TS Police Jobs: తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. పార్ట్-2 దరఖాస్తులో పోస్టుల ఆర్డర్ ఇలా ఇస్తే బెటర్.. తెలుసుకోండి
పోలీస్ ఉద్యోగం (Police Jobs).. నేటి యువతకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. యూనిఫాం వేసుకుని సమాజ సేవలో పాలు పంచుకోవాలని లక్షలాది మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల దాదాపు 20 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (TSLPRB Notifications) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షను సైతం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) ఇప్పటికే నిర్వహించి, ఫలితాలను సైతం విడుదల చేసింది. దీంతో అభ్యర్థులు ప్రస్తుతం పార్ట్-2 అప్లికేషన్ ను సమర్పించాల్సి ఉంది. ఈ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 10వ తేదీ లాస్ట్ డేట్. అయితే.. పార్ట్-2 దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు పోస్టుల వారీగా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థులు ప్రిఫరెన్స్ ఇచ్చే సమయంలో అనేక విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్ లో ఇతర జాబ్ లకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా? లేక, ఇదే ఉద్యోగంలో స్థిరపడాలనుకుంటున్నారా? సమాజంతో ఎక్కువ సంబంధాలను కలిగి ఉన్న ఉన్న పోస్టు మీ లక్ష్యమా? తదితర అన్ని విషయాలను ఆలోచించుకుని మీరు మీ ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఇండియన్ జాగ్రఫీ 68 (SI, CONSTABLE, TSPSC GROUPS)
పోలీస్ ఉద్యోగమే నా డ్రీమ్ జాబ్, ఈ ఉద్యోగంలోనే నేను స్థిరపడాలి అని అనుకునే వారి తమ ప్రిఫరెన్స్ ను ఈ విధంగా ఇస్తే బాగుంటుంది. (పురుషులు)
1.సివిల్ (CIVIL): బయట మనకు ఎక్కువగా కనిపించేది సివిల్ పోలీసులే. సమాజంలో ఈ ఉద్యోగానికి అత్యంత గౌరవం ఉంటుంది. కేసుల నమోదు, దర్యాప్తు తదితర అన్ని అంశాలు వీరి పరిధిలోనే ఉంటాయి. అందుకే సివిల్ పోలీసులను అసలు సిసలైన పోలీసులుగా చెబుతుంటారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రముఖ పాత్ర వీరిదే. పోలీస్ జాబ్ మీ డ్రీమ్ అయితే.. ఖాకీ డ్రస్ మీ కల అయితే.. ఈ ఉద్యోగానికి ఫస్ట్ ఆప్షన్ ఇవ్వండి.
2.ఫైర్ (Fire): రెండో ఆప్షన్ గా మీరు ఫైర్ ఇవ్వొచ్చు. ఈ పోస్టుకు మీరు ఎంపికైతే ఫ్యామిలీతో ఎక్కువ సమయం కేటాయించవచ్చు. ఇంకా.. ఉద్యోగ ఒత్తిడి కూడా చాలా తక్కువ ఉంటుంది.
ఇది కూడా చదవండి: జనరల్ సైన్స్ ఇంపార్టెంట్ బిట్స్ 114 (SI, CONSTABLE, TSPSC GROUPS)
– వీటి తర్వాత Jail, AR, SAL CPL, TSSP, SPF ఉద్యోగాలను ప్రాధాన్యత క్రమంలో 3, 4, 5, 6, 7 ఆప్షన్లుగా ఇవ్వొచ్చు. ఈ ఆప్షన్లను అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. కొందరు తమకు గ్రౌండ్ పర్ఫర్మెన్స్ బాగుంటుంది కాబట్టి TSSP పోస్టు సులువుగా దక్కుతుందని భావిస్తుంటారు. అలాంటి వారు ముందుగా TSSP ఆప్షన్ ఇస్తారు. అయితే.. మీకు పోస్టు కేటాయించే సమయంలో మీ మార్క్స్, గ్రౌండ్ మెరిట్ మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటారు. మీరు ఫస్ట్ సివిల్ ఆప్షన్ ను పెట్టుకుంటే.. మీరు ఆ ఉద్యోగానికి అర్హత సాధిస్తే కేటాయిస్తారు. లేకుంటే మీరు ఇచ్చిన నెక్స్ట్ ఆప్షన్ ను చెక్ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో మీరు సివిల్ ఉద్యోగంపై ఆసక్తి ఉండి.. మొదటి ఆప్షన్ TSSP పెట్టుకుంటే.. మీకు ఆ పోస్టునే కేటాయించే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో మీరు మెరిట్ ఉండి కూడా సివిల్ ఉద్యోగం పొందే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
సివిల్ ఉద్యోగమే కావాలా?, అయితే.. ఇలా!
సివిల్ పోలీస్ గా ఎప్పటికైనా స్థిరపడాలన్నది మీ కల అయితే.. 1.CIVIL, 2.AR, 3.TSSP ఆర్డర్ ఇవ్వడం బెటర్. ఇలా ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మీరు ఒకవేళ సివిల్ జాబ్ కు అర్హత సాధించలేకపోయి.. AR లేదా TSSP ఉద్యోగం సాధిస్తే భవిష్యత్ లో సివిల్ లోకి కన్వర్షన్ పొందే ఛాన్స్ ఉంటుంది.
ఇంటి దగ్గరే ఉండాలనుకుంటున్నారా?
మీరు మీ సొంత ప్రాంతానికి సమీపంలో ఉద్యోగం చేయడమే టార్గెట్ అనుకుంటే.. 1.CIVIL 2.Fire, 3.AR, 4.TSSP, 5.SAR CPL, 6,JAIL, 7.SPF ప్రాధాన్యలుగా ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది.
సొంత జోన్: 1.CIVIL 2.Fire, 3.AR ఉద్యోగాలకు ఎంపికైతే మీరు మీ సొంత జోన్లోనే ఉద్యోగం చేసుకోవచ్చు. 4వ ఆప్షన్ అయిన TSSPకి ఎంపికైతే.. జిల్లా హెడ్ క్వార్ట్సర్స్ లో లేదా హైదరాబాద్ లో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది.5, 6, 7 ఆప్షన్లకు ఎంపికైన వారు హైదరాబాద్ లో విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది.
ఇతర ఉద్యోగం మీ లక్ష్యమా?
చాలా మంది ఎస్ఐ, కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలు సాధించినా కూడా.. భవిష్యత్ లో గ్రూప్స్, సివిల్స్ లాంటి అత్యంత ఉన్నతమైన కొలువే లక్ష్యంగా ప్రిపరేషన్ కొనసాగించాలని అనుకుంటారు. ఎప్పటికైనా ఆ ఉద్యోగం సాధించాలన్నది వారి కలగా ఉంటుంది. అలాంటి వారు.. 1.Fire, 2. Jail, 3.SPF, 4.AR, 5.TSSP, 6.CPL, 7.CIVIL ఆర్డర్ లో ప్రిఫరెన్స్ ఇవ్వొచ్చు. మొదటి మూడు ఉద్యోగాలకు షిఫ్ట్ ల వారీగా విధులు ఉంటాయి. చదువుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది.
మహిళలకు: మహిళలకు సివిల్, ఏఆర్, జైల్ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. ఎస్ఐ ఉద్యోగాలకు మొదటి రెండు ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే.. కానిస్టేబుల్ అయితే మూడు ఆప్షన్లను వరుసగా ఇచ్చుకోవచ్చు. మహిళలకు తక్కువగా ఆప్షన్లు ఉంటాయి కాబట్టి ఇలా ఇచ్చుకోవడం బెటర్.
– ట్రాన్స్ పోర్ట్, ఎక్సైజ్ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులు వారి ఆసక్తులకు అనుగుణంగా ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు.
గమనిక: ఈ పై విషయాలు అభ్యర్థులకు అవగాహన కోసం మాత్రమే.. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు మీకు తెలిసిన ఇప్పటికే పోలీస్ ఉద్యోగం చేస్తున్న వారిని సంప్రదించవచ్చు. మీరు ఏదైనా ఇనిస్ట్యూట్ లో కోచింగ్ తీసుకుంటే నిర్వాహకులు, ఫ్యాకల్టీని కూడా అడిగి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు.