ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు హారిజంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యక్ష నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్‌ను మార్కు చేయకుండా ఓపెన్, రిజర్వుడు కేటగిరీల్లో 33 1/3 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని ఆదేశించింది. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేష్ కుమార్ దరియా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక ప్రక్రియలో ఈ మేరకు అమలుచేయాలని స్పష్టం చేస్తూ సీఎస్ శాంతికుమారి ఫిబ్రవరి 1న మెమో జారీ చేశారు. దీంతో సమాంతర రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ సహా వివిధ నియామక బోర్డులు ఫలితాల వెల్లడికి కసరత్తు మొదలు పెట్టాయి.
ఇకపై రిజర్వేషన్స్ ఇలా…
ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు వర్టికల్ రిజర్వేషన్లు అమలవుతాయి. ఆ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులను ఆయా వర్గాలతోనే భర్తీ చేస్తారు. ఒకవేళ వీరు ఓపెన్ కేటగిరీ(ఓసీ)లో మెరిట్‌తో ఓపెన్ పోస్టులకు ఎంపికైతే వారికి రిజర్వు చేసిన పోస్టులు అలాగే ఉంటాయి. వాటిని ఆయా రిజర్వుడు వర్గాల అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేస్తారు. ఇదే పద్ధతిలో మహిళలకు సబార్డినేట్ సర్వీసు నిబంధన రూల్ నం.22ఏ ప్రకారం వర్టికల్ విధానంలో రిజర్వేషన్లు అమలయ్యాయి. ఈ విధానంలో మహిళలు…ఓపెన్‌లో, రిజర్వుడు కేటగిరీల్లో జనరల్ మెరిట్‌లో పోస్టులు సాధించినప్పటికీ, వారికి ప్రత్యేకంగా రిజర్వు చేసిన పోస్టులు వారికే ఉంటాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మహిళలకు ఇక వర్టికల్ రిజర్వేషన్లు వర్తించవు. సమాంతర రిజర్వేషన్ కింద ఆ రిజర్వుడు కేటగిరీలో మహిళలకు 33 1/3 శాతం రిజర్వేషన్ మాత్రమే అమలవుతుంది. ఒకవేళ మెరిట్ ఉంటే జనరల్ కింద రిజర్వు అయిన పోస్టులకు పోటీపడవచ్చు.