తెలంగాణలో లక్షలాది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్ 2 .. గ్రూప్ 4 పరీక్షలకు సంబంధించిన కదలిక మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన తర్వాత.. ఈ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇందులో భాగంగానే తెలంగాణ పోలీస్ నియామక మండలి ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియను మొదలు పెట్టింది. మరోవైపు టీఎస్పీఎస్సీ తెలంగాణ తొలి గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ప్రారంభించింది.
గత నెలలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కూడా నిర్వహించింది. ఈ పోస్టుల్లో ఎక్కువ సీట్లు మహిళలకు కేటాయించారని.. మహిళా రిజర్వేషన్లను సరిగ్గా పాటించలేదని హైకోర్టులో కేసు పడింది. దీంతో పాటు ఎస్టీ రిజర్వేషన్లను పది శాతానికి పెంచుతూ ఇటీవలే ప్రభుత్వం జీవో జారీ చేసింది. వీటికి అనుగుణంగా వివిధ శాఖల్లో ఖాళీలకు సంబంధించిన రోస్టర్ పాయింట్లకు సంబంధించిన మార్పులు తప్పనిసరి అయింది. ఎస్టీ రిజర్వేషన్ల జీవోకు అనుగుణంగా సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌ను సవరిస్తూ, కొత్త రోస్టర్ పాయింట్ల వివరాలతో తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే గెజిట్ జారీ చేసింది. దీంతో ఇప్పటికే టీఎస్పీఎస్సీకి వివిధ విభాగాలు అందించిన ఖాళీల వివరాలు, రోస్టర్ పాయింట్లను మార్చాల్సి ఉంది. అందుకు గ్రూప్2, గ్రూప్ 4 నోటిఫికేషన్ల ప్రక్రియ ఆలస్యమైందని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడు తాజాగా గ్రూప్ 2, గ్రూప్ 4 పరీక్షలకు సంబంధించిన కీలక ప్రక్రియ మొదలైంది. సోమవారం ఈ నెల 14వ తేదీ నుంచి టీఎస్పీఎస్సీ వివిధ శాఖలతో గ్రూప్ 2 పోస్టులు, ఖాళీలపై సమీక్ష నిర్వహించనుంది. ఇటీవల రిజర్వేషన్ల పెంపు, రోస్టర్ పాయింట్లలో చేసిన సవరణల కారణంగా ఇప్పటికే గుర్తించిన గ్రూప్ 2 పోస్టుల జాబితాలో మార్పులు తప్పనిసరి. కొత్త రోస్టర్ పాయింట్లకు అనుగుణంగా రిజర్వేషన్లు, కేటగిరీల వారీగా పోస్టులు మారుతాయని.. వాటిని ఫైనల్ చేసేందుకు అన్ని శాఖలతో మీటింగ్ ఏర్పాటు చేసినట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ నెలలో తుది కసరత్తు పూర్తవుతుందని.. వచ్చే నెలలో గ్రూప్ 2 పోస్టుల రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు ఆదివారం సిద్ధిపేటలో ఎస్సై అభ్యర్థుల శిక్షణా శిబిరాన్ని సందర్శించిన మంత్రి హరీష్‌రావు త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించారు. స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కేలా నిబంధనలు మార్చినట్లు తెలిపారు. దీంతో గ్రూప్ 2 తో పాటు గ్రూప్ 4 నియామక ప్రక్రియకు సంబంధించిన కదలిక మొదలైందని ఆఫీసర్లు చెబుతున్నారు.
Need job