Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​ : ఏప్రిల్​ 2023

కరెంట్​ అఫైర్స్​ : ఏప్రిల్​ 2023

తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు టీఎస్​పీఎస్​సీ (TSPSC), టీఎస్​ఎల్​పీఆర్​బీ (TSLPRB) నిర్వహిస్తున్న పోటీ పరీక్షలకు, గురుకుల్​ (TREI RB) పోస్టులకు నిర్వహిస్తున్న అన్ని పరీక్షలకు యూపీఎస్సీ (UPSC) పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్​. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ముఖ్యాంశాలు, తెలంగాణ విశేషాలు, సైన్స్​ అండ్​ టెక్నాలజీ, స్పోర్ట్స్, వార్తల్లో వ్యక్తులు.

Advertisement

అంతర్జాతీయం

నాటోలోకి ఫిన్లాండ్‌
ఫిన్లాండ్‌ నాటో సైనిక కూటమిలో 31వ సభ్య దేశంగా అధికారికంగా చేరింది.  నాటోలో ఫిన్లాండ్‌ చేరేందుకు చివరగా అమోదం తెలిపిన దేశంగా తుర్కియే నిలిచింది.  రష్యాతో ఫిన్లాండ్‌కు 1,340 కి.మీ. సరిహద్దు ఉండడంతో రష్యా భద్రతకు పెనుసవాలుగా మారనుంది.

యూఎన్వో గణాంక కమిషన్‌కు భారత్‌
వచ్చే జనవరి 1వ తేదీ నుంచి నాలుగు సంవత్సరాల కాలానికి ఐక్యరాజ్యసమితి అత్యున్నత గణాంక కమిషన్‌ సభ్యురాలిగా భారత్‌ ఎన్నికైంది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జై శంకర్‌ వెల్లడించారు.

రష్యాకు యూఎన్‌ఎస్‌సీ బాధ్యతలు
ఐరాస భద్రతామండలి అధ్యక్ష బాధ్యతలు రష్యా దక్కించుకుంది. యూఎన్‌ఎస్‌సీలో శాశ్వత సభ్య దేశమైన రష్యా ఏప్రిల్‌ నెలకు ఈ బాధ్యతలు చేపట్టింది. యూఎన్‌ఎస్‌సీ అధ్యక్ష హోదాలో రష్యా బాధ్యతగా వ్యవహరించాలని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కెరీన్‌ జీన్‌ పెర్రీ కోరారు.

Advertisement

యుద్ధానికి చైనా సిద్ధం
చైనా–తైవాన్‌ ఘర్షణ తారస్థాయికి చేరుతోంది. ఈ ద్వీప దేశంపై ఏ క్షణంలోనైనా యుద్ధానికి దిగేందుకు అన్నివిధాలా సిద్ధంగా ఉన్నట్లు చైనా సైన్యం ప్రకటించింది.  తైవాన్‌ తమ దేశంలో అంతర్భాగమేనని చైనా వాదిస్తుండగా, తైవాన్‌ తీవ్రంగా విభేదిస్తోంది.

సౌదీ–ఇరాన్‌ మధ్య దౌత్య సంబంధాలు
కొన్నేళ్లపాటు శత్రు దేశాలుగా ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్‌ తమ మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకున్నాయి. దౌత్య సంబంధాల పునరుద్ధరణపై సౌదీ, ఇరాన్‌ విదేశాంగ మంత్రులు తాజాగా బీజింగ్‌లో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఐరాస మహిళా సిబ్బందిపై నిషేధం
అఫ్గానిస్థాన్‌లో ఐక్యరాజ్య సమితి పరిధిలో అఫ్గాన్‌ మహిళలు ఎవరూ పనిచేయకూడదని తాలిబన్‌ సర్కారు నిషేధం విధించింది. ముందుగా వివిధ జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల్లోని మహిళలపై నిషేధం విధించిన తాలిబన్లు ఈ మేరకు ఐరాస మహిళా సిబ్బందికీ దాన్ని వర్తింపజేశారు.

Advertisement

జ‌నాభాలో వరల్డ్ నంబర్ వన్
జనాభాలో చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్‌ అవతరించిందని  ఐక్యరాజ్యసమితి చెందిన సంస్థ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2023’ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం భారత జనాభా 142.86 కోట్లతో తొలి స్థానంలో ఉండ‌గా, చైనా జనాభా 142.57 కోట్లతో రెండో స్థానంలో ఉంది.

