ప్రాంతీయం
ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ పాలసీ
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పాలసీ విధానాన్ని అక్టోబర్ 30న ప్రవేశపెట్టింది. కర్బన రహితం, డిజిటీలికరణ లక్ష్యంగా నూతన విధానం రూపొందించారు. రాష్ట్రంలో 5431 ఎలక్ట్రిక్ వాహనాలు ఉండగా వీటిలో 40 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. 78 విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. పరిశ్రమకు 2100 ఎకరాలు కేటాయించారు. రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో 1600 ఎకరాలలో ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ పార్క్, మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో 500 ఎకరాలలో ఎలక్ట్రానిక్ వాహనాల బ్యాటరీ తయారీ పార్కులు ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణ కబడ్డీ సంఘం ఎన్నికలు
తెలంగాణ కబడ్డీ సంఘం చైర్మన్‌గా కేంద్ర హోం శాఖ సహాయ మత్రి కిషన్‌రెడ్డి నవంబర్ 1న ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు చేపట్టారు. వీరు నాలుగేళ్లు పదవిలో ఉంటారు.
హ్యాండ్‌బాల్ అధ్యక్షుడిగా తెలంగాణ వ్యక్తి
జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన అరిశెనపల్లి జగన్మోహన్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఘనత పొందిన తొలి వ్యక్తి జగన్మోహన్రావు.
హైదరాబాద్ సైంటిస్టుల ఘనత
శాస్త్రవేత్తల పరిశోధనలు, వాటివల్ల చేకూరే ప్రయోజనాల ఆధారంగా స్టాన్ఫోర్డ్ యునివర్సిటీ ప్రకటించిన టాప్ 200 అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాల్లో హైదరాబాద్ నగరంలో వివిధ పరిశోధన సంస్థలకు చెందిన అయిదుగురు సైంటిస్టులు చోటుసంపాదించారు. బయోటెక్నాలజీ విభాగంలో ఐఐసీటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ వెంకటమోహన్ దేశంలో 2, ప్రపంచంలో21వ ర్యాంక్ పొందగా, సీసీఎంబీకి చెందిన అమితాబ్చటోపాధ్యాయ దేశంలో 6వ ర్యాంకు సాధించారు. పర్యావరణ శాస్త్ర విభాగంలో ఎంఎన్వీ ప్రసాద్(116), న్యూక్లియర్ కెమిస్ట్రి విభాగంలో అశ్వినీ నంగియా(124), లిటరరీ స్టడీస్‌లో ప్రమోద్ కే నాయర్(189) చోటు పొందారు.
తెలంగాణ రిజర్వాయర్ల కెపాసిటీ 878 టీఎంసీలు
తెలంగాణలో వినియోగం, నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్లు, బ్యారేజీలలో కలిపి 878 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటుందని నీటిపారుదల శాఖ అంచనా వేసింది. 428.30 టీఎంసీలు సాగునీటికి, 88.66 టీంఎసీలు ఇండస్ట్రీస్‌కు, 217.13 టీఎంసీలు మిషన్ భగీరథకు కేటాయించారు. రాష్ట్రంలో 125 జలాశయాలు ఉండగా వీటిలో 52 ఇప్పటికే పూర్తయ్యాయి. పనులు కొనసాగుతున్నవి 72. కాళేశ్వరం, దేవాదుల, కల్వకుర్తి ఎత్తిపోతలు కలిపి 153 భారీ ఎత్తిపోతల పథకాలు రాష్ట్రంలో ఉన్నాయి.
దుబ్బాకలో బీజేపీ విజయకేతనం
తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు సమీప అభ్యర్థి సోలిపేట సుజాత(టీఆర్ఎస్)పై 1049 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 మెదక్ ఎంపీ స్థానంలోనూ మంచి మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్కు ఈ ఉప ఎన్నికలో చేదు అనుభవం ఎదురైంది. ఈ మూడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావే కావడం గమనార్హం.
జల శక్తి అవార్డులు
ఏపీలోని విజయనగరం, కడప జిల్లాలకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నవంబర్ 11న అవార్డులను ప్రకటించింది. మొత్తం 25 అవార్డుల్లో ఆకాంక్షిత జిల్లాల విభాగంలో విజయనగరం జిల్లా మొదటి బహుమతి పొందగా, దక్షిణ జోన్లో అత్యుత్తమ నీటి సంరక్షణ చర్యలు చేపట్టినందుకు కడప జిల్లాకు కూడా మొదటి బహుమతి లభించింది.
అప్పుల్లో ఏపీ మూడో స్థానం
దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో బహిరంగ మార్కెట్ నుంచి రూ.3,53,596 కోట్ల రుణం తీసుకోగా అందులో ఏపీ వాటా 8.83 శాతం , తెలంగాణ వాటా 6.49 శాతం మేర ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు అప్పుల పరంగా ఏపీ మూడో స్థానంలో, తెలంగాణ ఆరో స్థానంలో ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
తుంగభద్ర పుష్కరాలు
తుంగభద్ర నది పుష్కరాలు నవంబర్ 20న ప్రారంభమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పండితులతో అక్టోబర్ 11న నిర్వహించిన దైవజ్ఞ సమ్మేళనంలో ఈ మూహూర్తం ఖరారు చేశారు. డిసెంబర్ 1 వరకు పుష్కరాలు కొనసాగనున్నాయి.
ముగ్గురు ఎమ్మెల్సీల నియామకం
గవర్నర్ కోటాలో భాగంగా తెలంగాణలో కొత్త ఎమ్మెల్సీలుగా బస్వరాజ్‌సారయ్య, గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్‌గుప్తా నవంబర్ 17న ప్రమాణ స్వీకారం చేశారు. వీరి నియామకంతో మండలిలో మొత్తం 40 స్థానాలు భర్తీ అయినట్లయింది. 35 మంది టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉండగా.. మజ్లిస్ రెండు, బీజేపీ, కాంగ్రెస్, టీచర్ ఎమ్మెల్సీ ఒక్కొక్కరు ఉన్నారు.
టూరిజం కార్పొరేషన్ చైర్మన్
తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్‌గా సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన ఉప్పల శ్రీనివాస్‌గుప్త నియమితులైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ప్రస్తుతం అంతర్జాతీయ వైశ్య సమాఖ్య ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్‌గా, రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
స్వనిధిలో తెలంగాణ టాప్
ప్రధానమంత్రి స్వనిధి పథకం పరిధిలో వీధి వ్యాపారుల గుర్తింపు, బ్యాంకు లోన్ల మంజూరులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని నవంబర్ 25న కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 5,88,099 మంది వీధి వ్యాపారులను గుర్తించిందని, వారిలో 3,07,279 మంది లోన్లు మంజూరు చేసిందని వెల్లడించారు.
మత్స్య సమాఖ్యకు జాతీయ అవార్డు
ఉత్తమ పనితీరు కనబరిచిన మత్స్య సహకార సంఘాల సమాఖ్యకు కేంద్ర ప్రభుత్వ జాతీయ అవార్డు లభించింది. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నవంబర్ 21న ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర పశు సంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖల సహాయ మంత్రి ప్రతాప్‌చంద్ర సారంగి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అనితారాజేంద్ర అవార్డుతోపాటు రూ.5 లక్షల నగదు బహుమతి అందుకున్నారు.
ఏపీలో ‘జగనన్న తోడు’
చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ‘జగనన్న తోడు’ పథకం ప్రారంభించింది. నవంబర్ 25న తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసు నుంచి పథకాన్ని ప్రారంభించిన ఆ రాష్ట్ర సీఎం జగన్.. వారం, పది రోజుల్లో చిరువ్యాపారుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున వడ్డీలేని రుణం జమవుతుందన్నారు. ఈ పథకంలో భాగంగా తొలి విడతగా 10 లక్షల మందికి రూ.1000 కోట్ల మేర లోన్లు ఇవ్వనున్నారు. ఇందుకు ఏటా రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు అయ్యే వడ్డీని ప్రభుత్వమే చెల్లించనుంది.
