HomeLATESTగ్రూప్​ 1 పేపర్​ ఇలా ఉండొచ్చా.. ఉండొద్దా..? ఒక విశ్లేషణ

గ్రూప్​ 1 పేపర్​ ఇలా ఉండొచ్చా.. ఉండొద్దా..? ఒక విశ్లేషణ

‘నిన్న తెలంగాణలో గ్రూప్ వన్ పరీక్ష జరిగింది. గతంలో జరిగిన అర్హత పరీక్ష ప్రశ్న పత్రం లీక్ అయిన దరిమిలా మళ్ళీ నిన్న పరీక్ష పెట్టారు. అంతకు ముందు పరీక్ష పత్రం బాగా కఠినంగా ఉందని చెప్పారు. అంతకు ముందు అర్హత సాధించని వాళ్ళలో కొందరు ఈ సారి ఆశావాదంతో పరీక్షకు సిద్ధం అయ్యారు. అయితే నిన్నటి పేపర్ అంతకు మించి కఠినంగా ఉందని, ఇంతకు ముందు అర్హత సాధించిన వాళ్ళలో కొందరు ఇప్పుడు గట్టెక్కలేరని, విద్యార్థుల మీద కక్ష సాధింపుగా పేపర్ ఉందని చెప్తున్నారు. కోచింగ్ నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కటాఫ్ 70 కి మించి ఉండదని అంచనా వేస్తున్నారు. అంటే 150 ప్రశ్నలలో సగానికి మించి ప్రశ్నలు విద్యార్థులకు తెలియనివి రూపొందించారని అర్థం.

Advertisement

ప్రశ్న పత్రాన్ని గమనించాక ప్రశ్న పత్రం రూపొందించడం గురించి నా అభిప్రాయాల్ని చెప్పాలనిపించింది. నేనూ ఇలాంటి పరీక్షలు రాశాను. తర్వాత కాలంలో ప్రశ్నలు రూపొందించాను. తెలుగు అకాడెమీ ప్రచురించిన “రాజనీతి శాస్త్రం ప్రశ్నల నిధి” తెలుగు ఇంగ్లీష్ మీడియాలలో నేను రాసిన పుస్తకాలే ఇప్పటికీ ఉన్నాయి. తెలంగాణ సంస్కృతి, భారత రాజ్యాంగం పైన నేను ప్రశ్నలు రూపొందించాను. ప్రభుత్వ పరీక్షల నిర్వహణలో గోప్యత అవసరం కాబట్టి ఇంతకు మించి చెప్పకూడదు.

నిన్నటి పేపర్ అంత బాగా లేదని చెప్పగలను. పరీక్షకు 150 నిమిషాలు కేటాయించి 150 ప్రశ్నలు ఇచ్చారు. మొత్తం పేపరు రెండు భాషలలొ కలిపి 48 పేజీలు ఉంది. ఇందులో డైరెక్ట్ ప్రశ్నలు 37 మాత్రమే. అంటే ప్రశ్న ఇచ్చి కింద నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం లాంటివి. ఇందులో కూడా మూడు ప్రశ్నలు సీక్వెన్స్ ఆర్డర్ లో పెట్టాల్సినవి ఉన్నాయి. ఒక ప్రశ్న లేని దాన్ని గుర్తించే ప్రశ్న. మిగతా 93 ప్రశ్నలు ప్రశ్నలు స్టేట్మెంట్ రూపంలో ఉండి ఏవి తప్పో ఏవి సరైనవో లేక జతపరిచే పద్ధతిలో జవాబులను గుర్తించాలి. ఇవి క్లిష్టమైనవి. సమయం చాలా తీసుకునేవి. ఈ పద్ధతిలో ఒక ప్రశ్న నాలుగు ప్రశ్నలతో సమానం. ఇలాంటివి 93 ఉన్నాయి. అంటే ఇవే 372 ప్రశ్నలతో సమానం. మిగతా 20 ప్రశ్నలు మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలు. అవి ఎలాగూ చాలా ఆలోచించి రఫ్ వర్క్ చేసి సమాధానాలు గుర్తించాల్సినవి. ఈ కారణంగా నిన్న చాలామంది నిరాశ చెంది ఏదో ఒక చోట ఊరికే బబ్లింగ్ చేసి ఉంటారు.