ఉక్రెయిన్‌ చేతికి  ‘పేట్రియాట్‌’
అమెరికా అత్యాధునిక పేట్రియాట్‌ గైడెడ్‌ క్షిపణి వ్యవస్థ ఉక్రెయిన్‌ చేతికొచ్చింది. భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే పేట్రియాట్‌ క్షిపణి వ్యవస్థతో శత్రు సేనల నుంచి దూసుకొచ్చే క్షిపణులు, స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ మిస్సైళ్లను కూల్చేయొచ్చు.

ప్రపంచంలోనే తేలికైన పెయింట్‌
ప్రపంచంలోనే తేలికైన పెయింట్‌ను అమెరికాలోని సెంట్రల్‌ ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఎలాంటి రంగు లేకుండా ఉండే ఈ ప్లాస్మోనిక్‌ పెయింట్‌ను ఏ రంగులోకి అయినా సులువుగా మార్చుకోవచ్చు. ఈ పెయింట్ను యూనివర్సిటీ  ప్రొఫెసర్‌ దెబాశిస్‌ చందా నాయకత్వం వహించారు.

Advertisement

నేరాల్లో వెనుజులా టాప్
నేరాలపై వెలువడిన ఒక నివేదిక ప్రకారం–ప్రపంచ దేశాల్లో భారత్‌ 77వ స్థానంలో నిలిచింది. వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ప్రకారం–అత్యధిక నేరాలతో వెనుజులా మొదటి స్థానంలో నిలిచింది. అమెరికాకు 55వ ర్యాంక్, ఇంగ్లండ్‌కు 65వ ర్యాంక్‌ లభించింది.

‘జ్యూస్‌’ ప్రయోగం సక్సెస్
గురు గ్రహం, దాని చుట్టూ పరిభ్రమిస్తున్న చందమామలపై పరిశోధనల కోసం ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ) ‘జ్యూస్‌’ వ్యోమనౌకను విజయవంతంగా ప్రయోగించింది. దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్‌ గయానా నుంచి ఏరియాన్‌ రాకెట్‌ ద్వారా ఇది నింగిలోకి పయనమైంది.

జాతీయం

జియో ట్యాగింగ్‌లో కేరళ టాప్
జియో ట్యాగింగ్‌లో దేశంలోనే కేరళ మొదటి స్థానంలో నిలిచింది. 2022–23 సంవత్సరానికి ఆ రాష్ట్రానికి చెందిన ఉత్పత్తులకే అత్యధిక జియో ట్యాగ్‌లు లభించాయి. కేరళకు చెందిన బీన్స్, కందిపప్పు, నువ్వులు, వెల్లుల్లి, కర్బూజాలకు జియో ట్యాగ్‌లు లభించాయి. తెలంగాణలోని తాండూర్‌ కందిపప్పునకూ 2022–23లోనే జియో ట్యాగ్‌ లభించింది.

Advertisement

భారత వృద్ధి 6.3 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023–24) భారత వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్‌ తగ్గించింది. 6.3 శాతం మాత్రమే వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గతంలో ఇదే ప్రపంచ బ్యాంక్‌ భారత్‌ వృద్ధి రేటు 6.6 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.

అంబానీయే ఆసియా సంపన్నుడు
ఆసియాలోనే సంపన్న వ్యక్తిగా ముకేశ్‌ అంబానీ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. 2023కు ప్రపంచ కుబేరుల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. 83.4 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో ముకేశ్‌ అంబానీ ఆసియాలో అగ్రస్థానంలో, ప్రపంచ కుబేరుల్లో 9వ స్థానంలో నిలిచారు.  బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 211 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలో టాప్లో ఉన్నాడు.

భూటాన్ రాజు పర్యటన
ప్రధాని మోడీతో భారత పర్యటనకు వచ్చిన వాంగ్‌చుక్‌ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆర్థిక, వాణిజ్యపరమైన సహకారంతో పాటు ఇంధన, అంతరిక్ష, సాంకేతి రంగాల్లో భూటాన్‌కు చేయూతనందించేందుకు ఈ సందర్భంగా భారత్‌ హామీనిచ్చింది.

Advertisement

‘ఇండియా జస్టిస్‌’ ర్యాంకింగ్
‘ఇండియా జస్టిస్‌’ ర్యాంకుల్లో కర్ణాటక, తమిళనాడు తొలి రెండు స్థానాల్లో నిలవగా తెలంగాణ మూడు, ఆంధ్రప్రదేశ్‌ 5వ స్థానాలను దక్కించుకున్నాయి. టాటా ట్రస్టు మూడో ఇండియా జస్టిస్‌ నివేదిక (ఐజేఆర్‌) –2022 వెల్లడించింది. ఈ ట్రస్టు 2019 నుంచి ఐజేఆర్‌ నివేదికలు ఇస్తోంది.

