Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​ : ఆగస్ట్​ 2023

కరెంట్​ అఫైర్స్​ : ఆగస్ట్​ 2023

అంతర్జాతీయం

మిస్సైల్స్ తో ఉత్తరకొరియా పరేడ్‌
ఉత్తరకొరియా శక్తివంతమైన అణు క్షిపణులను ప్రదర్శించింది. ప్యాంగ్యాంగ్‌లో జరిగిన సైనిక పరేడ్‌లో రష్యా, చైనా ప్రతినిధులతో కలిసి అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌ ఉన్‌ వీటిని తిలకించారు.1950–53 కొరియా యుద్ధానికి విరామం పలికి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉత్తరకొరియా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.

Advertisement

అత్యంత వేడి నెలగా జులై
భూమిపై అత్యంత వేడి నెలగా ‘2023 – జులై’ రికార్డు నమోదు చేసిందని ఐరోపా సంఘానికి చెందిన వాతావరణ పర్యవేక్షణ సంస్థ కోపర్నికస్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ సర్వీస్‌ ప్రకటించింది. ఈ ఏడాది జులై నెలలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 16.95 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.

స్టూడెంట్‌ ఫ్రెండ్లీ సిటీగా లండన్‌
ప్రపంచంలో అన్నింటికంటే బెస్ట్‌ స్టూడెంట్‌ ఫ్రెండ్లీ సిటీగా లండన్‌ నిలిచింది. క్వాక్‌క్వారెల్లీ సైమండ్స్‌ సంస్థ 2024 సంవత్సరానికి సంబంధించిన స్టూడెంట్‌ ఫ్రెండ్లీ సిటీల జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో లండన్‌ అగ్ర స్థానం దక్కించుకుంది. తర్వాతి స్థానంలో టోక్యో, సియోల్, మెల్‌బోర్న్  నిలిచాయి.

పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వరుల్‌
పాకిస్థాన్‌ ఆపద్ధర్మ  ప్రధానిగా పష్తూన్‌ తెగకు చెందిన అన్వరుల్‌ హఖ్‌ కాకర్‌తో అధ్యక్షుడు అరిఫ్‌ అల్వి ప్రమాణం చేయించారు. అధ్యక్ష కార్యాలయంలో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని పదవి నుంచి వైదొలగిన షెహబాజ్‌ షరీఫ్‌ సహా పలువురు నేతలు హాజరయ్యారు.

Advertisement

పొడవైన గడ్డంతో ‘గిన్నిస్‌’ విజేతగా మహిళ
అమెరికాకు చెందిన హనీకట్‌ అత్యంత పొడవైన గడ్డం (11.8 అంగుళాలు) కలిగిన మహిళగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్స్‌లో చోటు దక్కించుకుంది. గతంలో ఇదే దేశానికి చెందిన వివాన్‌ వీలర్‌ అనే మహిళ పేరిట ఉన్న రికార్డును (10.04 అంగుళాలు) తాజాగా ఎరిన్‌ హనీకట్‌ అధిగమించింది.

‘తూర్పు లద్దాఖ్‌’ పరిష్కారానికి అంగీకారం
తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంట రెండు దేశాల మధ్య మిగిలిపోయిన సమస్యలను పరిష్కరించుకుందామని భారత్, చైనా ఒక అంగీకారానికి వచ్చాయి. రెండు రోజుల పాటు జరిగిన 19వ విడత చర్చల అనంతరం ఇరు దేశాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

 బ్రిక్స్‌ కూటమిలోకి మరో ఆరు దేశాలు
దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న సమావేశంలో బ్రిక్స్ కూటమి విస్తరించాలని సభ్య దేశాలు నిర్ణయించాయి. కూటమిలోకి కొత్తగా ఆరు దేశాలకు (అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ) పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలని కూటమి నిర్ణయించింది.

Advertisement

కంబోడియా ప్రధానిగా హన్‌ మనెట్‌
కంబోడియా ప్రధానిగా హన్‌ మనెట్ ఎన్నికను కంబోడియా పార్లమెంటు ఆమోదించింది. కంబోడియా జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)కి జులైలో మనెట్‌ ఎన్నికయ్యారు. ఆసియాలోనే అత్యంత ఎక్కువ కాలం అధికారంలో ఉన్న దేశాధినేతగా గుర్తింపు పొందారు.