నేషనల్
నీట్లో ప్రభుత్వ స్కూళ్లకు కోటా
ప్రభుత్వ బడుల్లో 6 నుంచి 12 చదివిన స్టూడెంట్స్‌కు నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)లో 7.5 శాతం కోటా కేటాయిస్తూ తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన బిల్లును అక్టోబర్ 30న గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ఆమోదించారు. తమిళనాడు ప్రభుత్వ కోటాలో ఎంబీబీఎస్, డెంటల్, ఆయుర్వేద, యునాని, సిద్ధ హోమియోపతి విభాగాల్లో భర్తీ అయ్యే సీట్లలో సుమారు 300 సీట్లు ప్రభుత్వ బడుల్లో చదివిన స్టూడెంట్స్‌కు లభిస్తాయి. అఖిలభారత్ కోటాలో కేటాయించే సీట్లకు ఈ రిజర్వేషన్ వర్తించదు.
మేరి సహేలి
మహిళా ప్రయాణికుల రక్షణ కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దేశంలోని అన్ని రైల్వే జోన్లలో ‘మేరి సహేలి’ అనే కార్యక్రమాన్ని అక్టోబర్ 29న ప్రారంభించింది. దీన్ని 2020 సెప్టెంబర్‌లో హుబ్బళ్లి రైల్వే డివిజన్లో పైలట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టి అక్కడ వచ్చిన ఫలితాల ఆధారంగా దేశవ్యాప్తంగా విస్తరించారు. మేరి సహేలి కార్యక్రమంలో భాగంగా యువ మహిళా పోలీసులతో కూడిన ఒక దళం మహిళా ప్రయాణికుల జాబితా తీసుకొని వారి ప్రయాణం పూర్తయ్యే వరకు రక్షణ కల్పిస్తుంది.
ప్రజావ్యవహారాల సూచి–2020
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతున్న పరిపాలన ఆధారంగా పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్ అక్టోబర్ 30న ‘పబ్లిక్ ఎఫైర్స్ ఇండెక్స్–2020’ను విడుదల చేసింది. పెద్ద రాష్ట్రాల విభాగంలో కేరళ(1.388), తమిళనాడు(0.912), ఏపీ(0.531)లు వరుసుగా తొలి మూడు స్థానాలు పొందాయి. చిన్న రాష్ట్రాల విభాగంలో గోవా(1.745), మేఘాలయ(0.797), హిమాచల్ ప్రదేశ్(0.725)లు కేంద్రపాలిత ప్రాంతాల విభాగంలో చండిగఢ్(1.057), పుదుచ్చేరి(0.520), లక్షద్వీప్(0.003)లు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచి అత్యుత్తమ పరిపాలన సాగుతున్న రాష్ట్రాలుగా గుర్తింపు పొందాయి.
ఆత్మ నిర్భర్ భారత్ 3.0
కొవిడ్–19 నేపథ్యంలో దేశ ఆర్థిక రంగం గాడి తప్పకుండా కేంద్రం మరో ప్యాకేజీని ప్రకటించింది. ‘ఆత్మ నిర్భర్ భారత్’ కింద ఇప్పటికే రెండు ఉద్దీపన ప్యాకేజీలు వెల్లడించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలలా సీతారామన్ నవంబర్ 12న మూడో ప్యాకేజీని ఆవిష్కరించారు. 9 విభాగాలకు కొత్తగా రూ.1.20 లక్షల కోట్ల ప్యాకేజీని ఆమె ప్రకటించారు. కాగా ఈ మొత్తం జీఎస్డీపీలో 15 శాతమని మంత్రి పేర్కొన్నారు.
ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్
15వ ఆర్థిక సంఘం 2021–26 సంవత్సరాలకు సంబంధించిన నివేదికను నవంబర్ 9న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సమర్పించింది. కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్, సభ్యులు అజయ్‌నారాయణ్ ఝా, అనూప్‌సింగ్, అశోక్ లాహిరి, రమేష్‌చందర్, కార్యదర్శి అరవింద్ మెహతాలు సంయుక్తంగా రాష్ట్రపతికి రిపోర్ట్ అందజేశారు. కొవిడ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్యరంగంలో వసతుల కల్పనకు రూ. లక్ష కోట్ల గ్రాంటు ఇవ్వాలని, అయిదేళ్లలో స్థానిక సంస్థలకు రూ.4.3 లక్షల కోట్లు మంజూరు చేయాలని, 17 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు కింద రూ.2.9 లక్షల గ్రాంటు ఇవ్వాలని, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇంతకు ముందులాగే 41 శాతం కొనసాగించాలనే ప్రధాన సిఫారసులు చేసింది.
బిహార్, 11 రాష్ట్రాల ఉప ఎన్నికల రిజల్ట్
బీహార్ రాష్ట్రం, 11 రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాలు నవంబర్ 10న వెల్లడయ్యాయి. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏకు125, ఆర్జేడీకి 110, ఇతరులకు 8 స్థానాలు దక్కాయి. మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో 28 స్థానాలకు బీజేపీ 19 గెలుచుకోగా, కాంగ్రెస్‌కు 9 స్థానాలు దక్కాయి. గుజరాత్ ఉప ఎన్నికల్లో 8 స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్‌లో ఏడు స్థానాలకు 6 చోట్ల బీజేపీ గెలిచింది. బిహార్‌లో వాల్మీకినగర్ లోక్‌సభ స్థానానికి జరిగిన బై పోల్‌లో జేడీ(యూ) అభ్యర్థి విజయం గెలుపొందారు. 2020 ఏడాదికి గాను దేశవ్యాప్తంగా 40 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. 40 స్థానాలు బీజేపీ, 12 కాంగ్రెస్, 7 ఇతరులు దక్కించుకున్నారు.
నౌకాయాన శాఖ పేరు మార్పు
కేంద్ర నౌకాయాన శాఖను ‘నౌకాశ్రయాలు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ’ గా మారుస్తున్నట్లు నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గుజరాత్‌లోని హజీరా(సూరత్) నుంచి ఘోఘా(భావ్‌నగర్) వరకు రో–పాక్స్ నౌక సేవల ప్రారంభం సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. రోపాక్స్ ఫెర్రీ నౌక సేవల ద్వారా సూరత్, సౌరాష్ట్ర మధ్య దూరం 317 కిలోమీటర్లు నుంచి కేవలం 60 కిలోమీటర్లకు తగ్గనుంది.
ప్రజలే సర్పంచ్‌ను తొలగించవచ్చు
గ్రామ సర్పంచ్‌ను తొలగించే అధికారం ఆ గ్రామ ప్రజలకే కల్పించే బిల్లును హర్యాన రాష్ట్రం నవంబర్ 6న ఆమోదించింది. హర్యాన పంచాయతీ రాజ్ (రెండో సవరణ) బిల్లు–-2020ను రాష్ట్ర డిప్యూటీ సీఎం దుష్యంత్ సింగ్ చౌతాలా అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. సర్పంచ్ పనితీరు సరిగా లేకుంటే, ఆయన పదవీకాలం ముగియక ముందే ఆ గ్రామస్తులు తొలగించేలా చట్టంలో నిబంధనను చేర్చారు.
కేరళ స్టూడెంట్ వరల్డ్ రికార్డ్
కేరళ కాసర్గోడ్ జిల్లాకు చెందిన ఫాతిమా అనే ఎంబీఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కేవలం 35 రోజుల్లోనే 628 ఆన్లైన్ డిప్లొమా కోర్సులను పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. గతంలో 88 రోజుల్లో 520 కోర్సులను పూర్తి చేసిన రికార్డును ఆమె బ్రేక్ చేశారు. లాక్డౌన్ టైంలో ఫాతిమా ఆగస్టు 25 నుంచి ప్రతి రోజు కనీసం 20 కోర్సుల చొప్పున కంప్లీట్ చేసి ఈ ఘనత సాధించారు.
