోనా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ.1.5 కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వేరియంట్ ఇప్పటికే 25 దేశాలకుపైగా విస్తరించిందని పేర్కొంది. అత్యంత ప్రమాదకరమైన ఈ వేరియంట్ శరవేగంగా విస్తరిస్తోంది. భారత్‌లో మాత్రం కరోనా వేరియంట్ల ప్రభావం కన్పించండం లేదు.

Advertisement

ప్రపంచంలో మొదటి రోబో లాయర్‌
ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో లాయర్ త్వరలో కోర్టు కేసును వాదించబోతోంది. ఈ రోబో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ లీగల్ అసిస్టెంట్‌గా మారింది. ఈ AI రోబోట్‌ను డునాట్‌పే అనే కంపెనీ తయారు చేసిన ఈ రోబో వచ్చే ఫిబ్రవరిలో ఒకే కేసులో తన కక్షిదారుకు సహకరించనుంది.

జనాభాలో భారత్‌ నంబర్వన్
ప్రపంచ జనాభాలో చైనాను భారత్‌ ఇప్పటికే అధిగమించి తొలి స్థానానికి చేరుకున్నట్లు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. తాజాగా ‘వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ’ ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించినట్లు పేర్కొంది. చైనాలో జననాల రేటు తగ్గినట్లు ఇటీవలి కొన్ని నివేదికలు వెల్లడించాయి.

నేపాల్‌లో విమాన ప్రమాదం
నేపాల్‌లో జ‌రిగిన ఘోర విమాన ప్రమాదంలో 72 మంది దుర్మరణం చెందారు. ఖాఠ్మాండు నుంచి టూరిస్టు కేంద్రమైన పొఖారా బయల్దేరిన యతి ఎయిర్‌లైన్స్‌ విమానం ల్యాండవడానికి కొద్దిసేపటి ముందు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దారుణంలో అందరూ మరణించినట్లు భావిస్తున్నారు.

Advertisement

న్యూజిలాండ్‌ ప్రధాని రాజీనామా
పది నెలల పదవీకాలం ఉండగానే న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ రాజీనామా చేశారు. ప్రధానమంత్రిగా ఫిబ్రవరి 7 తన ఆఖరి రోజని లేబర్‌ పార్టీ సభ్యుల సమావేశంలో ప్రకటించి ప్రపంచ దేశాలను షాక్‌కి గురి చేశారు.

లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అరుణా మిల్లర్‌
అమెరికాలోని భారత సంతతి మహిళ అరుణా మిల్లర్‌ మేరీలాండ్‌ రాష్ట్రానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (10వ)గా ఎన్నికైన తొలి భారత-–అమెరికా మహిళా రాజకీయవేత్తగా రికార్డుకెక్కారు. డెమోక్రాట్‌ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. పలువురు రిపబ్లికన్లూ అమెకు మద్దతు తెలపడం విశేషం.

బ్రెజిల్ అధ్యక్షుడిగా లూలా డా సిల్వా
బ్రెజిల్‌ దేశ 39వ‌ అధ్యక్షుడిగా లులా డా సిల్వా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జైర్‌ బోల్సోనారోపై లులా డ సిల్లా మెజార్టీ సాధించారు. గతంలో ఆయ‌న 2003 నుంచి 2006 వరకు, 2007 నుంచి 2011 వరకు రెండు పర్యాయాలు బ్రెజిల్ అధ్యక్షుడిగా పనిచేశారు.

Advertisement

భద్రతా మండలికి కొత్త దేశాలు
భద్రతా మండలి అయిదు కొత్త సభ్య దేశాలకు స్వాగతం పలికింది. జపాన్, స్విట్జర్లాండ్, మొజాంబిక్, ఈక్వెడార్, మాల్టా దేశాలు మండలిలో రెండేళ్ల పాటు సభ్యులుగా ఉంటాయి. భారత్, ఐర్లాండ్, కెన్యా, మెక్సికో, నార్వే దేశాల రెండేళ్ల సభ్యత్వ కాలం డిసెంబరు 31తో ముగిసింది.

ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డ్‌
ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు దంపతులను కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డ్‌కు ఎంపిక చేసింది. ప్రవాసీయులకు ఇచ్చే ఈ అత్యున్నత అవార్డుకు ఈ ఏడాది 21 మందిని ఎంపిక చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో జరిగే ప్రవాసీ భారతీయ దివస్‌ కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.

అంతరిక్షంలో సినిమా షూటింగ్
రష్యా దర్శకుడు క్లిమ్‌ షిపెంకో రూపొందిస్తున్న సినిమా ‘ద చాలెంజ్‌’లో ఒక సీక్వెన్స్‌ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో తీశారు. అందులో నటించిన యూలియా పెరెస్లిడ్‌తో కలిసి12 రోజుల పాటు ఐఎస్‌ఎస్‌లో గడిపారు. దీంతో అంతరిక్షంలో షూటింగ్‌ జరుపుకున్న తొలి సినిమాగా ద చాలెంజ్‌ రికార్డు సృష్టించింది

Advertisement

సిరియాపై ఇజ్రాయెల్‌ దాడులు
ఇజ్రాయెల్‌ ప్రభుత్వం మరోమారు సిరియాపై దాడికి పాల్పడింది. సిరియా రాజధాని డమాస్కస్‌లోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌పై క్షిపణి దాడులకు దిగింది. బషర్‌ అల్‌ అసద్‌కు మద్దతు పలుకుతున్న స్థానిక ఉగ్రవాదులకు ఇరాన్, లెబనాన్‌ హిజ్‌బుల్లాల నుంచి ఆయుధాల సరఫరా అడ్డుకునేందుకే ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

జాతీయం

‘నాటు నాటు’కు గోల్డెన్ గ్లోబ్
చిత్ర ప‌రిశ్రమ‌ల‌కు సంబంధించిన గోల్డెన్ గ్లోబ్స్ హాలీవుడ్ అవార్డ్స్ వేడుక కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో ‘నాటు నాటు’ పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ పాట చంద్రబోస్ రాయగా, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు.

‘శతఘ్ని’లోకి మహిళా అధికారులు
దేశంలో అతిపెద్ద సాయుధ దళం ‘ఆర్మీ’పోరాట విభాగంలోనూ మహిళలను చేర్చుకోవాలని నిర్ణయించింది. ముందుగా ఆర్టిలరీ (శతఘ్ని)దళాల్లో మహిళా అధికారులను చేర్చుకునేందుకు ఉద్దేశించి ప్రతిపాదనలను కేంద్రానికి పంపించినట్లు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే చెప్పారు.

Advertisement

 భారత్‌ వృద్ధి రేటు 6.6
భారత్‌ 2023–24 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్‌ కుదించింది. 6.9 శాతంగా ఉన్న క్రితం అంచనాలను 6.6 శాతానికి కుదిస్తున్నట్లు తన తాజా ఎకనమిక్‌ అప్‌డేట్‌లో తెలిపింది. భారత్‌ 2021–22లో 8.7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకోగా, ప్రస్తుత 2022–23లో ఈ రేటు 6.9 శాతంగా ఉంటుందని ఇప్పటికే ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది.

పర్యాటక నౌక ‘ఎంవీ గంగా విలాస్‌’
ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన ప్రయాణం సాగించే నదీ పర్యాటక నౌక ‘ఎంవీ గంగా విలాస్‌’ను ప్రధాని మోడీ ప్రారంభించారు. వారణాసి నుంచి నౌక ప్రయాణం ఆరంభమైంది. ఇది పాట్నా, సాహిబ్‌గంజ్, కోల్‌కతా, ఢాకా, గౌహతి గుండా ప్రయాణిస్తుంది. ఈ నౌకలో 36 మంది ప్రయాణించవచ్చు.

సేతుసముద్ర ప్రాజెక్ట్‌కు ఆమోదం
సేతుసముద్ర ప్రాజెక్టుపై తమిళనాడు శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. రాజకీయ కారణాలతో భాజపా ఈ ప్రాజెక్టుకు అడ్డుపడిందని, దీంతో రాష్ట్ర ప్రగతి కుంటుపడుతోందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పేర్కొన్నారు. దీని అమలుకు కేంద్రం ముందుకు రావాలని, రాష్ట్రం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు.