ప్రాజెక్ట్‌ టైగర్‌కు 50 ఏళ్లు
దేశంలో పులుల సంరక్షణ, తగ్గిపోతున్న పులుల సంఖ్యను పెంచేందుకు భారత ప్రభుత్వం ఏప్రిల్ 1, 1973న ప్రాజెక్ట్ టైగర్‌ను ప్రారంభించింది. దీనికి 50 ఏండ్లు పూర్తయిన ప్రధాని మోడీ  ‘ఇంటర్నేషనల్‌ బిగ్‌ క్యాట్‌ అలియెన్స్‌(ఐబీసీఏ)’ ప్రాజెక్టు ప్రారంభించారు. 2022 నాటికి దేశంలో 3,167 పెద్ద పులులు ఉన్నాయి.

ఆప్ కు జాతీయ పార్టీ హోదా
ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ హోదా దక్కించుకున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. సీపీఐ, తృణమూల్‌ కాంగ్రెస్, ఎన్సీపీలు జాతీయ పార్టీల హోదాను కోల్పోయాయి. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ), ఆప్‌ నేషనల్ పార్టీలుగా ఉన్నాయి.

Advertisement

స్పేస్‌ పాలసీకి ఆమోదం
ప్రైవేటురంగ భాగస్వామ్యాన్ని పెంచే రీతిలో రూపొందించిన ‘భారత అంతరిక్ష విధానం–2023’కి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆధునిక అంతరిక్ష సాంకేతికతలపై ఇస్రో దృష్టిసారించేందుకు ఇది దోహదపడుతుందని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు.

నదిలో మెట్రో రైలు ట్రయల్‌ రన్‌
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా మెట్రో రైల్వే సంస్థ దేశంలోనే తొలిసారిగా నది లోపల మైట్రో రైలును విజయవంతంగా నడిపింది. హుగ్లీ నదిలో నిర్మించిన సొరంగ మార్గంలో కోల్‌కతాలోని మహాకరణ్‌ స్టేషన్‌ నుంచి హావ్‌డా మైదాన్‌ స్టేషన్‌ వరకు రైలు పరుగులు తీసింది.

వృద్ధి రేటు 5.9 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023–24) భారత వృద్ధి రేటు అంచనాలను 6.1 శాతం నుంచి 5.9 శాతానికి తగ్గిస్తున్నట్లు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ప్రకటించింది. అయినా ప్రపంచంలో అత్యంత వేగవంత వృద్ధి సాధించే దేశంగా భారత్‌ నిలుస్తుందని పేర్కొంది.

Advertisement

దేశంలో తొలి డిజిటల్‌ కోర్టు
దేశంలో మొదటి సారి కాగితపు రహిత డిజిటల్‌ కోర్టుగా నవీ ముంబయిలోని వాశీ కోర్టు విశిష్టతను సొంతం చేసుకుంది. కాగితం వినియోగించాల్సిన అవసరం లేని, పూర్తిస్థాయి డిజిటల్‌ కోర్టు ఏర్పాటులో స్థానిక న్యాయవాదులు మంచి సహకారం అందించారు.

హైదరాబాద్‌కు 65వ స్థానం
హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ అధ్యయనంలో ప్రపంచంలోని  అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్‌ 65వ స్థానంలో నిలిచింది. ముంబయి 21వ స్థానం దక్కించుకుంది. 3.40 లక్షల మంది మిలియనీర్లతో న్యూయార్క్‌ నగరం తొలి స్థానం పొందింది.

క్వాంటమ్‌ మిషన్‌కు ఆమోదం
క్వాంటమ్‌ సాంకేతకతలో శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన – అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించే  ‘జాతీయ క్వాంటమ్‌ మిషన్‌’కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2023–31 మధ్య రూ.6,003 కోట్లు దీని కోసం ఖర్చు చేస్తారు.

Advertisement

‘టీసీఎస్‌’కు టాప్ ప్లేస్
‘భారతదేశంలో పనిచేయడానికి ఉత్తమమైనవిగా’ ఉద్యోగులు భావిస్తున్న కంపెనీల జాబితాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) టాప్ ప్లేస్ లో నిలిచింది. లింక్డ్‌ఇన్‌ భారత్‌లో అత్యుత్తమ 25 కంపెనీలతో జాబితా వెలువరించగా అమెజాన్, మోర్గాన్‌ స్టాన్లీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా
గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. భారత్‌ – అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గత ఆర్థిక సంవత్సరంలో 128.55 బిలియన్‌ డాలర్లకు చేరింది. భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతులు 78.31 బి.డాలర్లకు చేరాయి. అమెరికా నుంచి దిగుమతులు 16% పెరిగి 50.24 బి.డాలర్లుగా నమోదయ్యాయి. చైనా, యూఏఈ, సౌదీ అరేబియా, సింగపూర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

