తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9న తేదీన నిర్వహించనుంది. దీనిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అక్టోబర్ 21నుంచి ప్రధాన పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఓఎంఆర్ పద్దతిలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గ్రూప్ 1కు భారీ సంఖ్యలో 4.03 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. తెలంగాణలో ఖాళీగా ఉన్న 563 గ్రూప్ 1 సర్వీసు పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ పరీక్షకు వారం రోజుల ముంద నుంచి అందుబాటులోకి రానున్నాయి. మెయిన్స్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహిస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: గ్రూప్ 1 పరీక్ష రెండంచెల్లో జరుగుతుంది. మొదటి దశలో ప్రిలిమ్స్ ఇందులో నుంచి 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. ప్రాథమిక(ప్రిలిమినరీ) పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్‌లో జరుగుతుంది. ఇందులో 150 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. మెయిన్స్ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ పరీక్ష 150 మార్కులకు మూడు గంటలు ఉంటుంది. ఇది కేవలం క్వాలిఫయింగ్ పేపర్ మాత్రమే.
టైమ్ మేనేజ్మెంట్: గ్రూప్–1 ప్రిపరేషన్ లో అభ్యర్థులు సమయ పాలనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిలిమ్స్ మే లేదా జూన్ లో ఉన్నందున ఇప్పటి నుంచి అందుబాటులో ఉన్న సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. ప్రిపరేషన్ చివరి దశలో రివిజన్ కోసం ఒక వారం రోజులు మినహాయిస్తే.. అభ్యర్థులు ప్రతిరోజు ప్రిలిమ్స్‌తో పాటు కొంత సమయం మెయిన్స్ కూడా కేటాయించి ప్రిపేర్ అవ్వాలి.
అన్ని సబ్జెక్టులపై పట్టు పెంచుకోవాలి: అభ్యర్థులుప్రిపరేషన్ ప్రణాళికలో భాగంగా ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్ చదివేలా సమయ పాలన పాటించాలి. ప్రిలిమినరీ పరీక్ష సిలబస్‌లో మొత్తం 13 అంశాలను పేర్కొన్నారు. వీటిలో కొన్ని ఉమ్మడిగా అనుసంధానం చేసుకుంటూ చదివే టాపిక్స్ కూడా ఉన్నాయి. (ఉదా: కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్; భారత రాజ్యాంగం విధానం, పరిపాలన తదితర). వీటన్నింటిని బేరీజు వేసుకుంటే..అభ్యర్థులు ప్రతి రోజు సగటున 8 నుంచి 10 గంటల సమయం ప్రిపరేషన్‌కు కేటాయించేలా టైమ్ టేబుల్ రూపొందించుకోవాలి.