అంతర్జాతీయం
ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా ఐజాక్ హెర్జోగ్
ఇజ్రాయెల్ కొత్త అధ్యక్షుడిగా ఐజాక్ హెర్జోగ్ ఎన్నికయ్యారు. పార్లమెంట్లో జరిగిన రహాస్య ఓటింగ్‌లో 120 మంది సభ్యుల్లో 87 మంది ఐజాక్‌కు మద్దతు పలికారు. 2015 ఎన్నికల్లో బెంజిమన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా ప్రధాని పదవికి హెర్జోగ్ పోటీపడ్డారు.
ఎఫ్డీఐలో సింగపూర్ టాప్
2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టిన దేశంగా సింగపూర్ నిలిచింది. పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహ విభాగం (డీపీఐఐటీ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2020–21లో సింగపూర్ నుంచి 17.41 బిలియన్ డాలర్ల మేర ఎఫ్‌డీఐలు వచ్చాయి. సింగపూర్ తర్వాతి స్థానాల్లో వరుసగా అమెరికా, మారిషస్ ఉన్నాయి.
అమెజాన్ సీఈవోగా ఆండీ జెస్సీ
ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి జెఫ్ బెజోస్ 5 జూలై 2021న తప్పుకోనున్నారు. కొత్త సీఈవోగా ఆండీ జెస్సీ బాధ్యతలు చేపట్టనున్నారు. జెస్సీ ప్రస్తుతం అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపార విభాగానికి సారథ్యం వహిస్తున్నారు. బెజోస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారు.
ఒక్కో జంట ముగ్గురిని కనొచ్చు
జనాభా నియంత్రణపై ఉన్న ఆంక్షలను చైనాలోని కమ్యూనిస్టు పార్టీ సడలించింది. ఒక్కో జంట ముగ్గురు పిల్లలను కనేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు మాత్రమే ఆమోదం ఉంది. దేశంలో జననాల రేటు తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
భారత్‌లో అమెరికా రాయబారిగా గర్సెట్టీ
భారత్‌లో అమెరికా రాయబారిగా లాస్ఏంజెల్స్ మేయర్ ఎరిక్ గర్సిట్టీని ఆ దేశ అధ్యక్షుడు జోబైడెన్ నియమించారు. గర్సెట్టీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ తరఫున ప్రచార బృందానికి కో–చైర్మన్‌గా పనిచేశారు. చైనా, జపాన్, ఇజ్రాయెల్ దేశాలకు కూడా అమెరికా రాయబారుల్ని నియమించింది.
సాంగ్ ఇన్–హుంగ్ ఎవరెస్ట్ రికార్డ్
హాంకాంగ్‌కు చెందిన సాంగ్ ఇన్–హుంగ్ ఎవరెస్ట్ పర్వతాన్ని కేవలం 25 గంటల 50 నిమిషాల్లో అధిరోహించింది. ఇంత తక్కువ సమయంలో ఎవరెస్టు ఎక్కిన మొదటి మహిళగా ఆమె రికార్డ్ సృష్టించింది. గతంలో 39 గంటల 6 నిమిషాల్లో నేపాలీ మహిళ పుంజో ఝుంగ్మూ లామా పేరుతో ఈ రికార్డ్ ఉంది.
అంతరిక్షంలోకి బెజోస్
‘బ్లూ ఆరిజిన్’ తొలిసారిగా చేపట్టబోయే మానవసహిత అంతరిక్షయాత్రలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రయాణించనున్నాడు. బ్ల్యూ ఆరిజిన్‌కు చెందిన సొంత రాకెట్ ‘న్యూ షెపర్డ్’ తొలియాత్ర జులై 20న టెక్సాస్ నుంచి జరగనుంది. ఇందులో వ్యోమగాములతో కలిసి బెజోస్, ఆయన సోదరుడు మార్క్ ప్రయాణిస్తాడని కంపెనీ తెలిపింది. పది నిమిషాల్లో ఈ యాత్ర పూర్తవుతుంది.
గుటెరస్ మరోసారి
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌గా ఆంటోనియో గుటెరస్ మరోసారి ఎన్నికకానున్నారు. ఆయన ప్రస్తుత పదవీకాలం డిసెంబర్ 31తో ముగియనుంది. ఆయన పేరును మరోసారి సర్వప్రతినిధి సభకు సిఫార్స్ చేయాలని భద్రత మండలి సమవేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. 2022 జనవరి 1 నుంచి 2026 డిసెంబర్ 31 వరకు ఆయన పదవిలో కొనసాగుతారు.
15 శాతం కార్పొరేట్ ట్యాక్స్
పెద్ద కంపెనీలు పన్ను ఎగవేయకుండా నివారించే భాగంగా 15 శాతం కనీస కార్పొరేట్ ట్యాక్స్ విధించాలనే ప్రతిపాదనకు జీ–7 దేశాలు మద్దతు తెలిపాయి. లండన్‌లో జరిగిన జీ–7 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో దీనిపై చర్చించారు. సాంకేతిక దిగ్గజ కంపెనీలు వివిధ దేశాల్లో నమోదు చేసే అమ్మకాల ఆధారంగా పన్ను చెల్లించాలని ప్రతిపాదించారు.
భద్రతామండలిలో ఐదు తాత్కాలిక సభ్యదేశాలు
యూఎన్ఓ భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశాలుగా అల్బేనియా, బ్రెజిల్, గబోన్, ఘనా, యూఏఈ ఎన్నికయ్యాయి. ఇవి 2021 నుంచి 23 వరకు సభ్యదేశాలుగా కొనసాగుతాయి. ఎస్తోనియా, నైగర్, సెయింట్ విన్సెంట్, టునీషియా, వియత్నాం గ్రెనెడైన్స్ దేశాల పదవీకాలం ఈ ఏడాది ముగియనుంది.