Advertisement

నలందలో బౌద్ధ స్తూపాలు
బిహార్‌లోని నలంద జిల్లాలో 1,200 ఏళ్ల నాటి రెండు సూక్ష్మ రాతి బౌద్ధ స్తూపాలను కనుగొన్నారు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నలందలోని మహావిహారం సమీపంలో చేపట్టిన తవ్వకాల్లో ఇవి బయటపడ్డాయని పురావస్తు శాఖ పట్నా సర్కిల్‌ అధికారిణి గౌతమి భట్టాచార్య చెప్పారు.

సికింద్రాబాద్‌-–వైజాగ్ మధ్య ‘వందే భారత్‌’
సికింద్రాబాద్‌– విశాఖపట్నం మధ్య నడిచే దేశంలో ఎనిమిదో వందేభారత్‌ రైలును ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఢిల్లీ నుంచి ఆయన జెండా ఊపగా, సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి  ప్రత్యక్షంగా ప్రారంభించారు.

సీజేఐకు ‘గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డు’
గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డు (ప్రపంచ నాయకత్వ అవార్డు)కు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఎంపిక అయ్యారు. న్యాయ వృత్తిలో జీవితకాల సేవలకుగాను ఆయన్ను కేంబ్రిడ్జ్‌లోని హార్వర్డ్‌ లా స్కూల్‌ సెంటర్‌ ఎంపిక చేసింది. ఈ అవార్డును జనవరి 11న ఆన్‌లైన్‌ ద్వారా అందించనున్నారు.

Advertisement

108వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌
మహారాష్ట్రలోని నాగపూర్‌లో 108వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సు జరుగుతుంది. జనవరి 3 నుంచి ఐదు రోజులు ఈ సమ్మిట్ నిర్వహించనున్నారు. క్వాంటమ్‌ టెక్నాలజీ, డేటా సైన్స్‌తోపాటు కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పరిశోధకులకు ప్రధాని మోడీ ఈ సందర్భంగా సూచించారు.

దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం
భారత్‌లో నిరుద్యోగం రోజు రోజుకీ ఎక్కువైపోతోంది. డిసెంబర్‌లో అత్యధికంగా 8.3% శాతానికి నిరుద్యోగం రేటు ఎగబాకింది. గత 16 నెలల్లో అదే అత్యధికమని సెంటర్‌ ఫర్‌ మోనటిరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) ఒక నివేదికలో తెలిపింది. నిరుద్యోగం రేటు అత్యధికంగా హర్యానాలో 37.4% ఉంది. ఆ తర్వాత స్థానాల్లో రాజస్థాన్‌ (28.5%), ఢిల్లీ (20.8%) ఉన్నాయి.

పెద్ద నోట్ల రద్దు సరైనదే
రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం ఆరేళ్ల కింద తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. నోట్ల రద్దును సవాలు చేస్తూ దాఖలైన 58 పిటిషన్లను కొట్టేసింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు 4–1తో మెజారిటీ తీర్పు వెలువరించింది.

Advertisement

ప్రాంతీయం

సీఎస్‌గా శాంతికుమారి
తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన‌ శాంతికుమారి నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సీఎస్‌గా ఆమె 2025 వరకు పదవీలో కొనసాగనున్నారు.

పర్యాటక మిత్ర పురస్కారం
కోల్‌కతాలో జరిగిన బుద్ధిస్ట్‌ టూర్‌ ఆపరేటర్ల సంఘం అంతర్జాతీయ సదస్సులో తెలంగాణకు పర్యాటక మిత్ర పురస్కారం లభించింది. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య దీన్ని స్వీకరించారు.

