HomeLATESTమున్సిపల్​ జాబ్స్​ (వార్డు ఆఫీసర్)​​: 2019 తెలంగాణ మున్సిపల్​ చట్టం స్టడీ మెటీరియల్​

మున్సిపల్​ జాబ్స్​ (వార్డు ఆఫీసర్)​​: 2019 తెలంగాణ మున్సిపల్​ చట్టం స్టడీ మెటీరియల్​

Telangana Municipal Jobs (ward officers): TS Municipal Act 2019 STUDY Material

రాష్ట్రంలోని మున్సిపాలిటీలు.. కార్పొరేషన్లన్నింటా మెరుగైన పాలనను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మున్సిపల్‌ చట్టం 2019ని రూపొందించింది. అంతర్జాతీయంగా పట్టణీకరణ రోజు రోజుకూ విస్తరిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటినుండి పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాలు పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నది. హైదరాబాద్‌ నగరం విశ్వనగరంగా వృద్ధి చెందడంతోపాటు వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం లాంటి నగరాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. పెరుగుతున్న నగరీకరణ, పట్టణీకరణకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నది.

ప్రపంచవ్యాప్తంగా నేడు 50 శాతం జనాభా పట్టణాల్లోనే జీవిస్తున్నది. 2050 నాటికి ప్రపంచ పట్టణ జనాభా 70శాతానికి చేరుకుంటుందని అంచనా.

తెలంగాణ రాష్ట్రంలో 42.6 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తున్నది. పట్టణీకరణలో దేశంలోనే 5వ స్థానానికి చేరుకున్న తెలంగాణలో పట్టణ జనాభా మరో ఐదేళ్లలో 50 శాతానికి చేరుకుంటుందని అంచనా. అంటే…రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలోని సగం జనాభా పట్టణాల్లోనే నివసించబోతున్నది.

Advertisement

ప్రస్తుతం రాష్ట్రంలో పట్టణాలు, నగరాలలో పాలన కోసం 6 వేర్వేరు చట్టాలు అమల్లో ఉన్నాయి. అవన్నీ చాలా కాలం క్రితం అమల్లోకి వచ్చాయి. పట్టణ పరిపాలనలో ఎన్ని సంస్కరణలు అమలు చేసినా, ఎంత ఖచ్చితంగా వ్యవహరించినా ఆయా చట్టాల్లో ఉన్న లొసుగులు, లోపాల వల్ల మంచి ఫలితాలు రావడం లేదు. దీనివల్ల పట్టణ ప్రణాళిక అనుకున్న విధంగా అమలు కావడంలేదు.

మున్సిపాలిటీల చట్టం 1965 రూపొందించబడగా.. మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం 1994లో, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ చట్టం 1920లో., అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ చట్టం 1975లో, జీహెచ్‌ఎంసీ యాక్టు 1955లో, హెచ్‌ఎండీఏ యాక్టు 2008 లో తయారు చేయబడ్డాయి.

ఇపుడు పరిస్థితి మారింది. అవసరాలు మారాయి. జనాభా పెరిగింది. కొత్త కొత్త వసతులు అవసరం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాత చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సంస్కరణలు తెచ్చి, అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా, పౌర సేవలు త్వరితగతిన అమలయ్యేలా కొత్త చట్టాలు రావాల్సి ఉంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వివిధ రకాల అనుమతులు పొందడానికి ప్రజలకు ఎదురవుతున్న అనేక ఇబ్బందులను నివారించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో కొత్తగా అనేక పరిశ్రమలు, కంపెనీలు వస్తున్నాయి. వాటి స్థాపనకు అక్కరకురాని నిబంధనలు అడ్డు కాకుండా, పారదర్శకమైన అనుమతుల విధానం తెచ్చుకోవాలి. అన్ని నగరాలు, పట్టణాలు ఎటు పడితే అటు కాకుండా, ఎట్ల పడితే అట్ల కాకుండా ప్రణాళికాబద్ధంగా, పద్ధతి ప్రకారం అభివృద్ధి కావాలి. సరైన ప్రణాళిక లేకుంటే, ముందుచూపుతో వ్యవహరించకుంటే ఎంత పెద్ద నగరాలైనా చెత్తకుప్పలుగా, తాగునీటికి కూడా నకనకలాడే దుర్భర పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అందుకు ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలే ఉదాహరణ. మన హైదరాబాద్‌తో పాటు, ఇతర నగరాలు కూడా అలా కాకుండా ఉండటం కోసం మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. ముందుచూపుతో భవిష్యత్‌ను నిర్మించాలనే మంచి లక్ష్యంతోనే ప్రభుత్వం కొత్త అర్బన్‌ పాలసీని తీసుకొస్తున్నది.

