దేశంలో అత్యధిక ఉద్యోగులను కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వేస్. నెట్‍వర్క్ పరంగా ప్రపంచంలో నాలుగోస్థానంలో నిలిచి ఏటా లక్షల ఉద్యోగులను నియమించుకుంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, అధిక వేతనాలు, ఉద్యోగ భద్రత, ఆకర్షించే ప్రోత్సాహకాలు, ప్రమోషన్లు, ఉచిత రైలు ప్రయాణం వంటి సదుపాయాలుండటంతో రేల్వే ఉద్యోగాలంటే యువతలో యమ క్రేజ్. దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ(రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెన్త్, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రిపరేషన్ గురించి తెలుసుకుందాం..
రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని భారతీయ రైల్వేలకు లోకో పైలట్ స్థానం సాధారణం. లోకో పైలట్ అనేది రైళ్లను నడపడానికి మరియు రవాణా సమయంలో రైళ్లను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి అవసరమైన వ్యక్తి. ఇది భారతీయ రైల్వేలో ఉన్నతమైన స్థానం. లోకో పైలట్ అసిస్టెంట్ యొక్క విధులు రైలును సజావుగా నడపడానికి లోకో పైలట్‌కు సహాయం చేయడం. లోకో పైలట్ పనిలో లోకోమోటివ్ ఇంజిన్ యొక్క సరైన పనితీరును నిర్వహించడం, రైలులో మరమ్మత్తు మరియు నిర్వహణ పనులను నిర్వహించడం, సిగ్నల్ మార్పులను తనిఖీ చేయడం మరియు ఇతర రైల్వే అధికారులతో పరస్పర చర్య చేయడం వంటి అనేక ముఖ్యమైన కార్యకలాపాలు ఉంటాయి.
ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్.
సెలెక్షన్ ప్రాసెస్: ఫస్ట్ స్టేజ్ సీబీటీ-1, సెకండ్ స్టేజ్ సీబీటీ-2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: సీబీటీ-1కు 60 నిమిషాల సమయం ఉంటుంది. 75 ప్రశ్నలు, 75 మార్కులు కేటాయించారు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ అంశాల్లోప్రశ్నలు వస్తాయి. సీబీటీ-2లో రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్-ఏ విభాగానికి 90 నిమిషాల వ్యవధి, 100 ప్రశ్నలు; పార్ట్-బి విభాగానికి 60 నిమిషాల వ్యవధి, 75 ప్రశ్నలు వస్తాయి. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. పార్ట్-ఏలో మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్; పార్ట్-బిలో సంబంధిత ట్రేడ్ సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
సిలబస్ అండ్ ప్రిపరేషన్
జనరల్ అవేర్‌నెస్: జనరల్ అవేర్‌నెస్‌లో భాగంగా అభ్యర్థి ముఖ్యంగా స్టాటిక్ జీకే, కరెంట్ ఎఫైర్స్, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ లాంటి అంశాలపై బేసిక్ నాలెడ్జ్ పెంపొందించుకోవాలి. స్టాటిక్ జీకేలో దేశాలు, రాజధానులు, పార్కులు, బయోస్పియర్ రిజర్వాయర్లు, ప్రముఖ సరస్సులు, జలపాతాలు, గిరిజన తెగలు, నృత్యాలు, గ్రంథాలు, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలపై ఎక్కువ ఫోకస్ చేయాలి. కరెంట్ ఎఫైర్స్ లో భాగంగా ప్రతి రోజు కనీసం రెండు న్యూస్ పేపర్స్ చదవాలి. గడిచిన సంవత్సర కాలంలో జరిగిన వివిధ రకాల సదస్సులు, సమావేశాలు వాటి థీమ్స్, రాజకీయ మార్పులు, ఆర్థిక సామాజిక మార్పులు మొదలగు సమకాలీన అంశాలపై విశ్లేషనాత్మక అవగాహన పెంపొందించుకోవాలి.
చరిత్ర: హిస్టరీ సబ్జెక్ట్‌కి సంబంధించి ప్రధానంగా వివిధ యుద్ధాలు, ఒడంబడికలు జరిగిన సంవత్సరాలు, జైన, బౌద్ధ మతాలు, రాజవంశాల కాలక్రమం, ముఖ్యమైన శాసనాలు, రాజులు – బిరుదులు, ప్రముఖ కవులు, గ్రంథాలు – రచయితలు, భక్తి ఉద్యమకారులు, భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు, దండయాత్రలు, బ్రిటీష్ కాలంలోని కమిషన్లు, స్వాతంత్ర్య సమరయోధులు, బ్రిటీష్ పాలన కాలంలోని ప్రధానమైన ఘట్టాలు మొదలగు అంశాలు చదవాలి.
పాలిటీ: పాలిటీలో భాగంగా రాజ్యాంగ పరిషత్ ముఖ్యంశాలు, రాజ్యాంగంలోని భాగాలు, షెడ్యూల్స్, ముఖ్యమైన ప్రకరణలు, రాజ్యాంగ సవరణలు, ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు, కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్, సుప్రీంకోర్ట్, రాష్ట్రప్రభుత్వం, హైకోర్టు లాంటి అంశాలపై ప్రాథమిక అవగాహన పెంపొందించుకోవాలి.