ఉత్తమ ఇంక్యుబేటర్గా ‘టీ హబ్’
భారత్‌లో ఆవిష్కరణలకు మూల స్తంభంలా పనిచేస్తున్న ‘టీ హబ్‌’కు ‘బెస్ట్‌ ఇంక్యుబేటర్‌ ఇండియా’అవార్డు లభించింది. జాతీయ స్టార్టప్‌ దినోత్సవం సందర్భంగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్ ఢిల్లీలో ‘నేషనల్‌ స్టార్టప్‌ అవార్డులు 2022’ను ప్రదానం చేశారు.

ప్రిన్స్‌ ముకర్రమ్‌ఝా
ఏడో నిజాం మీర్‌ఉస్మాన్‌ అలీఖాన్‌ మనవడు, చివరి నిజాం ప్రిన్స్‌ మీర్‌ అలీఖాన్‌ ముకర్రమ్‌ ఝా టర్కీలో మరణించారు. ముకర్రమ్‌ ఝాను 8వ నిజాంగా ఉస్మాన్‌ అలీఖాన్‌ ప్రకటించారు.

సీఎంకు ‘సర్‌ ఛోటూ రామ్‌’ అవార్డు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అఖిల భారత రైతు సంఘం ప్రతినిధులు ‘సర్‌ ఛోటూ రామ్‌’అవార్డును ప్రకటించారు. పంజాబ్‌ రైతుల సంక్షేమం కోసం కృషి చేసిన సర్‌ ఛోటూ రామ్‌ పేరిట ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు.

స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్‌ అవార్డులు
జాతీయస్థాయిలో తెలంగాణకు ఫోర్ స్టార్‌ రేటింగుల్లో తెలంగాణ మొదటి మూడు స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ (ఎస్‌ఎస్‌జీ) అవార్డులు సాధించింది. వీటితోపాటు 3 స్టార్, 2 స్టార్‌ రేటింగ్స్‌లోనూ తెలంగాణ పల్లెలు టాప్ ర్యాంక్‌లలో నిలిచాయి.

తెలంగాణకు పర్యాటక మిత్ర పురస్కారం
కోల్‌కతాలో జరిగిన బుద్ధిస్ట్‌ టూర్‌ ఆపరేటర్ల సంఘం అంతర్జాతీయ సదస్సులో తెలంగాణకు పర్యాటక మిత్ర పురస్కారం లభించింది. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య దీనిని స్వీకరించారు.

వార్తల్లో వ్యక్తులు

చేత‌న్ శ‌ర్మ
బీసీసీఐ ఐదుగురు సభ్యుల కొత్త సీనియర్‌ సెలక్షన్‌ కమిటీని ప్రకటించింది. చేతన్‌ శర్మ (నార్త్‌జోన్‌) చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో సలీల్‌ అంకోలా (వెస్ట్‌), సుబ్రతో బెనర్జీ (ఈస్ట్‌), శివ్‌ సుందర్‌ దాస్‌ (సెంట్రల్‌), ఎస్‌.శరత్‌ (సౌత్‌జోన్‌) సభ్యులుగా ఉంటారు.

శరద్‌ యాదవ్‌
సీనియర్‌ రాజకీయవేత్త, లోక్‌తాంత్రిక్‌ జనతా దళ్‌(ఎల్‌జేడీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌ గుర్గావ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. శరద్‌ యాదవ్‌ మొత్తం పదిసార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా పనిచేశారు. ఏడు సార్లు లోక్‌సభకు, మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.

ఏసీ చరానియా
అమెరికా అంతరిక్ష సంస్థ ప్రతిష్టాత్మక నాసా చీఫ్‌ టెక్నాలజిస్ట్‌గా భారతీయ అమెరికన్‌ ఏసీ చరానియా నియమితులయ్యారు. వాషింగ్టన్‌లోని నాసా ప్రధాన కార్యాలయంలో అడ్మిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌కు టెక్నాలజీ పాలసీ, ప్రోగ్రామ్‌ల ప్రధాన సలహాదారుగా చరానియా సేవలందించాల్సి ఉంటుంది.

ప్రసన్నకుమార్‌
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌ (గతంలో నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌) చైర్మన్‌ – మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా తెలుగువారైన ప్రసన్నకుమార్‌ మోటుపల్లి నియమితులయ్యారు. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రసన్న కుమార్‌ బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివారు.

