HomeLATESTఉద్యమ గాయకుడు సాయిచంద్ ఇకలేరు.. భావోద్వేగానికి గురైన సీఎం.. 8న వరంగల్​కు ప్రధాని.. రేపు పోడు...

ఉద్యమ గాయకుడు సాయిచంద్ ఇకలేరు.. భావోద్వేగానికి గురైన సీఎం.. 8న వరంగల్​కు ప్రధాని.. రేపు పోడు పట్టాల పంపిణీ

గుండెపోటుతో సాయిచంద్ హఠాన్మరణం

తన గళంతో తెలంగాణ పాటను ఉర్రూతలూగించిన ఉద్యమ గొంతుక మూగబోయింది. ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్(39) గురువారం తెల్లవారు జామున గుండెపోటుతో కన్నుమూశారు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా..రక్తబంధం విలువ నీకు తెలియదురా.. అనే పాట సాయిచంద్ కు గాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. వనపర్తి జిల్లా అమరచింత గ్రామానికి చెందిన సాయిచంద్ పీజీ వరకు చదువుకున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నిర్వహించిన సభలన్నింటా సాయిచంద్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఉద్యమంలో చురుకుగా పనిచేసిన సాయిచంద్ ను సీఎం కేసీఆర్ 2021 డిసెంబర్లో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. అదే బాధ్యతల్లో ఉన్న సాయిచంద్ చిన్న వయసుల్లోనే చనిపోవటం రాష్ట్రవ్యాప్తంగా కళాకారులు, ఉద్యమాభిమానులను విషాదంలో ముంచెత్తింది. హైదరాబాద్ గుర్రంగూడలోని సాయిచంద్ ఇంటికి వెళ్లిన సీఎం కేసీఆర్ ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. సాయిచంద్‌ భార్య, పిల్లలు కాళ్లపై పడి రోదించడంతో కేసీఆర్‌ భావోద్వేగానికి గురయ్యారు. సాయిచంద్‌ తండ్రి వెంకట్రాములును, కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చారు. మంత్రులు కేటీఆర్, హరీష్​రావుతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ సాయిచంద్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Advertisement

8న వరంగల్ కు ప్రధాని మోదీ

pm narendra modf

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన తేదీ ఖరారైంది. వచ్చే నెల 8న ఆయన వరంగల్ కు వస్తున్నారు. ఈ సందర్భంగా కాజీపేటలో వ్యాగన్ ఓవరాలింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం వరంగల్ లో నిర్మించ తలపెట్టిన మెగా టెక్స్ టైల్ పార్కుకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తుంది.

రేపు పోడు భూముల పంపిణీ.. కరీంనగర్ కు సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ రాత్రి కరీంనగర్​ చేరుకుంటారు. తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్ లో బస చేస్తారు. రేపు ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయనున్నారు.

తొమ్మిదేళ్లలో చూసింది ట్రైలరే… కేటీఆర్​

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచుకుంటామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ తొమ్మిదేళ్లలో చూసింది ట్రైలర్‌ మాత్రమేనని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కేసీఆర్‌ మదిలో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. నానక్‌రామ్‌గూడలో క్రెడాయ్‌ ఆఫీసును ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. తెలంగాణది సమగ్ర, సమీకృత, సమతుల్య అభివృద్ధి అని పేర్కొన్నారు. తాగునీరు, విద్యుత్‌ సరఫరా సులభమే అయితే.. గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

Advertisement

రిటైరైనోళ్లతో సంపాదిస్తున్నాడు; బండి సంజయ్​

రిటైర్ అయిన అధికారులను అడ్డుపెట్టుకుని ఏటా వెయ్యి కోట్లు సంపాదించడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. రిటైర్డ్ డీజీపీ ఎస్.కె.జయచంద్ర, ఆయన కుమార్తె, బాలీవుడ్ నటి పాయల్ నేహా ఇవాళ హైదరాబాద్ లోని స్టేట్ పార్టీ ఆఫీసులో బీజేపీలో చేరారు. బండి సంజయ్​ కాషాయ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. రిటైర్డ్ అధికారులు ఆలోచనను మార్చుకుని తెలంగాణ భవిష్యత్ కోసం పనిచేయాలని కోరారు.

ఇందిరా, రాజీవ్ సాగర్ ఎందుకు ఆపారు : భట్టి విక్రమార్క

ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఎందుకు ఆపిందో చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్​చేశారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఏర్పాటుచేసిన కార్నర్​ మీటింగ్​ లో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ హయాంలో ఇందిర, రాజీవ్ సాగర్ ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయితే 10 ఏండ్లు కావస్తున్న మిగతా 20% పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదు…’ అని ప్రశ్నించారు.

మళ్లీ నిద్రమాత్రలు మింగిన శేజల్​!

బీఆర్​ఎస్​ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు.. ఆరిజన్​ డైరీ సీఈవో శేజల్​ మరోసారి ఆత్మహత్యకు ప్రయత్నించింది. దుర్గం చిన్నయ్యపై ఆమె కొంతకాలంగా లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్​లోని పెద్దమ్మ గుడి వద్ద శేజల్​ స్పృహ తప్ప పడిపోయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమెను ఆటోలో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆమె హ్యాండ్ బ్యాగులో నిద్రమాత్రలు, సూసైడ్​ నోట్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శేజల్ ఇలా చేయడం మూడో సారి. ఇటీవల ఢిల్లీలోని తెలంగాణ భవన్​ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

Advertisement

అక్కడ హోటల్​ రెంట్​ రూ. లక్ష

క్రికెట్​ ఫ్యాన్స్​ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. గుజరాత్​లోని అహ్మదాబాద్​ ఇందుకు వేదిక కానున్నట్టు ఇటీవల ఐసీసీ తన షెడ్యూల్ ప్రకటించింది. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా​ చూసేందుకు భారీగా అభిమానులు తరలి వస్తారు. అందుకే అక్కడ హోటల్​ రూంలకు ఇప్పటి నుంచే డిమాండ్​ పెరిగింది. అక్టోబర్​ 15వ తేదీ నాటికి అక్కడున్న ఫైవ్​ స్టార్​ హోటల్స్ అన్నీ బుక్కయ్యాయి. కొన్ని హోటళ్లు ఏకంగా రూ.40 వేల నుంచి లక్ష వరకు ఛార్జ్ చేస్తున్నాయి. భారత్​– పాకిస్తాన్​ మ్యాచ్​కు ఉన్న డిమాండ్​ను వారు క్యాష్​ చేసుకుంటున్నారు.

రాహుల్​ కాన్వాయ్ ని అడ్డుకున్న పోలీసులు

అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో రెండు రోజులపాటు పర్యటించేందుకు వెళ్లిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న బిష్ణుపూర్ వద్ద ఆపేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ నెలకొంది. ఇంఫాల్​ నుంచి హెలికాప్టర్ లో చుర్ చాంద్‌పూర్‌ కు రాహుల్ గాంధీ బయల్దేరారు. మణిపూర్ లో దాదాపు రెండు నెలలుగా హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. ఆ రాష్ట్రంలో మైదాన ప్రాంతాలకు చెందిన మైటీలు తమను గిరిజనులుగా గుర్తించాలని కేసు వేయడం.. ఆ దిశగా చర్యలకు హైకోర్టు ఆదేశాలివ్వడంతో రాష్ట్రంలో గత నెల 3 నుంచి కొండ ప్రాంతాలకు చెందిన కుకీ తెగ గిరిజనులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు, అల్లర్లు చెలరేగి పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది.

పాత కక్షలతో సూర్యాపేటలో దారుణం

సూర్యాపేట పట్టణంలో పాత కక్షల నేపథ్యంలో పట్టపగలు ఒక యువకుడిపై హత్యాయత్నం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో తాళ్లగడ్డకు చెందిన చీకూరి సంతోష్ పై మామిళ్లగడ్డకి చెందిన మహేష్, సన్నీ, బంటీ కత్తులతో దాడి చేశారు. స్థానికులు అడ్డుకుంటున్నప్పటికీ.. విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ సంతోష్ సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!