థాయ్‌లాండ్‌ ప్రధానిగా థావిసిన్‌ ఎన్నిక
థాయ్‌లాండ్‌ ప్రధానిగా రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం శ్రెథ్థా థావిసిన్‌ ఎన్నికయ్యారు. పార్లమెంటులో తాజాగా నిర్వహించిన ఓటింగ్‌లో మాజీ ప్రధాని తక్సిన్‌ షినవత్రకు చెందిన ఫ్యూథాయ్‌ పార్టీ నేతృత్వంలోని కూటమి గెలిచింది. మొత్తం 727 ఓట్లలో థాయ్‌ పార్టీ కూటమికి 482 ఓట్లు వచ్చాయి.

జాతీయం

‘కేరళం’గా కేరళ
తమ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి కేరళ శాసనసభ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని పార్టీలకతీతంగా ఏకగ్రీవంగా ఆమోదించింది. కొత్త పేరును అధికారికంగా మార్పు చేయాలని కోరుతూ ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించనున్నారు. రాష్ట్రం పేరును పూర్వం నుంచే మలయాళంలో ‘కేరళం’ అని పిలిచేవారని గుర్తు చేశారు.

Advertisement

ఢిల్లీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
వివాదాస్పదంగా మారిన ఢిల్లీ సర్వీసుల బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లును పెద్దల సభ చర్చకు చేపట్టినప్పుడు కాంగ్రెస్, ఆప్‌ సహా విపక్షాలు పలు అభ్యంతరాలు వ్యక్తపరిచాయి. ఓటింగులో బిల్లుకు అనుకూలంగా 131, వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి.

ఎన్‌ఎండీసీకి కొత్త చిహ్నం
దేశంలోనే ఇనుప ఖనిజ ఉత్పత్తిలో అతిపెద్ద సంస్థ అయిన ఎన్‌ఎండీసీ కొత్త చిహ్నాన్ని (లోగో) ఆవిష్కరించింది. సంస్థ సీఎండీ అమితవ ముఖర్జీ, ఉక్కు శాఖ సెక్రటరీ నాగేంద్రనాథ్‌ సిన్హాతో కలిసి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ లోగోను విడుదల చేశారు. దేశం సాధిస్తున్న ప్రగతిని ఇది గుర్తు చేస్తోందన్నారు.

అడ్వొకేట్స్‌ (సవరణ) బిల్లు – 2023కు ఆమోదం
న్యాయవాద వృత్తిని ఒకే చట్టం (అడ్వొకేట్స్‌ చట్టం 1961)తో నియంత్రించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన అడ్వొకేట్స్‌ (సవరణ) బిల్లు – 2023ను రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లులో పవిత్రమైన న్యాయవాద వృత్తిలో దళారీలను ఏరివేసే కఠిన నిబంధనలు రూపొందించారు.

Advertisement

ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం
మోడీ సర్కారుపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సుదీర్ఘ చర్చ అనంతరం మూజువాణి ఓటుతో వీగిపోయింది. స్వాతంత్య్రానంతరం మొత్తంగా లోక్‌సభలో ఇప్పటివరకు 28 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. పదేళ్లు అధికారంలో ఉన్న మన్మోహన్‌ సింగ్‌ ఒక్కసారి కూడా అవిశ్వాసాన్ని ఎదుర్కొలేదు.

‘పీఎం విశ్వకర్మ’కు ఆమోదం
ఐదేళ్లలో అమలు చేయనున్న ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ పథకంతో 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. అర్హులైన వారికి రూ.2 లక్షల రుణ సదుపాయం 5 శాతం వడ్డీ రేటుతో ఇవ్వనున్నారు.

ఏడు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర
పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన ‘ఢిల్లీ సర్వీసుల బిల్లు’ సహా ఏడు బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపింది. డేటా ప్రొటెక్షన్‌ చట్టాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు, జన్‌ విశ్వాస్‌ (సవరణ) బిల్లు, ఐఐఎం (సవరణ) బిల్లు, జాతీయ దంత వైద్య కమిషన్‌ (సవరణ) బిల్లు, సముద్ర ప్రాంత ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు కూడా చట్ట రూపం దాల్చాయి.