బ్రసెల్స్‌లో నాటో మీటింగ్
నాటో ప్రధాన కార్యాలయం బ్రసెల్స్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో పాటు 30 మంది దేశాధినేతల సమావేశం జరిగింది. సైనిక పరంగా చైనాతో ప్రపంచ భద్రతకే ప్రమాదం ఉందని నాటో పేర్కొంది. అంతర్జాతీయ నియమాలను చైనా గౌరవించాలని తీర్మానంలో పేర్కొంది.
క్రిప్టో కరెన్సీకి ఎల్ శాల్వడార్ చట్టబద్ధత
క్రిప్టోకరెన్సీబిట్‌కాయిన్‌కు చట్టబద్ధత కల్పిస్తూ ఎల్ శాల్వడార్ దేశం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చట్టానికి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. దీంతో బిట్‌కాయిన్‌కి చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా ఎల్ శాల్వడార్ నిలిచింది.
గాజాపై ఇజ్రాయెల్ దాడులు
కాల్పుల విరమణ ప్రకటించిన దాదాపు నెల రోజులకు ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేస్తోంది. జూన్ 15న గాజా స్ట్రిప్‌లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేశాయి. గాజా నుంచి ప్రయోగించిన మంటల బెలూన్లతో చాలా ప్రాంతాల్లో పంటలు నాశనమయ్యాయని, అందుకు ప్రతీకారంగానే ఈ దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
బ్రిటన్‌లో జీ–7 సమ్మిట్
ఇంగ్లాండ్‌లో జరిగిన జీ–7 సమావేశంలో పేద దేశాలకు 2022 చివరి వరకు 100 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు అందించాలని జీ–7 కూటమి నిర్ణయించినట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించాడు. ‘ఒకే ధరిత్రి.. ఒకే ఆరోగ్యం’ అనే నినాదంతో అందరం కరోనాను నిర్మూలించాలని వర్చువల్ మీట్లో ప్రధాని మోడీ కోరారు.
ఇరాన్ అధ్యక్షుడిగా ఇబ్రహీం రైసీ
ఇరాన్ అధ్యక్షుడిగా సయ్యద్ ఇబ్రహీం రైసీ ఎన్నికయ్యారు. దేశ సర్వోన్నత నేత అయతొల్లా అలీ ఖొమేనీ ఆధ్వర్యంలోని కమిటీ పర్యవేక్షణలో ఈ ఎన్నికలు జరిగాయి. రైసీ ఇప్పటివరకు దేశ న్యాయవ్యవస్థ అధిపతిగా పనిచేశారు. ఆయన మహ్మద్ ప్రవక్త ప్రత్యక్ష వారసత్వం ఉన్న కుటుంబానికి చెందినవాడు.
కెనడా సుప్రీంకోర్టు జడ్జిగా జమాల్
కెనడాలో సుప్రీంకోర్టు జడ్జిగా ఎన్ఆర్ఐ జస్టిస్ మహ్మద్ జమాల్‌ను ప్రధాని జస్టిస్ ట్రుడో నామినేట్ చేశారు. లీగల్, అకాడమిక్ రంగాల్లో ఆయనకు ఉన్న అపార అనుభవం చాలా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా అన్నారు. కెనడా సుప్రీంకోర్టుకు నామినేట్ అయిన తొలి శ్వేతజాతేతర వ్యక్తిగా ఆయన ఈ ఘనత సాధించారు.
బఫెట్ రాజీనామా
బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ట్రస్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వారెన బఫెట్ ప్రకటించాడు. 4.1 బిలియన్ డాలర్ల విలువైన బెర్క్‌షైర్ హాత్వే షేర్లను అయిదు ఫౌండేషన్లకు వితరణ చేసినట్లు ఆయన తెలిపారు. తన సంపదలో 99 శాతం వితరణ చేస్తానన్నాడు.
మైక్రోసాఫ్ట్ మరో రికార్డ్
ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటల్ విలువ జూన్ 22న సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,48,50,100 కోట్లు)కు చేరింది. దీంతో అమెరికాలో ఆపిల్ కంపెనీ తరువాత రెండు ట్రిలియన్ క్లబ్‌లోకి చేరిన రెండో కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది.
బెజోస్ అంతరిక్షయాత్రపై పిటిషన్
బ్లూ ఆరిజన్‌కు చెందిన న్యూ షెపర్డ్‌లో అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్న అమెజాన్ సీఈవో బెజోస్‌ను తిరిగి భూమి మీదకు రావొద్దనే పిటిషన్‌పై 33వేల మంది సంతకాలు చేశారు.
జాతీయం
భారత్‌లో కరోనా ‘డెల్టా వేరియంట్’
భారత్‌లో మొదటిగా కనిపించిన కరోనా రకానికి ‘డెల్టా వేరియంట్’ అనే పేరును ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖరారు చేసింది. టెక్నికల్‌గా ‘బి.1.617’ గా పిలిచే ఈ వైరస్ రకం అధికారికంగా 53 దేశాల్లో కనిపించిందని సంస్థ తెలిపింది. ఇలా పిలవడంపై భారత్ అభ్యంతరం తెలిపింది.
పీఎం–కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం
కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల కోసం ‘పీఎం–కేర్స్ ఫర్ చిల్డ్రన్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ పథకం ద్వారా అనాథలైన చిన్నారులకు ఉచిత విద్యతోపాటు 23 ఏళ్లు నిండే నాటికి రూ.10లక్షలు అందేలా చూస్తామని తెలిపింది.
వృద్ధిరేటు 9.3%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వృద్ధిరేటు 9.3 శాతం ఉంటుందని ప్రముఖ రేటింగ్స్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అంచనా వేసింది. కానీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7.9 శాతానికి పరిమితం అవుతుందని పేర్కొంది. లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని ఆందోళన తెలిపింది.
వృద్ధిరేటు 8.3 శాతమే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్ తగ్గించింది. ఏప్రిల్ లో 10.1 శాతం అంచనా వేయగా, ఇప్పుడు 8.3 శాతానికి తగ్గించింది. 2022–23లో 7.5శాతం, 2023–24లో 6.5 శాతం వృద్ధిరేటు నమోదు కావచ్చని పేర్కొంది.
117వ స్థానంలో ఇండియా
ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సూచీ-2021లో భారత్ 117వ ర్యాంకును పొందింది. ఐరాస జూన్ 6న విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 2020 ఏడాది 115వ ర్యాంకుని సాధించిన భారత్ ఈ ఏడాది 117తో సరిపెట్టుకుంది. దక్షిణాసియా దేశాలైన భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల కంటే భారత్ వెనుకబడి ఉన్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. మొత్తమ్మీద చూసుకుంటే భారత్‌కి ఎస్‌డీజీ స్కోర్ 100కి 61.9 వచ్చింది.
శంషాబాద్‌కు గ్రీన్ ఎయిర్‌పోర్టు అవార్డ్
ఇప్పటికే మూడుసార్లు గ్రీన్ ఎయిర్‌పోర్టు విభాగంలో అవార్డు దక్కించుకున్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(శంషాబాద్ ఎయిర్‌పోర్టు).. మరోసారి ఆ ఘనత సాధించింది. ఆసియా పసిఫిక్ విభాగంలో ఏటా 25 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యం ఉన్న కేటగిరీలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ‘గ్రీన్ఎయిర్‌పోర్టు గోల్డెన్ అవార్డ్’ లభించింది.
విలువైన స్టార్టప్‌గా బైజూస్
దేశంలోనే అత్యంత విలువైన స్టార్టప్‌గా బైజూస్ నిలిచింది. కొత్త పెట్టుబడులు రావడంతో బైజూస్ విలువ దాదాపు 16.5 బిలియన్ డాలర్లకు చేరింది. 2019లో తన చివరి విడత నిధుల సమీకరణ అనంతరం పేటీఎం 16 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పుడు తాజాగా బైజూస్ 16.5 బిలియన్ డాలర్లతో టాప్ స్టార్టప్‌గా అవతరించింది.
శ్రీశైలంలో తామ్ర శాసనాలు
శ్రీశైల క్షేత్రంలో తామ్ర శాసనాలు దొరికాయి. ఘంటామఠంలో 21 తామ్ర శాసనాలు బయటపడ్డాయి. శాసనాల్లో తెలుగు, నందిగిరి లిపి ఉన్నట్లు గుర్తించారు. లిపి ఆధారంగా ఇవి 14 నుంచి 16 శతాబ్ద కాలం నాటివిగా భావిస్తున్నట్లు మైసూరు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నం రెడ్డి తెలిపారు.
దేశంలో రికార్డ్ ఫారెక్స్ నిల్వలు
భారత్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు జూన్‌లో 600 బిలియన్ డాలర్లను దాటాయి. దేశ ఫారెక్స్ నిల్వలు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. మే 28వ తేదీతో ముగిసిన వారంతో పోల్చిచూస్తే నిల్వలు 6.842 బిలియన్ డాలర్లు ఎగసి 605.008 డాలర్లకు చేరినట్లు ఆర్‌బీఐ జూన్ 11న విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి.
ప్రసార భారతి కొత్త యాప్
ప్రసారభారతి కొత్తగా ‘న్యూస్ ఆన్ ఎయిర్’ పేరుతో యాప్ సేవలు ప్రారంభించింది. ఈ యాప్‌లో ఆల్ ఇండియా రేడియోకు సంబంధించిన 240 రేడియో సేవలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 90 దేశాల్లో శ్రోతలు ఉన్నారు. న్యూస్ ఆన్ ఎయిర్ రేడియో సర్వీసుల్లో వివిధ భారతి మొదటి స్థానంలో నిలిచింది.
దేశ జనాభా 133.89 కోట్లు
దేశ జనాభా 133.89 కోట్లకు చేరిందని తాజా లెక్కల్లో తేలింది. నిమిషానికి సగటున 51 మంది శిశువులు పుడుతుంటే 16 మంది చనిపోతున్నారు. ఏడాది కాలంలో దేశంలో 2.67 కోట్ల మంది శిశువులు జన్మించగా మరణాలు 83 లక్షలున్నాయి.
అతిపెద్ద దాతగా జెమ్షెడ్జీ టాటా
గత శతాబ్దకాలంలో ప్రపంచంలో అత్యధికంగా విరాళాలిచ్చిన వ్యక్తిగా భారత పారిశ్రామిక పితామహుడు, టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్‌జీ టాటా (102 బిలియన్ డాలర్లు) అగ్రస్థానంలో నిలిచాడని హూరన్, ఎడెల్‌గివ్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలో తేలింది. బఫెట్ (37.4 బిలియన్ డాలర్లు), జార్జ్ సోరోస్ (34.8 బిలియన్ డాలర్లు) తర్వాత స్థానంలో ఉన్నారు.