డిజిటల్‌ లావాదేవీల్లో బెంగళూరు టాప్‌
పేమెంట్ సర్వీసుల సంస్థ వరల్డ్‌లైన్‌ ఇండియా నివేదిక ప్రకారం దేశీయంగా గతేడాది డిజిటల్‌ చెల్లింపు లావాదేవీల్లో బెంగళూరు నగరం అగ్రస్థానంలో నిలిచింది. 2022లో 65 బిలియన్‌ డాలర్ల విలువ చేసే 2.9 కోట్ల లావాదేవీలతో టాప్‌ ప్లేస్‌ దక్కించుకుంది. న్యూఢిల్లీ, ముంబయి, చెన్నై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

పూంచ్‌లో ఆర్మీ ట్రక్‌పై ఉగ్రదాడి
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు బయల్దేరిన భారత సైనికులపై  టెర్రరిస్టుల అటాక్ చేశారు. బాటా దురియన్‌లో ఆర్మీ ట్రక్‌పై టెర్రరిస్టులు గ్రెనేడ్లు విసరడంతో ఐదుగురు సైనికులు సజీవ దహనమయ్యారు.

గిన్నిస్‌ రికార్డుల్లో బిహూ డ్యాన్స్‌
ఈశాన్య రాష్ట్రం అస్సాం సంప్రదాయ నృత్యమైన బిహూ డ్యాన్స్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో స్థానం దక్కించుకుంది. ఒకే వేదికపై 11,304 మంది కళాకారులు, నృత్యకారులు బిహూ నృత్యాన్ని ప్రదర్శించి చరిత్ర సృష్టించారు. అస్సాం సాంస్కృతిక వారసత్వానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

టార్గెట్ 9 శాతం అణు విద్యుత్
భారతదేశంలో 2047 కల్లా 9 శాతం విద్యుత్తు అణు వనరుల నుంచే ఉత్పత్తి అవుతుందని కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు. 2030 కల్లా 20 గిగావాట్ల అణు ఇంధన శక్తిని ఉత్పత్తి చేస్తామని చెప్పారు. అప్పుడు అమెరికా, ఫ్రాన్స్‌ తర్వాత అణుఇంధన ఉత్పత్తి దేశాల్లో భారత్‌ మూడో స్థానానికి చేరుకుంటుందని తెలిపారు.

దేశంలోనే తొలి 3డీ పోస్టాఫీస్‌
దేశంలోనే తొలిసారిగా 3డీ ప్రింటెడ్‌ సాంకేతికతతో నిర్మిస్తున్న అల్సూర్‌ బజార్‌ పోస్టాఫీస్‌.. బెంగళూరులోని కేంబ్రిడ్జి లే అవుట్‌వాసులకు త్వరలోనే సేవలు అందించనుంది. ఎల్‌ అండ్‌ టీ కంపెనీ చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ నెల రోజుల్లో పూర్తి కానుంది.

ఢిల్లీలో గ్లోబల్‌ బుద్ధిస్ట్‌ సమ్మిట్‌
గ్లోబల్‌ బుద్ధిస్ట్‌ సమ్మిట్‌ సెషన్‌ను ఏప్రిల్ 20న‌ ఢిల్లీలో ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గౌతమ బుద్ధుని బోధనలను ఆచరించి సుస్థిరాభివృద్ధిని సాధించవచ్చని అభిలషించారు.

ప్రాంతీయం

చినజీయర్‌కు పద్మభూషణ్‌ ప్రదానం
రాష్ట్రపతి భవన్‌లో 53 మందికి పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌ స్వామి పద్మభూషణ్‌ను అందుకోగా, సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి పద్మశ్రీ అందుకున్నారు.

వెయ్యేళ్ల నాటి శిల్పాలు
మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం పోతులమడుగులోని వేణుగోపాల స్వామి అలయ సమీపంలో వెయ్యేళ్ల నాటి శిల్పాలను గుర్తించారు.

పీహెచ్‌సీలకు జాతీయ గుర్తింపు
రాష్ట్రంలోని మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ నాణ్యత ధ్రువీకరణ  పొందాయి. యాదాద్రి జిల్లాలోని సంస్థాన్‌ నారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు నిజామాబాద్‌ జిల్లా నందిపేట, మేడ్చల్‌ జిల్లా నారపల్లి ప్రాథమిక ఆర్యోగ్య కేంద్రాలు క్వాలిటీ సర్టిఫైడ్‌ స్టేషన్లుగా గుర్తింపు దక్కించుకున్నాయి.

