తెలంగాణ లో ఆగస్ట్ 07న పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించే ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూలై 30వ తేదీ నుంచి హాల్‌టికెట్లను కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అయితే అభ్యర్థులకు ఇన్ని రోజుల ప్రిపరేషన్ ఒక ఎత్తయితే పరీక్షారాస్తున్న సమయం అంతే ముఖ్యం. ఇందుకోసం ప్రతి అభ్యర్థి ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లే ముందు, వెళ్లిన తర్వాత పరీక్ష ముగిసే వరకు పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కింద వివరంగా ఇచ్చాము. ప్రతి పాయింట్ చివరి వరకు జాగ్రత్తగా చదివి పరీక్ష రాసేందుకు సిద్ధమవ్వండి. ఆల్ ది బెస్ట్..
- ఎస్సై పరీక్ష రాస్తున్న అభ్యర్థులు భవిష్యత్‌లో ఉద్యోగంలో చేరిన తర్వాత శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. కాబట్టి ఒత్తిడి జయించడం ప్రిలిమ్స్ పరీక్ష నుంచే ప్రారంభించండి.
- పరీక్ష ఆగస్ట్ 07వ తేది ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్ష కోసం 503 సెంటర్లను ఏర్పాటు చేశారు. అన్ని సెంటర్లలో కలిపి 2, 47, 217 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.
- మొత్తం 554 పోస్టులు ఉన్నాయి. కాంపిటీషన్ ఎంత ఉంటుందో అనే ఆందోళనతో పరీక్ష రాయవద్దు.. అందులో ఉన్న పోస్టుల్లో ఒక పోస్టు నాదే అనే ధృఢ సంకల్పంతో పరీక్షను రాయడం మొదలు పెట్టాలి.
- హాల్ టికెట్లు ఆగస్ట్ 05వ తేది అర్ధరాత్రి వరకే వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి అభ్యర్థులు చివరి వరకూ వేచి చూడకుండా ముందే హాల్‌టికెట్ ప్రింట్ తీసుకుని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.
- పరీక్షా కేంద్రాన్నీ వీలైనంత వరకు ఒక రోజు ముందే విజిట్ చేయండి. పరీక్ష రోజే సెంటర్‌ను వెతకడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. అది పరీక్షపై ప్రభావం చూపుతుంది. నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించరు కాబట్టి సమయానికి ముందే సెంటర్‌కు చేరుకోవాలి. గంట ముందే అభ్యర్థులను పరీక్షా హాలులోకి అనుమతిస్తారు.
- ఎగ్జామ్ సెంటర్లోకి ఏ విధమైన ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్‌ఫోన్స్, గ్యాడ్జెట్స్, పర్సులు అనుతమించరు. ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు జ్యూవెలరీ కూడా లోపలికి అనుమతించమని స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పరీక్షా కేంద్రంలో వస్తువులు భద్రపరుచుకునేందుకు ఎలాంటి సదుపాయాలు ఉండవు కాబట్టి వీలైనంత మేర ఎలాంటివి తీసుకురాకపోవడం ఉత్తమం.
- అభ్యర్థులు ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ చేసేందుకు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ వెంట తెచ్చుకోవాలి. బ్లాక్ బాల్ పాయింట్ పెన్ అయితే బెటర్. ఓఎంఆర్ షీట్ స్కానింగ్‌లో బ్లాక్ పెన్ అయితే కంప్యూటర్ జవాబును తొందర గుర్తిస్తుంది.
- ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షలో ఈ సారి కొత్తగా బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకొచ్చారు. ప్రతి అభ్యర్థికి డిజిట్ ఇమేజ్ మరియు ఫింగర్ ఫ్రింట్స్ తీసుకున్న తర్వాతనే పరీక్షా హాలులోకి అనుమతి స్తారు. అయితే బయోమెట్రిక్ సరిగ్గా రావాలంటే అభ్యర్థులు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులకు టాటూస్ కానీ , మెహందీ కానీ ఉండకూడదు. వీటి వల్ల బయోమెట్రిక్ రాదు.
- ఓఎంఆర్ షీట్‌పై ఎలాంటి పిచ్చి గీతలు కానీ పేర్లు కానీ, ఇష్టదైవాల పేర్లు కానీ, సింబల్స్, ఫోన్ నంబర్ కానీ ఎలాంటి రాతలు రాయకూడదు. ఇలా చేస్తే మీ ఓఎంఆర్ షీట్‌ను కంప్యూటర్ స్కాన్ చేయదు . మీ రిజల్ట్ కూడా రాదు.
- క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మొత్తం ప్రశ్నలు ఉన్నాయా లేదా క్వశ్చన్ నంబర్స్ ఎక్కడైనా మిస్సయ్యాయా లేదా చెక్ చేసుకోవాలి. ప్రింట్ సరిగ్గా లేకపోయినా… ఎగ్జామినర్‌కు తెలియజేయాలి.
- క్వశ్చన్ పేపర్ మీరు ఎంచుకున్న భాష ప్రకారం ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది. కాబట్టి ఇచ్చిన ప్రశ్నలు కొన్ని పదాలు తెలుగులో అర్థం కాకపోతే ఇంగ్లీష్‌లో చదువుకుని అర్థం చేసుకుంటే ఈజీగా జవాబును గుర్తించవచ్చు.
- ముఖ్యంగా ఎస్సై ప్రిలిమ్స్‌లో నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఊహించి సమాధానాలు గుర్తించడం వల్ల చాలా నష్టపోతారు. మీకు సరిగ్గా తెలిసిన వాటికి మాత్రమే జవాబులు గుర్తించండి. 60 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని పరీక్ష రాయండి.
- ప్రతి అభ్యర్థి పరీక్షా ఫలితాలు వెలువడేంత వరకు హాల్‌టికెట్‌ను తప్పనిసరిగా భద్రపరుచుకోవాలి. తర్వాత వెబ్సైట్లో కూడా హాల్‌టికెట్లు అందుబాటులో ఉండవని గుర్తుపెట్టుకోవాలి. పై విషయాలు మరొక్కసారి చదువుకుని జాగ్రత్తగా పరీక్ష రాయండి.. అందరికీ ఆల్ ది బెస్ట్..