అగ్రస్థానంలో మోడీ
గ్లోబల్ అప్రూవల్ రేటింగ్ అంశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అగ్రస్థానంలో నిలిచారు. మోడీ తర్వాత రెండో స్థానంలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉన్నారు. గ్లోబల్ అప్రూవల్ రేటింగ్‌పై అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది.
ప్రాంతీయం
తెలంగాణకు ఆరోస్థానం
నీతిఆయోగ్ ప్రకటించిన సుస్థిరాభివృద్ధి సూచిక (2020–21) ఇండెక్స్ లో కేరళ 75 స్కోర్‌తో టాప్‌లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ మూడోస్థానం, తెలంగాణ ఆరోస్థానంలో నిలిచాయి. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాలను పరిగణనలోకి తీసుకొని నీతిఆయోగ్ ఈ ర్యాంకులను ప్రకటిస్తుంది. బీహార్, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాలు అట్టడుగు స్థానంలో ఉన్నాయి.
మరో పదేళ్లు బీసీ రిజర్వేషన్లు
తెలంగాణలోని బీసీలకు విద్యా, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లను మరో పదేళ్లు పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.3 జారీ చేసింది. జూన్ ఒకటో తేది నుంచి 2031 మే 31 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది.
నీటి ఆవిరితో విద్యుత్ ప్లాంట్
సింగరేణి పరిధిలోని భద్రాద్రి జిల్లా మణుగూరులో ‘జియో థర్మల్ విద్యుత్ ప్లాంట్’ నిర్మాణానికి కేంద్రం రూ.1.72 కోట్లు మంజూరు చేసింది. 20 కిలోవాట్ల సామర్ధ్యంతో దేశంలోనే తొలిసారి నీటిఆవిరితో విద్యుత్ ప్లాంట్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు.
మండలికి కొత్త ప్రొటెం చైర్మన్
రాష్ట్ర శాసనమండలి ప్రొటెం (తాత్కాలిక) చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎంఎల్సీ భూపాల్ రెడ్డిని నియమిస్తూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు జారీ చేశారు. సీనియారిటి ఆధారంగా 2007 నుంచి ఎమ్మెల్సీగా ఉన్న ఆయనను సీఎం కేసీఆర్ సిఫార్స్ చేశారు.
సింగరేణికి నేషనల్ అవార్డ్
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అత్యుత్తమ ప్రతిభతో నేషనల్ అవార్డ్ గెలుచుకుంది. మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ సంస్థ నిర్వహించిన వీడియో సెమినార్లో ఈ అవార్డ్ ప్రకటించింది. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్మించిన 1200 మెగావాట్ల ఈ కేంద్రం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలో ఎంపికైంది.
నిరుద్యోగులకు యాప్
వివిధ రంగాలకు చెందిన అన్నిరకాల సంస్థల్లో ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని నిరుద్యోగులకు చేరవేసేందుకు ‘డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ’ (డీట్) యాప్, పోర్టల్‌ను తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. నిరుద్యోగులు తమ వివరాలు ‘డీట్’లో నమోదు చేసుకుంటే ఖాళీల సమాచారం తెలుస్తుంది.
నల్లమలలో కాలాముఖ ఆలయం
శైవమత శాఖల్లో ఒకటైన కాలాముఖ దేవాలయాన్ని నల్లమల అటవీప్రాంతంలో గుర్తించినట్లు తెలంగాణ కొత్త చరరిత్ర బృందం ప్రకటనలో తెలిపింది. ఈ ఆలయం, విగ్రహాలు, 10 నుంచి 12 వ శతాబ్దం నాటివని కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు.
వరిలో కొత్త వంగడం
నిజామాబాద్ జిల్లాలోని రుద్రూర్ ప్రాంతీయ చెరకు, వరి పరిశోధన స్థానం శాస్ర్తవేత్తలు రూపొందించిన వరిలో సన్నరకం నూతన వంగడానికి (ఆర్.డి.ఆర్–1200) రాష్ట్ర స్థాయి సాంకేతిక పరిశీలనలో ఆమోదం లభించింది. అధిక దిగుబడులు సాధించే రకంగా ఇది ఎంపికైంది.
అటవీ కళాశాలకు జాతీయ గుర్తింపు
సిద్దిపేట జిల్లా నుంచి ములుగులో ఉన్న తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్సీఆర్ఐ) కి ‘గ్రీన్ చాంపియన్’ గుర్తింపు లభించింది. జాతీయ స్థాయిలో స్వచ్ఛత, పచ్చదనం, పోటీలో నిలిచినందుకు ఈ ఘనత సాధించింది.
లింగనిష్పత్తిలో ఏడో స్థానం
కేంద్ర జనగణన విభాగం తాజాగా విడుదల చేసిన 2019 జనన మరణ లెక్కల ప్రకారం అత్యధిక లింగనిష్పత్తి రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. 2019లో 1000 మంది బాలురకు 953 మంది బాలికలు మన రాష్ట్రంలో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ (1024), నాగాలాండ్ (1001) టాప్ ప్లేస్‌లో ఉన్నాయి.
హన్మకొండగా వరంగల్ అర్బన్ జిల్లా
వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండగా, రూరల్ జిల్లాను వరంగల్‌గా ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. త్వరలో దీనికి సంబంధించిన ఉత్తుర్వులు జారీ చేస్తానని ఆయన తెలిపారు.
భద్రాద్రిలో రాతియుగం నీటిపాత్రలు
భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలం జిన్నెలగూడెంలో రాతియుగం నాటి సమాధుల ఆనవాళ్లు, రాతి చిప్పలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఆదిమానవులు వీటిని ఉపయోగించి ఉంటారని బృంద సభ్యులు తెలిపారు.
వార్తల్లో వ్యక్తులు
జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్ర
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్ర జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్యానెల్ సభ్యులుగా జస్టిస్ ఎం.ఎం.కుమార్, రాజీవ్ జైన్ నియమితులయ్యారు. ఇదివరకు చైర్మన్‌గా ఉన్న జస్టిస్ హెచ్.ఎల్.దత్తు పదవీకాలం గతేడాది డిసెంబర్లో ముగిసింది.
టీవీ నరేంద్రన్
కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) కొత్త అధ్యక్షుడిగా (2021–22) టాటా స్టీల్ ఎండీ, సీఈవో టీవీ నరేంద్రన్ ఎన్నికయ్యారు. ఉదయ్ కోటక్ స్థానాన్ని నరేంద్రన్ భర్తీ చేయనున్నారు. ఉపాధ్యక్షుడిగా హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్ బాధ్యతలు తీసుకోనున్నారు.
వినయ్ నందికూరి
సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) కొత్త డైరెక్టర్‌గా ప్రముఖ బయాలజిస్టు డాక్టర్ వినయ్ నందికూరి బాధ్యతలు తీసుకున్నారు. ఈయన ఇప్పటివరకు ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీలో సైంటిస్ట్‌గా క్షయ వ్యాధిపై ప్రయోగాలు చేశారు.
సీఎన్‌ఆర్ రావు
భారతరత్న ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. పునరుత్పాదక ఇంధన వనరులపై పరిశోధనలు చేసినందుకు ఇంటర్నేషనల్ ఎనీ అవార్డు–2020కు ఎంపికయ్యారు. ఎనర్జీ పరిశోధనల్లో ఈ పురస్కారాన్ని నోబెల్ బహుమతిగా పరిగణిస్తారు.
సమంత్ కుమార్ గోయల్
రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా) చీఫ్ సమంత్ కుమార్ గోయల్ పదవీకాలాన్ని ఏడాది పొడిగించారు. ఆయన జూన్ 30న రిటైర్ కావాల్సి ఉండగా ఏడాది పొడిగిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది.
కుల్దీప్ సింగ్
సీఆర్‌పీఎఫ్ చీఫ్ కుల్దీప్ సింగ్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎన్‌ఐఏ డీజీగా ఉన్న వైసీ మోదీ మే 31న పదవీ విరమణ చేయనుండగా మే 29న కుల్దీప్‌సింగ్‌కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగిస్తూ అదేశాలు వెలువడ్డాయి.
అనూప్ చంద్ర పాండే
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా, రిటైర్డ్ ఐఏఎస్ అనూప్ చంద్ర పాండే నియమితులయ్యారు. 1984 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన అనూప్ చంద్ర గతంలో యూపీ సీఎస్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆర్టికల్ 324 (2) ప్రకారం రాష్ట్రపతి ఆయనను నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ ప్రకటించింది.
సిమోన్ బైల్స్
స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్… అమెరికాలోని టెక్సాస్ లో జూన్ 7న జరిగిన అమెరికా జాతీయ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో ఏడోసారి ఆల్ అరౌండ్ చాంపియన్‌గా (119.650 పాయింట్లు) నిలిచింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందింది. గతంలో క్లారా స్కార్త్ ఆరుసార్లు విజేతగా నిలిచింది. 2016 రియో ఒలింపిక్స్‌లో సిమోన్ నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఐదు పతకాలు నెగ్గింది.
రంజిత్ సింగ్
గ్లోబల్ టీచర్ అవార్డ్ గెలుచుకున్న మహారాష్ట్రకు చెందిన ఉపాధ్యాయుడు రంజిత్‌సింగ్ ప్రపంచ బ్యాంక్ సలహాదారుగా నియమితులయ్యారు. ఆధునిక టెక్నాలజీతో ఉపాధ్యాయుల శిక్షణలో నాణ్యత పెంచేందుకు ‘గ్లోబల్ కోచ్’ పేరుతో ప్రపంచ బ్యాంక్ నూతన కార్యక్రమం ప్రారంభించింది. 2024 వరకు ఆయన ఈ కమిటీలో కొనసాగనున్నారు.
సత్య నాదెళ్ల
భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నూతన చైర్మన్‌గా నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ జాన్ తాంసన్ స్థానంలో, ప్రస్తుత సీఈవోను కొత్త కంపెనీ ఎంపిక చేసింది. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు.
మేఘ రాజగోపాలన్
భారత సంతతికి చెందిన జర్నలిస్టు మేఘ రాజగోపాలన్ జర్నలిజంలో ఇచ్చే అత్యున్నత స్థాయి పురస్కారం‘పులిట్జర్ ప్రైజ్’ గెలుచుకున్నారు. ఏడాదికిగాను ఆమెకు ఈ అవార్డు లభించింది. ఇద్దరు కంట్రిబ్యూటర్లతో కలిసి ఆమెకు ఈ ఫ్రైజ్ దక్కింది.
వినూ మన్కడ్
తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పురస్కరించుకొని ఐసీసీ పది మంది దిగ్గజ క్రికెటర్లకు ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు కల్పించింది. ఇందులో భారత్ నుంచి దివంగత క్రికెటర్ వినూ మన్కడ్, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరకు స్థానం దక్కింది.
ఎం.పి.సింగ్
కృష్ణా నదీ యాజ మాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్‌గాఎం.పీ.సింగ్‌ను నియమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కృష్ణా బోర్డు చైర్మన్‌గా పనిచేసిన పరమేశం మే 31న పదవీ విరమణ చేశారు. ఇటీవల వరకు ఎన్‌టీబీవో (నర్మదా తపతి బేసిన్ ఆర్గనైజేషన్) సీఈవోగాఎం.పి.సింగ్ పనిచేశారు
జహీద్ ఖురేషీ
అమెరికాలో మొట్టమొదటిసారి ఒక ముస్లిం–అమెరికన్ వ్యక్తి ఫెడరల్ జడ్జిగా ఎంపికయ్యారు. దీనికి సంబంధించి 81–16 ఓట్లతో సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో అమెరికా మొట్టమొదటి ముస్లిం–అమెరికన్ ఫెడరల్ జడ్జిగా పాకిస్తాన్ సంతతికి చెందిన జహీద్ ఖురేషీ (46) నియమితులయ్యారు.
డింకోసింగ్
మణిపూర్ కు చెందిన ఇండియన్ స్టార్ బాక్సర్ డింకోసింగ్ క్యాన్సర్‌తో మరణించాడు. 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో గోల్డ్‌మెడల్, 1998లో అర్జున, 2013లో పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నాడు.
తిప్పినేని రామదాసప్ప నాయుడు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ జీవిత విశేషాలతో, న్యాయవ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులు, సంస్కరణలను పొందుపరుస్తూ తిప్పినేని రామదాసప్ప నాయుడు ‘భారత న్యాయ దిగ్గజం’ పుస్తకాన్ని రూపొందించారు. దీన్ని జస్టిస్ చంద్రయ్య ఆవిష్కరించారు.
మిల్కాసింగ్
పరుగుల వీరుడు, ఫ్లయింగ్ సిఖ్‌గా పేరుగాంచిన భారత అథ్లెట్ మిల్కాసింగ్ కరోనాతో మరణించాడు. 1951లో భారత సైన్యంలో చేరి, 1958 కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్‌మెడల్‌తో సత్తా చాటాడు. 1958 టోక్యో, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణ పతకాలు నెగ్గాడు. కేంద్ర ప్రభుత్వం 1959లో పద్మశ్రీతో సత్కరించింది.
కరణం మల్లీశ్వరి
ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ గా తెలుగు వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి నియమితులయ్యారు. ఈ వర్సిటీ ఏర్పడిన తర్వాత తొలి వీసీ అవకాశం మల్లీశ్వరికే దక్కింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆమె 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్య పతకం గెలిచింది.
శిబులాల్
కేంద్రప్రభుత్వం బ్యూరోక్రాటిక్ సంస్కరణలు లక్ష్యంగా చేపట్టాలనుకుంటున్న మిషన్ కర్మయోగి టాస్క్‌ఫోర్స్ చైర్మన్‌గా ఇన్ఫోసిస్ మాజీ సీఈవో శిబులాల్ నియమితులయ్యారు. దేశంలోని అన్ని సివిల్ సర్వీస్ విభాగాల పనితీరులో, ప్రజా సేవల మెరుగుదల దీని ఉద్దేశం.
ద్యుతీచంద్
మహిళల 100 మీటర్ల విభాగంలో ఒడిశా స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ కొత్త జాతీయ రికార్డు సృష్టించింది. ఆమె 11.17 సెకన్లలో రేసును ముగించి 11.21 సెకన్లతో తన పేరిటే ఉన్న నేషనల్ రికార్డును తిరగరాసింది.
జాన్ మెకాఫీ
‘మెకాఫీ’ యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ సృష్టికర్త జాన్ మెకాఫీ అనుమానాస్పది స్థితిలో మరణించారు. అమెరికాకు చెందిన మెకాఫీ ఆ దేశంలో నమోదైన పన్ను ఎగవేత కేసులో అరెస్ట్ అయ్యి, కొన్ని నెలలుగా స్పెయిన్ జైలులో ఉంటున్నారు.
సౌరభ్ చౌదరి
షూటింగ్ ప్రపంచకప్ టోర్నీలో పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టోల్ విభాగంలో సౌరభ్ చౌదరి కాంస్య పతకం గెలుచుకున్నాడు. ఫైనల్లో 220 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
ముక్కాముల శ్రీనివాస్
అమెరికన్ మెడికల్ ఆసోసియేషన్ చైర్మన్‌గా ఎన్ఆర్ఐ ముక్కాముల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ సంఘానికి చైర్మన్‌గా ఎన్నికైన మొదటి ఇండియన్‌గా ఆయన నిలిచారు.
క్రీడలు
చాంపియన్ లీగ్ విజేత చెల్సీ
ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ టోర్నీ అయిన చాంపియన్స్ లీగ్‌లో చెల్సీ విజేతగా నిలిచింది. ఫైనల్లో 1–0 తేడాతో మాంచెస్టర్ సిటీ ఎఫ్‌సీపై విజయం సాధించింది. చాంపియన్ లీగ్‌లో చెల్సీకి ఇది రెండో టైటిల్. హవెర్జ్ 42 వ నిమిషంలో గోల్ కొట్టడంతో చెల్సీ చాంపియన్‌గా నిలిచింది.
ఆసియా బాక్సింగ్ విన్నర్ సంజీత్
ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ 91 కిలోల విభాగంలో భారత బాక్సర్ సంజీత్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్లో 4–1 తో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ విన్నర్ వాసిలీ లెవిట్ (కజకిస్థాన్) పై విజయం సాధించాడు. ఈ ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్ రికార్డ్ స్థాయిలో రెండు స్వర్ణాలు సహా 15 మెడల్స్ గెల్చుకుంది.
బెల్‌గ్రేడ్ చాంపియన్ జొకోవిచ్
బెల్‌గ్రేడ్ ఓపెన్ ఏటీపీ –250 టోర్నీలో పురుషుల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ నోవాక్ జొకోవిచ్ (సెర్బియా) చాంపియన్‌గా నిలిచాడు. దీంతో తన కెరీర్‌లో 83వ సింగిల్స్ టైటిల్ సాధించాడు. ఫైనల్లో జొకోవిచ్ 6–4, 6–3తో మొల్కాన్ (స్లొవేకియా)పై గెలిచాడు.
ప్రపంచ క్యాండిడేట్స్ టోర్నీకి హంపి
ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపి క్యాండిడేట్స్ చెస్ టోర్నీకి అర్హత సాధించింది. ఫిడే మహిళల గ్రాండ్ ప్రి సిరీస్‌లో రెండో స్థానం రావడంతో ఆమె ఈ ఛాన్స్ దక్కించుకుంది. హంపి 293 పాయింట్లతో ఈ టోర్నీకి అర్హత పొందింది.
అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి విజేత పెరెజ్
అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెర్గియో పెరెజ్ చాంపియన్‌గా నిలిచాడు. 51 ల్యాప్‌ల రేసులో పెరెజ్ 2 గంటల 13 నిమిషాల 36.410 సెకన్లలో లక్ష్యాన్ని చేరి విజేత అయ్యాడు. పెరెజ్‌కిది కెరీర్‌లో రెండో విజయం. వెటెల్ (ఆస్టన్ మార్టిన్) రెండో స్థానంలో, పియరీగ్యాస్లీ (ఆల్ఫా టారీ) మూడో స్థానంలో నిలిచారు.
బెస్ట్ టెస్ట్ సిరీస్‌గా బోర్డర్–గవాస్కర్
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన 2020–21 బోర్డర్–గవాస్కర్ సిరీస్ అత్యుత్తమ టెస్ట్ సిరీస్‌గా ఐసీసీ ప్రకటించింది. తమ సోషల్ మీడియాలో 70 లక్షల మంది అభిమానులు వేసిన ఓట్ల ఆధారంగా దీన్ని నిర్ణయించినట్లు ఐసీసీ తెలిపింది.
విన్నర్స్ జకోవిచ్, క్రెజికోవా
ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్‌లో సెర్బియా స్టార్ టాప్ సీడ్ జకోవిచ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో అయిదో సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్‌ను ఓడించాడు. దీంతో మొత్తం 19 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో చెక్ రిపబ్లిక్ స్టార్ బార్బారా క్రెజికోవా ఫైనల్లో 6–1, 2–6, 6–4 తో పవ్లిచెంకోవా (రష్యా)ను ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్ గెలుచుకుంది.
వినేశ్ ఫొగాట్‌కు గోల్డ్ మెడల్
పోలెండ్ ఓపెన్ రెజ్లింగ్ టోర్నీ మహిళల 53 కేజీల విభాగంలో ఇండియన్ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్లో 8–0తో బెరెజా (ఉజ్బెకిస్థాన్)పై విజయం సాధించింది.
హాల్ ఆఫ్ ఫేమ్‌లో మన్కడ్
తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ సందర్భంగా ఐసీసీ పది మంది దిగ్గజ క్రికెటర్లకు ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు కల్పించింది. ఇందులో భారత్ నుంచి దివంగత క్రికెటర్ వినూ మన్కడ్‌కు చోటు దక్కింది. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరకు స్థానం లభించింది.
స్విమ్మింగ్‌లో వరల్డ్ రికార్డ్
ఆస్ట్రేలియా ఒలింపిక్ స్విమ్మింగ్ ట్రయల్స్‌లో మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో 19 ఏళ్ల కేలీ మెకియోన్ కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ జరిగిన పోటీల్లో కేలీ 100 మీటర్ల లక్ష్యాన్ని 57.45 సెకన్లలో అందుకొని… 57.57 సెకన్లతో 2019లో రేగన్ స్మిత్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును సవరించింది.
చాంపియన్ న్యూజిలాండ్
ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్‌పై న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మొదటి ఐసీసీ వరల్డ్ టెస్ట్ టైటిల్ కైవసం చేసుకుంది. డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు ఆసీస్ ప్లేయర్ లబుషేన్ (1675) చేయగా, అత్యధిక వికెట్లు ఇండియన్ బౌలర్ అశ్విన్ (71) తీశాడు.
ఫ్రెంచ్ గ్రాండ్ ప్రి విన్నర్ వెర్స్టెపెన్
రెడ్‌బుల్ రేసర్ మాక్స్ వెర్స్టాపెన్ ఫ్రెంచ్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో డ్రైవర్ చాంపియన్ షిప్ 2021 పట్టికలో 12 పాయింట్లతో టాప్ లో కొనసాగుతున్నాడు.
