ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, గ్రూప్స్ ఎగ్జామ్ ఏదైనా జనరల్ అవేర్నెస్ కీలకం. ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ పరీక్షలో ముఖ్యమైన జనరల్ అవేర్‌నెస్‌లో ఎక్కువ మార్కులు ఎలా సాధించాలి. ఏ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎలాంటి ప్లానింగ్‌తో ముందుకెళ్లాలి, ఎక్కువ మార్కులు ఎలా సాధించాలో తెలుసుకుందాం.
- ఐబీపీఎస్ మెయిన్స్ ఎగ్జామ్‌లో మాత్రమే జనరలో అవేర్నెస్ ఉండగా ఆర్ఆర్బీలో రెండు దశల్లో ఉంటుంది. ఇందులో ముఖ్యంగా భారతదేశ చరిత్ర, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ అంశాలు కీలకపాత్ర పోషిస్తాయి.
నోట్: ఐబీపీఎస్ బ్యాకింగ్ సెక్టార్‌కు సంబంధించింది కావునా బ్యాంకింగ్ రంగం గురించి అదనంగా సమాచారం సేకరించి ప్రిపేర్ అవ్వాలి. - ఎగ్జామ్ ముందు ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
ఇండియన్ హిస్టరీ:
ప్రీవియస్ పేపర్స్ గమనిస్తే ఈ విభాగం నుంచి 6 నుంచి 8 ప్రశ్నలు ఇస్తున్నారు.ముఖ్యంగా ప్రాచీన, మధ్యయుగ భారతదేశ చరిత్రలో వివిధ రాజుల కాలంలో నిర్మించిన ఆలయాలు, వాటి నిర్మాణ శైళి, ప్రాచీన సంస్కృతి-వారసత్వం, రాజకీయ పరిపాలన, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు. సాహిత్యం, కళల గురించి అవగాహన ఉండాలి. ఆధునిక భారతదేశ చరిత్రలో స్వాతంత్ర్య పోరాటంలో వివిధ దశలు, పాల్గొన్న నాయకులు, వారు స్థాపించిన సంస్థలు, పత్రికలు, అతివాదులు, మితవాదులు, విప్లవకారులు వంటి అంశాలపై ఫోకస్ చేయాలి.
జనరల్ సైన్స్:
ఈ విభాగంలో బయాలజి, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడు భాగాలుంటాయి. వీటి నుంచి 15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. బయాలజీలో ముఖ్యంగా మానవ శరీర ధర్మశాస్త్రం. వృక్ష శరీర ధర్మ శాస్త్రం, జీవసామ్రాజ్య వర్గీకరణ, వ్యాధులు ముఖ్యమైన అంశాలుగా పరిగణించవచ్చు. ఫిజిక్స్ విభాగంలో విశ్వం, ధ్వని, కాంతి, విద్యుత్, ఉష్ణం, ఆధునిక భౌతిక శాస్త్రం, అయస్కాంతత్వం, యాంత్రికశాస్త్రం వంటి అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి.శాస్త్రవేత్తలు-సేవలు, భౌతికరాశులు-ప్రమాణాలు, నోబెల్ గ్రహీతలు వంటి అంశాలపై దృష్టి సారించాలి. కెమిస్ట్రీలో రసాయనబంధం, ద్రావణాలు, ఆమ్లాలు, క్షారాలు, రసాయన ఇంధనాలు, లోహ సంగ్రహణ శాస్త్రం, నిత్య జీవితంలో రసాయనశాస్త్రం అంశాలు ఎక్కువ చదవాలి.
సైన్స్ అండ్ టెక్నాలజీ:
ఈ అంశం నుంచి రెండు నుంచి నాలుగు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీ, న్యూక్లియర్ ఎనర్జీ, రక్షణ రంగం, బయోటెక్నాలజీ అంశాలపై ఫోకస్ చేయాలి.
