Current Affairs Telangana
తెలంగాణ
అతిపెద్ద మెడిటేషన్ సెంటర్
శ్రీరామ చంద్ర మిషన్ నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్‌ను రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామ సమీపంలో జనవరి 28న బాబా రాందేవ్, హార్ట్ ఫుల్ నెస్ గ్లోబల్ గైడ్ కమలేశ్ డి. పటేల్ (దాదాజీ)తో కలిసి ప్రారంభించారు. 1400 ఎకరాలలో నిర్మించిన హార్ట్‌ఫుల్‌నెస్ ఇనిస్టిట్యూట్‌లో ఒక భాగంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.. ఇది 30 ఎకరాల స్థలంలో ఒకేసారి లక్ష మంది ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఉంది. దీని చుట్టూ తాబేలు ఆకారంలో 8 ఉపకేంద్రాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. శ్రీరామచంద్ర మిషన్‌ను 1945లో ఉత్తర్ ప్రదేశ్‌లో అప్పటి గురూజీ బాబూజీ మహరాజ్ ప్రారంభించారు. శ్రీరామ చంద్ర మిషన్‌కు ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలలో 5 వేలకు పైగా ధ్యాన కేంద్రాలున్నాయి.
నాగోబా జాతర
గిరిజన సంప్రదాయ ‘నాగోబా’ జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జనవరి 24న ప్రారంభమైంది. మెస్రం వంశస్థులు పూజలు నిర్వహించారు. మేడారం తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. ఏటా నిర్వహించే ప్రజా దర్బార్‌ను ఫిబ్రవరి 27న నిర్వహించనున్నారు. తెలంగాణ గిరిజనులతో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి అనేక మంది గిరిజనులు ఈ జాతరకు హాజరవుతారు.
సింగరేణి ఎండీకి అవార్డు
ఆసియాలోని వ్యాపార, పరిశ్రమల విభాగంలో ప్రతిభావంతులకు థాయ్‌లాండ్‌లో ప్రచురితమయ్యే ఏసియా వన్, యూఆర్‌ఎస్ మీడియా సంయుక్తంగా అందించే భారతీయ మహంతం వికాస్ పురస్కార్ సింగరేణి ఎండీ శ్రీధర్‌కు లభించింది. ఫిబ్రవరి 7న బ్యాంకాక్‌లో జరిగే 13వ ఏషియన్ బిజినెస్ అండ్ సోషల్ ఫోరం సదస్సులో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. ఫిబ్రవరి 6న థాయ్‌లాండ్‌లో జరిగే ఇండియా, థాయ్‌లాండ్ ద్వైపాక్షిక సంబంధాల సమావేశంలో పాల్గొనాలని థాయ్‌లాండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ శ్రీధర్‌ను ఆహ్వానించింది.
కృష్ణభాస్కర్‌కు అవకాశం
ప్రజా పాలనలో అత్యున్నత ఫలితాలు సాధించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కేంద్రప్రభుత్వం అందించే పీఎం ఎక్సలెన్స్ అవార్డులకు సంబంధించిన సవరణలపై సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్‌కు ఆహ్వానం అందింది. దేశవ్యాప్తంగా 15 జిల్లాల కలెక్టర్లను ఎంపికచేయగా తెలుగు రాష్ట్రాలలో కృష్ణభాస్కర్‌తో పాటు ఏపీ నుంచి విశాఖపట్నం కలెక్టర్ వినయ్ చాంద్ ఉన్నారు. రూరల్ డెవలప్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్స్‌కు సంబంధించి 2020 అవార్డులలో చేపట్టాల్సిన సవరణలు, సూచనలను జనవరి 28న తెలియజేశారు.
యూఎన్ డీపీలో తెలంగాణ ఫస్ట్
ఐక్యరాజ్య సమితి డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(యూఎన్‌డీపీ) రూపొందించిన అభిలషణీయమైన ప్రగతి–ఆర్థికవృద్ధి కేటగిరీలో 82శాతం స్కోర్ సాధించి తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రెండు, కర్ణాటక మూడోస్థానంలో నిలిచాయి. వాణిజ్య ఆవిష్కరణలు, మౌలిక వసతుల రంగంలో వృద్ధి రేటు 16 శాతం నుంచి 61శాతానికి పెరగడంతో రాష్ట్రానికి ఈ ఘనత దక్కింది.
అంతప్రజ్ఞ సదస్సు
దేశంలోనే అతిపెద్ద ప్రాంతీయ సాంకేతిక ఉత్సవం అంతప్రజ్ఞ సదస్సును నిర్మల్ జిల్లా బాసరలో ట్రిపుల్ ఐటీలో జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో నిర్వహించారు. ఈ ఉత్సవాలు ‘స్పాట్ అండ్ ఎంకరేజ్ రూరల్ టెక్ ఇన్నోవేటర్స్’ అనే థీమ్‌తో నిర్వహించారు. ఈ సందర్భంగా 300 రకాల సాంకేతిక నమూనాలను స్టూడెంట్స్ ప్రదర్శించారు.