Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​: ఫిబ్రవరి 2023

కరెంట్​ అఫైర్స్​: ఫిబ్రవరి 2023

అంతర్జాతీయం

భారత అమ్మాయిలదే ప్రపంచకప్‌
అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించి టైటిల్ నెగ్గింద ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ తితాస్‌ సాధు (2/6)తో పాటు పర్శవి చోప్రా (2/13), అర్చన దేవి (2/17) రాణించారు.

Advertisement

చెక్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడిగా పావెల్‌
చెక్‌ రిపబ్లిక్‌ కొత్త అధ్యక్షుడిగా మాజీ సైనిక ఉన్నతాధికారి జనరల్‌ పెట్ర పావెల్‌ ఎన్నికయ్యారు. పావెల్‌కు 58.2 శాతం, బబీస్‌కు 42.8 శాతం ఓట్లు దక్కాయి. పావెల్, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. గతంలో నాటో కూటమిలోని సైనిక కమిటీకి నాయకత్వం వహించారు.

బ్రిటన్‌ రాజముద్ర తొలగింపు
ఆస్ట్రేలియా తమ దేశ ఐదు డాలర్‌ల కరెన్సీ నోటుపై ఇక నుంచి బ్రిటన్‌ రాజు చిత్తరువుని ముద్రించబోమని ఆ దేశ సెంట్రల్‌ బ్యాంకు ప్రకటించింది. ఆ స్థానంలో తమ దేశ మూలవాసుల సంస్కృతిని ప్రతిబింబించేలా కొత్త నోట్లను ఆస్ట్రేలియా ముద్రించనుంది.

ఐఎస్‌ఐఎల్‌ అంతర్జాతీయ ఉగ్ర సంస్థే
ఆగ్నేయాసియాలోని భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ లేవాంట్‌ (ఐఎస్‌ఐఎల్‌)ను అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటించింది. దీంతో ఆ సంస్థకు చెందిన ఆస్తులను స్తంభింపజేయడంతో పాటు సంస్థ సభ్యుల ప్రయాణాలపైనా, ఆయుధాలపైనా నిషేధం విధించారు.

Advertisement

65వ గ్రామీ అవార్డులు
ప్రఖ్యాత 65వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ ఏంజెల్స్‌లో జరిగింది. భారత్‌కు చెందిన రిక్కీ కేజ్‌ ‘డివైన్‌ టైడ్స్‌’ ఆల్బమ్‌కు గానూ బెస్ట్‌ ఇమ్మర్సివ్‌ ఆడియో ఆల్బమ్‌ అవార్డు అందుకున్నారు. 2015, 2022, 2023తో కలిపి మూడు గ్రామీ అవార్డులు అందుకున్న ఏకైక భారతీయుడుగా కేజ్‌ నిలిచారు. అత్యధికంగా 31 గ్రామీ అవార్డులు పొందిన సెలబ్రిటీగా జార్జ్‌ సాల్టి ఉండేది. తాజాగా అమెరికన్‌ సింగర్‌, డ్యాన్సర్‌ బియాన్స్‌ 32 అవార్డులతో ఆ రికార్డును బద్ధలు కొట్టింది.

పాక్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ మరణం
పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ అమైలాయిడోసిస్‌ అనే వ్యాధితో బాధపడుతూ మరణించారు. భారత్, పాక్‌ల మధ్య 1999 నాటి కార్గిల్‌ యుద్ధానికి ప్రధాన కారణం ముషారఫే. కేసుల భయంతో స్వదేశాన్ని వీడిన ఆయన 2016 నుంచి యూఏఈలో ఉంటున్నాడు.

సైబర్‌ సెక్యూరిటీపై క్వాడ్‌ మీటింగ్
సైబర్‌ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసేందుకు మెషిన్‌ లెర్నింగ్‌తో పాటు ఇతర అత్యాధునిక సాంకేతికతలను కలిసికట్టుగా ఉపయోగించుకోవాలని ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాలతో కూడిన క్వాడ్‌ కూటమి నిర్ణయించింది. సైబర్‌ నేరాలను ఎదుర్కోవడానికి సభ్య దేశాలకు ఈ ఒప్పందం ఉపకరిస్తుందని తెలిపింది.

Advertisement

చాట్ జీపీటీకి పోటీగా.. గూగుల్ బార్డ్                                                                   
తిరుగులేని ఆదరణతో దూసుకెళ్తున్న చాట్‌జీపీటీ (చాట్‌ జెనరేటివ్‌ ప్రీ ట్రెయిన్డ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌)కి పోటీగా గూగుల్‌ కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బోట్‌ ‘బార్డ్‌’ను తీసుకొస్తోంది. చాట్ జీపీటీని మైక్రోసాఫ్ట్‌ తన సెర్చ్‌ ఇంజన్‌ బింగ్‌కు అనుసంధానం చేయనుందన్న వార్తల నేపథ్యంలో గూగుల్‌ ప్రకటన ఆసక్తి రేకెత్తిస్తుంది.

బంగ్లాదేశ్‌ నూతన అధ్యక్షుడిగా చుప్పూ
బంగ్లాదేశ్‌ కొత్త అధ్యక్షుడిగా మహమ్మద్‌ షహాబుద్దీన్‌ చుప్పూ ఎన్నికయ్యారు. అవామీ లీగ్‌ పార్టీ తరపున చుప్పూ పోటీ చేసినా, ప్రత్యర్థులు ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 74 ఏళ్ల వయసున్న చుప్పూ ప్రస్తుతం అవామీ లీగ్‌ పార్టీ అడ్వైజరీ కౌన్సిల్‌ సభ్యుడిగా పనిచేస్తున్నారు.

దక్షిణాఫ్రికాలో అత్యవసర పరిస్థితి
దక్షిణాఫ్రికాను తీవ్ర విద్యుత్‌ సంక్షోభం చుట్టుముట్టడంతో దేశంలో విపత్తు అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా ప్రకటించారు. ఆస్పత్రులు, తాగు నీటి సరఫరా వ్యవస్థలకు నిరంతరం విద్యుత్‌ సరఫరా ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏకైక విద్యుత్‌ సరఫరా సంస్థ ఎస్కామ్‌ దివాళా తీయడంతో ఈ పరిస్థితిని ఎదుర్కొంటోంది.

Advertisement

చిట్టెలుక గిన్నిస్‌ రికార్డు
కాలిఫోర్నియాకు చెందిన ఒక చిట్టెలుక ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన మూషికంగా గిన్నిస్‌ రికార్డు సాధించింది. దీని వయసు 9 ఏళ్ల 209 రోజులని ధ్రువీకరణ పత్రం స్పష్టం చేస్తోంది. మానవ సంరక్షణలో ఎక్కువ కాలం జీవించిన మూషికంగా ఇది గుర్తింపు సాధించింది. ఇది పసిఫిక్‌ పాకెట్‌ మౌస్‌ జాతికి చెందింది.

ఆఫ్రికాలో కొత్త వైరస్
ఆఫ్రికా దేశంలోని ఈక్వటోరియల్ గినియాలో మార్‌బర్గ్ వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఈ కొత్తరకం ఎబోలా వ్యాప్తి చెందుతోందని, దీని వల్ల ఇప్పటి వరకూ 10 మంది ప్రాణాలు కోల్పోయారని ఫిబ్రవ‌రి 14వ తేదీ డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

యూఎన్ఓలో చిరుధాన్యాల ప్రదర్శన
‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం–2023’ సందర్భంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ప్రత్యేక చిరుధాన్యాల ప్రదర్శనను భారత్‌ ఏర్పాటు చేసింది. దేశంలో పండే వివిధ రకాలతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను యూఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధి రుచిర కాంబోజ్‌ ప్రారంభించారు.

Advertisement

వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్‌ బంగా
ప్రముఖ భారతీయ అమెరికన్‌ వ్యాపారవేత్త అజయ్‌ బంగాను ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా నామినేట్‌ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఆయన నామినేషన్‌కు ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేస్తే  ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి భారతీయ అమెరికన్‌గా బంగా చరిత్ర సృష్టిస్తారు.

సియాటెల్‌లో కొత్త చట్టం
అమెరికాలో అమలవుతున్న ‘వివక్ష వ్యతిరేక చట్టంలో’ కులాన్ని చేర్చిన మొదటి నగరంగా సియాటెల్‌ నిలిచింది. స్థానిక సభలో ప్రవాస భారతీయురాలు, సియాటెల్‌ నగర కౌన్సిల్‌ సభ్యురాలు క్షమా సావంత్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సియాటెల్‌ సిటీ కౌన్సిల్‌ 6-1 ఓట్లతో దాన్ని ఆమోదించింది. ఈ నిర్ణయంతో ప్రవాస భారతీయుల్లోని కొన్ని కులాలకు వివక్ష నుంచి విముక్తి లభిస్తుంది.

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
మాతృభాషలో చదువుకుంటే విద్యార్థులకు ఎంతో మంచిదని యునెస్కో పేర్కొంది. 24వ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ‘బహుభాష విద్య మార్పునకు ఒక అవసరం’ అన్న అంశంపై దృష్టిసారించామని యునెస్కో పేర్కొంది.

Advertisement

జాతీయం

‘అమృత్‌ ఉద్యాన్‌’గా మొగల్‌ గార్డెన్స్‌
ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ ఉద్యాన వనాల్లో ఒకటైన రాష్ట్రపతి భవన్‌లోని మొగల్‌ గార్డెన్స్‌ను ఇకపై ‘అమృత్‌ ఉద్యాన్‌’గా పిలవనున్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను దేశం నిర్వహించుకొంటున్న వేళ మొగల్‌ గార్డెన్స్‌ పేరును మారుస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం తెలియజేసింది.

2023–24 కేంద్ర బడ్జెట్‌
2023–24 ఆర్థిక సంవత్సరానికి 45.03 లక్షల కోట్ల రూపాయలతో కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 5.9 శాతానికి పరిమితం చేస్తామని పేర్కొన్నారు. 2022–23లో ద్రవ్యలోటును 6.4 శాతంగా సవరించారు.

రాష్ట్ర గీతంగా ‘జై జై మహారాష్ట్ర మాఝా’
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో ‘జై జై మహారాష్ట్ర మాఝా’ను రాష్ట్ర గీతంగా గుర్తించారు. ఫిబ్రవరి 19న మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని లాంఛనంగా ప్రకటించనున్నారు.

Advertisement

విజేతగా ఉత్తరాఖండ్‌ శకటం
రిపబ్లిక్ డే సందర్భంగా తమ రాష్ట్రంలోని ప్రకృతి సౌందర్యాన్ని, అపూర్వమైన ఆధ్యాత్మికతను కళ్లకు కట్టిన ఉత్తరాఖండ్‌ శకటానికి రాష్ట్రాల విభాగంలో ప్రథమ స్థానం దక్కింది. త్రివిధ దళాల సైనికులు చేసిన కవాతుల్లో పంజాబ్‌ రెజిమెంట్‌ మొదటి స్థానంలో నిలిచింది.

ఖేలో ఇండియా స్పాన్సర్‌గా ‘స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌’
ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ (కేఐవైజీ)తో దేశీయ క్రీడల నిర్వాహక సంస్థ ‘స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌’ (ఎస్‌ఎఫ్‌ఏ) జతకట్టింది.యువతలోని క్రీడా నైపుణ్యాన్ని మెరుగు పరచడానికి విశేష కృషి చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఏ ఐదేళ్ల పాటు ఖేలో ఇండియా గేమ్స్‌కు స్పాన్సర్‌గా రూ.12.5 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

దేశంలో ఓటర్లు@  94.5 కోట్లు
మన దేశంలో ఓటర్ల సంఖ్య 1951 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఆరు రెట్లు పెరిగింది. ఈ ఏడాది జనవరి 1 నాటికి మన దేశంలో రిజిస్టర్‌ ఓటర్లు 94.50 కోట్లు అని కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడింది. మొదటిసారి 1951లో ఓటర్ల జాబితాను రూపొందించినప్పుడు 17.32 కోట్ల మంది తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకున్నారు.

Advertisement

రెపో రేటు పెంచిన ఆర్బీఐ
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ రెపో రేటును పావు శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి పెంచింది. దీంతో 6.25 శాతంగా ఉన్న కీలక వడ్డీ రేటు 6.50 శాతానికి చేరింది. ఎంఎస్‌ఎప్‌ రేట్లు 25 బీపీఎస్‌ పాయింట్లు పెరిగి 6.75 శాతానికి చేరింది.

బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్స్‌
కొయ్‌కోడ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రాన్స్‌జండర్లలో ఒకరైన జహాద్‌ బిడ్డకు జన్మనిచ్చారు. దేశంలో ఓ ట్రాన్స్‌జెండర్‌ జంట తల్లిదండ్రులు కావడం ఇదే తొలిసారి. కేరళకు చెందిన జహాద్, జియా పావల్‌ అనే ట్రాన్స్‌జెండర్‌ జంట మూడేళ్ల నుంచి కలిసి ఉంటోంది.

సుప్రీం న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి, మణిపూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్‌ పులిగోరు వెంకట సంజయ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్, జస్టిస్‌ సంజయ్‌ కరోల్, జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ మనోజ్‌మిశ్రలతో సీజేఐ ప్రమాణం చేయించారు. దీంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరింది.

Advertisement

బెంగళూరులో ఏరో ఇండియా ప్రదర్శన
బెంగళూరులో 14వ ఏరో ఇండియా ప్రదర్శనను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేజస్, భారత్‌లో తయారీకి, సమర్థతకు ప్రమాణంగా నిలిచినట్లు ప్రధాని ప్రకటించారు. ఏరో ఇండియా ప్రదర్శనకు 98 దేశాల నుంచి 810 రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థల అధికారులు హాజరయ్యారు.

సోహ్నా–దౌసా ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో చేపట్టిన ఢిల్లీ–ముంబయి ఎక్స్‌ప్రెస్‌ వే (1,386 కి.మీ.) లో 246 కి.మీ. మొదటి దశ సోహ్నా–దౌసా రహదారిని ప్రధాని మోడీ రాజస్థాన్‌లోని దౌసాలో ప్రారంభించారు. ఈ రహదారితో ఢిల్లీ, జైపుర్‌ మధ్య ప్రయాణ సమయం అయిదు గంటల నుంచి రెండు గంటలకు తగ్గనుంది.

