త్వరలోనే టెట్ (TSTET 2023) నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ను సెప్టెంబర్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు మొదటి వారంలోనే టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశాలున్నాయని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 45 రోజుల తర్వాత సెప్టెంబర్ రెండో వారంలో పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడు సార్లు టెట్ నిర్వహించారు. 2016, మే 22న తొలిసారి, 2017, జులై13న రెండోసారి పెట్టారు. గతేడాది జూన్ 12న చివరి సారి టెట్ నిర్వహించారు. ఈ నెల మొదటివారంలో ఎంసీఆర్హెచ్ఆర్డీలో విద్యాశాఖ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైన.. వెంటనే టెట్ నిర్వహించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో టెట్ నిర్వహణపై అధికారులు సర్కారుకు నివేదిక అందించారు. దీనికి సర్కారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓకే అన్నట్టు తెలిసింది.
రెండు, మూడు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఈలోపు టీచర్ల భర్తీ ప్రక్రియను కూడా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. టెట్ పూర్తయిన వెంటనే నాలుగైదు వేల పోస్టులతో టీచర్ల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వేసే ఛాన్స్ ఉంది. ఈ నెల 31వ తేదీన జరిగే రాష్ట్ర కేబినేట్ మీటింగ్లో టీచర్ల భర్తీపైనా చర్చ జరిగే అవకాశముంది.