HomeLATESTఅక్టోబర్​లో ఎన్నికలు.. 100 సీట్లు.. పార్టీ ఆవిర్బావ వేడుకల్లో కేసీఆర్​ : టుడే న్యూస్ ఏప్రిల్...

అక్టోబర్​లో ఎన్నికలు.. 100 సీట్లు.. పార్టీ ఆవిర్బావ వేడుకల్లో కేసీఆర్​ : టుడే న్యూస్ ఏప్రిల్ 27

ఎమ్మెల్యేలకు క్లాస్​ పీకిన సీఎం కేసీఆర్

పార్లమెంటరీ పంథాలో ఏదైనా సాధించవచ్చునని, స్వరాష్ట్ర సాధనతో దాన్ని రుజువు చేయగలిగామని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ అన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ఇప్పుడు దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు బయల్దేరినట్లు చెప్పారు. తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. సరిగా పనిచేయని ఎమ్మెల్యేల తోకలు కత్తిరిస్తామని సీఎం కేసీఆర్ సిట్టింగ్​ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ఇండ్లు వదిలి జనంలో ఉండాలని.. నియోజకవర్గాల్లో మంచిగా పనిచేసుకొని గెలవాలన్నారు. పల్లె నిద్రలాంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలన్నారు. దళితబంధులో కొందరు కమీషన్లు తీసుకున్నారని క్లాస్​ పీకారు. అక్టోబర్​లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముందని, గెలవడం పెద్ద టాస్క్ కాదని, గతంలో కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధించాలన్నారు. తొలి దఫా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 63 సీట్లలో గెలిచామని, రెండో దఫా 88 సీట్లలో విజయం సాధించామని, ఈ సారి వంద సీట్లు గెలవడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల వివరాలు ఇవ్వాలని.. వాటిని పేదలకు పంపిణీ చేద్దామని చెప్పారు. మనం తెలివిగా ఉంటే బండమీద నూకలు పుట్టించవచ్చని ఎమ్మెల్యేలను అప్రమత్తం చేశారు.

Advertisement

బీఆర్​ఎస్ పార్టీ 23వ ఆవిర్భావం సందర్భంగా చేసిన​ తీర్మానాలు

దేశంలో రైతురాజ్యం స్థాపించాలి. ప్రతిరాష్ట్రంలో కనీసం ఒక భారీ నీటి ప్రాజెక్టు నిర్మించాలి. 24 గంటల పాటు దేశ వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే కొత్త పాలసీ అమలు. మన దేశ బ్రాండ్ తో విదేశాలకు ఫుడ్ ప్రాడెక్టు ల ఎగుమతి. దేశ వ్యాప్తంగా దళితబందు. బిసి జనగణన, దేశంలో భారీ స్థాయిలో మౌలిక వసతులు కల్పన. ద్వేషాన్ని విడిచి …ప్రశాంతతకు దేశ పౌరులంతా ఏకం కావాలని తీర్మానాలు చేశారు. పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ప్రవేశపెట్టిన తీర్మానాలను సీఎం కేసీఆర్ బలపరిచారు.

మక్కల కొనుగోలుకు సీఎం కేసీఆర్ నిర్ణయం

యాసంగి మొక్కజొన్న పంట కొనుగోలుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. క్వింటాలు మక్కలకు ప్రభుత్వం రూ.1962 మద్దతు ధర చెల్లిస్తోంది. యాసంగిలో రాష్ట్రంలో దాదాపు 6.50 లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగయింది. 17.37 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనాలున్నాయి.

