మరో పక్షం రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు, ప్రశ్నపత్రాలు లీకైనందున గతంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను రద్దుచేయాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 60 ఖాళీలు అదనంగా చేర్చి త్వరలో కొత్తగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. వయో పరిమితి సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నియామక బోర్డుల ద్వారా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహించి నియామక ప్రక్రియ పూర్తిచేస్తామని స్పష్టంచేశారు.
రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం
రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్టాఫ్‌నర్సుల పోస్టులను భర్తీచేశామని గుర్తుచేశారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులకు సంపూర్ణమైన విశ్వాసం కల్పించడానికే ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.