తెలంగాణలో పోలీసు ఉద్యోగాల దరఖాస్తులకు ఈ ఒక్క రోజే మిగిలింది. 26వ తేదీ రాత్రి 10 గంటలకు దరఖాస్తుల గడువు ముగియనుంది. ఎస్ఐ, పోలీస్, ఎక్సైజ్ కానిస్టేబుల్, జైళ్లు, ఫైర్ డిపార్టుమెంట్లో వివిధ పోస్టులకు ఇప్పటికే 12.30 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు టీఎస్ఎల్పీఆర్బీ TSLPRB వెల్లడించింది. మొత్తం 17,516 పోస్టులకు.. 6 లక్షల 90 వేల మంది అప్లై చేసుకున్నారు. వీరిలో కొందరు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకున్నారు. దీంతో అప్లికేషన్ల సంఖ్య అభ్యర్థులతో పోలిస్తే దాదాపు రెండింతలకు చేరువైంది. చివరి రోజున దాదాపు మరో లక్ష అప్లికేషన్లు వచ్చే అవకాశముందని బోర్డు వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఈసారి పోలీసు ఉద్యోగాలకు పోటీ పడే వారి సంఖ్య 13 లక్షలు దాటిపోనుంది.
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ నెల 20 వ తేదీన పోలీసు ఉద్యోగాలకు అప్లికేషన్ల గడువు ముగిసింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాలకు ప్రభుత్వం మరో రెండేండ్లు గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం పెంచింది. దీంతో దరఖాస్తులకు 26వరకు గడువు పొడిగించటంతో.. దరఖాస్తుల సంఖ్య అంతకంతకు పెరిగిపోయింది. అప్లై చేసిన వారిలో మహిళా అభ్యర్థులు దాదాపు మూడు లక్లల మంది ఉన్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అంచనాగా వెల్లడించింది. చివరి రోజున అభ్యర్థుల రద్దీ పెరుగుతుందని.. అందుకే ఈ నెల 27న మధ్యాహ్నానికి మొత్తం అప్లికేషన్లు.. అభ్యర్థుల సంఖ్యపై పూర్తి స్పష్టత వస్తుందని TSLPRB వర్గాలు తెలిపాయి.