దేశంలో లిథియం నిల్వలు
దేశంలో మొదటిసారి లిథియం నిల్వలను జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) గుర్తించిందని కేంద్ర గనుల శాఖ ప్రకటించింది. జమ్ము కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో లిథియం నిక్షేపాలు గుర్తించింది. ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాలు భావిస్తున్న నేపథ్యంలో లిథియం నిల్వలు లభించడం మేలు చేయనుంది.

ఎన్టీఆర్‌ చిత్రంతో వెండి నాణెం
సినీ హీరో, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ చిత్రంతో వంద రూపాయల వెండి నాణెం విడుదలకు రిజర్వు బ్యాంకు ఆమోదం తెలిపింది. మరో 2 నెలల్లో ఇది మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ నాణెం కొనుగోలుకు రిజర్వు బ్యాంకు కౌంటర్‌ లేదా ఏదైనా బ్యాంకులో రూ.4,160 చెల్లించాలి. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం చొప్పున జింక్, నికెల్‌ కలిపి ఈ నాణెం తయారు చేయనున్నారు.

దాదాసాహేబ్‌ ఫాల్కే అవార్డ్స్‌
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఖాతాలో మరో పురస్కారం వచ్చి చేరింది.  ముంబయిలో జరిగిన ‘దాదాసాహేబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ (2023)’ వేడుకలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ‘ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును సొంతం చేసుకుంది. అలియా భట్‌ ఉత్తమ నటి (గంగూభాయి కతియావాడి), రణ్‌బీర్‌ కపూర్‌ ఉత్తమ నటుడు (బ్రహ్మాస్త్ర) అవార్డులను గెలుచుకున్నారు.

ఎంపీలకు సంసద్ రత్న
సంసద్‌ రత్న అవార్డులకు (2023) కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధురీ, ఆర్జేడీకి చెందిన మనోజ్‌ ఝా, సీపీఎం నేత జాన్‌ బ్రిటాస్‌ సహా 13 మంది ఎంపీలు నామినేట్‌ అయ్యారు. వీరిలో 8 మంది లోక్‌సభ, ఐదుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నట్లు అవార్డులను రూపొందించిన ప్రైమ్‌ పాయింట్‌ ఫౌండేషన్‌ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

ఫాబా పురస్కారాలు
దేశంలో ప్రతిష్టాత్మక డాక్టర్‌ బి.ఎస్‌.బజాజ్‌ స్మారక ఫెడరేషన్‌ ఆఫ్‌ ఏసియన్‌ బయోటెక్‌ అసోసియేషన్‌ (ఫాబా) – 2023 పురస్కారాలు కేంద్ర బయోటెక్నాలజీ విభాగం మాజీ కార్యదర్శి డాక్టర్‌ రేణూ స్వరూప్‌; ఎల్వీ ప్రసాద్‌ నేత్ర విజ్ఞాన సంస్థ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ బాలసుబ్రమణియన్‌లను వరించాయి.

‘మిషన్‌ కర్మయోగి’  కమిటీ
ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల శిక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘మిషన్‌ కర్మయోగి’ కార్యక్రమ అమలును పర్యవేక్షించేందుకు కేంద్రం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గాబా నేతృత్వంలోని ఈ కమిటీలో పీఎంవో నుంచి ఒక సీనియర్‌ అధికారి, వివిధ శాఖల నుంచి ఏడుగురు కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.

డిజిటల్ పేమెంట్స్
భారతదేశం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(యూపీఐ), సింగపూర్‌లోని పే నౌని కనెక్ట్ చేయడం ద్వారా రెండు దేశాల మధ్య క్రాస్-బోర్డర్ చెల్లింపు కనెక్టివిటీ ప్రారంభించబడింది. ఈ సదుపాయాన్ని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, సింగపూర్ నుంచి మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ మేనేజింగ్ డైరెక్టర్ రవి మీనన్ ప్రారంభించారు.

ప్రాంతీయం

బొగ్గు రవాణాలో రికార్డు

గత నెలలో 68.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా, 68.4 లక్షల టన్నుల బొగ్గు రవాణాతో కొత్త రికార్డు నమోదైందని సింగరేణి సంస్థ తెలిపింది. 2016 మార్చి నెలలో చేసిన 64.7 లక్షల టన్నుల బొగ్గు రవాణాయే ఇప్పటి వరకు నెలవారీ గరిష్ఠ రవాణా రికార్డు అని వివరించింది.

కేంద్ర పన్నుల్లో పెరిగిన తెలంగాణ వాటా
కేంద్రపన్నుల్లో తెలంగాణ రాష్ట్ర వాటా పెరిగింది. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్రపన్నుల్లో భాగంగా 2023–24లో తెలంగాణకు రూ.21,470.98 (2.102 శాతం) కోట్లు రానున్నాయి.