కొత్త మున్సిపల్‌ చట్టంలోని ముఖ్యాంశాలు :

 • రాష్ట్ర అసెంబ్లీ ఇటీవల ఆమోదించిన సరికొత్త మున్సిపల్‌ చట్టం ప్రణాళికాబద్ధమైన పట్టణాభివృద్ధి లక్ష్యంగా రూపొందింది. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ప్రజలు మెరుగైన రీతిలో నివసించేలా ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.
 • గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహా, కొత్తగా ఏర్పడిన ఏడుకార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీలకు ఈ చట్టం వర్తిస్తుంది.
 • పట్టణ ప్రజలు శాంతియుతంగా, ప్రశాంతమైన వాతావరణంలో నివసించేలా కట్టుదిట్టమైన నిబంధనల్ని ఇందులో పొందుపరిచారు.
 • మొత్తం ఏడు అధ్యాయాలుగా రూపొందిన ఈ చట్టంలో తొలి అధ్యాయం చట్టంలోని ప్రాథమిక అంశాలను చర్చించింది. మిగిలిన వాటిలో మున్సిపాలిటీల ఏర్పాటు, ఆదాయం, మంచినీటి సరఫరా విధులు, టౌన్‌ప్లానింగ్‌, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, ఎన్నికల నిర్వహణ, ఇతర అనుబంధ చట్టా లు, నిబంధనలు ఉన్నాయి.
 • పురపాలక శాఖకు సంబంధించిన ప్రతిపదం గురించి చట్టంలో విశ్లేషించారు.
 • కొత్త చట్టంలో మేయ ర్లు, మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్లకు ప్రత్యేకంగా విధులు, బాధ్యతలను పొందుపరిచారు.
 • వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రతి మున్సిపాలిటీలో యువత, మహిళలు, పెద్దలు, నిపుణులతో కలిసి 15 మంది సభ్యుల కమిటీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు.
 • గతానుభవాలను, భవిష్యత్తు అవస రాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం…ఇకపై నగర పంచాయతీలు ఉండవు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మాత్రమే ఉంటాయి. అన్ని యూ.ఎల్‌.బీలు వార్డులతో సహా కొత్త మున్సిపల్‌ చట్టం పరిధిలోకి వస్తాయి.
 • ఈ చట్టంలో మార్పులు, చేర్పులు, సవరణలు చేసే పూర్తి అధికారం రాష్ట్ర శాసనసభకే ఉంటుంది.
 • ఛైర్‌ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లందరికీ విధిగా శిక్షణ, పునఃశ్ఛరణ నిర్వహించాలనీ, శిక్షణకోసం అర్బన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేయాలనీ, అభివృద్ధి ప్రక్రియలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంచాలని, ఇందుకోసం ప్రతి వార్డులో 4 రకాల వార్డు కమిటీలు నియమించాలనీ చట్టంలో పొందుపరిచినారు.
 • వాటితో పాటుగా పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం లాంటి కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ, అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములను చేస్తూ.. ప్రతి వార్డులో యూత్‌ కమిటీ, వుమెన్‌ కమిటీ, సీనియర్‌ సిటిజెన్స్‌ కమిటీ, ఎస్‌.హెచ్‌.జీ/రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వంటి గ్రూపులతో మరో కమిటీ లు ఏర్పాటు చేయాలని చట్టం సూచించింది.
 • మున్సిపాలిటీ పాలకవర్గానికి అవసరమైన సలహాలు, సూచనలను ఈ కమిటీలు అందిస్తాయి.
 • ఈ కమిటీలు ప్రతి 3 నెలలకోసారి విధిగా సమావేశమవుతూ మినిట్స్‌ రాస్తాయి.
 • ఆ మినిట్స్‌ను కచ్చితంగా మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పెట్టి చర్చించాలనే నిబంధనను నూతన మున్సిపాలిటీ చట్టం చెప్తోంది.

మున్సిపల్‌ కమిషనర్‌ బాధ్యతలు :

 • భారత రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్‌ 243వ ఆర్టికల్‌ ప్రకారం మున్సిపల్‌ కమిషనర్లకు ప్రత్యేక జాబ్‌ చార్ట్‌ ఉంది.
 • రోడ్లు, డ్రైనేజీలు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించడం, నిర్వహించడం కమిషనర్లదే బాధ్యత. ప్రజలకు సురక్షిత మంచినీరు సరఫరా చేయడం, శానిటేషన్‌ పనులు నిర్వహించడం, సమర్ధవంతంగా వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ చేయడం, ప్రతి ఇంటినుండి చెత్తను సేకరించడం, రోడ్లను శుభ్రంగా ఉంచడం, చెత్తను జాగ్రత్తగా డంప్‌ యార్డులకు తరలించడం,
 • మురికివాడలలో అభివృద్ధి పనులు చేయడం,
 • నైట్‌ షెల్టర్లను నిర్వహించడం,
 • బస్సు షెల్టర్లు నిర్మించడం,
 • స్మశాన వాటికలు, బొందలగడ్డలు నిర్వహించడం, విద్యుత్‌ స్మశాన వాటికలు నిర్మించి, వాటిని వాడుకునేలా ప్రజలను చైతన్య పరచడం,
 • వీధిదీపాలు వెలిగేట్లు చూడటం,
 • పట్టణవ్యాప్తంగా పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేయడం,
 • రోడ్డు డివైడర్లు ఏర్పాటు చేయడం,
 • స్లాటర్‌ హౌజ్‌లను నియంత్రిత పద్ధతిలో నిర్వహించడం,
 • ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేపట్టే ప్రాధాన్యతా కార్యక్రమాలను అమలు చేయడం.. వంటి పౌరసేవల బాధ్యతలను మున్సిపల్‌ కమీషనర్లు నిర్వర్తించాల్సి వుంటుంది.
 • వీటితో పాటు కమిషనర్లు, మున్సిపల్‌ ఉద్యోగులు జిల్లా కలెక్టర్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేయాల్సి ఉంటుందనే నిబంధనలు ఉన్నాయి.

మున్సిపాలిటీలు – కలెక్టర్ల బాధ్యతలు :

 • జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని మున్సిపాలిటీలు, యూ.ఎల్‌.బీలలో జరిగే అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములు కావాలి.
 • శాఖల మధ్య కలెక్టర్‌ సమన్వయం చేయాలి.
 • డిస్ట్రిక్ట్‌ లెవల్‌ గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలోనే తయారుచేసి, అమలు చేయాలి.
 • దీనికోసం ఆయా మున్సిపాలిటీలలో బడ్జెట్‌ కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు మున్సిపాలిటీల విషయంలో బాధ్యతలను నూతన చట్టంలో పొందుపరిచినారు.

ఆస్తిపన్ను చెల్లింపు.. సెల్ఫ్‌ డిక్లరేషన్​ విధానం:

మున్సిపాలిటీ పరిధిలో ఆస్తిపన్ను చెల్లింపు ప్రాధాన్యత అంశం. అయితే ఆస్తిపన్నును చెల్లించే విషయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్తిపన్నును నిర్ధారించడం, సవరించడం, వసూలు చేయడం తదితర ప్రక్రియల్లో అవినీతిని, జాప్యాన్ని నివారించడానికి కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు.. ఆస్తిపన్ను విధింపు, వసూలు విషయంలో మున్సిపల్‌ అధికారులు, సిబ్బందికి జవాబుదారీతనం కల్పించే విధంగా చట్టంలో నిబంధనలు పెట్టింది ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న చట్టంలో ఆస్తిపన్ను వసూలు చేసినా, చెయ్యకున్నా అధికారులు, ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకొనే వెసులుబాటు లేదు. కొత్త చట్టంలో అలా ఉండదు. బాధ్యులపై చర్యలు తీసుకుంటారు.

Advertisement
 • ఆస్తిపన్ను వసూళ్లలో పారదర్శకత సాధించడానికి కొత్త చట్టం ఉపయోగపడుతుంది.
 • ప్రజలు ఎవరికి వారు తమ ఆస్తి విలువను అంచనా వేసుకునే సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టినారు.
 • సెల్ప్‌ డిక్లరేషన్‌ ఆధారంగానే ఆస్తిపన్ను విధిస్తారు.
 • ప్రజల జవాబుదారీ తనం మీద పూర్తిగా విశ్వాసంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
 • ఒకవేళ ఎవరైనా తమ ఆస్తిని తక్కువగా లేదా తప్పుగా అంచనా వేస్తే వారిని కఠినంగా శిక్షించే విధంగా, భారీగా జరిమానా విధించే విధంగా నిబంధనలు నూతన మున్సిపాలిటీ చట్టంలో పొందుపరిచింది
 • ప్రభుత్వం. ఆస్తిపన్ను మాదిరిగానే మున్సిపాలిటీల్లో ట్రేడ్‌ లైసెన్సులు కూడా సెల్ప్‌ డిక్లరేషన్‌ ఆధారంగానే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మున్సిపాలిటీల బడ్జెట్‌ :

 • వాస్తవానికి మున్సిపాలిటీలు అనగానే వాటికి బడ్జెట్‌ కేటాయింపులు తక్కువ అనే భావన ఉంటుంది. కానీ నూతన చట్టం ప్రకారం బడ్జెట్‌ కేటాయింపులకు ప్రాధన్యత కల్పించినారు. ఆయా పట్టణాల ప్రాధాన్యతలు గుర్తించి దానికి అనుగుణంగా, పట్టణాలు ఆరోగ్య కరంగా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందేలా బడ్జెట్‌ కేటాయింపులు ఉండాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థికంగా సహకారం అందిస్తుంది.
 • పట్టణాల అభివృద్ధి కోసం కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చే నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్‌ లో నిధులు కేటాయిస్తుంది.
 • మున్సిపాలిటీల బడ్జెట్‌ తయారీలో కలెక్టర్లు భాగస్వాములు కావాలి. మార్గదర్శకులు గా వ్యవహరించి మున్సిపాలిటీల బడ్జెట్‌ సమావేశంలో విధిగా పాల్గొనాలి.
 • ఆయా సంవత్సరంలో వచ్చే ఆదాయం, చేయాల్సిన ఖర్చులను బేరీజు వేసుకుంటూ బడ్జెట్‌ రూపొందాలి.
 • గ్రీన్‌ కవర్‌ కోసం కేటాయించినట్లుగానే శానిటేషన్‌ పనుల కోసం కూడా బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు ఉండాలి.
 • చెత్తను సేకరించడానికి అవసరమైన వాహనాలు, పరికరాల కొనుగోలు కోసం నిధులు సమకూర్చాలి. వీధిలైట్ల కోసం చెల్లించాల్సిన విద్యుత్‌ బిల్లులు, మంచినీళ్ల బిల్లులు కూడా కచ్చితంగా బడ్జెట్‌ లోనే పొందుపర్చాలి. ఈ రెండింటినీ ఎప్పటికప్పుడు విధిగా సంబంధిత సంస్థలకు చెల్లించాలి.
 • మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు చేసిన అప్పులను తీర్చేందుకు బడ్జెట్‌ లో కేటాయింపులు ఉండాలి. పార్కులు, ప్లే గ్రౌండ్‌లు, ఓపెన్‌ స్పేస్‌లను నిర్వహించడానికి నిధులు కేటాయించాలి.
 • దహన వాటికలు, ఖనన వాటికలను నిర్వహించడానికి నిధులు కేటాయించాలి.
 • పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మించడానికి నిధులు కేటాయించాలి.
 • 50 వేల జనాభాకు ఒకటి చొప్పున వేర్వేరుగా వెజిటేరియన్‌, నాన్‌ వెజిటేరియన్‌ మోడల్‌ మార్కెట్లు నిర్మించడానికి నిధులు కేటాయించాలి.
 • మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ మోడల్‌ మార్కెట్ల డిజైన్లను రూపొందించాలి. దాని ప్రకారమే నిర్మాణాలు జరగాలి.
 • డంప్‌ యార్డులను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలి. దీనికోసం నిధులు కేటాయించాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్తగా విలీనమైన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
 • అభివృద్ధికి నోచుకోని మురికివాడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
 • మున్సిపాలిటీలు తయారుచేసిన బడ్జెట్‌ కాపీని ఆర్థిక సంవత్సరం ముగియడానికి 15 రోజుల ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలి.

