లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పదో తరగతి వార్షిక పరీక్షలపై (Telangana Tenth Exams) తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు కీలక ప్రకటన చేశారు. రానున్న మార్చిలో ఈ పరీక్షలను (TS Exams) నిర్వహించనున్నట్లు ప్రకటించారు. గతంలో విడుదల చేసిన అకాడమిక్ క్యాలెడంర్ లో పేర్కొన్న ప్రకారమే ఎగ్జామ్స్ జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో వారం పాటు సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పరీక్షలను ఆలస్యంగా నిర్వహించే అవకాశం ఉందన్న ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరీక్షల విభాగం చేసిన ప్రకటనలో ఆ ప్రచారానికి తెరపడింది. ఈ సందర్భంగా పరీక్షా ఫీజు చెల్లింపునకు సంబంధించిన షెడ్యూల్ ను సైతం కృష్ణారావు విడుదల చేశారు. విద్యార్థులు రేపు అంటే అక్టోబర్ 30 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీ విద్యార్థి అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
విద్యార్థులు నవంబర్ 30వ తేదీ వరకు రూ.50 లేట్ ఫీజుతో.. డిసెంబర్ 15 వరకు రూ.200 లేట్ ఫీజుతో.. డిసెంబర్ 29వ తేదీ వరకు రూ.500 లేట్ ఫీజుతో ఫీజులు చెల్లించాలని ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. గతంలో ఫెయిల్ అయిన విద్యార్థుల విషయానికి వస్తే.. మూడు సబ్జెక్టుల వరకు రూ. 100.. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులున్న వారు సైతం రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. ఒకేషనల్ కోర్సులకు ఒక్కో సబ్జెక్టుకు రూ.60 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు మొదటిసారి పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం పట్టణాల్లో రూ.24 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేల లోపుంటే వారికి ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుందని అధికారులు ప్రకటనలో వెల్లడించారు.