భారత నౌకాదళంలో అగ్నివీర్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్ చిల్కాలో ప్రారంభమయ్యే 02/2024 బ్యాచ్ పేరున ట్రైనింగ్ ఉంటుంది. మే 13 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. ఇంటర్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్ (10+2)/ రెండేళ్ల ఒకేషనల్ కోర్సు లేదా ఇంజినీరింగ్ డిప్లొమా (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఆటోమొబైల్స్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 1 నవంబర్ 2003 నుంచి 30 ఏప్రిల్2007 మధ్యలో జన్మించి ఉండాలి.
సెలెక్షన్: అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్, స్టేజ్-1 (ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్), స్టేజ్-2 (రాత పరీక్ష, శారీరక దార్ఢ్య పరీక్ష- పీఎఫ్‌టీ), మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పురుషులు, మహిళలు కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి.
ట్రైనింగ్: అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్ చిల్కాలో నవంబర్ నెలలో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.36500, నాలుగో ఏడాది రూ.40 వేల వేతనం లభిస్తుంది.
ఎగ్జామ్ ప్యాటర్న్: క్వశ్చన్ పేపర్ హిందీ మరియు ఇంగ్లీష్ మీడియంలో మొత్తం 100 బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున 100 మార్కులను కలిగి ఉంటుంది. ఇంగ్లీష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్… నాలుగు విభాగాల్లో ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి ఒక గంట. నెగెటివ్ మార్కింగ్ అమలులో ఉంటుంది. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.
దరఖాస్తులు: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మే 13 నుంచి మే 27 వరకు దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్‌లో ట్రైనింగ్ ఉంటుంది. పూర్తి వివరాలకు www.joinindiannavy.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.