రాష్ట్ర అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల్లో మొదటగా పోలీసు పోస్టుల భర్తీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. హోంశాఖ పోస్టుల భర్తీపై రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ విధానాన్ని యూనిట్ల వారిగా ఇప్పటికే పోలీసు శాఖ అధికారులు ఖరారు చేసినందున ఆర్థిక శాఖ ఆమోదం లభించగానే వచ్చే వారంలో ప్రకటన వెలువడనున్నట్టు సమాచారం. పోలీస్ విభాగానికి సంబంధించి 20 వేల పోస్టులకు అనుమతి కోరుతూ ఇప్పటికే తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ప్రభుత్వానికి ఫైల్ పంపింది. కానీ.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన 18334 పోస్టులు ప్రకటించింది. దీంతో అంతమేరకు ఏయే పోస్టుల సంఖ్య కుదించాలనే కసరత్తు జరుగుతోంది. ఆ మేరకు రోస్టర్ ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇతర పోస్టులకు పదేండ్ల వయో పరిమితిని పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మూడు రోజులైనా ఆ జీవో విడుదల కాలేదు. ఆ జీవో జారీ అయిన తర్వాతే.. ఇతర విభాగాల్లో ఉద్యోగాల భర్తీ ప్రాసెస్‌కు లైన్ క్లియర్ అవుతుంది. పోలీస్ విభాగంలో వయో పరిమితి పెంచే ప్రసక్తి లేదని సీఎం ప్రకటించటంతో.. ఆ జీవోకు సంబంధం లేకుండానే పోలీస్ పోస్టుల భర్తీకి రూట్ క్లియర్‌గా ఉండటంతో అందరి దృష్టి TSLPRB నియామకాల వైపు మళ్లింది. ప్రభుత్వం ప్రకటించిన వాటిలో అత్యధిక పోస్టులు ఇదే విభాగంలో ఖాళీగా ఉండటంతో వీటికి సైతం వయో పరిమితి పెంచాలనే డిమాండ్లు పెరిగాయి. ఈ ప్రతిపాదన కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు.
యూనిఫామేతర పోస్టులకు 10 ఏళ్ల వరకు సడలింపు ఇచ్చిన నేపథ్యంలో అయితే ఈ సారికి పోలీసు ఉద్యోగాల భర్తీలోనూ వయోపరిమితి పెంచాలని సర్కారు భావిస్తోంది. ఎస్సై, కానిస్టేబుళ్లకు 3ఏళ్లతో డీఎస్పీ స్థాయి పోస్టులకు కొంత సడలింపు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. అనుమతి లభిస్తే ప్రస్తుతం కానిస్టేబుల్‌కు 22ఏళ్లు, ఎస్సై పోస్టులకు 25ఏళ్లు ఉంది. వీరికి మూడేళ్లు పెంచితే కానిస్టేబుల్‌కు 25, ఎస్సై పోస్టులకు 28ఏళ్ల వరకు వయోపరిమితి పెరగనుంది. అయితే అసెంబ్లీలోనే సీఎం కేసీఆర్ యూనిఫాం పోస్టులకు సంబంధించి వయోపరిమితిలో ఎలాంటి సడలింపు ఉండదని స్పష్టం చేశారు. 81వేల పోస్టుల్లో అత్యధిక భాగం పోలీసు ఉద్యోగాలదే ఉన్నందున వయోపరిమితి విషయమై ప్రభుత్వం పునరాలోచిస్తున్నట్టు సమాచారం.
డీఎస్పీ పోస్టుల విషయంలో తెలంగాణాలో కనీస ఎత్తు 167.5 సెం.మీ ఉంది. కానీ యూపీఎస్సీ, ఇతర రాష్ట్రాల్లో మాత్రం 165 సెం.మీ ఉంది. దీనిపై నిరుద్యోగుల నుంది కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ విషయమై డీజీపీ మహేందర్‌రెడ్డికి పలువురు విజ్ఞప్తి చేశారు. ఉన్నతస్థాయి అధికారుల నిర్ణయం మేరకు నోటిఫికేషన్ వచ్చే లోపు ఎత్తు తగ్గింపుపై కూడా నిబంధనలు సడలించే అవకాశం ఉంది.
వెబ్సైట్: www.tslprb.in