ఎకానమీ: అర్థశాస్త్రంలో నీతిఆయోగ్, ద్రవ్యం, జాతీయాదాయం, పేదరికం, కేంద్ర, రాష్ట్ర బడ్జెట్, వ్యవసాయరంగం, పారిశ్రామికరంగం, సేవారంగం, ఆర్థికసర్వే లాంటి అంశాలు ప్రిపేర్ అవ్వాలి.
జాగ్రఫీ: జాగ్రఫీలో హిమాలయాలు, అడవులు, పీఠభూములు, ఖనిజాలు, నదీవ్యవస్థ, దేశనైసర్గిక స్వరూపం, రైల్వే వ్యవస్థ, విశ్వం, గ్రహాలు, నక్షత్రాలు, మహాసముద్రాలు, పంటలు, రుతువులు మొదలగు అంశాల గురించి అవగాహన పెంచుకోవాలి.
జనరల్సైన్స్: జనరల్ సైన్స్‌లో భాగంగా వ్యాధులు, రక్తవర్గాలు, విటమిన్లు, భౌతికశాస్త్ర కొలతలు, ప్రమాణాలు, ఆవర్తనపట్టిక, ఆమ్లాలు క్షారాలు, రసాయనిక నామాలు చదవాలి.
ప్రాక్టీస్‌తో మ్యాథ్స్‌లో స్కోరింగ్
ఈ విభాగంలో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అంశాలు ఉంటాయి. ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారో తెలుస్తుంది. ముఖ్యమైన చాప్టర్లపై ఫోకస్ చేస్తూ ప్రిపేర్ కావాలి.
మ్యాథ్స్: నంబర్ సిస్టమ్, బాడ్‌మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎమ్, హెచ్‌సీఎఫ్, రేషియో అండ్ ప్రపోషన్, పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జియోమెట్రి, ట్రిగనోమెట్రి, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, క్యాంలెండర్ అండ్ క్లాక్, పైప్స్ అండ్ పిస్టన్స్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
మెంటల్ ఎబిలిటీ: అనాలజీ, అల్ఫాబిటికల్ అండ్ నంబర్ సిస్టమ్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటిక్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, షిలాజియం, జంబ్లింగ్, వెన్ డయాగ్రమ్, డాటా ఇంట్రప్రిటేషన్, డిషిసన్ మేకింగ్, అనలటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అంశాలపై ఫోకస్ చేయాలి.
ప్రీవియస్ పేపర్స్‌పై ఫోకస్
ఈ విభాగంలో భాగంగా వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఇందులో మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది కావున ఎక్కువ ఫోకస్ చేయాలి. ప్రీవియస్ పేపర్స్‌లో ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తూ సీటింగ్ అరేంజ్మెంట్, ఫజిల్ టెస్ట్, లాజికల్ వెన్ డయాగ్రమ్స్ మరియు డాటా ఇంటర్‌ప్రిటేషన్‌కి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. అనాలజీ, భిన్నపరీక్ష, శ్రేడులు, కోడింగ్ – డీకోడింగ్, గణిత పరిక్రియలు, రక్త సంబంధాలు, దిక్కులు, ర్యాంకింగ్, తీర్మానాలు, వెన్ డయాగ్రమ్స్, మిస్సింగ్ నంబర్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, ఫజిల్స్, డాటా ఇంటర్ ప్రిటేషన్, ప్రకటనలు–నిర్ధారణల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. ప్రతి టాపిక్కు నిర్దిష్టమైన సమయం కేటాయించుకొని ఎక్కువ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. దీంతో స్పీడ్, అక్యూరసీ పెరుగుతోంది. టాపిక్ వైస్ మాక్‌టెస్టులు రాయాలి.
నోటిఫికేషన్
పోస్టులు: మొత్తం 5,696 ఖాళీలు ఉన్నాయి. యూఆర్- 2499; ఎస్సీ- 804; ఎస్టీ- 482; ఓబీసీ- 1351; ఈడబ్ల్యూఎస్- 560; ఎక్స్‌ఎస్‌ఎం- 572 పోస్టులు ఉన్నాయి. సికింద్రాబాద్ జోన్లో 758 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ(ఫిట్టర్/ ఎలక్ట్రీషియన్/ ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్/ మిల్‌రైట్/ మెయింటెనెన్స్ మెకానిక్/ మెకానిక్- రేడియో అండ్ టీవీ/ ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ మెకానిక్- మోటార్ వెహికల్/ వైర్‌మ్యాన్/ ట్రాక్టర్ మెకానిక్/ ఆర్మేటర్ అండ్ కాయిల్ వైండర్/ మెకానిక్- డీజిల్/ హీట్ ఇంజిన్/ టర్నర్/ మెషినిస్ట్/ రిఫ్రజెరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ మెకానిక్) పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసినవారూ అర్హులు.
వయసు: 1 జులై -2024 నాటికి 18- నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. పూర్తి వివరాలకు www.indianrailways.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.