ఆయుర్వేదానికి గుర్తింపు
ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజస్థాన్‌లోని జైపుర్, గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని ఆయుర్వేద కేంద్రాలను నవంబర్ 13న మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అధిపతి టెడ్రోస్ అథనోమ్ గేబ్రియేసిస్ భారత్‌లో అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
జీ20- గ్లోబల్ స్మార్ట్ సిటీస్
ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ సిటీలు అనుసరించదగ్గ ఉత్తమ విధానాలను రూపొందించేందుకు మార్గదర్శక నగరంగా హైదరాబాద్ ఎంపికైంది. ‘జీ20-గ్లోబల్ స్మార్ట్ సిటీస్ అలయన్స్’ కార్యక్రమం కోసం హైదరాబాద్ సహా ప్రపంచ వ్యాప్తంగా 36 మార్గదర్శక నగరాలను ఎంపిక చేసినట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి బెంగళూరు, ఫరీదాబాద్, ఇండోర్ కూడా ఉన్నాయి.
పరం సిద్ధి 63వ ర్యాంక్
ప్రపంచంలోని 500 శక్తిమంతమైన కంప్యూటర్లలో భారత సూపర్ కంప్యూటర్ పరం సిద్ధికి 63వ స్థానం దక్కింది. దీన్ని నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్(ఎన్ఎస్ఎం)లో భాగంగా సీడ్యాక్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆప్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీల సంయుక్తాధ్వర్యంలో రూపొందించారు.
గోవుల రక్షణకు కేబినెట్
గోవులను కాపాడటమే లక్ష్యంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొంత మంది మంత్రులతో ప్రత్యేక కేబినెట్‌ను ఏర్పాటు చేసింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహ్వాన్ నవంబర్ 18న విషయాన్ని వెల్లడించారు. నవంబర్ 22న అగర్ మల్వా జిల్లాలోని ఆవుల అభయారణ్యం వద్ద నుంచి కార్యాచరణ అమలుకు మొదటి సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఆర్బీఐ ట్విటర్ అకౌంట్
కేంద్ర బ్యాంకుల్లో ట్విటర్ ఫాలోవర్ల పరంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రపంచ రికార్డు సాధించింది. 10 లక్షల మందికి పైగా ఆర్బీఐ ట్విటర్ ఖాతాను ఫాలో అవుతున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులను(ఈసీబీ) దాటి ఈ రికార్డును సొంతం చేసుకోవడం విశేషం. 85 ఏళ్ల చరిత్ర ఉన్న ఆర్బీఐ 2012లో ట్విటర్ అకౌంట్ ప్రారంభించగా… నవంబర్ 22 నాటికి ఫాలోవర్ల సంఖ్య 10 లక్షలు దాటింది.
జీవితకాల సాఫల్య పురస్కారం
కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ ‘వాతాయన్ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని’ నవంబర్ 21న లండన్‌లో అందుకున్నారు. గంగానది, హిమాలయాలు, పర్యావరణంపై ఆయన సాగించిన రచనలకు ఈ అవార్డు దక్కింది. అప్పటి ప్రధాన మంత్రి వాజ్‌పేయీ నుంచి ‘సాహిత్య భారతి’, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ‘భారత్ గౌరవ్ సమ్మాన్’ను అందుకున్నారు.
పెళ్లికి మతంతో పని లేదు
వివాహాల్లో హిందువా, ముస్లిమా అనేది న్యాయస్థానం చూడదని.. కేవలం వారు మేజర్లా? కాదా? అనేదే ముఖ్యమంటూ నవంబర్ 24న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మేజర్లకు వారి జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకునే హక్కు ఉంటుందని పేర్కొంది. హిందూ యువతిని పెళ్లి చేసుకున్న ఓ ముస్లిం యువకుడిపై నమోదైన కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది.
మూడు రాష్ట్రాల్లో కొవిడ్ టీకా డ్రై రన్
కొవిడ్ టీకాను ప్రజలకు అందించే క్రమంలో మొదట దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో దక్షిణాది నుంచి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఎంపిక కాగా మిగిలిన రెండింటిలో ఒకటి హరియాణా, మూడో రాష్ట్రంగా ఉత్తర్‌ప్రదేశ్ లేక గుజరాత్‌ని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. దేశం మొత్తం మీద 30 కోట్ల మందికి తొలి విడత కొవిడ్ టీకా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ప్రాంతీయ భాషల్లో టెక్నికల్ ఎడ్యుకేషన్
దేశంలో ఇంజినీరింగ్ సహా టెక్నికల్ ఎడ్యుకేషన్‌ను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 26న కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఈ విధానం అమలుకు కొన్ని ఐఐటీ, ఎన్ఐటీలను ఎంపిక చేశారు.
ఇంటర్నేషనల్
బై బై కరోనా
కరోనా వైరస్‌పై అవగాహన కోసం శాస్త్రీయకార్టూన్(సైన్టూన్)లతో వెలువడిన ప్రపంచంలో తొలి పుస్తకం బై బై కరోనా. కౌన్సిల్ ఆప్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) అనుబంధ సంస్థ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీడీఆర్ఐ)లో ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. ప్రదీప్ కుమార్శ్రీవాస్తవ రచించిన ఈ పుస్తకాన్ని అక్టోబర్ 29న ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఆవిష్కరించారు.
ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ కొత్త అధ్యక్షుడు
స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా గల ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ నూతన అధ్యక్షుడిగా డ్యుయర్ట్పాచికో ఎన్నికయ్యాడు. 2020–23 కాలానికి అధ్యక్షుడిగా ఎంపికౌన ఇతను పోర్చుగల్ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. 2020 నవంబర్ 1 నుంచి 4 వరకు వర్చువల్ పద్ధతిలో జరిగిన ఇంటర్ పార్లమెంటరి యూనియన్ 206 సెషన్లో గాబ్రియేలా క్యువాస్ బార్రోన్(మెక్సికో) స్థానంలో బాధ్యతలు చేపట్టడాడు.
ఐవరికోస్ట్ అధ్యక్షుడిగా ఔట్టారా
2020 అక్టోబర్ 31న జరిగిన ఐవరికోస్ట్ అధ్యక్ష ఎన్నికల్లో అలస్సానే ఔట్టారా వరుసగా నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2010 డిసెంబర్ 4 నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఈయన 1990–93 కాలంలో ఐవరికోస్ట్ ప్రధానిగా వ్యవహరించారు. అక్టోబర్ 31న జరిగిన ఎన్నికల్లో 53.90 శాతం పోలింగ్ నమోదైంది. ఔట్టారా 94.27 శాతం ఓట్లు పొందగా హెన్నికోనన్ బిడై 1 శాతం, పాస్కల్ గుయెస్సన్ 2, కౌడియోకేనన్ 2 శాతం ఓట్లు పొందారు.
న్యూజిలాండ్ మంత్రిగా భారత మహిళ
న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డర్న్ తన మంత్రివర్గంలో భారత సంతతి మహిళ అయిన ప్రియాంకా రాధాకృష్ణన్‌కు చోటు కల్పించారు. డైవర్సిటీ ఇంక్లూజన్, ఎథ్నిక్ కమ్యూనిటీస్ మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. కేరళ మూలాలు కలిగిన ప్రియాంకా సింగపూర్‌లో చదివి న్యూజిలాండ్‌లో స్థిరపట్టారు. 2017లో లేబర్ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికై, 2019లో ఎథ్నిక్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ పార్లమెంట్ ప్రైవేటు కార్యదర్శిగా నియమితులయ్యారు.
టాంజానియా అధ్యక్ష ఎన్నికలు
టాంజానియా అధ్యక్షుడిగా జాన్ మగుఫిలి అక్టోబర్ 30న రెండోసారి ఎన్నికయ్యాడు. అక్టోబర్ 28న జరిగిన ఎన్నికల్లో ఇతని పార్టి చామా చా మపిండుజి 84 శాతం ఓట్లు పొందింది. 1961లో బ్రిట్ నుంచి టాంజానియా స్వాంతంత్ర్యం పొందింది. 2015లో తొలిసారి అధ్యక్షుడైన జాన్ మగుఫిలి రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. టుండులిస్టు చాడేమా పార్టి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది.
అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్
అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమోక్రటిక్ పార్టీ నేత జోబైడెన్ విజయం సాధించారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన సెనేటర్ కమలా హారిస్ ఎన్నికయ్యారు. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 538 ఓట్లలో అధ్యక్షపీఠం దక్కించుకునేందుకు 270 ఓట్లు కావాల్సి ఉండగా.. బైడెన్‌కు 290, ట్రంప్‌కు 214 ఓట్లు దక్కాయి. జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ బాధ్యతలు చేపట్టనున్నారు. జో బైడెన్ పూర్తి పేరు జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్. ఉపాధ్యక్షురాలిగా పదవి చేపట్టబోతున్న తొలి మహిళ కమలా హారిసే.
యూఏఈ ఇస్లామిక్ చట్టాల్లో మార్పు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నవంబర్ 7న తన దేశ ఇస్లామిక్ చట్టాల్లో కీలకమార్పలు చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛకు అవకాశం కల్పిస్తూ.. కొత్త నిబంధనలు రూపొందించింది. వివాహం కాని వారు సహజీవనం చేసుకోవడానికి అనుమతించింది. గతంలో దీన్ని నేరంగా పరిగణించేవారు. మద్యంపై పరిమితులను సడలించింది. పరువు హత్యల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.
అతిపెద్ద వాణిజ్య ఒడంబడిక
ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా భావిస్తున్న ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య’(ఆర్సీఈపీఆర్సెప్) ఒడంబడికపై ఆసియా–పసిఫిక్ రీజియన్ 15 దేశాలు సంతకం చేశాయి. ఇందుకు భారత్ మాత్రం నిరాకరించింది. ఆర్థిక రంగం కోలుకునేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని సభ్య దేశాలు భావిస్తుండగా.. ధరల హెచ్చుతగ్గుల వల్ల దిగుమతులు పెరిగితే అది దేశీయ ఉత్పత్తిదారులకు హాని కలిగిస్తుందని భారత్ ఆర్సెప్ చర్చల నుంచి గతేడాది వైదొలిగింది.
12వ బ్రిక్స్ సదస్సు
రష్యా అధ్యక్షతన జరుగుతున్న 12వ బ్రిక్స్ సదస్సులో నవంబర్ 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగించారు. 2021లో బ్రిక్స్ ఏర్పాటై 15 ఏండ్లు పూర్తవుతుందని, అప్పటికల్లా గత సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుకు సంబంధించిన వివరాలతో నివేదిక రూపొందిస్తారని ఆయన పేర్కొన్నారు. కరోనా సందర్భంగా తాము 150 దేశాలకు అత్యవసర ఔషధాలను సరఫరా చేశామని, అదే స్ఫూర్తితో ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరా కొనసాగుతుందన్నారు.
వాషింగ్టన్లో లైంగిక విద్య తప్పనిసరి
అమెరికాలోని వాషింగ్టన్ స్కూల్స్ విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్నాయి. స్టూడెంట్స్‌కు సెక్సువల్ హెల్త్ ఎడ్యుకేషన్ తప్పనిసరి చేయనున్నాయి. దీనిపై ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాతే ఈ ప్రక్రియ మొదలుపెట్టింది. అక్కడి జనాభాలో 60 శాతం మంది ఓటర్ల నుంచి అభిప్రాయాలు సేకరించగా ఇందులో దాదాపు 90 శాతం మంది పాఠశాలల్లో సెక్సువల్ హెల్త్ ఎడ్యుకేషన్‌ను సపోర్ట్ చేశారు. 4- నుంచి12వ తరగతుల వారికి2022–-23 నుంచి క్లాసెస్ ప్రారంభించనున్నారు.
ఒబామా బుక్‌లో ఇండియా విక్టరీ
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ ను ఇటీవల విడుదల చేశారు. ఈ బుక్‌లో ఆధునిక కాలంలో అనేక అంశాల్లో ఇండియాదే విక్టరీ అని పేర్కొన్నారు. ప్రపంచాన్నే ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తిగా మహాత్మాగాంధీని అభివర్ణించారు. 2010, 2015 సంవత్సరాల్లో అమెరికా అధ్యక్షుడిగా భారత్‌ను సందర్శించిన ఒబామా, భారత ఆర్థికరంగ రూపాంతర ప్రధాన శిల్పిగా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను అభివర్ణించారు.
బుకర్ ప్రైజ్ –2020
డగ్లస్ స్టువర్ట్ అనే 44 ఏళ్ల స్కాటిష్ అమెరికన్ రచయిత తన తొలి రచనతోనే ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ‘షగ్గీ బెయిన్’ పేరుతో ఆయన రచించిన ఆత్మకథకు ఈ ఏడాది బుకర్ ప్రైజ్ లభించింది. ఈ బహుమతి కింద 50 వేల పౌండ్లు(దాదపాఉ రూ.49 లక్షలు) అందిస్తారు.
ఎలాన్ మస్క్‌కు రెండో స్థానం
టెస్లా కోఫౌండర్ ఎలాన్ మస్క్ బిల్ గేట్స్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో నిలిచారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. బిల్‌గేట్స్ నికర సంపద 127.7 బిలియన్ డాలర్లుగా కాగా, ఎలాన్ మస్క్ నికర సంపద విలువ 127.9 బిలియన్ డాలర్లకు చేరింది. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ 2017 నుంచి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు.
మిల్లెట్ ఫైండర్
ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాల ఉత్పత్తుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకునేందుకు ఇక్రిశాట్ 30 దేశాల్లోని సుమారు వెయ్యి ఉత్పత్తుల డేటా సేకరించింది. స్మార్ట్‌ఫుడ్ వెబ్‌సైట్‌లో మిల్లెట్ ఫైండర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆస్కార్‌కు ‘జల్లికట్టు’
2019లో లిజో జోసి పెల్లిస్సెరీ దర్శకత్వంలో మలయాళంలో విడుదలైన ‘జల్లికట్టు’ చిత్రం 93వ ఆస్కార్ పురస్కారాల పోటీకి ఇండియా తరఫున ఎంపికైంది. శకుంతలా దేవీ, గుంజన్ సక్సేనా, ఛపాక్, గులాబో సితాబో, చెక్‌పోస్ట్, స్కై ఈజ్ పింక్… వంటి 27 చిత్రాలను పరిశీలించిన తర్వాత ‘జల్లికట్టు’ను ఎంపిక చేశామని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ బోర్డ్ ఛైర్మన్ రాహుల్ రావైల్ తెలిపారు. మనుషుల్లో దాగున్న క్రూరత్వాన్ని, జంతువుల పట్ల మానవుల తీరును ఈ చిత్రం సూటిగా ప్రశ్నించింది. గతేడాది రణ్‌వీర్‌సింగ్ నటించిన హిందీ చిత్రం ‘గల్లీబాయ్’ భారత్ తరఫున ఆస్కార్‌కు వెళ్లింది. ఆస్కార్ వేడుకలను 2021 ఏప్రిల్ 25న నిర్వహించనున్నారు.
బ్రైబరీ రేటు భారత్‌లోనే ఎక్కువ
లంచగొండితనం(బ్రైబరీ) రేటు ఆసియా దేశాల్లో భారత్‌లోనే అధికంగా ఉన్నట్లు ‘ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్’ సంస్థ తాజా రిపోర్టులో వెల్లడించింది. ‘గ్లోబల్ కరెప్షన్ బారోమీటర్–ఆసియా’ పేరుతో రూపొందించిన సంస్థ రిపోర్ట్ ప్రకారం.. ఇండియా మొదటి స్థానం(బ్రైబరీ రేటు 39 శాతం), కాంబోడియా రెండు(37 శాతం), ఇండోనేషియా మూడో స్థానాల్లో నిలిచాయి. మాల్దీవులు, జపాన్(2 శాతం)లలో లంచగొండితనం అతి తక్కువగా ఉందని సంస్థ పేర్కొంది.
స్పోర్ట్స్
అలెక్సిస్ వస్టైన్ బాక్సింగ్ టోర్నీ
అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య, ఫ్రెంచ్ బాక్సింగ్ ఫెడరేషన్, యురోపియన్ బాక్సింగ్ పెడరేషన్లు 2020 అక్టోబర్ 27 నుంచి 31 వరకు సంయుక్తంగా ప్రాన్స్‌లోని నంటాస్ వేదికగా ‘అలెక్సిస్ వస్టైన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీ’ నిర్వహించాయి. ఈ టోర్నీలో భారత క్రీడాకారులు అమిత్ఫంగాల్(52కిలోలు), అశిష్ కుమార్(75కిలోలు), సంజీత్(91 కిలోలు) స్వర్ణ పతకాలు సాధించారు. కోవిందర్ సింగ్ బిస్త్ రజతం గెలుచుకున్నాడు. 63కిలోల విభాగంలో శివధాఫా, 81కిలోల విభాగంలో సుమిత సంగ్వాన్, సలిష్ కుమార్(91కిలోలు) కాంస్యాలు సాధించారు.
మర్లోన్ సామ్యూల్స్ రిటైర్మెంట్
వెస్టిండిస్ క్రికెటర్ మర్లోన్ సామ్యూల్స్ నవంబర్ 4న అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్, బౌలర్ అయిన సామ్యూల్స్ వెస్టిండిస్ తరఫున 71 టెస్టులు, 207 వన్డేలు, 67 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. 2012 టీ20 వరల్డ్‌కప్, 2016 టీ20 వరల్డ్‌కప్‌లు గెలిచిన వెస్టిండిస్ జట్టు సభ్యుడు. రెండు వరల్డ్ కప్ ఫైనల్స్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందిన ఏకైక క్రికెటర్.
ఎమిలియ రొమగ్నా గ్రాండ్ ప్రి–2020
నవంబర్ 1న జరిగిన ఎమిలియ రొమాగ్నా గ్రాండ్ ప్రి–2020 ఫార్ములా వన్ పోటీల్లో లెవిస్ హమిల్టన్(మెర్సిడెజ్) విజేతగా నిలిచాడు. వాల్టెరి బొట్టాస్(మెర్సిడెజ్), రిసియార్డో(రెనాల్డ్)లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. అత్యధిక గ్రాండ్‌ప్రి టైటిళ్లు గెలిచిన మైకెల్ షుమాకర్(91) రికార్డును ఇటీవల అధిగమించిన హమిల్టన్కు ఇది 93వ టైటిల్.
అంపైర్ అలీందార్ రికార్డు
అత్యధిక వన్డేలకు(210) ఫీల్డ్‌లో బాధ్యతలు నిర్వర్తించిన అంపైర్‌గా అలీందార్(పాకిస్థాన్) రికార్డు సృష్టించారు. 209 వన్డేలకు అంపైర్‌గా వ్యవహరించిన రూడే కోయిర్ట్జెన్(దక్షిణాఫ్రికా) రికార్డును అధిగమించిన అలీందార్.. అత్యధిక టెస్టుల(102)కు, అంతర్జాతీయ మ్యాచ్‌ల(387)కు అంపైర్‌గా ఉన్నారు.
ఐపీఎల్ విన్నర్ ముంబై ఇండియన్స్
డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకుంది. యూఏఈలో జరిగిన ఐపీఎల్-13 ఫైనల్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి రోహిత్ సేన అత్యధికంగా ఐదుసార్లు ట్రోఫీ దక్కించుకుంది. ఈ సీజన్లో అత్యధిక పరుగులు (670) చేసిన లోకేష్ రాహుల్ ఆరెంజ్ క్యాప్, అత్యధిక వికెట్లు(30) పడగొట్టిన రబాడ పర్పుల్ క్యాంప్ అందుకున్నారు. విన్నర్ ముంబై ఇండియన్స్ జట్టుకు రూ.20 కోట్లు, రన్నర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ.12.5 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది.
రికార్డు సమం
అత్యధిక సార్లు నంబర్‌వన్‌గా ఏడాదిని ముగించిన ఆటగాడిగా టెన్నిస్ దిగ్గజం పీట్ సంప్రాస్ పేరిట ఉన్న రికార్డును నొవాక్ జకోవిచ్ సమం చేశాడు. మొత్తంగా సంప్రాస్ లాగే ఆరుసార్లు ‘ఇయర్ ఎండ్ నంబర్‌వన్’గా నిలిచాడు. గతంలో 2011, 2012, 2014, 2015, 2018లో జకోవిచ్ ఈ ఘనత సాధించాడు. 33 ఏళ్ల జకోవిచ్ ఇప్పటి వరకు 17 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచాడు.
టీ20 చాలెంజర్ ట్రోఫీ
టీ20 చాలెంజర్ ట్రోఫీ–2020ని ట్రయల్ బ్లేజర్స్ దక్కించుకుంది. రెండుసార్లు చాంపియన్ అయిన సూపర్ నోవాస్‌కు చెక్ పెడుతూ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ స్మృతి మంధానతోపాటు సల్మా ఖాతూన్, దీప్తి శర్మ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
షుమాకర్ రికార్డ్ సమం
టర్కిష్ గ్రాండ్ ప్రిలో బ్రిటన్ ఫార్ములావన్ రేసర్ లూయిస్ హామిల్టన్(మెర్సిడస్) ఏడో ఎఫ్1 టైటిల్ గెలిచి.. అత్యధిక టైటిళ్లు గెలిచిన డ్రైవర్‌గా ఎఫ్ 1 దిగ్గజం మైకెల్ షుమాకర్ రికార్డ్ సమం చేసి 94వ గ్రాండ్ ప్రి విజయం సాధించాడు. ఈ రేసులో పెరెజ్(రేసింగ్ పాయింట్), వెటెల్(ఫెరారీ) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ విజయంతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాయింట్లను 307కు పెంచుకున్న హామిల్టన్ మరోసారి టైటిల్ దక్కించుకున్నాడు. 2008, 2014, 2015 తన తొలి మూడు టైటిళ్లు గెలుచుకున్న హామిల్టన్ కు ఇది వరుసగా నాలుగో ప్రపంచ చాంపియన్‌షిప్.
కిట్ స్పాన్సర్‌గా ఎమ్‌పీఎల్ స్పోర్ట్స్
టీమ్ ఇండియా దుస్తుల స్పాన్సర్‌గా ఎమ్‌పీఎల్ స్పోర్ట్స్ వ్యవహరిస్తుందని బీసీసీఐ ప్రకటించింది. నైకితో ఒప్పందం ముగియగా.. టీమ్ ఇండియా పురుషులు, మహిళలు, అండర్–19 జట్ల కిట్ స్పాన్సర్‌గా ఎమ్‌పీఎల్ స్పోర్ట్స్‌ను ఎంపిక చేసింది. 2020 నవంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు ఈ ఒప్పందం కొనసాగుతుంది.
2022లో మహిళల ప్రపంచ కప్
భారత్ వేదికగా జరగాల్సిన మహిళల అండర్-17 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను ఫిఫా రద్దు చేసింది. అయితే ఈ మెగా టోర్నీని 2022లో నిర్వహించడానికి అనుమతించింది. 2022లో భారత్, కోస్టారికా (అండర్-20 మహిళల కప్)లలో ఫిఫా టోర్నీలు జరగనున్నాయి.
సుదీప్ త్యాగీ రిటైర్మెంట్
ఇండియన్ క్రికెట్ ఫాస్ట్ బౌలర్ సుదీప్ త్యాగీ అన్ని ఫార్మాట్లకు నవంబర్ 19న రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటి వరకు నాలుగు వన్డేలు, టీ20 ఇన్నింగ్స్‌తోపాటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు.
మెరిసిన మెద్వెదెవ్
ఏటీపీ ఫైనల్స్‌లో రష్యా ఆటగాడు డానియల్ మెద్వెదెవ్, ఆస్ట్రియా క్రీడాకారుడు డొమినిక్ థీమ్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో టాప్ 3 వరల్డ్ ర్యాంకర్లను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్న వ్యక్తిగా మెద్వెదెవ్ రికార్డ్ సృష్టించాడు.
15 ఏండ్లు ఉంటేనే క్రికెట్
అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయాలంటే15 ఏండ్లు ఉండాలని ఐసీసీ కొత్త నింబంధన తీసుకొచ్చింది. క్రీడాకారుల రక్షణ కోసమే ఈ రూల్ తీసుకొచ్చినట్లు ఐసీసీ తెలిపింది. 1996లో పాకిస్థాన్ ప్లేయర్ హసన్ రజా 14 ఏళ్ల 227 రోజుల వయసులో అరంగేట్రం చేసి పిన్న వయస్కుడైన అంతర్జాతీయ క్రికెటర్‌గా రికార్డ్ సృష్టించాడు.
ఐసీసీ ఛైర్మన్‌గా బార్‌క్లే
న్యూజిలాండ్ క్రికెట్(ఎన్‌జెడ్‌సీ) డైరెక్టర్ గ్రెగ్ బార్‌క్లే ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. ఐసీసీ వార్షిక త్రైమాసిక సమావేశం సందర్భంగా జరిగిన ఓటింగ్‌లో బార్‌క్లే 11-5తో ఇమ్రాన్ ఖవాజా (సింగపూర్)పై నెగ్గి స్వతంత్ర ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు. శశాంక్ మనోహర్ (భారత్) తర్వాత ఐసీసీకి ఎన్నికైన రెండో స్వతంత్ర ఛైర్మన్ బార్‌క్లేనే. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు బార్‌క్లేకు మద్దతుగా నిలిచాయి.
సైన్స్& టెక్నాలజీ
నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం
భారత్ నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగాన్ని అక్టోబర్ 30న ఐఎన్ఎస్ కోరా నుంచి బంగాళఖాతంలో విజయవంతంగా నిర్వహించింది. ఐఎన్ఎస్ కోరా అనేది నౌకా విధ్వంసక క్షిపణులను ప్రయోగించే ఒక చిన్న యుద్ధనౌక. 1998లో ప్రవేశపెట్టిన ఈ యుద్ధ నౌకను ఉపరితల యుద్ధాలలో ఎక్కువగా వినియోగిస్తారు. 25 నాట్స్ వేగం కలిగి 1350 టన్నుల పేలుడు పదార్థాలను ఇది మోసుకెళ్లగలదు.
యునెస్కో జాబితాలో కొత్త బయోస్పియర్ రిజర్వ్‌లు
యునెస్కోకు చెందిన ఇంటర్నేషనల్ కోఆర్డినేటింగ్ కౌన్సిల్(ఐసీసీ) మ్యాన్ అండ్ బయోస్పియర్(ఎంఏబీ) కార్యక్రమంలో నూతనంగా 18 దేశాలకు చెందిన 25 బయోస్పియర్ రిజర్వ్‌లను అక్టోబర్ 27 నుంచి 28 వరకు జరిగిన సమావేశంలో చేర్చారు. దక్షణాసియా నుంచి మాల్దీవులు(2), భారత్(1) రిజర్వ్ ఎంపికయ్యాయి. భారత్ నుంచి మధ్యప్రదేశ్‌లోని పన్నా బయోస్పియర్ రిజర్వ్, మాల్దివుల నుంచి పువాహ్ ములాహ్, అద్దూఅటోల్లు ఎంపికయ్యాయి. దీనిలో 129 దేశాలకు చెందిన 714 బయోస్పియర్ రిజర్వ్‌లు యునెస్కో జాబితాలో ఉన్నాయి. దక్షణాసియా నుంచి అత్యధికంగా 12 బయోస్పియర్ రిజర్వ్‌లు భార్ నుంచి చేరాయి.
ఎస్ఈఆర్బీ పవర్ స్కీమ్
దేశంలో పరిశోధనా రంగంలో మహిళ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడానికి అక్టోబర్ 29న భారత్ శాస్త్రసాంకేతిక శాఖ ‘ఎస్ఈఆర్బీ–పవర్’(సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ బోర్డ్–ప్రమోటింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఎక్స్‌ప్లోరేటరీ రీసెర్చ్) అనే పథకాన్ని ప్రారంభించింది. దీనికి 35 నుంచి 55 ఏళ్ల వయసున్న మహిళలు అర్హులు. ఏటా 25 నుంచి 75 మందిని ఎంపిక చేస్తారు. దీనిలో రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో జాతీయ సంస్థల మహిళలకు మూడు సంవత్సరాలకు రూ.60 లక్షలు అందిస్తారు. రెండవ విభాగంలో యూనివర్సిటీ విజేతలకు చెందిన మహిళా శాస్త్రవేత్తలకు మూడు సంవత్సరాలకు రూ.30 లక్షలు అందిస్తారు. వ్యక్తిగతంగా నెలకు రూ.15 వేల స్టైఫండ్ ఇస్తారు.
బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం
భారత వైమానిక దళం అక్టోబర్ 30న బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని సుఖోయ్ యుద్ధ విమానం నుంచి విజయవంతంగా పరీక్షించింది. వైమానిక దళ వెర్షన్‌ను తంజావూరు వైమానిక స్థావరం నుంచి బంగాళఖాతంలోని ఒక నమూనా నౌకపైకి విజయవంతంగా ప్రయోగించారు. బ్రహ్మోస్ వైమానికదళ వెర్షన్ ను 2019 మే నెలలో తొలిసారి విజయవంతంగా పరీక్షించారు. ఉపరితల వెర్షన్‌ను 2020 సెప్టెంబర్ 30న పరీక్షించారు.
మలబార్ విన్యాసాలు
భారత్, అమెరికా, జపాన్‌లు ఏటా నిర్వహించే మలబార్ నౌకా విన్యాసాలలో ఆస్ట్రేలియా నూతనంగా చేరుతుంది. 2020లో ఈ విన్యాసాలు రెండు దశల్లో జరగనున్నాయి. తొలి దశలో యుద్ధ క్రీడలు నవంబర్ 3 నుంచి 6 వరకు విశాఖపట్నం సమీపంలో బంగాళాఖాతంలో, రెండో దశ విన్యాసాలు నవంబర్ 17 నుంచి 20 వరకు అరేబియా తీరంలో నిర్వహించనున్నారు. 1992లో అమెరికా, భారత్‌లు ఈ విన్యాసాలు ప్రారంభించగా 2015లో జపాన్ భాగస్వామిగా చేరింది.
పీఎస్ఎల్వీ–సీ49
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ వెహికల్(పీఎస్ఎల్వీ–సీ49) ద్వారా అంతరిక్షలంలోకి 10 ఉపగ్రాహాలను పంపింది. ఈ ప్రయోగానికి నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ అంతరిక్షకేంద్రం వేదికైంది. మొత్తం 10 ఉపగ్రహాలలో భారత్‌కు చెందిన భూ పరిశీలన ఉపగ్రహం(ఈవోఎస్–01) ఒకటి ఉండగా.. మిగతా 9 విదేశాలకు చెందినవి. ఇస్రోకు ఈ ఏడాది ఇది తొలి ప్రయోగం.
చైనా 6జీ శాటిలైట్
ప్రపంచంలోనే తొలిసారిగా ప్రయోగాత్మక 6జీ ఉపగ్రహాన్ని చైనా ప్రయోగించింది. షాంక్షి ప్రావిన్స్‌లోని అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. దీంతోపాటు 12 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. ఆరో తరం కమ్యూనికేషన్లకు అవసరమైన హైస్పీడ్ టెక్నాలజీని, ఇతర కీలకాంశాలను తాజా శాటిలైట్ ద్వారా చైనా పరీక్షిస్తుంది. పంటలు, విపత్తులపై పర్యవేక్షణ, కార్చిచ్చు నివారణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞనాలూ ఈ ఉపగ్రహంలో ఉన్నాయి.
2068లో జీవకోటి అంతం
అపోహిస్-99942 అనే ఉల్క భూమివైపునకు దూసుకువస్తుందని, ఇది భూమిని ఢీకొడితే జీవకోటి అంతం కాక తప్పదని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. 2068లో అపోహిస్-99942 భూమిని ఢీకొనే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నాసా శాస్త్రవేత్తలు 2004లో ఈ ఉల్కను గుర్తించారు. దాని గమనాన్ని అప్పటి నుంచి నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ ఉల్క 2029లో భూ కక్ష్యకు 32 వేల కిలోమీటర్ల సమీపానికి వస్తుందని అప్పుడు భూమిని ఢీకొనే ప్రమాదం తక్కువేనని, 2068లో జీవకోటికి ముప్పు తప్పకపోవచ్చని పేర్కొన్నారు.
హైపర్లైప్ ప్రయోగం
కొత్త తరం రవాణా వ్యవస్థ అయిన హైపర్‌లూప్ ప్రయోగాన్ని అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఉన్న ‘ డెలపూప్ ప్రయోగ కేంద్రం’లో నవంబర్ 10న నిర్వహించారు. ప్రయోగాన్ని నిర్వహించిన వర్జిన్ హైపర్‌లూప్ సంస్థ అధికారులు కొత్తగా ఆవిష్కరించిన ఎక్స్పటీ–2 హైపర్‌లూప్ పాడ్‌లో ప్రయాణించారు. ఈ వాహనం 15 సెకన్లలో 500 మీటర్లు దూసుకెళ్లి గంటకు 172 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంది. హైపర్‌లూప్‌ను ఇప్పటికే 400 సార్లు ప్రయోగించినా.. తొలి సారిగా మానవులతో నిర్వహించిన ప్రయోగం సక్సెస్ అయింది.
టీఎంటీలో ఇండియన్ సైంటిస్టులు
థర్టీ మీటర్ టెలిస్కోప్(టీఎంటీ) ప్రాజెక్టులో భాగంగా నోబెల్ గ్రహీత ఆండ్రియా గెజ్తో కలిసి భారత ఖగోళ శాస్త్రవేత్తలు పని చేశారు. హవాయి ద్వీపంలోని మౌనా కియాలో ఏర్పాటు చేయనున్న ఈ భారీ టెలిస్కోప్‌నకు సంబంధించిన అంతర్గత పరికరాల రూపకల్పనలో ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్(ఐఐఏ)’ డైరెక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం, ‘ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్’ సైంటిస్ట్ శశిభూషణ్ పాండే తదితరులు పాల్గొన్నారు.
క్యూఆర్ శామ్ పరీక్ష సక్సెస్
భూ ఉపరితలం నుంచి గగనతలంలో 30 కిలోమీటర్ల పరిధిలోని శత్రు విమానాన్ని ఎలాంటి వాతావరణంలోనైనా గుర్తించి ధ్వంసం చేసే క్యూఆర్‌శామ్ క్షిపణి పరీక్షను భారత్ నవంబర్ 13న విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించగా.. 30 కిలోమీటర్ల పరిధిలోని మానవ రహిత బన్షీ విమానాన్ని ఈ స్వల్పశ్రేణి క్షిపణి నేరుగా తాకి ధ్వంసం చేసింది.
అంతరిక్ష ట్యాక్సీ శకం
మానవసహిత అంతరిక్ష యాత్రల చరిత్రలో అమెరికా సంస్థ ‘స్పేస్ఎక్స్’ తొలిసారిగా వాణిజ్య రోదసియానాన్ని చేపట్టిన ప్రైవేటు సంస్థగా గుర్తింపు పొందింది. స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్ రాకెట్ నలుగురు వ్యోమగాములతో విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఇది స్పేస్ ఎక్స్ చేపట్టిన రెండో అంతరిక్ష ప్రయోగం.
రెండో విడత మలబార్ విన్యాసాలు
భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా పాల్గొంటున్న రెండో దశ మలబార్–2020 నావికా దళ విన్యాసాలు ఉత్తర అరేబియా సముద్రంలో నవంబర్17న ప్రారంభమయ్యాయి. 20 వరకు కొనసాగే ఈ విన్యాసాల్లో భారత్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యతోపాటు ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌక యూఎస్ఎస్ నిమిట్జ్ ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.
నౌకా దళంలోకి మరో విమానం
సముద్ర జలాలపై గస్తీ తిరుగుతూ సుదూరం నుంచే శత్రు దేశాల జలాంతర్గాములను వేటాడే అత్యాధునిక పొసిడాన్ 8ఐ(పీ8ఐ) యుద్ధ విమానం భారత్ నౌకా దళంలో చేరింది. అమెరికా రూపొందించిన ఈ విమానం నవంబర్ 18న గోవాలోని ఐఎన్ఎస్ హన్స నౌకా స్థావరంలో దిగింది.
‘బ్రహ్మోస్’ పరీక్ష సక్సెస్
భారత సైన్యం అండమాన్, నికోబార్ దీవుల నుంచి సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్షిపణి భూతల దాడి (ల్యాండ్ అటాక్) వెర్షన్‌ను నవంబర్ 24 దిగ్విజయంగా పరీక్షించింది. పరిధిని 290 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్లకు పెంచగా వేగం మాత్రం మునుపటి తరహాలో 2.8 మ్యాక్ (ధ్వని కన్నా దాదాపు మూడు రెట్లు ఎక్కువ వేగం)ను కొనసాగించారు. బ్రహ్మోస్‌ను భారత్, రష్యాలు ఉమ్మడిగా అభివృద్ధి చేశాయి. ఈ అస్త్రాన్ని జలాంతర్గాములు, యుద్ధనౌకలు, యుద్ధవిమానాలు, నేల నుంచి ప్రయోగించొచ్చు. ఈ క్షిపణి పరిధిని 800, 1500 కిలోమీటర్లకు పెంచేందుకు కసరత్తు జరుగుతోంది.
సెంటినెల్–6
సముద్ర మట్టాల్లో వస్తున్న మార్పులను పర్యవేక్షించేందుకు అమెరికాకు చెందిని నాసా ఓ ఉపగ్రాహాన్ని పంపింది. సెంటినెల్–6 మైకేల్ ప్రెలిచ్ అనే ఈ శాటిలైట్‌ను స్పేస్ ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్‌కు అనుసంధానించి కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి నవంబర్ 21న విజయవంతంగా ప్రయోగించారు. సుమారు 30 ఏళ్ల పాటు పని చేసే ఈ ఉపగ్రహం సముద్ర మట్టాల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది.
చాంగే-5 వ్యోమనౌక
చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను సేకరించి, భూమికి రప్పించేందుకు చాంగే-5 అనే మానవ రహిత వ్యోమనౌకను నవంబర్ 24న చైనా విజయవంతంగా కక్ష్యలోకి పంపింది. చంద్రుడిపై నుంచి నమూనాలను తెచ్చేందుకు మానవాళి యత్నించడం గత 40 ఏళ్లలో ఇదే తొలిసారి.
వార్తల్లో వ్యక్తులు
జస్టిస్ భన్సిలాల్ భట్
నేషనల్ కంపెనీ లా అప్పీల్లేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏ) తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తున్న జస్టిస్ భన్సిలాల్ భట్ పదవీకాలాన్ని కేంద్ర కార్పొరేట్వ్యవహారాల శాఖ మూడు నెలలు పొడిగించింది. 2020 మార్చి 15న జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ స్థానంలో తాత్కాలిక చైర్మన్‌గా నియమితులైన జస్టిస్ భన్సిలాల్ భట్ పదవీ కాలం మూడోసారి పొడిగించారు. ఈ పెంపుతో 2020 డిసెంబర్ 31 వరకు ఆయన పదవిలో కొనసాగుతారు.
పీవీజీ మీనన్
ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఈఎస్ఎస్సీఐ) నూతన సీఈవోగా పీవీజీ మీనన్ నియమితులయ్యారు. ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్, మేనేజ్మెంట్ రంగాల్లో మూడు దశాబ్దాల అనుభవం గల పీవీజీ మీనన్ ఎన్కే మహపాత్ర స్థానంలో బాధ్యతలు చేపట్టారు.