Advertisement

వాణిజ్య లోటు రూ.1.7 లక్షల కోట్లు
దేశ ఎగుమతులు జులైలో 32.25 బిలియన్‌ డాలర్ల (రూ.2.64 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయి. దిగుమతులు 52.92 బి.డాలర్ల (రూ.4.34 లక్షల కోట్ల)కు తగ్గాయి. ఫలితంగా వాణిజ్య లోటు (ఎగుమతులు – దిగుమతుల బిల్లుల మధ్య వ్యత్యాసం) 25.43 బి.డాలర్ల నుంచి 20.67 బి.డాలర్లకు (రూ.1.7 లక్షల కోట్లు) పరిమితమైంది.

థార్‌ ఎడారిలో పురాతన డైనోసార్‌ శిలాజం
ఐఐటీ – రూర్కీ, భారత భూగర్భ సర్వే సంస్థ (జీఎస్‌ఐ) పరిశోధకులు రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని థార్‌ ఎడారిలో 16.7 కోట్ల ఏళ్ల క్రితం నాటి డైనోసార్‌ శిలాజాన్ని కనుగొన్నారు.

గరిష్టానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం
జులైలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్టానికి చేరింది. గత నెలలో ఇది 7.44 శాతానికి పెరిగింది. 2022 ఏప్రిల్‌లోని 7.79% తర్వాత ఇదే గరిష్ట స్థాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశించుకున్న ద్రవ్యోల్బణ నియంత్రిత లక్ష్యమైన 6 శాతాన్ని మించడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలిసారి.

Advertisement

నేషనల్ అవార్డులు
భారతీయ సినిమా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ అవార్డులను కేంద్ర ప్రకటించింది. 2021 సంవత్సరానికి గానూ ‘పుష్ప: ది రైజ్‌’లో నటనకు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌, ఉత్తమ నటి అవార్డును అలియా భట్‌ (గంగూభాయి కాఠియావాడి), కృతిసనన్‌(మిమి)లకు దక్కాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ ఎంపికైంది. తెలుగు నుంచి ‘పుష్ప’, ‘ఆర్ఆర్‌ఆర్‌’ అత్యధిక కేటగిరిల్లో అవార్డులను సొంతం చేసుకున్నాయి.

వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో తులిప్‌ గార్డెన్‌
శ్రీనగర్‌లోని ఇందిరా గాంధీ స్మారక తులిప్‌ గార్డెన్‌ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. 68 రకాలకు చెందిన 1.5 మిలియన్ల తులిప్‌ పుష్పాలతో ఆసియాలో అతిపెద్ద గార్డెన్‌గా ఈ ఘనత సాధించింది.30 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న శ్రీనగర్‌లోని తులిప్‌ గార్డెన్‌ ఆసియాలోనే అతిపెద్దది.

‘కెనరా డిజిటల్‌ రూపీ యాప్‌’
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చేపట్టిన సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా కెనరా బ్యాంక్‌ ‘కెనరా డిజిటల్‌ రూపీ యాప్‌’ పేరిట ఒక యూపీఐ ఇంటరాపబుల్‌ డిజిటల్‌ రూపీ మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించింది. డిజిటల్‌ కరెన్సీకి మొబైల్‌ యాప్‌ తీసుకొచ్చిన తొలి బ్యాంక్‌ ఇదే.

Advertisement

ఎన్‌జీటీ చైర్మన్గా జస్టిస్‌ ప్రకాశ్‌ శ్రీవాస్తవ
జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) చైర్మన్గా జస్టిస్‌ ప్రకాశ్‌ శ్రీవాస్తవ నియమితులయ్యారు. ప్రస్తుతం తాత్కాలిక చైర్‌పర్సన్‌గా ఉన్న జస్టిస్‌ సేయో కుమార్‌ సింగ్‌ నుంచి ఈయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

బనస్థలి విద్యాపీఠ్‌కు రాజీవ్‌ సద్భావన అవార్డు
రాజస్థాన్‌లోని బనస్థలి విద్యాపీఠ్‌కు 2020–21వ సంవత్సరానికి 25వ రాజీవ్‌ సద్భావన అవార్డును మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ బహూకరించారు. ఈ అవార్డు కింద రూ.10 లక్షల నగదు, ప్రశంసా పత్రం అందజేశారు.

ప్రాంతీయం

ఆర్టీసీ బిల్లుకు ఆమోదం
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందింది. గవర్నర్‌ తమిళిసై రవాణా, రహదారులు – భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఇతర అధికారులతో సమావేశమై బిల్లులోని అంశాలపై చర్చించారు.

Advertisement

ఐటీ శాఖకు అవార్డులు
అత్యున్నత సాంకేతికత రూపొందించి వినియోగించుకున్నందుకు తెలంగాణ ఐటీ శాఖకు రెండు పురస్కారాలు లభించాయి. గోవాలో జరుగుతున్న ఈటీ గవర్నమెంట్‌ డిజిటెక్‌ – 2023 సదస్సులో బిహార్‌ ఐటీ మంత్రి మహమ్మద్‌ ఇస్రాయిల్‌ మన్సూరి చేతుల మీదుగా ఈ అవార్డులను ఐటీ శాఖలోని ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ డైరెక్టర్‌ రమాదేవి లంక అందుకున్నారు.

క్రైమ్‌ ఓఎస్‌కు ఈ-రక్షా పురస్కారం
సైబరాబాద్‌ పోలీసులు రూపొందించిన ‘క్రైమ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌’కు జాతీయ పురస్కారం దక్కింది. జులై చివరి వారంలో నిర్వహించిన 4వ విడత పోటీల్లో ‘ఈ-రక్షా’ అవార్డు విభాగంలో ‘క్రైమ్‌ ఓఎస్‌’కు తొలిస్థానం దక్కినట్లు ఎన్‌సీఆర్‌బీ ప్రకటించి పురస్కారం అందించింది.

కొత్త రెవెన్యూ డివిజన్లు
రాష్ట్రంలో కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు రెవెన్యూశాఖ  నోటిఫికేషన్లు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లాలో పటాన్‌చెరు,  మెదక్‌ జిల్లాలో రామాయంపేట కేంద్రంగా వీటిని ఏర్పాటు చేశారు.  

మంత్రిగా పట్నం ప్రమాణం
రాజ్‌భవన్లో మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమణ స్వీకారం చేశారు. ఆయనకు భూగర్భ గనుల శాఖ, సమాచార శాఖలను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.

వార్తల్లో వ్యక్తులు

జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకుర్‌
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకుర్‌ నియమితులయ్యారు. జులై 5వ తేదీన సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయ శాఖ అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.

సంజయ్‌ కుమార్‌
కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డ్‌ (సీబీఐసీ) చైర్మన్‌గా ఐఆర్‌ఎస్‌ అధికారి సంజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ బాధ్యతలు చేపట్టారు. ఇంతకుమునుపు ఈ పదవిలో ఉన్న వివేక్‌ జోహ్రి మే 31న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో సంజయ్‌ కుమార్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

రంజనా దేశాయ్‌
అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్‌ – లోక్‌పాల్‌కు సారథి, సభ్యులను సిఫార్సు చేసే శోధన కమిటీకి చైర్‌పర్సన్‌గా ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) చైర్‌పర్సన్‌ జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ని కేంద్ర ప్రభుత్వం నియమించింది.

భూమన క‌రుణాక‌ర్ రెడ్డి
టి.టి.డి కొత్త చైర్మన్‌గా భూమన క‌రుణాక‌ర్ రెడ్డి భాద్యత‌లు చేప‌ట్టారు. భూమన ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2006-–2008 మ‌ధ్య టి.టి.డి చైర్మన్‌గా ప‌ని చేశాడు.  భూమన తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎంఏ చేశారు.

ముల్యో హాండోయో
భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (ఎన్‌సీఈ)లో సింగిల్స్‌ చీఫ్‌ కోచ్‌గా ముల్యో హాండోయో (ఇండోనేసియా) నియమితుడయ్యాడు. ఆల్‌ ఇంగ్లాండ్‌ మాజీ ఛాంపియన్‌ ఇవాన్‌ సొజొనోవ్‌ (రష్యా) డబుల్స్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు.

నరేంద్ర మోడీ
ఎర్ర కోట నుంచి వరుసగా పదేళ్లు మువ్వన్నెల జెండాను ఎగురవేసిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా నరేంద్ర మోడీ నిలిచారు. ఆయన 90 నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లాడారు. సరికొత్త రికార్డు సృష్టించారు. 10 సార్లు మోదీ ప్రసంగించగా సగటు సమయం 82 నిమిషాలుగా ఉంది.

వైభవ్‌ తనేజా
టెస్లా కొత్త చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ)గా భారత సంతతికి చెందిన వైభవ్‌ తనేజా నియమితులయ్యారు. సీఎఫ్‌ఓ జాచరీ కిర్కాన్‌ వైదొలగుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెస్లా పేర్కొంది.

శశిధర్‌ జగదీశన్‌
గత ఆర్థిక సంవత్సరానికి రూ.10.55 కోట్ల వేతనాన్ని అందుకోవడం ద్వారా, బ్యాంకుల సీఈవోల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీఈఓ శశిధర్‌ జగదీశన్‌ ప్రథమ స్థానంలో నిలిచారు. 2023 బ్యాంకుల వార్షిక నివేదిక ప్రకారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డిప్యూటీ ఎండీ భరూచాకు రూ.10 కోట్లు లభించాయి.

పర్మీందర్‌ చోప్రా
పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) మొదటి పూర్తిస్థాయి మహిళా చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా పర్మీందర్‌ చోప్రా బాధ్యతలు చేపట్టారు. ఆగస్టు 14 నుంచి ఆమె నియామకం అమల్లోకి వచ్చింది. 2023 జూన్‌ 1 నుంచి సీఎండీగా అదనపు బాధ్యతలను ఆమె నిర్వర్తించారు.

ఆర్‌.దొరైస్వామి
లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) మేనేజింగ్‌ డైరెక్టరుగా ఆర్‌.దొరైస్వామిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ముంబయిలోని ఎల్‌ఐసీ కేంద్ర కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా దొరైస్వామి ఉన్నారు. దొరైస్వామి 2026 ఆగస్టు 31 లేదా, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎల్‌ఐసీ ఎండీ పదవిలో ఉంటారు.

సచిన్‌ టెండుల్కర్‌
భారత ఎన్నికల సంఘం (ఈసీ) ప్రచారానికి నేషనల్‌ ఐకాన్‌గా మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ నియమితులయ్యారు. ఎన్నికల్లో ఓటింగు శాతం పెంచేందుకు ఈసీతో కలిసి సచిన్‌ సంయుక్తంగా కృషి చేసే ఈ ఒప్పందం మూడేళ్ల పాటు అమలులో ఉంటుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ధోనీ, అమీర్‌ఖాన్, మేరీకోమ్‌ నేషనల్‌ ఐకాన్స్‌గా వ్యవహరించారు.

నీలకంఠ్‌ మిశ్రా
ఆధార్‌ సేవలు అందించే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తాత్కాలిక చైర్మన్గా  నీలకంఠ్‌ మిశ్రా నియమితులయ్యారు. ఆధార్‌ చట్టం కింద ఛైర్‌పర్సన్, సభ్యులకు మూడేళ్ల పదవీ కాలం ఉంటుంది. నీలకంఠ్‌ మిశ్రా యాక్సిస్‌ బ్యాంక్‌కు ముఖ్య ఆర్థికవేత్తగా ఉన్నారు.

రతన్‌ టాటా
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటాకు, మహారాష్ట్ర ప్రభుత్వం తాము ప్రవేశ పెట్టిన ‘ఉద్యోగ్‌ రత్న’ అవార్డును ప్రదానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రవేశపెట్టాక తొలిసారిగా ఇచ్చింది ఇప్పుడే. సీఎం, డిప్యూటీ సీఎంలు ముంబయిలో టాటా నివాసంలో కలిసి ఈ అవార్డు అందజేశారు.

అమన్‌ప్రీత్‌
ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్‌ పిస్టల్‌ విభాగంలో అమన్‌ప్రీత్‌ సింగ్‌ గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ టోర్నీలో ఇప్పటిదాకా భారత్‌ అయిదు స్వర్ణాలు, నాలుగు కాంస్యాలు సాధించింది.

నొవాక్‌ జకోవిచ్‌
నొవాక్‌ జకోవిచ్‌ సిన్సినాటీ ఓపెన్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు. నాలుగు గంటల పాటు సాగిన ఫైనల్లో జకోవిచ్‌ ప్రపంచ నంబర్‌వన్‌ అల్కరాస్‌పై విజయం సాధించాడు. ఈ టోర్నీ గెలిచిన అత్యంత పెద్ద వయస్కుడిగా 36 ఏళ్ల జకోవిచ్‌ రికార్డు సృష్టించాడు.

స్పోర్ట్స్

ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌
భారత మహిళల కాంపౌండ్‌ ఆర్చరీ జట్టు (జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌) త్రయం ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించింది. ఏ విభాగంలోనైనా దేశానికి ఇదే మొదటి పసిడి.

రన్నరప్‌గా ప్రణయ్‌
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ రన్నరప్‌గా నిలిచాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ ప్రణయ్‌, వెంగ్‌ హాంగ్‌ యాంగ్‌ (చైనా) చేతిలో పోరాడి ఓడాడు.

హాకీ ఆసియా చాంపియన్స్‌
ఆసియా చాంపియన్స్‌ హాకీ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ 4-–3 గోల్స్‌తో మలేసియాను ఓడించింది. జట్టుకు ఇది నాలుగో ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ. మూడో స్థానం కోసం జరిగిన పోరులో జపాన్‌ 5-–3 గోల్స్‌తో  దక్షిణ కొరియాను ఓడించింది.

రెజ్లింగ్‌ విన్నర్ మోహిత్‌
అండర్‌-20 ప్రపంచ రెజ్లింగ్‌ చాంఛాంంపియన్‌షిప్‌లో మోహిత్‌ కుమార్‌ స్వర్ణం సాధించాడు. 61 కేజీల విభాగం ఫైనల్లో అతను రష్యాకు చెందిన ఎల్డార్‌ అక్మదునినోవ్‌ను ఓడించాడు.2018లో దీపక్‌ పునియా విజేతగా నిలిచాక జూనియర్‌ పురుషుల ప్రపంచ రెజ్లింగ్‌లో చాంపియన్‌ అయింది మోహితే.

మహిళల ఫిఫా ప్రపంచకప్‌
మహిళల ఫిఫా ప్రపంచకప్‌లో స్పెయిన్‌ చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో స్పెయిన్‌ 1–-0తో ఇంగ్లాండ్‌ను ఓడించింది. 1966 తర్వాత తొలి టైటిల్‌ గెలవాలనుకున్న ఇంగ్లాండ్‌కు నిరాశ తప్పలేదు.

చెస్ వరల్డ్ కప్‌ చాంపియన్‌
చెస్ వరల్డ్ కప్‌ చాంపియన్‌గా మాగ్నస్‌ కార్ల్‌సన్ అవతరించాడు. ప్రపంచ చాంపియన్‌గా అవతరిద్దామని భావించిన ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. విజేతగా నిలిచిన కార్ల్‌సన్‌ రూ. 91 లక్షలు, రన్నరప్‌ ప్రజ్ఞానంద రూ. 66 లక్షల ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంటారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ

జాబిల్లిపైకి రష్యా లునా 25
సుమారు 47 ఏళ్ల తర్వాత చంద్రుడి పైకి రష్యా మళ్లీ రాకెట్‌ ప్రయోగం చేపట్టింది. దక్షిణ ధ్రువమే లక్ష్యంగా ‘లునా – 25’ అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఆగస్టు 21న ఈ వ్యోమనౌక చంద్రుడిపై దిగే అవకాశం ఉందని రాస్‌కాస్మోస్ అధికారులు పేర్కొన్నారు.

నేవీలోకి వింధ్యగిరి
భారత నౌకాదళ అమ్ములపొదిలోకి మరో అధునాతన స్వదేశీ యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ ‘వింధ్యగిరి’ చేరింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కోల్‌కతాలోని హుగ్లీ నది తీరంలో ఈ నౌకను అధికారికంగా భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టారు.

దేశీయ రివాల్వర్‌ ‘ప్రబల్‌’
దేశీయంగా రూపొందించిన తొలి లాంగ్‌ రేంజ్‌ రివాల్వర్‌ ‘ప్రబల్‌’ ఆగస్టు 18న విడుదలైంది. కాన్పుర్‌లోని అడ్వాన్స్‌డ్‌ వెపన్స్‌ అండ్‌ ఎక్విప్‌మెంట్‌ ఇండియా లిమిటెడ్‌ (ఏడబ్ల్యూఈఐఎల్‌) సంస్థ దీన్ని రూపొందించింది. ఈ రివాల్వర్‌తో 50 మీటర్ల దూరంలోని లక్ష్యాలను గురిపెట్టవచ్చు.

జాబిల్లిపై చంద్రయాన్ 3​
ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 విజయవంతమైంది. ఆగస్ట్ 23న చంద్రయాన్​ సేఫ్​గా ల్యాండ్​ అయింది. ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రగ్యాన్‌ చంద్రుడి ఉపరితలంపై 14 రోజుల పాటు పరిశోధనలు జరపనున్నాయి. జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద వ్యోమ నౌకను దింపిన తొలి దేశం భారత్‌. చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సాధించిన నాలుగో దేశం భారత్‌ది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!