ఎట్టకేలకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్‌లో ప్రశ్నాపత్రాలు తారుమారైన విషయంపై హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జీ కలెక్టర్ అమయ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. ఇన్విజిలేటర్, హాల్ సూపరింటెండెంట్‌ల పొరపాటు కారణంగా జరిగిందని ధ్రువీకరించారు. ఒక్క సెంటరే కాదు.. మొత్తం మూడు సెంటర్లలో ఈ తప్పిదం జరిగిందని వివరణ ఇచ్చారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 106 సెంటర్లలో 16వ తేదీన గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించారు. లాలాగూడలోని సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్స్ హై స్కూల్, SFS చర్చి శాంతి నగర్ లో 47 మంది అభ్యర్థులకు తెలుగు, ఇంగ్లీషులో ముద్రించిన ద్విభాషా ప్రశ్న పత్రాలను పంపిణీ చేయకుండా ఇతర భాషల్లో ముద్రించిన ప్రశ్నపత్రాలను పంపిణీ చేయటంతో పొరపాటు జరిగిందని ప్రకటించారు. మూడు రూమ్‌ల్లో జరిగిన ఈ తప్పును వెంటనే గుర్తించి ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ముద్రించిన సరైన ప్రశ్నపత్రాన్ని పంపిణీ చేసి సరిదిద్దినట్లు తెలిపారు. తమ ఆన్సర్ షీట్లు చెల్లుబాటు అవుతాయో.. కాదోననే అపోహతో కొత్త సెట్‌ను తీసకునేందుకు అభ్యర్థులు చాలా సేపు నిరాకరించారని వివరణ ఇచ్చారు. సెంటర్ లో ఉన్న అధికారులు జిల్లా కలెక్టర్‌తో చర్చించి.. అభ్యర్థులకు సర్ధిచెప్పి.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3.30 వరకు పరీక్ష రాయించినట్లు వివరణ ఇచ్చారు. పరీక్ష పూర్తయ్యే వరకు పేర్కొన్న అభ్యర్థులందరూ పరీక్షా కేంద్రం ప్రాంగణంలో ఉన్నారని.. ఎలాంటి అవకతవకలు జరిగేందుకు ఆస్కారం లేదని తెలిపారు.
ఇదే విధంగా అబిడ్స్‌లోని స్టాన్లీ ఇంజినీరింగ్ కాలేజీలో ఇవే కారణాలతో ఇద్దరు అభ్యర్థులకు 15 నిమిషాలు, అయిదుగురికి 30 నిమిషాల అదనపు సమయం ఇచ్చారు. అబిడ్స్‌లోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో 15 మంది అభ్యర్థులకు పరీక్షను పూర్తి చేయడానికి 7 నిమిషాల అదనపు సమయం ఇవ్వబడింది. TSPSC లో సంప్రదింపుల మేరకు వారిచ్చిన సలహాలకు అనుగుణంగా అభ్యర్థులకు అడిషనల్ టైమ్ ఇచ్చినట్లు జిల్లా కలెక్టకర్ ఈ ప్రకటనలో తెలిపారు. పొరపాటుకు కారణమైన ఇన్విజిలేటర్లపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.