Advertisement

కాంగ్రెస్​ దీక్షకు రేవంత్ డుమ్మా

రాహుల్​ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ గాంధీ భవన్ లో కాంగ్రెస్​ చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఏఐసీసీ సెక్రటరీ నదీమ్ జావెద్ ఈ దీక్షకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, చిన్నారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. 11 గంటలకు మొదలైన దీక్ష సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. హైదరాబాద్​లోనే ఉన్న రేవంత్​ రెడ్డి చివరి నిమిషం వరకు రాకపోయే సరికి దీక్షను క్లోజ్ చేశారు. ఇటీవల నల్లగొండలో నిరుద్యోగ నిరసన సభకు సంబంధించి ఉత్తమ్ తో తలెత్తిన విభేదాల కారణంగానే రేవంత్​ ఈ దీక్షకు గైర్హాజరైనట్లు ప్రచారం జరిగింది.

అధికారంలోకి రాగానే కేసీఆర్​ అవినీతిపై విచారణ: భట్టి విక్రమార్క

కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతిపై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ జరిపిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పీపుల్స్ ​మార్చ్​ పాదయాత్రలో భాగంగా ఆయన హనుమకొండ జిల్లా స్టేషన్ ఘన్​పూర్​ నియోజకవర్గం వేలేరు మండలంలో పర్యటించారు. రాష్ట్ర ప్రజల సొమ్మును దోపిడీ చేసిన కేసీఆర్ ను​ తెలంగాణ నుంచి తరిమికొట్టాల్సిన అవసరముందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణలో ఎక్కడా సక్కగా నీళ్లు రావడం లేదని ఫైర్​ అయ్యారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం పేరుతో కేసీఆర్ రాష్ట్ర సంపద లూటీ చేశాడని ఆరోపించారు.

పేపర్​ లీక్​ కేసులో బండికి ఊరట

టెన్త్ పేపర్ లీక్ కేసులో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు వేసిన పిటిషన్ ను హనుమకొండ కోర్టు కొట్టేసింది. ఏప్రిల్ 17న పబ్లిక్ ప్రాసిక్యూటర్ హనుమకొండ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ ఇచ్చిన టైంలో పోలీసులు చేసిన సూచనలు బండి సంజయ్ ఉల్లంఘించారని, విచారణకు సహకరించడం లేదని ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు నమోదు చేసుకున్న కోర్టు బెయిల్ రద్దు పై దాఖలైన పిటిషన్ ను కొట్టేసింది.

Advertisement

కేసిఆర్ పై రేపు మరో బాంబు పేల్చనున్న ఆర్ఎస్ ప్రవీణ్

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేపు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 30 లక్షల మంది నిరుద్యోగ యువత జీవితాలను నాశనం చేసిన పేపర్ లీకేజీ కేసులో అసలైన నిందితులను పట్టుకోవడంలో సిట్ విఫలమైందని, ప్రభుత్వం తమకు ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నదని ఆయన విమర్శించారు.  అసలైన నిందితులను  కాపాడుతుందని  ఆరోపించారు. పేపర్ లీకేజీ పై మాట్లాడకుండా సీఎం ఇతర రాష్ట్రాల్లో తిరుగుతూ, తప్పించుకుంటున్నారని ఆయన ఆరోపించారు.  మరికొన్ని కొత్త సాక్ష్యాలతో  రేపు తాను  హై కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ ఇవ్వనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే తెలంగాణ ప్రజలంతా కలిసి కెసిఆర్ ను జైలుకు పంపుతారని ఆయన ట్వీట్ చేశారు.

పాశిగామలో ఇథనాల ప్రాజెక్ట్.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హౌస్ అరెస్ట్

వెల్గటూరు మండలం పశిగామ గ్రామంలో ఇథనాల ప్రాజెక్ట్ కు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతు తెలిపేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను హౌస్ అరెస్ట్ చేశారు. పాశిగామలో భారీగా పోలీసులను మోహరించి గ్రామస్తులను బయటకు రాకుండా కట్టడి చేశారు. రాష్ట్రంలో నిరంకుశ, నియంతృత్వ పాలన సాగుతోందని జీవన్ రెడ్డి విమర్శించారు. దొంగచాటుగా ఇథనాల్ పరిశ్రమకు శంకుస్థాపన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇథనాల్ పరిశ్రమతో పరిసరాలు కలుషితం అవుతాయని అన్నారు.