నిజానికి స్టేట్మెంట్ల రూపంలో ఉండే కష్టతరమైన ప్రశ్నలను మన దగ్గర ప్రవేశపెట్టిన వాళ్ళలో నేనే ప్రథముడిని. 2002 లోనే ఇలాంటి ప్రశ్నలతో నేను రాసిన పుస్తకాన్ని తెలుగు అకాడెమీ ప్రచురించింది. దాన్ని తర్వాత ఇంగ్లీష్ మీడియంలో కూడా ప్రచురించారు. అయితే ప్రశ్నపత్రంలో కొన్ని ఇలాంటివి ఉంటే పరవాలేదు గానీ పేపర్ అంతా ఇలాగే ఉంటే చిరాకు వస్తుంది.

Advertisement

ప్రశ్నలు అడిగే వాళ్ళలో చాలా మందికి పిల్లలకు ఏమీ వచ్చునో తెలుసుకోవడం కంటే ఏమీ రాదో అడగాలని ఉంటుంది. ఈ ధోరణి నిన్నటి పేపర్ లో కనపడింది. మచ్చుకు రెండు ప్రశ్నలను గమనించండి.

‘జయిడర్ జీ’ నెదర్లాండ్స్ లోని జల భాగం నుండి తిరిగి పొందబడిన లోతట్టు ప్రాంతాలకు ప్రసిద్ది చెందిన:
(1) క్యానన్లు
(2) గీజర్లు
(3) పోల్డర్లు
(4) డైక్స్

అజీవిక తత్వ శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి జీవితాన్ని నిర్ణయించే ప్రధాన భావం ఏదీ?
(1) అర్థ
(2) నియాతి
(3) కర్మ
(4) ధర్మ

Advertisement

ఇంకా హైదరాబాదులో ఉన్న నాలుగు చర్చ్ లను అవి ఉన్న ప్రదేశాలతో జత పరిచే ప్రశ్న, ఆపరేషన్ బ్లూ స్టార్ కు సంబంధించిన సూక్ష్మ విషయాలను కూడా అడిగారు.

ప్రశ్నలు తయారు చేయడం కంటే మల్టిపుల్ ఛాయిస్ లో ఆప్షన్స్ ఇవ్వడం చాలా కష్టంతో కూడిన తెలివైన పని. ఇది అందరు చేయలేరు. నిన్నటి పేపర్ లో ఒక జత లో హరిత విప్లవ పితామహుడు అనే దానికి ఎదురుగా యం.ఎస్. విశ్వనాథన్ అనే పేరు ఇచ్చారు. ఇది విద్యార్థులను బోల్తా కొట్టించే పని. యం. ఎస్. స్వామినాథన్ కు బదులుగా యం. ఎస్. విశ్వనాథన్ ఇచ్చారు. నిజానికి తప్పు ఆప్షన్ ఇవ్వాలనుకుంటే మరో రంగంలోని శాస్త్రవేత్త పేరు ఇచ్చి ఉండాలి. సరైన జవాబును తలపించే తప్పు పేరు ఇవ్వకూడదు.

ప్రశ్న పత్రాలను రూపొందించేటపుడు కొన్ని విషయాలు పాటించాలి. మెజారిటీ విద్యార్థులు ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించేలా ప్రశ్న పత్రం ఉండాలి. కనీసం సగం ప్రశ్నలు పాఠ్య పుస్తకాల నుంచి ప్రిపరేషన్ నుంచి గుర్తించేవిగా ఉండాలి. ఇవన్నీ డైరెక్ట్ ప్రశ్నలుగా ఉండాలి. 25 శాతం అప్లికేషన్ ఓరియెంటెడ్ ప్రశ్నలు ఉండాలి. మరో 25 శాతం కామన్ సెన్స్ తో జవాబులు గుర్తించే విధంగా ఉండాలి. స్టేట్మెంట్ల రూపంలో ఉండే డబుల్ మల్టిపుల్ ప్రశ్నలు 25 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు.

Advertisement

పరీక్ష రాసి బయటికి వచ్చిన విద్యార్థి సంతోష పడాలి. ప్రశ్న పత్రం రూపొందించిన వాళ్ళపై గౌరవం పెరగాలి. ఉద్యోగం పైన ఆశ కలగాలి. లేదా ఇంకా కొంచె ప్రయత్నిస్తే బాగుండేదని అనిపించాలి. కనీసం కొన్ని కొత్త విషయాలు తెలుసుకునే విధంగా ఉండాలి. కానీ ఈ గ్రూప్ వన్ రెండు పేపర్లు చూసిన వాళ్ళలో కొందరికి ఇదంతా కాదుగానీ మరో మార్గం ఏదైనా ఉంటే చూడమనే విధంగానే ఉంది.

డా. పుల్లూరి సంపత్ రావు (సోషల్ మీడియా పోస్ట్​ యథాతథంగా)

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!