జాతీయ చెస్ చాంపియన్ ప్రణీత్
జాతీయ ఆన్లైన్ అండర్–14 చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన ప్రణీత్ విజేతగా నిలిచాడు. 11 రౌండ్లు ముగిసే సరికి 10 పాయింట్లతో ర్యాపిడ్ చెస్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
సైన్స్ అండ్ టెక్నాలజీ
దేశంలో నానో యూరియా
ప్రపంచంలోనే తొలిసారి ‘నానో యూరియా’ ను భారత రైతుల ఎరువుల సహకర సంస్థ (ఇఫ్కో) ప్రవేశపెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ నానో యూరియా ద్రవ రూపంలో ఉంటుంది. సంప్రదాయ యూరియా బస్తా ధరతో పోలిస్తే ఇది 10 శాతం తక్కువ రేటుకే దొరుకుతుంది.
చైనా హైయాంగ్–2డి శాటిలైట్
హైయాంగ్ 2డీచైనాకు చెందిన జియుక్వాన్ శాటిలైట్ సెంటర్ నుంచి మే 19న లాంగ్‌మార్చ్-4బి రాకెట్ ద్వారా హైయాంగ్-2డి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది సముద్రాల విపత్తు సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
పీ–75 ఇండియాకు ఆమోదం
ఇండియన్ నేవీని మరింత శక్తివంతం చేయడానికి పెండింగ్‌లో ఉన్న భారీ మేకిన్ ఇండియా ప్రాజెక్టు ‘పీ–75 ఇండియా’కు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.43 వేల కోట్ల అంచనాతో 6 సబ్‌మెరైన్స్ నిర్మించనున్నట్లు డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సమావేశంలో నిర్ణయించారు.
శుక్రుడి మీదకు నాసా రాకెట్స్
శుక్రగ్రహంపై పరిశోధనలకు రెండు రాకెట్లను నాసా ప్రయోగించనున్నట్లు తాజాగా తెలిపింది. ఈ దశాబ్దం చివర్లో వీటిని పంపుతామని వెల్లడించింది. ఈ గ్రహంపై ఉన్న అత్యధిక ఉష్ణోగ్రతకు దారితీసిన పరిస్థితులపై పరిశోధన చేయనున్నారు.
ఇస్రో ఆటోమేటెడ్ వెంటిలేటర్లు
కరోనా చికిత్సకు ఆటోమేటెడ్ కంప్రెషన్ ఆధారంగా వినియోగించే మూడు రకాల వెంటిలేటర్లను ఇస్రో తయారు చేసింది. ప్రోగ్రామబుల్ రెస్పిరేటరీ అసిస్టెన్స్ ఫర్ ద నీడీ ఎయిడ్ అనే ఈ వెంటిలేటర్లు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయని ఇస్రో అధికారులు తెలిపారు.
అంతరిక్షానికి చైనా ఆస్ట్రోనాట్స్
డ్రాగన్ దేశం కొత్తగా నిర్మించిన అంతరిక్ష కేంద్రానికి తన వ్యోమగాములను పంపింది. లాంగ్ మార్చ్ 2ఎఫ్ రాకెట్ ద్వారా షెంన్‌జూ12 క్యాప్సూల్‌లో చైనా ఆస్ట్రోనాట్స్ వెళ్లారు. నీ హైషెంగ్, లయూ బోమింగ్, టాంగ్ హోంగ్‌బోలు అంతరిక్ష కేంద్రంలో మూడు నెలలు గడపనున్నారు.
బ్రహ్మోస్‌కు 20 ఏండ్లు
బ్రహ్మోస్‌ను తొలిసారి ప్రయోగించి 20 ఏండ్లు పూర్తయింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణిగా ఇది గుర్తింపు పొందింది. అనేక పరీక్షల అనంతరం సైన్యం, నౌకాదళం, వాయుసేనలో బ్రహ్మోస్ కీలక అస్త్రంగా మారింది.
అంగారకుడి చిత్రాలను పంపిన ఝరాంగ్
అంగారకుడిపై దిగిన చైనా రోవర్ ఝరాంగ్ పంపిన చిత్రాలను చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ (సీఎన్ఎస్ఏ) విడుదల చేసింది. ల్యాండర్‌తో రోవర్ దిగిన సెల్ఫీ చిత్రాలను చైనా విడుదల చేసింది.
సౌరకుటుంబంలోకి కొత్త తోకచుక్క
సౌరకుంటుంబంలో కొత్త తోకచుక్కను సైంటిస్టులు గుర్తించారు. ఇది వేగంగా లోపలికి దూసుకొస్తుందని కనుగొన్నారు. దీనికి ‘2014 యూఎన్271’ అని పేరు పెట్టారు. నక్షత్రం చుట్టూ గ్రహాలు ఏర్పడినప్పుడు మిగిలిపోయన గ్రహశకలాలే ఈ తోకచుక్కలు.
భారత్–అమెరికా విన్యాసాలు
హిందూ మహాసముద్రంలో భారత్–అమెరికా రెండు రోజులు యుద్ధ విన్యాసాలు చేశాయి. ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరుగుతుండడంతో రెండు దేశాల మధ్య సమన్వయం పెంపొంచేందుకు ఈ కసరత్తు చేపట్టాయి.
సౌరశక్తి పరిశోధనలకు చంద్రయాన్–2
చంద్రయాన్–2లో అమర్చిన సోలార్ ఎక్స్‌రే మానిటర్ సాయంతో సూర్యుని కాంతి శక్తిని అధ్యయనం చేసే వీలుందని నాసా ప్రకటించింది. సూర్యుడి ఉపరితలం ప్రసరించే కాంతిని గుర్తించేందుకు ఎక్స్ఎస్ఎం టెక్నాలజీ ఉపయోగపడుతుందని తెలిపింది.