టీచర్ పోస్టుల భర్తీ నేపథ్యంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ ‘ టెట్’ పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ మేరకు పరీక్ష నిర్వహణ, చేపట్టాల్సిన మార్పులు, చేర్పులపై ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించింది. అనుమతి లభించిన వెంటనే టెట్ నోటిఫికేషన్ జారీ చేసి ఏప్రిల్ నెలాఖరు లేదా మే ఫస్ట్ వీక్‌లో టెట్ నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఈసారి అభ్యర్థులకు 45రోజుల పాటు ప్రిపరేషన్‌కు సమయం ఇవ్వనుంది.
ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా టీచర్ పోస్టుల భర్తీకి టెట్ నిర్వహణ తప్పనిసరి. మొదటి సారిగా 2011లో దీనిని ప్రవేశపెట్టారు. అప్పటినుంచి రాష్ట్రంలో జరిగిన ఉపాధ్యాయ నియామాక పరీక్షకు టెట్ ఎగ్జామ్‌లో అర్హత పొందిన వారినే అనుమతించారు. మొత్తం 150 మార్కులకు నిర్వహించే ఈ ఎలిజిబులిటీ టెస్ట్‌లో జనరల్ అభ్యర్థులు 90 మార్కులు, బీసీలు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 60 మార్కులు సాధిస్తే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ రాసేందుకు అర్హత సాధిస్తారు. తెలంగాణాలో చివరిసారిగా 2017లో నిర్వహించారు. ఆ తర్వాత అనేకమార్లు టెట్ నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసినా.. ఉపాధ్యాయ నియామకాలు లేనందున ప్రభుత్వం ఆసక్తి చూపించలేదు.
ఈ సారి నిర్వహించే టెట్‌లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే గతంలో టెట్ ఎగ్జామ్ వ్యాలిడీటీ ఏడేండ్ల పాటు ఉండేది. తాజాగా దానికి లైఫ్‌టైమ్ వ్యాలిడిటీ ఇస్తూ కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు డీఈడీ చేసిన వారికి మాత్రమే పేపర్–1 రాసేందుకు అర్హత ఉండేది. ఇప్పుడు బీఈడీ చేసిన వారికి కూడా అర్హత లభించింది. ఈ రెండు అంశాలను సవరించాలని కోరుతూ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. వీటికి ఆమోదం లభించగానే రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ వెలువడనుంది.
రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారు సుమారు 5లక్షల వరకు ఉన్నారు. వారిలో డీఈడీ(టీటీసీ) అభ్యర్థులు 1.5లక్షల మంది. బీఈడీ అభ్యర్థులు సుమారు 3.5 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో గతంలో టెట్ అర్హత సాధించిన వారు 2.5లక్షల మంది ఉన్నట్టు అంచనా. వీరందరూ టెట్ నోటిఫికేషన్ ఎదురుచూస్తున్నారు.