కమల్‌ దహల్‌ ప్రచండ
నేపాల్‌ నూతన ప్రధానమంత్రి పుష్ప కమల్‌ దహల్‌ ‘ప్రచండ’ పార్లమెంట్‌ విశ్వాస తీర్మానం నెగ్గారు. ఎన్నికల ముందు నేపాలీ కాంగ్రెస్‌తో పెట్టుకున్న పొత్తును వదిలేసి, అనూహ్యంగా ప్రతిపక్ష నేత కేపీ ఓలీతో చేతులు కలిపిన ప్రచండ మూడోసారి నేపాల్‌ ప్రధానిగా డిసెంబర్‌ 26న బాధ్యతలు చేపట్టారు.

ఆర్‌బోనీ గాబ్రియల్‌
అమెరికాకు చెందిన ఆర్‌బోనీ గాబ్రియల్‌ మిస్‌ యూనివర్స్‌ 2022 విజేతగా నిలిచింది. విన్నర్‌కు భారత్‌కు చెందిన మాజీ విశ్వ సుందరి హర్నాజ్‌ సంధు ఈ కిరీటాన్ని బహుకరించారు. మిస్‌ వెనిజులా ఆమంద డుడామెల్‌ తొలి రన్నరప్‌గా, మిస్‌ డొమిన్‌కన్‌ రిపబ్లిక్‌ ఆండ్రీనా మార్టినెజ్‌ రెండో రన్నరప్‌గా నిలిచారు.

అబ్దుల్ రెహ్మాన్‌ మక్కీ
పాకిస్తాన్‌ కేంద్రంగా భారత్‌పైకి ఉగ్రమూకలను ఉసిగొల్పుతున్న లష్కరే తోయిబా ఉగ్రసంస్థ డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్‌ మక్కీని గ్లోబల్‌ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలంటూ భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఉషారెడ్డి
డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్‌ ఉషారెడ్డి కాన్సస్‌ రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్‌ 22 సెనేటర్‌గా బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘకాలంగా ఆ పదవిలో ఉన్న టామ్‌ హాక్‌ స్థానంలో ఆమె ఈ పదవిలోకి వచ్చారు. ఎడ్యుకేషనల్‌ లీడర్‌షిప్‌ అంశంపై మాస్టర్స్‌ చేసిన ఉష గతంలో రెండు సార్లు మేయర్‌గా పనిచేశారు.

పంకజ్‌కుమార్‌ సింగ్‌
జాతీయ భద్రత ఉప సలహాదారునిగా (డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏగా) పంకజ్‌కుమార్‌ సింగ్‌ నియమితులయ్యారు. రాజస్థాన్‌ క్యాడర్‌ 1988 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన బీఎస్ఎఫ్ డైరెక్టర్‌ జనరల్‌ హోదాలో 2022 డిసెంబరు 31న పదవీ విరమణ చేశారు.

కె.సచ్చిదానందన్‌
ఆధునిక మళయాళ కవి, విమర్శకుడు, అనువాదకుడు కె.సచ్చిదానందన్‌ను ‘ఎనిమిదవ మహాకవి కన్హయ్యాలాల్‌ సేఠియా కవిత్వ అవార్డు’ వరించింది.16వ జైపుర్‌ సాహిత్య ఉత్సవంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

రవి కుమార్‌
కాగ్నిజెంట్‌ సీఈవోగా రవి కుమార్‌ నియమితులయ్యారు. గతంలో ఇన్ఫోసిస్‌ ప్రెసిడెంట్‌గా ఆయన వ్యవహరించారు. ప్రస్తుత కాగ్నిజెంట్‌ సీఈఓగా ఉన్న బ్రయాన్‌ హంఫ్రీస్‌ మార్చి 15న కంపెనీని వీడాల్సి ఉంది. ఇప్పుడే ఆయన బాధ్యతల నుంచి వైదొలగనున్నారు.