బిల్డింగ్​ పర్మిషన్​..టౌన్​ ప్లానింగ్​ (భవన నిర్మాణ అనుమతులు, పట్టణ ప్రణాళిక)

 • పట్టణాభివృద్ధిలో టౌన్‌ ప్లానింగ్‌ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. టౌన్‌ ప్లానింగ్‌ విషయంలో ప్రజల నుండి అనేక ఫిర్యాదులు వస్తుంటాయి. భవన నిర్మాణ అనుమతులు పొందే విషయంలో అనేకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ పొందడానికి అవస్థలు పడాల్సి వస్తున్నదని ప్రజలు తరుచుగా ఫిర్యాదులు చేస్తుంటారు.
 • మున్సిపల్‌ కార్యాల యాలకు రావాల్సిన అవసరం లేకుండానే, ఎవరినీ వ్యక్తిగతంగా కలవాల్సిన అవసరం లేకుండానే తేలికగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా భవన నిర్మాణ అనుమ తులు పొందడానికి కొత్త చట్టం వెసులుబాటు కల్పిస్తున్నది.
 • 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 10 మీటర్ల ఎత్తులో నిర్మించే నివాస భవనాలకు సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ ద్వారా ఆన్‌ లైన్‌ లో సత్వరమే అనుమతులు లభిస్తాయి.
 • అనుమతి పొందిన ప్లాన్‌ ద్వారా నిర్మించిన భవనాలకు సంబంధించి న మార్టిగేజ్‌ ఏరియాను కూడా సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ ద్వారానే రిలీజ్‌ చేస్తారు.
 • 500 చదరపు మీటర్ల విస్తీర్ణం, 10 మీటర్ల ఎత్తుకన్నా ఎక్కువ ఉన్న భవనాల నిర్మాణ అనుమతి కోసం ఆన్‌లైన్‌ సింగిల్‌ విండో విధానం ప్రవేశ పెట్టి, దీనికోసం వెబ్‌ సైట్‌ రూపొందిస్తారు.
 • 21 రోజుల్లోనే నిర్మాణ అనుమతులు సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ ద్వారా లభిస్తాయి.
 • అదే విధంగా 15 రోజుల్లోగానే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌, మార్టిగేజ్‌ రిలీజ్‌ కావాలని నిబంధన పెట్టారు. నిర్ణీత కాల వ్యవధిలో అనుమతులు ఇవ్వకుంటే ఇంటి యజమాని పర్మిషన్‌ పొందినట్లుగానే భావించవచ్చు.
 • అనుమతులు ఇచ్చే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకునే అధికారం ఈ చట్టం ప్రకారం ప్రభుత్వానికి ఉన్నది.
 • అనుమతి పొందిన యజమాని 6 నెలల్లో నిర్మాణం ప్రారంభించి, మూడేళ్లలో పూర్తి చేయాలి.
 • ఎక్కువ ఎత్తులో నిర్మించే భవనాలు ఐదేళ్లలో పూర్తిచేయాలి.
 • మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా రూపొందించే లే ఔట్లకు సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ విధానం ద్వారానే ఆన్‌లైన్‌లో తాత్కాలిక అనుమతి పొందే వెసులుబాటు కల్పిస్తున్నారు.
 • లే ఔట్‌ రూపొందించడం ద్వారా అందులో రెండేళ్లలోపే మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు కామన్‌ ఏరియాను మున్సిపాలిటీలకు రిజిస్టర్‌ చేయాలి. ఈ రెండు పనులు పూర్తయిన వెంటనే సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ ఆధారంగా లే ఔట్‌ కు ఫైనల్‌ అప్రూవల్‌ ఇవ్వాలి.
 • మున్సిపాలిటీలలో లే ఔట్లకు అనుమతి ఇచ్చేందుకు కలెక్టర్‌ నాయకత్వంలో లే ఔట్‌ అప్రూవల్‌ కమిటీ ఏర్పాటు అవుతుంది.
 • యజమానులు తమకు తాముగా ఇచ్చే సమాచారం ఆధారంగానే, వారిపై నమ్మకంతోనే సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ విధానం ద్వారా అనుమతులు ఇస్తారు.
 • వారు తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకునే విధంగా.. భారీ జరిమానాలు విధించే విధంగా చట్టంలో నిబంధనలను రూపొందించినారు.

ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీ :

 • కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగర ప్రాంతాల్లో ప్రణాళిక ప్రకారం ప్రగతి సాధించడం కోసం ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీని రూపొందించింది.
 • వాక్‌ టు వర్క్‌ కాన్సెప్ట్‌తో రూపొందే టౌన్‌షిప్‌ లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తారు.
 • లే ఔట్లు, భవన నిర్మాణాల అనుమతుల కోసం రూపొందించిన నిబంధనలు సక్రమంగా అమలు చేయడం కోసం జిల్లాస్థాయిలో కలెక్టర్‌ నేతత్వంలో ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ ను ఏర్పాటు చేస్తారు.
 • ప్లాన్‌ లో చెప్పిన విధంగా కాకుండా అనుమతి లేకుండా కట్టిన కట్టడాలను కూల్చివేయాలని, భూమి, భవనం విలువలో 25 శాతాన్ని పెనాల్టీగా విధించాలని నూతన మున్సిపాలిటీ చట్టంలో నిబంధనలను రూపొందించినారు.

అర్బన్‌ పాలసీ ప్రధాన లక్ష్యాలు :

అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా చేయడం ఇందులోని ప్రధాన లక్ష్యం.

త్వరితగతిన పౌరసేవలు అందించడం, పూర్తి పారదర్శకంగా పాలన ఉండటం,నగర, పట్టణ పాలనను సంస్థాగతంగా బలోపేతం చేయడం, పాలనలో సాంకేతిక విజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించుకొని తక్కువ సమయంలో సేవలు అందించే పద్ధతిని తీసుకురావడం, వాటితో పాటు.. ప్రతి పని నిర్ణీత సమయంలోనే పూర్తి చేయడం, ప్రతి అనుమతికీ నిర్ణీత కాలవ్యవధి నిర్ణయించడం, ప్రజల్లో విశ్వాసాన్ని, నమ్మకాన్ని పాదుకొల్పడం, అనుమతుల్లో జాప్యం లేకుండా సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ విధానం తేవడం, డిక్లరేషన్‌లో అవాస్తవాలు చెప్పిన వారిపై భారీ జరిమానాలు విధించడం..అనేటువంటి వినూత్న మార్పులతో, దశాబ్దాల కిందటి చట్టాలతో ఇప్పటి ప్రజల అవసరాలు తీర్చడం సాధ్యం కాదు అనే భావనతో ప్రభుత్వం నూతన మున్సిపాలిటీ చట్టాన్ని అమలులోకి తెచ్చింది.

తెలంగాణ మున్సిపాలిటీస్‌ యాక్టు 2019 ( తెలంగాణ మున్సిపాలిటీస్‌ యాక్టు 1965, మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1994 బదులుగా) ను జులై 19న జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలలో ఆమోదించడం జరిగింది.