రాష్ట్ర బడ్జెట్ 2023–24
సంక్షేమం, వ్యవసాయం అగ్ర ప్రాధాన్యాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023–24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రానున్న ఆర్థిక సంవత్సరానికి రూ.2,90,396 కోట్ల భారీ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 46 శాతం మంది వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారని రాష్ట్ర గణాంకాల తాజా నివేదిక వెల్లడించింది.

శాసనమండలి వైస్ చైర్మన్ ఎన్నిక
శాసన మండలి ఉపాధ్యక్ష (వైస్‌చైర్మన్‌) పదవి ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ పదవికి వరంగల్‌ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌ పేరును సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. మండలి ఉపాధ్యక్ష పదవి రెండేళ్లుగా ఖాళీగా ఉంది.

స్టార్టప్లో ఎనిమిదో స్థానం
4,566 స్టార్టప్‌లతో తెలంగాణ అంకుర సంస్థల ఏర్పాటులో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ 15వ స్థానానికి పరిమితమైంది. తొలి మూడు స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ నిలిచాయి.

ఆదిమానవుని వర్ణ చిత్రాలు
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం వ్యారారం గ్రామ పొలిమేరలో చిత్తరిగుట్టపైన ఆదిమానవుని కాలం నాటి వర్ణ చిత్రాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది.

అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ రాష్ట్రంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపికైంది. 2022కు గాను దుండిగల్‌ ఠాణా తెలంగాణలో తొలి ర్యాంకు సాధించింది.

హైదరాబాద్లో బయో ఆసియా సమ్మిట్
హైదరాబాద్లో 20వ బయో ఆసియా సదస్సును ‘అడ్వాన్సింగ్ ఫర్ వన్: షేపింగ్ నెక్స్ట్ జనరేషన్ హ్యూమనైజ్డ్ హెల్త్కేర్’ నినాదంతో నిర్వహిస్తున్నారు. బయోటెక్, లైఫ్ సైన్సెస్ విభాగంలో 75 స్టార్టప్లు ఈ సదస్సులో పాల్గొంటున్నాయి. జీవశాస్త్రంలో విశేష కృషికి అందించే ‘జీనోమ్ వ్యాలీ ఎక్సెలెంట్’ పురస్కారం రాబర్ట్ లాంగర్కు అందించారు.

అటవీ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు
అడవుల నిర్వహణ, అభివృద్ధిలో ప్రమాణాలు పాటిస్తున్న తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎఫ్‌డీసీ)కు జర్మనీకి చెందిన ఫారెస్ట్‌ స్టీవార్డ్‌ కౌన్సిల్‌ (ఎఫ్‌ఎస్‌సీ) సర్టిఫికెట్‌ దక్కింది. రాష్ట్రంలో తయారయ్యే సేంద్రియ అటవీ ఉత్పత్తులకు 5 సంవత్సరాల పాటు తమ లోగోను ఉపయోగించుకునేందుకు ఎఫ్‌ఎస్‌సీ అనుమతినిచ్చింది.

వార్తల్లో వ్యక్తులు

నిఖత్‌ జరీన్‌
ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాక్సింగ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ వ్యవహరించనున్నారు. వచ్చే ఒలింపిక్‌ క్రీడల్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించనున్న ఆమెకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తామని సంస్థ వెల్లడించింది.

శివ్‌నందన్‌ కుమార్‌
కృష్ణా బోర్డుకు కొత్త చైర్మన్‌గా శివ్‌ నందన్‌ కుమార్‌ను నియమిస్తూ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని కేంద్ర జల సంఘంలో సభ్యులుగా నవీన్‌కుమార్, ఎస్‌.కె.సిబాల్‌లను కొత్తగా నియమించారు. ఈ మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖ డైరెక్టర్ చందన్‌ ముఖర్జీ ఆదేశాలు జారీ చేశారు.

ఆర్కే రోజా
భారత క్రీడా ప్రాధికార సంస్థ (శాయ్‌) పాలకవర్గ సభ్యురాలిగా మంత్రి ఆర్కే రోజా నియమితులయ్యారు. పాలకవర్గ పునర్నియామకంలో భాగంగా సభ్యులుగా ఏపీతో పాటు హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, త్రిపుర రాష్ట్రాలకు చెందిన క్రీడాశాఖల మంత్రులను నియమించారు.

మన్మోహన్‌ సింగ్‌
భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు బ్రిటన్‌లో జీవితకాల సాఫల్య గౌరవాన్ని ప్రకటించారు. ఆర్థిక, రాజకీయ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించింది. బ్రిటన్‌లోని భారత విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సంఘం (ఎన్‌ఐఎస్‌ఏయూ) త్వరలో ఈ అవార్డును ప్రదానం చేస్తుంది.

నిక్కీ హేలీ
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానని ప్రముఖ భారతీయ అమెరికన్, రిపబ్లికన్‌ పార్టీ నేత నిక్కీ హేలీ ప్రకటించారు. తాజా పరిణామంతో ట్రంప్‌కు ఆమె ఏకైక ప్రత్యర్థిగా నిలువనున్నారు. నిక్కీ హేలీ సౌత్‌ కరోలినాకు రెండు పర్యాయాలు గవర్నర్‌ గాను, ఐరాసలో అమెరికాలో రాయబారిగాను పనిచేశారు.

నటాషా
ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా భారతీయ – అమెరికన్‌ విద్యార్థిని నటాషా పెరియనాయగమ్‌ వరుసగా రెండో ఏడాది ఘనత సాధించింది. అమెరికాలోని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీకి చెందిన సెంటర్‌ ఫర్‌ టాలెంటెడ్‌ యూత్‌ (సీటీవై) నిర్వహించిన పోటీలో ప్రపంచవ్యాప్తంగా15,300కి పైగా విద్యార్థులు పాల్గొంటే నటాషా ప్రథమ స్థానంలో నిలిచింది.

ఆది స్వరూప
కర్ణాటకలోని మంగళూరుకు చెందిన 17 ఏళ్ల బాలిక ఆది స్వరూప ఏకకాలంలో రెండూ చేతులతో నల్లబల్లపై రాస్తూ తన నైపుణ్యం చాటుకుంటోంది. ఒకే నిమిషంలో కన్నడ, ఇంగ్లీష్ భాషలు రెండూ చేతుల సాయంతో 45 పదాలు రాసి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు’లో స్థానం దక్కించుకుంది.

ధర్మేంద్ర కుమార్‌
బిహార్‌లోని కైమూర్‌ జిల్లా రామ్‌గఢ్‌కు చెందిన ధర్మేంద్ర కుమార్‌165 కిలోల బరువును తన పళ్లతో పది సెకన్లపాటు పైకిలేపి ప్రపంచ రికార్డు నమోదు చేశారు. ధర్మేంద్ర ఇప్పటివరకు 9 ప్రపంచ రికార్డుల్లో స్థానం సంపాదించారు. ‘హ్యామర్‌ హెడ్మాన్‌ ఆఫ్‌ ఇండియా’గా ఈయనకు పేరుంది.

సత్యనారాయణ రాజు
కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా కె.సత్యనారాయణ రాజు నియమితులయ్యారు. బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ అయిన రాజు 1988లో విజయా బ్యాంకులో చేరారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ముంబయి జోనల్‌ హెడ్‌గా పనిచేసి, అదే బ్యాంకులో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయికి చేరారు.

ప్రొఫెసర్ రాబర్ట్‌ ఎస్‌ లాంగర్‌
బయో ఆసియా 20వ విడత సదస్సు సందర్భంగా 2023 సంవత్సరానికి ‘జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌’ పురస్కారాన్ని ప్రొఫెసర్ రాబర్ట్‌ ఎస్‌ లాంగర్‌కు ప్రకటించారు. ఇన్‌ఫెక్షస్‌ డిసీజెస్‌ను నిరోధించడానికి వినియోగించే ‘ఎంఆర్‌ఎన్‌ఏ’ టీకాను వృద్ధి చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.

జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌
ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ను నియమించింది. ఇప్పటివరకు ఇక్కడ ఉన్న బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ చేసింది. మొత్తం 13 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది.

నీల్‌ మోహన్‌
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌, సోషల్‌ మీడియా దిగ్గజం యూట్యూబ్‌కు భారతీయుడు నీల్‌ మోహన్‌ సీఈవోగా నియమితులయ్యారు. సుదీర్ఘ కాలంగా సీఈవోగా ఉన్న సూసన్‌ వొజిసికి పదవి నుంచి వైదొలగడంతో యూట్యూబ్‌ యాజమాన్యం ఇండియన్‌-అమెరికన్‌ అయిన నీల్‌ మోహన్‌ను నూతన సీఈవోగా నియమించింది.

కోనేరు హంపి
అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో జరిగిన మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌ రెండో టోర్నమెంట్‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి రన్నరప్‌గా నిలిచింది. ద్రోణవల్లి హారిక 6 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో నిలిచింది. అలెగ్జాండ్రా కొస్టెనిక్‌ (రష్యా) విజేతగా అవతరించింది.

నిక్కీ హేలీ
ఎన్ఆర్ఐ నిక్కీ హేలీ 2024లో జరగ‌నున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడుతున్నారు. 51 ఏళ్ల నిక్కీ ఫిబ్రవ‌రి 14న ఒక వీడియో సందేశంలో ఈ ప్రకటన చేశారు. వలస వచ్చిన భారత కుటుంబం నుంచి వచ్చిన కూతురుగా గర్వపడతాను అని నిక్కీ వ్యాఖ్యానించారు.