హోంమంత్రి అమిత్ షాపై పోలీసు కేసు

కేంద్ర హోంమంత్రి అమిత్​ షాపై కర్నాటకలో పోలీస్​ కేసు నమోదైంది. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతాయని ఇటీవల బాగాల్​కోట్​లో జరిగిన ర్యాలీలో అమిత్ షా చేసిన కామెంట్లపై అక్కడ కాంగ్రెస్​ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరులోని హైగ్రౌండ్స్​ పోలీస్​స్టేషన్​లో కేసు పెట్టారు. కాంగ్రెస్‌కు పొరపాటుగా ఓటు వేసినా, రాష్ట్రంలో అవినీతి మునుపెన్నడూ చూడని స్థాయికి చేరుకుంటుందని, అల్లర్లు చెలరేగి యావత్ రాష్ట్రం అవస్థల పాలవుతుందని అమిత్ షా చేసిన కామెంట్లపై కాంగ్రెస్​ నేతలు మండిపడ్డారు.

Advertisement

ఆన్ లైన్ బెట్టింగ్ కు యువకుడి బలి

ఆన్​లైన్​ బెట్టింగుల్లో మోసపోయి ఓ యువకుడు ఇంట్లో సూసైడ్​ చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సంగారెడ్డికి చెందిన అరవింద్​ (30) సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ టెలిగ్రామ్ లో వచ్చిన లింక్ ఓపెన్ చేసి వర్క్ ఫ్రం హోం ఎంచుకున్నాడు. కొన్ని టాస్క్ లకు 200 ఇన్వెస్ట్ చేస్తే 250 రూపాయలను సైబర్ కేటుగాళ్లు పంపించే వారు. దీంతో 12 లక్షల వరకు ఆన్ లైన్ లో బెట్టింగ్ పెట్టాడు. టాస్క్ లు కంప్లిట్ చేసిన తర్వాత సైబర్ కేటుగాళ్ల నుంచి స్పందన రాలేదు. చెల్లి పెళ్లి కోసం దాచుకున్న డబ్బంతా పోవటం, అప్పులు కూడా చేయటంతో మనస్తాపంతో అరవింద్​ ఉరి వేసుకుని చనిపోయాడు.

లవ్​ ఫెయిల్​.. రివాల్వర్​తో కాల్చుకున్న జవాన్​

బేగంపేటలో సీఆర్పీఎఫ్ జవాన్ దేవేందర్ ఆత్మహత్య చేసుకున్నారు. చికోటి గార్డెన్‌ వద్ద సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయారు. మృతుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వాడు. సీఆర్‌పీఎఫ్‌ ఐజీ మహేశ్‌చంద్ర వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ప్రేమ విఫలం కావడంతో దేవేందర్ ​బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

సీబీఐ పై ఎంపీ అవినాష్​ వీడియో నోట్​

వైఎస్​ వివేకానంద హత్య రోజు ఏం జరిగిందో ప్రజలకు తెలియాలని ఏపీ ఎంపీ అవినాశ్​ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన సీబీఐకి ప్రశ్నలు సంధిస్తూ వీడియో రిలీజ్​ చేశారు. అసలు విషయాలు వదిలిపెట్టి ఇదేం దర్యాప్తు అని అన్నారు. వైఎస్​ వివేకా నంద రాసిన లెటర్​, ఆయన ఫోన్​ దాచామన్న సునీత, ఆమె భర్తను ఎందుకు వదిలేశారు అని అడిగారు. లెటర్​, ఫోన్​ పోలీసులకు ఇవ్వకపోవడం నేరం కాదా? అని నిలదీశారు. డాక్యుమెంట్లు తీసుకువెళ్లామని దస్తగిరి చెప్పినా వాటిని ఎందుకు పట్టించుకోలేదన్నారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్​ లెటర్​ను పక్కన పెట్టేసింది ఎవరిని కాపాడటానికి అన్నారు. దర్యాప్తు అంతా వన్​ సైడెడ్​గా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!