తెలంగాణ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అండ్‌ యూడీఏ యాక్టు -2019 (తెలంగాణ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ 1920, యూడీఏ యాక్టు 1975 కు బదులుగా), జీహెచ్‌ఎంసీ యాక్టు 2019 (జీహెచ్‌ఎంసీ యాక్టు 1955, హెచ్‌ఎండీఏ యాక్టు 2008కు బదులుగా) ను అమలులోకి వచ్చినాయి.

సర్టిఫికెట్ల జారీలో సంస్కరణలు :

 • మున్సిపాలిటీల నుంచి కావాల్సిన బర్త్‌ సర్టిఫికెట్‌, డెత్‌ సర్టిఫికెట్‌, ల్యాండ్‌ యూజ్‌ సర్టిఫికెట్‌ తదితర అన్ని సర్టిఫికెట్లు ఆన్‌ లైన్‌ లో, నిర్ణీత సమయంలో జారీ చేసే విధంగా సత్వర చర్యలలో భాగంగా.. సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ విధానాన్ని ప్రవేశపెడుతూ నిబంధనలను పొందు పరిచింది.
 • వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇండ్లు, ఇతర నిర్మాణాలకు కొత్తగా క్యూ ఆర్‌ పద్ధతిలో నంబర్లు కేటాయించాలని చట్టంలో పేర్కొన్నారు.

హరిత తెలంగాణ సాధనకోసం :

 • పట్టణాల్లో గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసి, అమలు చేయడానికి కలెక్టర్‌ నేతృత్వంలో అటవీశాఖ డీఎఫ్‌ఓ, మున్సిపల్‌ కమిషనర్లు సభ్యులుగా జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటవుతుంది.
 • ఈ కమిటీ పట్టణాల్లో గ్రీన్‌ కవర్‌ పనులను పర్యవేక్షిస్తుంది.
 • ప్రతి మున్సిపాలిటీ బడ్జెట్‌ లో 10శాతానికి తగ్గకుండా గ్రీన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని నూతన మున్సిపాలిటీ చట్టం స్పష్టం చేస్తున్నది.
 • వచ్చే ఐదేళ్ల కోసం వార్డుల వారీగా హరితహారం యాక్షన్‌ ప్లాన్‌ను తయారు చేయాలి.
 • హరితహారం ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని ప్రజలకు వివరించి చెప్పాలనీ, మొక్కలు నాటడమే కాదు, నాటిన మొక్కలు బతికే విధంగా బాధ్యతను నిర్వహించడానికి వార్డుల వారీగా ప్రత్యేక అధికారులను నియమించాలని చట్టం చెప్తున్నది.
 • ప్రతి వార్డులో నర్సరీ ఏర్పాటు చేసి దానిని నిర్వహించే బాధ్యతను ఛైర్‌ పర్సన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ నిర్వర్తించాలి. నాటిన మొక్కల్లో కనీసం 85శాతం బతికే విధంగా చర్యలు తీసుకోవాలి.
 • మొక్కలు నాటే విషయంలో, వాటిని రక్షించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డు కౌన్సిలర్‌ లేదా కార్పొరేటర్‌ను, స్పెషల్‌ ఆఫీసర్‌ పై చర్యలు తీసుకునే నిబంధనలను పొందు పరిచినారు.
 • మున్సిపల్‌ ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచేందుకు కామన్‌ మున్సిపల్‌ సర్వీసెస్‌ ను అమలు చేస్తారు. , ఉద్యోగులను ఏ మున్సిపాలిటీ నుండి ఏ మున్సిపాలిటీకైనా బదిలీ చేసే అవకాశం కల్పించే నిబంధనలను రూపొందించినారు.

త్వరలోనేమున్సిపల్​ ఉద్యోగాల పోటీ పరీక్షలకు అత్యంత కీలకమైన
100 ప్రశ్నలుండే
స్పెషల్​ బిట్​ బ్యాంక్ క్విజ్​ . డోంట్ మిస్​ అప్​ డేట్స్​

మున్సిపల్​ జాబ్స్​ (వార్డు ఆఫీసర్)​​: 2019 తెలంగాణ మున్సిపల్​ చట్టం పీడీఎఫ్​

Telangana Municipal Jobs (ward officers): TS Municipal Act 2019 pdf download

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!