రాష్ట్రానికి 13 జాతీయ అవార్డులు
జాతీయస్థాయి పురస్కారాల్లో తెలంగాణ పల్లెలకు 13 అవార్డులు వచ్చాయి.  దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సతత్‌ వికాస్‌కు 8 పురస్కారాలతోపాటు నానాజీ దేశ్‌ముఖ్‌ సర్వోత్తమ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌కు 5 అవార్డులు లభించాయి.

దక్షిణ డిస్కంకు పురస్కారాలు
దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)కు ఉత్తమ పంపిణీ సంస్థ కేటగిరీలో ప్రథమ, వినియోగదారులకు అవగాహన కల్పించే విభాగంలో ద్వితీయ అవార్డు లభించింది.

రాష్ట్రంలో అయ్యనార్‌ ఆరాధన
కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో కనిపించే అయ్యనార్‌ల ఆరాధన తెలంగాణలోని జనగామ జిల్లాలో గుర్తించామని చారిత్రక పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి వివరించారు. ఇది సుమారు 1600 సంవత్సరాల నాటిదై ఉంటుందని తెలిపారు.

హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌
హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఆవిష్కరించిన అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహానికి అరుదైన గౌరవం లభించింది. హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో ఈ స్మారకం నమోదైంది.

రెండు కొత్త మండలాలు
రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లా నుంచి పాల్వంచ మండలంగా ఏర్పాటు చేయగా, జోగులాంబ గద్వాల జిల్లాలో ఎర్రవల్లి నూతన మండలంగా ఏర్పాటు చేశారు.

కందూరు చోళుల శాసనం
దాదాపు 900 ఏళ్ల నాటి శిలా శాసనం ఒకటి నల్లగొండ జిల్లా డిండి మండలం వావికోల్‌లో లభ్యమైంది. దీన్ని కందూరు చోళుల నాటి వైద్య శాసనంగా పురావస్తు నిపుణులు చెబుతున్నారు. 12వ శతాబ్దానికి చెందిన కందూరు చోళుల శాసనంగా వారు గుర్తించారు.

వార్తల్లో వ్యక్తులు

రిషి సింగ్‌
‘ఇండియన్ ఐడల్‌’ ట్రోఫీని అయోధ్యకు చెందిన రిషి సింగ్‌ సొంతం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన రిషి సింగ్‌కు ఇండియన్‌ ఐడల్‌ ట్రోఫీతోపాటు  కారు, రూ.25 లక్షల నగదు బహుమతి అందుకున్నారు. కోల్‌కతాకు చెందిన దెబోస్మితా రాయ్‌ ఫస్ట్‌ రన్నర్‌గా నిలిచారు.

సంజిత చాను
రెండుసార్లు కామన్వెల్త్‌ చాంపియన్, వెయిట్‌లిఫ్టర్‌ సంజిత చానుపై నాలుగేళ్ల నిషేధం పడింది. గతేడాది డోప్‌ పరీక్షలో పట్టుబడిన మణిపుర్‌ లిఫ్టర్‌పై జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ క్రమశిక్షణ కమిటీ ఈ శిక్షను విధించింది.

కిరణ్‌ నాడార్‌
సామాజిక సేవకురాలు, కళాకృతుల సేకరణలో అవిరళ కృషి చేస్తున్న కిరణ్‌ నాడార్‌కు ఫ్రెంచ్‌ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. భారత్‌లో ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మానుయేల్‌ లీనన్‌ ఆ పురస్కారాన్ని కిరణ్‌ నాడార్‌కు అందజేసి సత్కరించారు.

జోగినపల్లి సంతోష్‌కుమార్‌
‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో తాజాగా ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’కు చోటు లభించింది. సామాజిక సేవా విభాగంలో ఒక గంటలో అత్యధిక సంఖ్యలో మొక్కలు నాటించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినందుకు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ సృష్టికర్త జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు చోటు కల్పించారు.

అమిత్‌ క్షత్రియ
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ‘మూన్‌ టు మార్స్‌’ కార్యక్రమం హెడ్‌గా భారత సంతతికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, రోబోటిక్స్‌ ఇంజనీర్‌ అయిన అమిత్‌ క్షత్రియ నియమితులయ్యారు. చంద్రుడిపై సుదీర్ఘ కాలం మకాం వేయడానికి, అక్కడి నుంచి అంగారక గ్రహంపైకి మనుషులను పంపే బృహత్తర లక్ష్యంతో నాసా ఈ మిషన్‌కు రూపకల్పన చేసింది.

కల్యంపూడి రాధాకృష్ణారావు
భారత్‌–అమెరికన్‌ గణాంకశాస్త్ర(స్టాటిస్టిక్స్‌) నిపుణుడు కల్యంపూడి రాధాకృష్ణారావుకు స్టాటిస్టిక్స్‌ రంగంలో నోబెల్‌ బహుమతితో సమానమైన ‘ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ ఇన్‌ స్టాటిస్టిక్స్‌’ ను 2023 సంవత్సరానికి రాధాకృష్ణారావుకు అందజేయనున్నట్లు ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ ఇన్‌ స్టాటిస్టిక్స్‌ ఫౌండేషన్‌ తెలిపింది.

చంద్రకళ ఓజా
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 15 ఏళ్ల చంద్రకళ ఓజా  నిర్విరామంగా 8 గంటల పాటు ఈత కొట్టి గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో చోటు సంపాదించింది. తెల్లవారుజామున అయిదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్విరామంగా ఈత కొట్టింది. చంద్రకళ 8 గంటల పాటు చెరువులో 64 రౌండ్లు ఈత కొట్టింది.

గుకేశ్‌
భారత చెస్‌ స్టార్ గుకేశ్‌ ఆర్మగెడాన్‌ ఆసియా, ఓసియానియా టైటిల్‌ సాధించి సత్తా చాటాడు. రెండు మ్యాచ్‌ల ఫైనల్లో అతను ప్రపంచ ర్యాపిడ్‌ ఛాంపియన్‌ నొడిర్‌బెక్‌ అబ్దుసతొరోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌)ను ఓడించి, విజేతగా నిలిచాడు.

రక్షిత రవి
భారత చెస్‌ క్రీడాకారిణి రక్షిత రవి మహిళా గ్రాండ్‌మాస్టర్‌ (డబ్ల్యూజీఎం) హోదా సాధించింది. చివరి డబ్ల్యూజీఎం నార్మ్‌ను దక్కించుకున్న ఆమె 2300 ఎలో రేటింగ్‌ దాటింది. ఫస్ట్‌ సాటర్‌డే టోర్నీ ఆరో రౌండ్లో సహజ్‌ గ్రోవర్‌ను ఓడించినప్పుడు రక్షిత ఆఖరి నార్మ్‌ను సొంతం చేసుకుంది.

సూర్యకుమార్‌ యాదవ్‌
స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ 906 పాయింట్లతో ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లి 15వ స్థానంలో ఉండగా, రషీద్‌ ఖాన్‌ నంబర్‌వన్‌ టీ20 బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఏ భారత బౌలర్‌ టాప్‌-10లో లేడు.

నందినీ గుప్తా
రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల నందినీ గుప్తా ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌–2023గా ఎంపికయ్యారు. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో ఆమె భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. మణిపుర్‌ రాజధాని ఇంఫాల్‌లో జరిగిన ఫైనల్స్లో ఢిల్లీకి చెందిన శ్రేయా పూంజా మొదటి రన్నరప్‌గా, మణిపుర్‌కు చెందిన స్ట్రెలా లువాంగ్‌ రెండో రన్నరప్‌గా నిలిచారు.

మను బాకర్‌
జాతీయ రైఫిల్‌/పిస్టల్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌లో మహిళల 25 మీటర్ల పిస్టల్‌లో మను బాకర్‌ గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్లో మను 31-–29తో చింకీ యాదవ్‌ను ఓడించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో అర్జున్‌ బబుతా విజేతగా నిలిచాడు.

నూతక్కి ప్రియాంక
ఫ్రాన్స్‌లో జరిగిన ‘టోర్నియో ఎంఐఎఫ్‌ ఇకామ్‌ లియోన్‌–2023’ అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో విజయవాడకు చెందిన మహిళా గ్రాండ్‌ మాస్టర్‌ నూతక్కి ప్రియాంక చాంపియన్గా నిలిచింది. తొమ్మిది రౌండ్ల టోర్నీలో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగిన ప్రియాంక ఏడు పాయింట్లతో టాప్లో  ఉంది.

వెర్‌ స్టాపన్‌
ఫార్ము లావన్‌ ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ ప్రిలో మ్యా­క్స్‌ వెరైపెన్‌(రెడ్‌ బుల్, 25 పాయింట్లు) విజేతగా నిలిచాడు. లూయి­స్‌ హామిల్టన్‌(మెర్సిడెజ్, 18 పాయింట్లు) నుంచి గట్టిపోటీ ఎదురైనా  తొలిసారి ఆస్ట్రేలియన్‌ టైటిల్‌ను మ్యాక్స్ తన ఖాతా­లో వేసుకున్నాడు.