పర్యావరణం:
ఈ అంశం నుంచి 1 నుంచి 2 ప్రశ్నలు రావచ్చు. ఇందులో పర్యావరణం యొక్క ప్రాథమిక సమాచారం, జీవవైవిధ్యం, కాలుష్యం_రకాలు, పర్యావరణ సమస్యలు(గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ క్షీణత, ఆమ్ల వర్షాలు, ఘన వ్యర్ధ పదార్థాల నిర్వహణ వంటి అంశాలు), అంతర్జాతీయ సదస్సులు, ప్రపంచ సంస్థల పాత్ర, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ముఖ్యమైనవి.
భూగోళశాస్త్రం:
ఈ విభాగంలో 3 నుంచి 6 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సౌరకుటుంబం, అక్షాంశాలు-రేఖాంశాలు, అగ్నిపర్వతాలు, ఖండాలు, భారతదేశ నైసర్గిక స్వరూపం, నదీవ్యవస్థ, వ్యవసాయం, ఖనిజవనరులు, జనాభా వంటి అంశాలపై ఎక్కువ అవగాహన కలిగి ఉండాలి.
పాలిటీ:
ఇందులో భారత రాజ్యాంగ స్వభావం, పరిణామక్రమం, ప్రాథమిక హక్కులు, విధులు, నిర్ధేశిక నియమాలు, రాష్ట్రపతి, రాజ్యాంగ సంస్థలు, 73 రాజ్యాంగ సవరణ చట్టం లాంటి అంశాలపై ఫోకస్ చేయాలి.
కరెంట్ అఫైర్స్:
ప్రస్తుతం పోటీపరీక్షలలో కరెంట్ అఫైర్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో ప్రశ్నలు అడిగే సరళిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది.
- గత 8 నెలల్లో జరిగిన అంశాలపై పట్టు సాధించాలి. ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు, వివిధ రిపోర్టులు, సమావేశాలు, సదస్సులు, అవార్డులు, వార్తల్లోని వ్యక్తులు, ప్రదేశాల గురించి పూర్తి అవగాహన ఉండాలి.
: కరోనాకు సంబంధించిన అంశాల మీద ఫోకస్ చేయాలి.
జనరల్ నాలెడ్జ్:
వివిధ విభాగాలకు చెందిన మొదటి అంశాలు(అతి పొడవైన, అతి ఎత్తైన), దేశాలు-రాజధానులు, అవార్డులు, దేశాలు-పార్లమెంట్, కరెన్సీ వంటి అంశాలు అధ్యయనం చేయాలి.
కంప్యూటర్ అవగాహన:
కంప్యూటర్ కు సంబంధించిన ప్రాథమిక అంశాలు, అవుట్ పుట్,ఇన్‌ఫుట్ పరికరాలు, కంప్యూటర్ లాంగ్వేజ్‌లు, సోషల్ మీడియాపై బేసిక్ నాలెడ్జ్ ఉండాలి.
క్రీడలు:
స్పోర్ట్స్‌లో ముఖ్యంగా ఒలంపిక్స్, క్రికెట్, టెన్నిస్ లాంటి ఆటలపై ప్రాథమిక అవగాహన ఉండాలి. ఏ క్రీడకు ఎలాంటి ట్రోఫీలు అందిస్తారు. ఎంత మంది ఆడతారు అనే అంశాలు తెలుసుకోవాలి.
పై అంశాలు కాకుండా ముఖ్యమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, యూఎన్ఓ విభాగం,అబ్రివేషన్స్, రవాణాకు సంబంధించిన అంశాలపై అవగాహన కలిగి ఉండాలి.
బ్యాంకింగ్ అవేర్నెస్:
ఈ అంశం కేవలం ఐబీపీఎస్ సిలబస్‌లో మాత్రమే ఉంది. దీనిలో బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణం, విధులు, వివిధ రకాల బ్యాంకులు వాటి ట్యాగ్‌లైన్స్, సీఈవోలు వంటి అంశాలతో పాటు బ్యాంకింగ్ రంగం టర్మీనాలజీ, రిజర్వ్ బ్యాంకుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలి.