టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 (TSPSC Group-1) ప్రిలిమినరీ కీ (Preliminary Key )పై భారీగా అభ్యంతరాలు నమోదయ్యాయి. దాదాపు వెయ్యికిపైగా అభ్యంతరాలు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి. అభ్యంతరాల నమోదు గడువు నవంబర్ 4వ తేదీతో ముగిసింది. ఇప్పటివరకు అభ్యంతరాలకు సంబంధించిన వివరాలను టీఎస్పీఎస్సీ అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు వచ్చిన అభ్యంతరాలను పరిశీలించేందుకు ఎక్స్పర్ట్ కమిటీని నియమించింది. టీఎస్పీఎస్సీ బుధవారం ఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంది.
ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా వారం పది రోజుల్లో ఫైనల్ కీ విడుదల చేసే అవకాశముంది. వెయ్యి అభ్యంతరాలు నమోదవటం.. తక్కువ సంఖ్యేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. ఒక అభ్యర్థి ఏకంగా పరీక్షలో వచ్చిన మొత్తం 150 ప్రశ్నలపై అభ్యంతరాలు నమోదు చేసినట్లు తెలిసింది. అందుకే మొత్తం అభ్యంతరాలు పరిశీలించేందుకు వారం రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ నెల 16న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 503 గ్రూప్-1 ఖాళీల భర్తీకి సంబంధించి ప్రాథమిక పరీక్షను నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ప్రైమరీ కీ (Group-1 Key) విడుదలైంది. “కీ” కి సంబంధించిన అభ్యంతరాలను నవంబర్ 4వ తేదీన సాయంత్రం వరకు స్వీకరించారు. అయితే.. ఈ ‘కీ’ పై పెద్దగా అభ్యంతరాలు రాలేదని టీఎస్పీఎస్సీ (TSPSC) వర్గాలు మొదట్లో తెలిపాయి. వాటిలో ఆరు ఆన్సర్లపైనే అభ్యంతరాలు ఎక్కువగా ఉన్నాయని.. ఒక ప్రశ్నను ఎక్కువ మంది ఛాలెంజ్ చేసినట్లు సమాచారం. దీంతో ఒక మార్కు కలిపేందుకు ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ.. మొత్తం 150 ప్రశ్నలపై తనకు సందేహాలున్నాయని ఒక అభ్యర్థి సవాల్ చేయటంతో టీఎస్పీఎస్సీ అధికారులు కూడా తల పట్టుకుంటున్నారు. ఒకవేళ అభ్యర్థి ఆట పట్టించేందుకు అలా చేసినప్పటికీ.. అలవోకగా కొట్టిపారేసే పరిస్థితి ఉండబోదని.. వాటన్నింటినీ పరిశీలించి సందేహాలు నివృత్తి చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
A saiganesh