లుకాస్‌ హెల్మెక్‌
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన 33 ఏళ్ల లుకాస్‌ హెల్మెక్‌ గంటకి 3,182 పుష్‌ అప్‌లు చేసి గిన్నిస్ రికార్డ్ సాధించాడు.  లుకాస్‌ నిమిషానికి 53 పుష్‌ అప్‌లు చేశాడని గిన్నిస్‌ వరల్డ్‌ అధికారులు  తెలిపారు. ఈ రికార్డు కోసం మూడేళ్లు లుకాస్ ట్రైనింగ్ తీసుకున్నాడు.

ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌
పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్‌ అగ్రనేత ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ (95) మొహాలీలోని ఓ ఫోర్టిస్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 25న కన్నుమూశారు. 1970–71, 1977–80, 1997–2002, 2007–2012, 2012–2017 ఐదుసార్లు పంజాబ్‌ సీఎంగా చేశారు.

అనంత్‌ మహేశ్వరి
ఐటీ పరిశ్రమ అత్యున్నత సంఘమైన నాస్కామ్‌ చైర్‌పర్సన్‌గా 2023–24 సంవత్సరానికి అనంత్‌ మహేశ్వరి ఎంపికయ్యారు. మహేశ్వరి ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. అంతేకాదు నాస్కామ్‌ వైస్‌ చైర్మన్‌గానూ ఇప్పటి వరకు సేవలు అందించారు.

రాధా అయ్యంగార్‌
అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ అండర్‌ సెక్రటరీ (మంత్రి)గా భారతీయ అమెరికన్‌ రాధా అయ్యంగార్‌ ప్లంబ్‌ నియామకాన్ని అమెరికా సెనెట్‌ 68-30 ఓట్లతో ఆమోదించింది. రక్షణ శాఖలో సాధన సామగ్రి సేకరణ విభాగాన్ని ఆమె పర్యవేక్షిస్తారు.

దీపికా మిశ్ర
మధ్యప్రదేశ్‌ వరద సహాయక చర్యల్లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన వింగ్‌ కమాండర్‌ దీపికా మిశ్ర భారత వాయుసేన శౌర్య అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకొన్న తొలి మహిళా అధికారిగా ఆమె గుర్తింపు పొందారు. రాజస్థాన్‌కు చెందిన దీపిక హెలికాప్టర్‌ పైలట్‌గా భారత వాయుసేనలో పనిచేస్తున్నారు.

స్పోర్ట్స్

మియామి టైటిల్‌
రష్యా టెన్నిస్‌ స్టార్‌ డానియల్‌ మెద్వెదెవ్‌ మియామి టైటిల్ కైవసం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో అతడు 7-–5, 6–-3తో జానిక్‌ సినర్‌ (ఇటలీ)ను ఓడించాడు. గత 25 మ్యాచ్‌ల్లో మెద్వెదెవ్‌ 24 గెలవడం విశేషం. ఇండియన్‌ వెల్స్‌ ఫైనల్లో కార్లోస్‌ అల్కరాస్‌ చేతిలో మాత్రమే ఓడిపోయాడు.

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌
ఫార్ములావన్‌ ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ప్రిలో మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్) చాంపియన్గా నిలిచాడు. ఏడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ (మెర్సిడెజ్, 18 పాయింట్లు) నుంచి గట్టిపోటీ ఎదురైనా నిలిచిన మ్యాక్స్‌ తొలిసారి ఆస్ట్రేలియన్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

నంబర్‌వన్‌గా అర్జెంటీనా
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అర్జెంటీనా జట్టు ఆరేళ్ల తర్వాత మళ్లీ టాప్ ర్యాంక్ సొంతం చేసుకుంది. ఫ్రాన్స్, బ్రెజిల్ వరుసగా రెండు, మూడో స్థానంలో ఉన్నాయి. భారత జట్టు ఐదు స్థానాలు పురోగతి సాధించి 101వ ర్యాంక్‌ చేరింది.

ఆర్లీన్స్‌ మాస్టర్స్‌ టోర్నీ
భారత యువ షట్లర్‌ ప్రియాంశు రజావత్‌ ఆర్లీన్స్‌ మాస్టర్స్‌ టోర్నీ విజేతగా నిలిచాడు. అతను తొలి బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 300 టైటిల్‌ను దక్కించుకున్నాడు. క్వాలిఫయర్‌గా అడుగుపెట్టి 21 ఏళ్ల ప్రియాంశు పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో మాగ్నస్‌ జొహానెసన్‌ (డెన్మార్క్‌)పై గెలిచాడు.