శివ చౌహాన్‌
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సరిహద్దు రక్షణ స్థానం సియాచిన్‌లో మొట్టమొదటిసారిగా ఒక మహిళా ఆఫీసర్‌ దళాధిపతిగా కెప్టెన్‌ శివ చౌహాన్‌ నియమితురాలయ్యింది. 15 వేల అడుగున ఎత్తున దేశ రక్షణకు నిలిచిన ఆమె ఈ పోస్ట్‌ పొందడానికి ఎంతో కష్టతరమైన ట్రైనింగ్ పూర్తి చేసింది.

బెనెడిక్ట్‌–16
మాజీ పోప్‌ బెనెడిక్ట్‌–16 వాటికన్‌ సిటీలో మరణించారు. మాజీ పోప్‌కు ప్రస్తుత పోప్‌ అంతిమ సంస్కారాలు జరిపిన అరుదైన సన్నివేశంగా ఇది చరిత్రలో నిలిచిపోనుంది. బెనెడిక్ట్‌ కోరిన విధంగా కార్యక్రమాన్ని నిరాడంబరంగా జరపనున్నట్టు వాటికన్‌ పేర్కొంది.

ఇ. ఆంజనేయ గౌడ్‌
స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ నూతన చైర్మన్‌గా డాక్టర్‌ ఇ. ఆంజనేయ గౌడ్‌ నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. గద్వాల్‌కు చెందిన ఆంజనేయ గౌడ్ గతంలో రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడిగా పనిచేశారు.

ఎరిక్‌ గార్సెటి
భారతదేశంలో అమెరికా రాయబారిగా లాస్‌ ఏంజెలెస్‌ మాజీ మేయర్‌ ఎరిక్‌ గార్సెటి మళ్లీ నామినేట్‌ అయ్యారు. ఈ మేరకు బైడెన్‌ సర్కారు నిర్ణయం తీసుకుంది. భారత్‌తో సత్సంబంధాలు చాలా కీలకమైనందున మళ్లీ నామినేట్‌ చేస్తున్నట్లు వైట్‌హౌస్‌ పేర్కొంది.

హీరాబెన్‌
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్‌ కన్నుమూశారు. ఆమెకు ప్రధాని మోడీ సహా అయిదుగురు కుమారులు సోమాబాయ్, అమృత్, ప్రహ్లాద్, పంకజ్, కుమార్తె వాసంతిబెన్‌ ఉన్నారు. గాంధీనగర్‌ శ్మశాన వాటికలో ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో అంత్యక్రియలు ముగిశాయి.

రీనా వినోద్‌ పుష్కర్ణ
ప్రవాస భారతీయురాలు, ప్రముఖ పాకశాస్త్ర నిపుణురాలు రీనా వినోద్‌ పుష్కర్ణను భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ పురస్కారానికి ఎంపిక చేసింది. జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో జరిగే ప్రవాసీ భారతీయ దివస్‌ కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.

స్పోర్ట్స్

అడిలైడ్‌ ఓపెన్ విజేత జొకోవిచ్
అడిలైడ్‌ ఇంటర్నేషనల్‌–1 ఓపెన్‌ ఏటీపీ–250 టోర్నీలో 35 ఏళ్ల సెర్బియా టెన్నిస్‌ స్టార్ నొవాక్‌ జొకోవిచ్ చాంపియన్‌గా నిలిచాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ జొకోవిచ్‌ ప్రపంచ 33వ ర్యాంకర్‌ సెబాస్టియన్‌ కోర్డా (అమెరికా)పై గెలిచాడు. జొకోవిచ్‌ కెరీర్‌లో ఇది 92వ సింగిల్స్‌ టైటిల్‌.

బ్రిటీష్‌ ఓపెన్‌ స్క్వాష్‌ టోర్నీ
ప్రతిష్టాత్మక బ్రిటీష్‌ జూనియర్‌ ఓపెన్‌ స్క్వాష్ టోర్నీలో అండర్‌–15 బాలికల సింగిల్స్‌ విభాగంలో భారత అమ్మాయి అనాహత్‌ సింగ్‌ విజేతగా నిలిచింది. ఫైనల్లో సొహైలా హజీమ్‌ (ఈజిప్ట్‌)పై గెలిచింది. గతంలో భారత్‌ నుంచి జోష్నా చినప్ప, దీపిక పళ్లికల్‌ మాత్రమే బ్రిటీష్‌ ఓపెన్‌ జూనియర్‌ టోర్నీలో విజేతలుగా నిలిచారు.  

యుకి–సాకేత్‌ జోడీకి టైటిల్‌
యుకి బాంబ్రి, సాకేత్‌ మైనేని జంట బ్యాంకాక్‌ ఓపెన్‌ ఛాలెంజర్‌ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో ఈ టాప్‌ సీడ్‌ జోడీ రుంగ్‌కాత్‌ (ఇండోనేషియా), అకిర సాంటిలన్‌ (ఆస్ట్రేలియా) ద్వయంపై విజయం సాధించింది. యుకి, సాకేత్‌ జంటకు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో వైల్డ్‌కార్డ్‌ లభించింది.

జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు
భారత ఆర్చరీ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఓపెన్‌ సెలెక్షన్‌ ట్రయల్స్‌లో తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత ట్రయల్స్‌లో డబుల్‌ 50 మీటర్ల రౌండ్‌లో 1440 పాయింట్లకుగాను 1418 పాయింట్లతో వరల్డ్ రికార్డ్ సాధించింది.

బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో హంపికి రజతం
భారత మహిళా చెస్ స్టార్ కోనేరు హంపి ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించింది.ఈ టోర్నీలో 35 ఏళ్ల హంపి 12.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. 13 పాయింట్లతో బిబిసారా (కజకిస్తాన్) చాంపియన్గా అవతరించింది. ఓపెన్ విభాగంలో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) టైటిల్ సాధించాడు.

సౌదీ అరేబియా క్లబ్‌తో రొనాల్డో
తన 20 ఏళ్ల ప్రొఫెషనల్‌ కెరీర్‌లో యూరోప్‌లోని విఖ్యాత క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించిన పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో తొలిసారి ఆసియాలోని సౌదీ అరేబియాకు చెందిన అల్‌ నాసర్‌ క్లబ్‌తో రెండున్నరేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు.

సైన్స్ అండ్ టెక్నాలజీ

నిఘా కోసం ప్రత్యేక డ్రోన్‌
గిడ్డంగుల నిర్వహణ, సైనిక అవసరాలు, శాంతి భద్రతల పరిరక్షణకు గువాహటి ఐఐటీ పరిశోధకులు విభిన్న రకాల డ్రోన్లను అభివృద్ధి చేశారు. గాల్లోకి నిట్టనిలువున పైకి లేచే మానవరహిత విమానం ‘రావెన్‌’నూ రూపొందించారు. ఇరుకైన ప్రాంతాల్లో నిఘా కోసం దీన్ని పక్షుల డిజైన్‌ స్ఫూర్తిగా తయారు చేశారు.

ఆపరేటింగ్‌ సిస్టం ‘భారోస్‌’
దేశీయ మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టంను (ఓఎస్‌) ఐఐటీ మద్రాస్‌ తీసుకొచ్చింది. ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’లో భాగంగా ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసినట్లు ప్రకటించింది. దీనికి ‘భారోస్‌ (భారత్‌ ఓఎస్‌)’ అని పేరుపెట్టింది. జండ్‌కే ఆపరేటింగ్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ (జండ్‌ కాప్స్‌) సంస్థ దీన్ని రూపొందించింది.

నౌకాదళంలోకి ‘వజీర్‌’
భారత నావికాదళం అమ్ములపొదిలోకి ఐదో స్కార్పీన్ తరగతికి చెందిన జలాంతర్గామి ‘వజీర్‌’ చేరింది. ప్రాజెక్టు–75లో భాగంగా దేశీయంగా నిర్మించిన ఈ సబ్‌మెరైన్ ద్వారా భారత నేవీకి మరింత బలం చేకూరనుంది. వజీర్‌ను ఫ్రాన్స్‌ నావల్‌ గ్రూప్‌ భాగస్వామ్యంతో ముంబైలోని మజగావ్‌డాక్‌షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌ నిర్మించింది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!