దిలీప్ రధ్
నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్(ఎన్డీడీబీ) చైర్మన్ అయిన దిలీప్ రధ్ ఇంటర్నేషనల్ డెయిరీ ఫెడరేషన్ బోర్డు సభ్యుడిగా నవంబర్ 2న ఎంపికయ్యారు. అమృత పటేల్(ఎన్డీడీబీ మాజీ చైర్మన్) తర్వాత ఈ ప్రత్యేకత పొందిన రెండో భారతీయుడు దిలీప్రధ్. ఇంటర్నేషనల్ డెయిరీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా పియర్క్రిస్టియానో బ్రజౌలే ఎంపికయ్యారు.
హర్‌ప్రీత్‌సింగ్
ఒక భారత విమానయాన సంస్థకు సీఈవోగా నియమితులైన తొలి మహిళ హర్‌ప్రీత్‌సింగ్. ఎయిరిండియా ప్రాంతీయ అనుబంధ సంస్థ అయిన అలయన్స్ ఎయర్కు సీఈవోగా అక్టోబర్ 30న నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె ఎక్స్క్యూటీవ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
సీఐసీగా సిన్హా
కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా యశ్వర్ధన్‌కుమార్ సిన్హా నవంబర్ 7న బాధ్యతలు చేపట్టారు. 62 ఏళ్ల సిన్హా మూడేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. మాజీ దౌత్యాధికారి అయిన సిన్హా ప్రస్తుతం సమాచార కమిషనర్‌గా ఉన్నారు. పాత్రికేయుడు ఉదయ్ మహుర్కర్, కార్మికశాఖ మాజీ కార్యదర్శి హీరాలాల్ సమారియా, కాగ్ మాజీ అధికారి సరోజ్ పున్హానీలు సిన్హాకు సహకమిషనర్లుగా నియమితులయ్యారు.
హాకీ ఇండియా ప్రెసిడెంట్
హాకీ ఇండియా కొత్త అధ్యక్షుడిగా మణిపూర్‌కు చెందిన జ్ఞానేంద్రో నింగోమ్ బామ్ ఎన్నికయ్యాడు. నవంబర్ 6న జరిగిన సమాఖ్య సర్వసభ్య సమావేశంలో అతడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహ్మద్ ముస్తాక్ స్థానంలో నింగోమ్బామ్ బాధ్యతలు చేపట్టాడు. ఈశాన్య రాష్ట్రాల నుంచి హాకీ ఇండియా అధ్యక్షుడైన ఘతన జ్ఞానేంద్రోదే.
విదిషా మైత్రా
యూఎన్వో సలహా కమిటీకి భారత దౌత్యవేత్త విదిషా మైత్రా ఎన్నికయ్యారు. పరిపాలన, బడ్జెట్ ప్రశ్నలకు సంబంధించిన యూఎన్వో సలహా కమిటీ (ఏసీఏబీక్యూ)లో ఆమెకు ఈ స్థానం దక్కింది. ఆసియా- పసిఫిక్ దేశాల బృందంలో యూఎన్వో భారత శాశ్వత మిషన్‌కు మొదటి కార్యదర్శి అయిన మైత్రా 126 ఓట్లు సాధించారు. 2021, జనవరి 1 నుంచి మూడేళ్ల పాటు సలహా కమిటీకి ఈమె సభ్యురాలిగా ఉంటారు.
అజీజ్ ప్రేమ్‌జీ
ఎడెల్‌గివ్ హూరన్ ఇండియా దాతృత్వ జాబితా–2020లో విప్రో చైర్మన్ ప్రేమ్‌జీ అగ్రస్థానంలో నిలిచారు. 2019–20 ఏడాదిలో రూ.7,904 కోట్లు అంటే.. రోజుకు రూ.22 కోట్ల చొప్పున దానమిచ్చారు. 2018–19లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపక చైర్మన్ శివ్‌నాడర్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు.
ప్రకృతి వైద్యులకు జాతీయ అవార్డు
ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ప్రముఖ ప్రకృతి వైద్యుడు డాక్టర్ కేవై రామచందర్‌రావు, ఆయన సతీమణి డాక్టర్ ఎన్జీ పద్మ దంపతులు ‘అబ్దుల్ కలామ్ జాతీయ అవార్డు’కు ఎంపికయ్యారు. ఢిల్లీలోని క్యాపిటల్ ఫౌండేషన్, జస్టిస్ కృష్ణయ్య ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రకటించిన ఈ అవార్డు నవంబరు15న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ వీరికి అవార్డుతో పాటు ‘ఏ లివింగ్ చరక’ అనే బిరుదును ప్రదానం చేశారు.
బాలల శాంతి పురస్కారం
బంగ్లాదేశ్‌లో సైబర్ వేధింపులను అడ్డుకునే కృషిలో భాగంగా మొబైల్ యాప్‌ను రూపొందించిన సదత్ రెహ్మాన్(17)కు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ బాలల శాంతి పురస్కారం లభించింది. హేగ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నాడు. ఈ ప్రఖ్యాత అంతర్జాతీయ బాలల పురస్కారాన్ని గతంలో పాక్‌కు చెందిన మలాలా యూసఫ్‌జాయ్, స్వీడన్ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌బెర్గ్ అందుకున్నారు.
షకీల్ అహ్మద్
జమ్మూ కశ్మీర్లో మెందార్లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ షకీల్ అహ్మద్(31)కు అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన అత్యుత్తమ సైంటిస్టుల జాబితాలో స్థానం లభించింది. ఈయన గ్రీన్ నానో మెటీరియల్స్, బయో పాలిమర్స్‌పై పరిశోధన పత్రాలను, 15 బుక్స్‌ను ప్రచురించారు.
సౌమిత్ర చటర్జీ
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, బెంగాలీ నటుడు, రచయిత సౌమిత్ర చటర్జీ(85) నవంబర్ 15న కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 1935 జనవరి 19న కోల్‌కతాలో జన్మించిన ఆయన ఎన్నో ఉత్తమ చిత్రాల్లో నటించారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, 2012లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది.
దేవిప్రియ మరణం
కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి దేవి ప్రియ(71) నవంబర్ 21న హైదరాబాద్‌లో మరణించారు. ఈయన రాసిన ‘గాలిరంగు’ కవితాసంపుటికి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. గుంటూరు జిల్లా తాటికొండలో 1949లో జన్మించిన ఈయన అసలు పేరు షేక్ ఖాజా హుస్సేన్.
తరుణ్ గొగొయ్
అసోం మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత తరుణ్ గొగొయ్(84) కొవిడ్ అనంతర అనారోగ్య సమస్యలతో నవంబర్ 23న మృతిచెందారు. ఆయన ఆరుసార్లు ఎంపీగా, మూడుసార్లు సీఎంగా(2001–16), రెండు సార్లు కేంద్ర మంత్రిగా పని చేశారు. అసోంలోని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.
అహ్మద్ పటేల్
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్(71) కరోనాతో చికిత్స పొందుతూ గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో నవంబర్ 25న మృతిచెందారు. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన అహ్మద్ పటేల్ సుదీర్ఘ కాలం సోనియా గాంధీకి రాజకీయ సలహాదారుగా వ్యవహరించారు. ఎనిమిది సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మూడుసార్లు లోక్‌సభ, అయిదు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
ఫుట్‌బాల్ దిగ్జజం మారడోనా
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా (60) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 1960 అక్టోబర్ 30న అర్జెంటీనాలో జన్మించిన మారడోనా.. 1986లో అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్ కప్ అందించారు. మెరుపు గోల్స్ కొడుతూ ఫుట్‌బాల్ ఆటలో ‘ది గోల్డెన్ బాయ్’గా పేరు తెచ్చుకున్నారు. నాలుగు సార్లు ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పాల్గొన్న డిగో.. 1990 ప్రపంచ కప్‌లో అర్జెంటీనా జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లారు.