ఆర్చరీలో ప్రపంచ రికార్డు
తెలుగమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ తుర్కియేలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1 టోర్నమెంట్లో మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగం ర్యాంకింగ్‌ రౌండ్లో ప్రపంచ రికార్డుతో అదరగొట్టింది. ఈ పోటీల్లో డబుల్‌-50 రౌండ్లో (353/360), సింగిల్‌-50 రౌండ్లో (360/360) పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

‘రెస్ట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ జట్టుదే చెస్‌ టైటిల్‌
కజకిస్తాన్, రెస్ట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ మహిళల జట్ల మధ్య జరిగిన చెస్‌ టోర్నమెంట్‌లో ‘రెస్ట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ జట్టు టైటిల్‌ దక్కించుకుంది. భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక, తమిళనాడుకు చెందిన మహిళా గ్రాండ్‌మాస్టర్‌ (డబ్ల్యూజీఎం) సవితాశ్రీ ‘రెస్ట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.

గుకేశ్‌ కు ఆర్మగెడాన్‌ టైటిల్‌
భారత చెస్‌ కెరటం గుకేశ్‌ మరోసారి సత్తా చాటాడు. ఆర్మగెడాన్‌ ఆసియా, ఓసియానియా టైటిల్‌ను ఈ గ్రాండ్‌ మాస్టర్‌ సొంతం చేసుకున్నా­డు. రెండు మ్యాచ్‌ల ఫైనల్లో అతను ప్రపంచ ర్యాపిడ్‌ ఛాంపియన్‌ నొడిర్బెక్‌ అబ్దుసతొరోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌)ను ఓడించాడు.

సైన్స్ అండ్ టెక్నాలజీ

రీయూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌  
అంతరిక్షంలో ఉపగ్రహాలను ప్రయోగించిన వాహక నౌకలను మళ్లీ వినియోగించే ప్రక్రియలో కీలకమైన రీయూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌ అటానమస్‌ ల్యాండింగ్‌ మిషన్‌ (ఆర్‌ఎల్‌వీ ఎల్‌ఈఎక్స్‌)ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది.

చంద్రుడి మీదకి క్రిస్టినా కోచ్
అర్టిమిస్–2 పేరుతో నాసా వచ్చే సంవత్సరం నిర్వహించనున్న చంద్రునిపై ప్రదక్షిణకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో క్రిస్టినా కోచ్ అనే మ‌హిళ ఉంది. దీంతో చంద్రుడి వరకూ వెళ్లిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించనుంది.

‘స్టార్‌ షిప్‌’ ప్రయోగం ఫెయిల్
మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ కంపెనీ రూపొందించిన అతిపెద్ద రాకెట్‌ ‘స్టార్షిప్’ నింగిలోకి ఎగిసిన కాసేపటికే పేలిపోయింది. చంద్రుడు, అంగారకుడిపైకి మానవ సహిత యాత్రల కోసం స్పేస్‌ఎక్స్‌ అభివృద్ధి చేసిన ఈ ప్రయోగం తొలి పరీక్షలో విఫలం అయింది. ‘స్టార్‌షిప్‌’ ప్రధాన రాకెట్, బూస్టర్లు కలిపి ఎత్తు 120 మీటర్లు (సుమారు 40 అంతస్తుల భవనం ఎత్తు) ఉంటుంది.  

పీఎస్‌ఎల్‌వీ-సీ55 రాకెట్ సక్సెస్
తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్‌(సతీష్‌ ధావన్‌ స్పేస్‌సెంటర్‌) నుంచి ఏప్రిల్ 22న ఇస్రో ప్రయోగించి పీఎస్‌ఎల్‌వీ-సీ 55 రాకెట్ విజయవంతమైంది. వాహననౌక రెండు విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి విజయవంతంగా మోసుకెళ్లి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.  ఈ ఏడాది ఇస్రోకిది తొలి పీఎస్‌ఎల్వీ ప్రయోగం కాగా, ఈ సిరీస్‌లో 57వ ప్రయోగమన్నారు.

DONT MISS TO READ

కరెంట్​ అఫైర్స్​ మార్చి 2023

కరెంట్​ అఫైర్స్​ ఫిబ్రవరి 2023

కరెంట్​ అఫైర్స్​ జనవరి 2023

కరెంట్​ అఫైర్స్​ 2022 (క్లిక్​ చేసి.. ఈ బుక్​ ఉచితంగా డౌన్​లోడ్​ చేసుకొండి)​

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!