పెన్నా మధుసూదన్‌
రచయిత్రి, పరిశోధకురాలు డా.ముదిగంటి సుజాతారెడ్డి ఏర్పాటు చేసిన ఆచార్య ముదిగంటి గోపాల్‌రెడ్డి స్మారక పురస్కారానికి ఆచార్య పెన్నా మధుసూదన్‌ ఎంపికయ్యారు. తెలంగాణకు చెందిన ఆచార్య పెన్నా మధుసూదన్, నాగ్‌పుర్‌ రాంటెక్‌లోని కవికుల గురువు కాళీదాసు సంస్కృత విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం
నీతి ఆయోగ్‌ సీఈఓగా బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. 1987 ఛత్తీస్‌గఢ్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి సుబ్రహ్మణ్యం కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేశారు. సుబ్రహ్మణ్యం తల్లిది కాకినాడ. తండ్రిది ఒడిశాలోని గుణుపురం. ప్రస్తుత సీఈఓ పరమేశ్వరన్‌ అయ్యర్‌ వరల్డ్ బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

షెల్లీ ఒబెరాయ్‌
దేశ రాజధాని ఢిల్లీ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల తేడాతో ఆప్‌ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్‌ గెలుపొందారు. మొత్తం 266 ఓట్లు పోల్‌ కాగా.. షెల్లీ ఒబెరాయ్‌కు 150 ఓట్లు; రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి. కొత్త మేయర్‌ షెల్లీ ఒబేరాయ్‌కు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అభినందనలు తెలిపారు.

డాక్టర్‌ రాజీవ్‌ సింగ్‌ రఘువంశీ
భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) నూతన డైరెక్టర్‌ జనరల్‌గా డాక్టర్‌ రాజీవ్‌ సింగ్‌ రఘువంశీ నియమితులయ్యారు. 2025 ఫిబ్రవరి 28 వరకు రఘువంశీ ఈ పదవిలో ఉంటారు. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఔషధ ప్రమాణాలు, నాణ్యతను ధ్రువీకరించి వాటి వినియోగానికి అనుమతివ్వడంలో ఈ సంస్థదే ప్రధానపాత్ర.

వివేక్‌ రామస్వామి
భారతీయ మూలాలున్న అమెరికన్‌ యువ పారిశ్రామికవేత్త వివేక్‌ రామస్వామి ఆ దేశ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నారు. నిక్కీ హేలీ తర్వాత రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం బరిలో నిలిచిన భారతీయ మూలాలున్న రెండో భారతీయుడు వివేక్‌. 37 ఏళ్ల వివేక్‌ తల్లిదండ్రులు గతంలో కేరళ నుంచి అమెరికాకు వలసవచ్చారు.

చలిగంటి రఘు
జర్మనీ తెలంగాణ సంఘం అధ్యక్షుడు చలిగంటి రఘుకు ఇండో జర్మన్‌ ప్రతిభా పురస్కారం – 2023 లభించింది. కరోనా సమయంలో రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ భాగస్వామిగా జర్మనీలోని 410 మంది భారతీయులకు, విద్యార్థులకు ఆహారం, ఆరోగ్య సేవలు అందించింనందుకు ఈ పురస్కారం దక్కింది.

బిశ్వభూషణ్‌ హరిచందన్‌
ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌లో బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆ రాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా వ్యవహరించిన హరిచందన్‌ ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా బదిలీ అయ్యారు.

స్పోర్ట్స్

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో సెర్బియా ఆటగాడు జకోవిచ్‌ మూడో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)పై గెలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో రిబకినాపై గెలిచి కొత్త చాంపియన్‌గా అరీనా సబలెంక నిలిచింది. మరోవైపు మహిళల డబుల్స్‌ ట్రోఫీని సినియాకోవా–క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌) జోడీ గెలుచుకుంది.

హాకీ ప్రపంచకప్‌ విన్నర్
భారత్‌ ఆతిథ్యమిచ్చిన 2023 హాకీ ప్రపంచకప్‌ను జర్మనీ కైవసం చేసుకుంది. ఫైనల్లో జర్మనీ 5-–4తో షూటౌట్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెల్జియంను ఓడించింది. జర్మనీకిది మూడో ప్రపంచకప్‌. 2002, 2006లోనూ ఆ జట్టు ట్రోఫీ నెగ్గింది.

వన్డే, టీ20ల్లో  నంబర్ వన్
టీమిండియా సూపర్‌ ఫామ్‌తో  ప్రస్తుతం టీ20ల్లో, వన్డేల్లో నెంబర్‌వన్‌గా ఉంది. టీమిండియా మొదట శ్రీలంకను, న్యూజిలాండ్‌తో సిరీస్లో క్లీన్‌స్వీప్‌ చేయడంతో టాప్లో నిలిచింది. టెస్టుల్లోనూ అగ్రస్థానం అందుకుంటే.. ముచ్చటగా మూడు ఫార్మాట్లలోనూ ఏకకాలంలో నెంబర్‌వన్‌గా నిలిచిన అరుదైన జట్టుగా నిలవనుంది.

వర్షిణికి ‘ఫిడే మాస్టర్‌’ టైటిల్‌
ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి ఎం.సాహితీ వర్షిణి ‘ఫిడే మాస్టర్‌’ టైటిల్‌ కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు విమెన్ క్యాండిడేట్‌ మాస్టర్, విమెన్‌ ఫిడే మాస్టర్, విమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ టైటిల్స్‌ సాధించిన సాహితి వర్షిణి తాజాగా ‘ఫిడే మాస్టర్‌’ అయింది.

ఫార్ములా-ఈ–రేస్ ఛాంప్‌
ఫార్ములా-ఈ ప్రి నాలుగో రౌండ్లో పెన్‌స్కీ డ్రైవర్‌ జీన్‌ ఎరిక్‌ వెర్న్‌ చాంపియన్‌గా నిలిచాడు. హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌లో సాగిన రేసులో వెర్న్‌ అగ్రస్థానం సాధించాడు. 46 నిమిషాల 1.099 సెకన్లలో 32 ల్యాప్‌లను పూర్తిచేసి అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు.

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్
ఇండియన్ స్టార్ ప్లేయర్ శుభ్‌మన్‌ గిల్‌ ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ (జనవరి–2023)గా ఎంపికయ్యాడు. శ్రీలంక, న్యూజిలాండ్‌ సిరీస్‌ల్లో కలిపి 567 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌కు చెందిన గ్రేస్‌ స్క్రీవెన్స్‌ మహిళల విభాగంలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’గా ఎంపికైంది.

చాంపియన్‌ సౌరాష్ట్ర
రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో సౌరాష్ట్ర 9 వికెట్ల తేడాతో బెంగాల్‌ను ఓడించింది.ఈ సీజన్‌లో 907 పరుగులు సాధించిన అర్పిత్‌ వసవాడాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్‌ 174 పరుగులకే కుప్పకూలగా సౌరాష్ట్ర 404 పరుగులు చేసింది.

సన్‌రైజర్స్‌ కెప్టెన్ మార్‌క్రమ్‌
రానున్న ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ మార్‌క్రమ్‌ కెప్టెన్గా ఉండనున్నారు. ఇటీవల జొహానెస్‌బర్గ్‌లో ముగిసిన తొలి ఎస్‌ఏ20 లీగ్‌లో విజేతగా నిలిచిన సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌కు మార్‌క్రమ్‌ నాయకత్వం వహించాడు.

సైన్స్ అండ్ టెక్నాలజీ

మానవసహిత గగన్‌యాన్‌
2024 చివరికల్లా మానవసహిత గగన్‌యాన్‌ ప్రయోగం నిర్వహిస్తామని షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ ప్రకటించారు. వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలతో పాటు సూర్యుడిపై పరిశోధనకు ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించడంతో చంద్రయాన్‌–3 ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఎస్ఎస్ఎల్‌వీ-డీ2  సక్సెస్
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహ‌రికోట నుంచి ఎస్ఎస్ఎల్‌వీ-డీ2 రాకెట్ మూడు ఉపగ్రహాల‌ను విజ‌య‌వంతంగా మోసుకెళ్లింది. మార్చిలో జీఎస్ఎల్‌వీ మార్క్ త్రీ రాకెట్ ద్వారా వన్‌వెబ్ ఇండియాకు చెందిన 236 శాటిలైట్లను ప్రయోగించ‌నున్నట్లు ఇస్రో చీఫ్ సోమ‌నాథ్ తెలిపారు.

అంతరిక్ష యాత్రకు బోయింగ్‌
విమానాల తయారీ సంస్థ బోయింగ్‌ కొత్తగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంది. బోయింగ్‌ కంపెనీ ఇంతకు ముందు మానవ రహిత అంతరిక్ష కేంద్రాలను పంపింది. ఈ మిషన్‌ కోసం నాసాకు చెందిన ఇద్దరు సీనియర్‌ సైంటిస్టులు బుచ్‌ విల్మోర్‌తో పాటు భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌ ఎంపికయ్యారు.

అస్త్ర మిస్సైల్ సక్సెస్
డీఆర్డీవో అస్త్ర మిస్సైల్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఎస్యూ–30 ఎంకేఐ ఫైటర్ జెట్ నుంచి దీన్ని పరీక్షించగా సక్సెస్ఫుల్గా టార్గెట్ను ఛేదించిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అస్త్ర క్షిపణి వ్యవస్థను తేజస్ మార్క్–1ఏ యుద్ధ విమానం, మిగ్–29 జెట్ అప్గ్రేడ్ వర్షన్లలో వినియోగించనున్నట్లు పేర్కొన్నాయి.  

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!